koodali

Friday, January 9, 2015

దేహస్వరూపం గురించి కొన్ని విషయాలు మరియు ..


కొందరు ఏమనుకుంటారంటే .. మరణించిన తరువాత అనుభవించటానికి ఏముంటుంది? అప్పుడు భావాలు( ఫీలింగ్స్) ఉండవు కదా..అనుకుంటారు. అయితే , తరువాత కూడా భావాలు ఉంటాయని గ్రంధాల ద్వారా తెలుసుకోవచ్చు.
.....................

శ్రీ దేవీ భాగవతము గ్రంధము ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు...


 యమధర్మరాజు ను  సావిత్రీదేవి..  ఎన్నో విషయాల గురించి  అడగటం  జరిగింది .


నరకబాధలు దరిచేరకుండా ఉండాలంటే ఏమేమి సత్కర్మలు చేయాలి..వంటి సందేహాలతో పాటూ అనేక విషయాలను అడుగుతుంది సావిత్రి.  


భూలోకంలో మరణించాక దేహం భస్మమైపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. ఆ పైని ఏ రూపంతో లోకాంతరాలకు వెళ్ళి శుభాశుభకర్మలను అనుభవించడం జరుగుతుంది ?...


 అంతంతకాలం నరకయాతనలు అనుభవిస్తోంటే దేహం నశించకుండా ఎలా ఉంటుంది? అసలు ఆ దేహం ఏమిటి ? ..అంటూ ఎన్నో విషయాలను అడగటం జరిగింది.

అప్పుడు  యమధర్మరాజు సావిత్రికి ఎన్నో విషయాలను తెలియజేస్తూ.. దేహస్వరూపం  గురించి  కూడా  వివరిస్తారు. 


కొన్ని విషయాలు..  


స్థూలశరీరం పంచభూతాత్మకం.అది కృత్రిమదేహం.కనక నశ్వరం - బూడిద అయిపోతుంది. మట్టిలో కలిసిపోతుంది. పంచభూతాలూ పంచభూతాలలో కలిసిపోతాయి...


అటుపైని అంగుష్ఠప్రమాణంతో జీవుడు మిగులుతాడు. ఇది సూక్ష్మదేహం. దానితోనే శుభాశుభకర్మఫలాలు అనుభవిస్తాడు. ఇది నశించదు.  శిధిలం కాదు.అగ్నిదగ్ధం కాదు...

 శస్త్రాస్త్రాలకు లొంగదు.తప్తద్రవ తప్తతైల తప్తపాషాణాది కూపాల్లో ఎంతకాలం ఎన్ని శిక్షలు వేసినా చెక్కు చెదరదు. దుఃఖాలను మాత్రం అనుభవిస్తూంటుంది...అంటూ ఎన్నో విషయాలను తెలియజేస్తారు యమధర్మరాజు.

................. 


ఒక యోగి ఆత్మ కధ గ్రంధము నుంచి ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు..


మానవుడి ఆత్మ, ఒకటో రెండో మూడో-శరీరమనే సీసాల్లో బంధించి ఉండి, అజ్ఞానమూ కోరికలూ అనే బిరడాలతో గట్టిగా బిగించి ఉన్నంతకాలం అతడు, పరమాత్మ సాగరంలో లీనం కాలేడు... 

చావు అనే సుత్తిదెబ్బతో స్థూలభౌతికకాయం బద్దలయిపోయినప్పుడు సూక్ష్మ, కారణశరీరాలనే తక్కిన తొడుగులు రెండూ , సర్వవ్యాప్త ప్రాణమనే పరమాత్మతో సచేతనంగా లీనం కావడానికి వీలులేకుండా ఆత్మను నిరోధించడానికి, ఇంకా మిగిలి ఉంటాయి... 

జ్ఞానం ద్వారా నిష్కామం అలవడినప్పుడు , దాని శక్తి తక్కిన కోశాల్ని రెండిటినీ ఛిన్నాభిన్నం చేసేస్తుంది. చివరికి, స్వల్పమైన మానవాత్మ విముక్తమయి , అమేయసమృద్ధమయిన పరమాత్మతో ఐక్యమవుతుంది. 


No comments:

Post a Comment