koodali

Monday, June 12, 2017

మాకు తెలిసిన ఒక అమ్మాయి చదువు కోసం...

 
మాకు తెలిసిన ఒక అమ్మాయి చదువు కోసం వేరే ఊళ్ళో సీట్ రావటం వల్ల తల్లితండ్రికి దూరంగా హాస్టల్లో ఉంటోంది. 

ఆ అమ్మాయికి కొంతకాలం క్రిందట బాగా జ్వరం వచ్చి కొన్నాళ్ళు నీరసంగా ఉంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని మందులు వేసుకుంటే జ్వరం తగ్గింది .

అయితే , అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏది పడితే అది తినకూడదు కదా! 

ఇంట్లో అయితే, పిల్లలకు అనారోగ్యం వస్తే పెద్దవాళ్లు వారికి పధ్యం ఆహారం వండి,  జాగ్రత్తగా చూసుకుంటారు. 

హాస్టల్స్లో అయితే , వందల మంది పిల్లలు ఉంటారు.  ఒక్కొక్కరికి అవసరమైన విధంగా ఆహారం కొన్నిసార్లు  లభించకపోవచ్చు. 

అనారోగ్యంగా ఉన్నప్పుడు ,అక్కడి  భోజనం తినలేక ఆ అమ్మాయి  ఒక రైస్ కుక్కర్ కొనుక్కుని,  హాస్టల్ రూంలో తనే ఆన్నం కూర వండుకునేదట. 

బజారుకు వెళ్ళి పండ్లు కొని తెచ్చుకుని తింటుందట.

 తల్లితండ్రి ఒకటి, రెండుసార్లు వచ్చి చూసి వెళ్ళారనుకుంటా.

కొన్ని రోజులు ఇంటికి వెళ్ళి వచ్చిందట. ఎక్కువ రోజులు ఇంటి వద్ద ఉంటే క్లాసులు పోతాయని వచ్చేసింది.  

ఈ మధ్య మళ్ళీ అప్పుడప్పుడు జ్వరం వస్తుందట.  ఆ అమ్మాయి తల్లితండ్రి ఏమంటున్నారంటే, వాతావరణంలో మార్పు వల్ల అలా జరుగుతుంది తగ్గిపోతుందిలే అంటున్నారట.

 ప్రస్తుతం జ్వరం తగ్గిందట.

 నాకు తెలిసినంతలో హాస్టల్లో కొందరు పిల్లలు అక్కడి ఆహారం నచ్చకపోతే బయటకు వెళ్ళి తినటం లేక నూడుల్స్ వండుకోవటం లేక పస్తు ఉండటం చేస్తుంటారు. 

అనారోగ్యంతో ఉన్నప్పుడు  తనే వండుకుని క్లాసులకు వెళ్తూ చదువుకోవటం ఎంతో కష్టం.  ఇలా ఉన్నాయి ఈ రోజుల్లో పిల్లల చదువులు,వారి కష్టాలు. 

ఇక ర్యాగింగ్ వంటివి ఉంటే అవన్నీ మరిన్ని కష్టాలు. 

ఏం చదువులో? ఏమిటో ? ఈ రోజుల్లో జీవితాలు చాలా టెన్షన్ గా ఉంటున్నాయి.

టీనేజ్ పిల్లల విషయాల సంగతి అలా ఉంచితే, తల్లితండ్రి ఉద్యోగానికి వెళ్తూ వేరే వారి  వద్ద ఉండే పసిపిల్లల విషయాలు మరెన్నో ఉంటాయి. 


No comments:

Post a Comment