koodali

Monday, February 14, 2011

చేనేత నేతన్నల వెతలు తీరేదెన్నడు ?


మానవులకు దుస్తులు ధరించటం అవసరమని దైవం" ప్రత్తి".మొక్కను సృష్టించటం జరిగింది. ఈ దూదితో దీపాలు కూడా వెలిగించుకోవచ్చు.


పాతకాలంలో ఎక్కువగా నూలుదుస్తులే ధరించేవారు. అవి చెమటను చక్కగా పీల్చుకుంటాయి. సహజమైన చల్లదనాన్ని కలిగిస్తాయి.

* పాలియెస్టర్ దుస్తులవలె కొందరికి ఎలర్జీలను కలిగించవు.

ఈ రోజుల్లో కంప్యూటర్ సహాయంతో క్రొత్త డిజైన్స్ కనుక్కోవటం, యంత్రాలపైన దుస్తులను విరివిగా తయారుచెయ్యటం వచ్చాక సాంప్రదాయ చేనేత మగ్గాల వారి పరిస్తితి దయనీయంగా తయారయింది.

యంత్రాలతో పోటీకి తట్టుకోలేక వారు వెనుకబడిపోతున్నారు. కుటుంబానికి జరుగుబాటు లేక నేతన్నలు ఎందరో ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతోంది.


ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి. ఆ మధ్యన చెన్నైలో మా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మా బంధువుల అబ్బాయి ఒక బనీను లాంటి " టీ షర్ట్ " వేసుకున్నాడు.

ఆ షర్ట్ ధరించి బైటకు వెళ్తోంటే నేను ఉండబట్టలేక ............. అదేమిటి ? బనీను వేసుకుని బైటకు వెళ్తున్నావు.... అని అడిగాను. దానికి తను నన్ను ఒక అజ్ఞానిని చూసినట్లు చూసి వివరాలు చెప్పాడు.

ఆ షర్ట్ ఒక పేరున్న పెద్ద కంపెనీ తయారు చేసినదట. ఆ షర్ట్ కు ఒక మూల బ్రాండ్ పేరు చూపించాడు. దాని రేటు విని నేను నోరెళ్ళబెట్టాను. 2000 రూపాయలు పోసి కొన్నాడట. అది చూడటానికి అంత ఖరీదులా అనిపించటంలేదు అనుకుని.... ఇక చేసేదేమీలేక నేను నోరు మూసుకున్నాను.


మనం పెద్దపెద్ద షాప్స్ కు వెళ్ళి కాటన్ చీరలు, షర్ట్స్ అవి వేల రూపాయలు ఖరీదుచేసి కొంటాము. అదే చేనేతదుస్తులు నేసే షాప్స్ కు వెళితే మాత్రం........... గీచిగీచి బేరం ఆడి ఇష్టమయితే కొంటాము లేకపోతే లేదు.

వారికి జరుగుబాటు లేక తక్కువరేటుకు ఇచ్చేస్తారులే అన్న ధీమా. వారికి ఫ్యాషన్ టెక్నాలజీలు, మార్కెటింగులు తెలియవుగదా మరి.....


ఈ చేనేతల వారు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అందరూ కలిసి సంఘాలుగా ఏర్పడి క్రొత్త డిజైన్స్ తెలుసుకుని , మార్కెట్ మెళకువలు నేర్చుకుంటూ జీవితాలు బాగుచేసుకోవాలి. ఇది చెప్పినంత తేలికకాదులెండి.


ప్రభుత్వపరంగా కూడా జౌళి పార్కుల పధకాలు, సమగ్ర చేనేత అభివృద్ధి పధకం, నేత బజార్లు, సహకారసంఘాలు ఇలా ఎన్నో పధకాలు ఉన్నాయంట. సమస్యల్లా........అవి సమర్ధవంతంగా అమలుకు నోచుకోలేకపోవటం.


చేనేత నేతన్నల వెతలు తీరాలంటే ప్రజలు కూడా తమ వంతు సహకరించాలి. తమిళనాడులో కాలేజీ విద్యార్ధినులు కూడా వారంలో ఒక రోజు విధిగా చేనేతదుస్తులను ధరించాలని నిర్ణయించుకున్నారు.


బ్రాండెడ్ దుస్తులంటే ఎంత మోజున్నా చేనేతసహకారసంఘాలవాళ్ళు తయారుచేసిన దుస్తులను కూడా కొంటూ ప్రజలు వారికి తోడ్పాటుని అందించాలి. ఊరికే వారిని చూసి బాధపడికన్నీరు కార్చటం వల్ల ఏం లాభం ?


ఫాషన్ టెక్నాలజీ నేర్చుకున్న యువత, ఇంకా మార్కెటింగ్ వ్యవహారాలు తెలిసిన యువత ఈ చేనేత నేతన్నలకు తమ సలహాలను అందించాలి.


ఈ బడా వ్యాపారప్రపంచంలో బడుగులు కూడా బ్రతకాలంటే ఒక్క ప్రభుత్వం వల్లేకాదు.......అందరూ తలొకచెయ్యీ వేసి తమవంతు సాయం తాము చేస్తేనే మన ప్రాచీన చేనేత కళ అంతరించకుండా ఉంటుంది..

 

No comments:

Post a Comment