koodali

Wednesday, February 16, 2011

అన్నదాత ఆవేదన .......... కారాదు అరణ్య రోదన...............


రైతులు రెక్కలుముక్కలు చేసుకుని పంటలు పండిస్తారు. ఇతరులు ఆ పంటను తక్కువధరకు కొని తెలివిగా ఆ సరుకులతో వ్యాపారం చేసుకుని తమ బ్రతుకులను పండించుకుంటున్నారు.

పంట పండించిన రైతు మాత్రం గిట్టుబాటు ధర చాలక పురుగుల మందులు తాగి తమ బ్రతుకులను బ్రద్దలు చేసుకుంటున్నారు.

అతివృష్టి.....అనావృష్టి మధ్య నలిగి కొన్ని నెలలు కష్టపడి ఒళ్ళుహూనం చేసుకుని రైతులు పంటలు పండిస్తే...1.కిలో టమేటో,, 1..కిలో పొటేటో రెండు రూపాయలకు ఇస్తావా ? ఒక రూపాయకు ఇస్తావా ? అని అడుగుతారు అందరూ............


అదే టమేటోలను ఒక రూపాయ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొని ........... వాటికి కొన్ని ఇతర దినుసులు కలిపి టమేటో సాసులు, కెచప్ లు, ఆలూ చిప్స్ తయారుచేసి అందమైన పాకెట్స్ లో పెట్టి వ్యాపారస్తులు సంవత్సరం పొడుగూతా అమ్మితే ........పెదవికదపకుండా వారు చెప్పిన రేటుకు 20.......30 రూపాయలు పెట్టి కొంటారు అందరూ.............


ఇతర ఆహారపదార్ధాలు కూడా వండినవి చాలా రేట్లుంటాయి. తాను పండించిన పంటకు తనకు ఇష్టమయిన రేటును నిర్ణయించుకునే హక్కు రైతుకు లేదు.

ఆ పంటలతో చేసిన పదార్ధాలను మాత్రం ఎంతైనా రేటు నిర్ణయించుకుని అమ్ముకునే హక్కు మాత్రం వ్యాపారస్తులకు ఉంది. అన్నీ ఆహారపదార్ధాలే. కానీ తేడా ఎక్కడుంది ?ఇదెక్కడి న్యాయం ?

మనము ఏదైనా పెద్ద షాపుకు వెళ్తాము. అక్కడ బేరం అడగటానికి అవకాశం ఉండదు. వారు చెప్పిన రేటుకు కొనవలసిందే. అదే రైతుల విషయంలో వేరే న్యాయం ఎందుకు ?

కొంతమంది ఉద్యోగస్తులకు నెలకు 40 వేలరూపాయల ఆదాయం వస్తే కొందరు చిన్న రైతులకు సంవత్సరానికి 40 వేల ఆదాయం రావటమే కష్టం..

ఒక్క ఆహార రంగమే కాదు ........ పరోక్షంగా ఈ రైతులు పండించిన ఉత్పత్తుల పై ఆధారపడి ఎందరో బ్రతుకుతున్నారు..

ఇంకా ,.కొందరు వ్యాపారస్తులు సరుకులు దాచేసి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తారు. వేసవిలో టమేటో 40 రూపాయలు ఉన్నప్పుడు కూడా రైతుకు అతి తక్కువ ధర చెల్లించి వినియోగదారుల వద్ద ఎక్కువ ధర తీసుకుంటారు. అటు రైతు.............ఇటు వినియోగదారులు ఇద్దరికీ నష్టం.


పూర్వం ఎక్కువమంది వ్యాపారస్తులు ధర్మబద్ధంగా వ్యాపారం చేసేవారు. వారికి పాపభయం ఉండేది. ఇప్పుడు అత్యాశతో ఎక్కువ లాభాలకు ఆశపడుతున్నారు.


రైతుల పంటకు తగ్గ న్యాయమయిన గిట్టుబాటు ధర చెల్లించి .......మధ్య దళారులు, వ్యాపారస్తులు న్యాయమయిన లాభాన్ని మాత్రమే తీసుకుంటూ ...........ఆ వస్తువులు వినియోగదారులకు అందిస్తే రైతు.......వ్యాపారి ........వినియోగదారులు అందరికీ న్యాయం జరుగుతుంది......... అదే ధర్మబద్ధమైన వ్యాపారం.
.ఇంకా.

1. రైతులకు తమ పంటను ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించాలి.

2.రైతులు పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవటానికి సోలార్ డ్రైయ్యర్లు అందించాలి.

3. తగినన్ని గిడ్డంగులను నిర్మించాలి.

4. ఈ దేశప్రజల సొమ్మును ఎందరో తింటున్నారు. అందరికీ ఆహారాన్ని అందించే అన్నదాతకు తన పంటకు ధరను నిర్ణయించుకునే హక్కును కల్పిస్తే ........ తద్వారా .అన్నదాత కుటుంబాలు బాగుపడితే దేశానికి లాభమే కానీ నష్టమేమీ లేదు.


ప్రపంచంలో తెలివి, కలిమి, బలిమి ఉన్నవాళ్ళు అమాయకులను అన్యాయం చేస్తున్నారు. భగవంతుడు మనకు తెలివిని, బలాన్ని ఇచ్చింది ............మనము బ్రతుకుతూ ఇతరులను కూడా బ్రతకనివ్వాలని.అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఆనందంగా ఉండాలని కోరుకుందాము...


రైతులకు వద్ద పంటను కొనేటప్పుడు గీచిగీచి బేరమాడకుండా సరి అయిన ధర ఇచ్చి కొంటే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఆ పుణ్యంవల్ల వ్యాపారస్తుల కుటుంబాలు కూడా సంతోషంగా ఉంటాయి..

 

No comments:

Post a Comment