koodali

Friday, February 18, 2011

భగవంతు డిచ్చినదానితో సంతుష్టి జెందక యాకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది.

 

శ్రీ రామకృష్ణపరమహంస వారికి శ్రీ శారదా మాతకు, శ్రీ వివేకానందుల వారికి ప్రణామములు.

శ్రీ శిరిడి సాయిబాబాకు ప్రణామములు.

ఈ క్రింద వ్రాసిన సంఘటనలు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము గ్రంధము నుంచి తీసుకున్నవండి.

దాము అన్నా ( దామోదర్ సావల్ రామ్ రాసనె ) అనబడు సాయి భక్తుడు ఉండేవారు.

దాము అన్నా జట్టి వ్యాపారములు 1. ప్రత్తి.

బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు , ప్రత్తిలో జట్టీ వ్యాపారము చేసి భాగస్తుడుగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు, నెంత మాత్రము ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను.

దాము అన్నా యాబేరమును చేయుటయా ? మానుటయా ? యను నాందోళనలో పడెను. జట్టీ వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి, తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము వ్రాసి బాబానడిగి, వారి సలహాను తెలిసికొనుమనెను.

ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసికొని మసీదుకు బోయెను. బాబా ముందర బెట్టెను. బాబా యా కాగితమేమని యడిగెను. సమాచారమేమనెను ? శ్యామా అహమద్ నగర్ నుండి దాము అన్నా యేదో కనుగొనుటకు వ్రాసినాడనెను.

బాబా యిట్లనెను. " ఏమి వ్రాయుచున్నాడు ? ఏమి యెత్తు వేయుచున్నాడు ? భగవంతు డిచ్చినదానితో సంతుష్టి జెందక యాకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము ."

బాబా చెప్పినదే ఆ యుత్తరములో గల సమాచారమని , శ్యామా " దేవా ! నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులు లగుటతో, వారినిచట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసియు నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు ?" అనెను.

బాబా యిట్లనియె; " ఓ శ్యామా ! దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు ?"

అప్పుడు శ్యామా ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియె. " సేటుకు పిచ్చి యెత్తినది. అతని గృహమందేలోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము."


శ్యామా జవాబును పంపెను. దానికొర కాతురతో దాము అన్నా కనిపెట్టుకొని యుండెను. జాబు చదువుకొని అతడు తన యాశయంతయు అడియాశ యైనదనుకొనెను.

కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామా వ్రాయుటచే తానే స్వయముగా శిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని యనుకొనెను.

అందుచే శిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టీ వ్యాపారము గూర్చి యడుగుటకు ధైర్యము చాలకుండెను.

బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబా కిచ్చినచో బాగుండు ననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్నా తన మనస్సున ననుకొనెను.

బాబాకు తెలియనిదేమియు లేదు. అరచేతనున్న యుసిరికాయవలె భూతభవిష్యత్ వర్తమానములు కూడ బాబా తెలిసినవారు.

బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కాని తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జెరచును. చేదుమాత్ర లారోగ్యమును వృధ్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే యిచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తులు భవిష్యత్ వర్తమానములు లాభముల గూర్చి బాగుగ దెలిసినవారు.


దాము అన్నా మనస్సును గనిపెట్టి బాబా యిట్లనెను. " ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు. " బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను.

2. ధాన్యముల బేరము

పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ యాలోచన కూడ బాబా గ్రహించి యిట్లనెను. " నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారము కూడ మానుకొను " మనెను.

కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని యొక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువ చేసిన వారెల్ల నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను.

ప్రత్తి జట్టీ వ్యాపారము కూడ కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను.

బాబా తనను రెండుసారులు గొప్ప నష్టములనుండి తప్పించెనని , దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను.

బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట గూడ ఇప్పటివరకు భక్తితో నున్నాడు..

 

No comments:

Post a Comment