koodali

Wednesday, November 20, 2013

ఈ నాటి ప్రజల పంజరపు బ్రతుకులు. ( చాలా మంది విషయంలో )


కొన్నాళ్ళ  క్రితం  వరకూ  కూడా  ప్రపంచంలో  ఇంత  పరుగు  లేదు.    ఇంత  పోటీ  లేదు. 


 ఇప్పుడు  జీవితాల్లో  వేగం  పెరిగిపోయింది.  తెల్లవారి  లేస్తే  పరుగేపరుగు.  ఎందుకో  తెలియని  పరుగు.

మా  చిన్నతనంలో  వేసవి  సెలవుల్లో  కొన్ని రోజులు   మా  తాతగారింటికి  వెళ్ళే  వాళ్ళం.   


పల్లెటూరి  జీవితం  పరుగు  లేకుండా  ప్రశాంతంగా  ఎంతో  బాగుండేది.   

పచ్చటి  పొలాలు,  దేవుని  ఆలయాలు,  ఆలయాల  వద్ద  చెరువు,  చెరువులో  తామరపువ్వులు  ఇవన్నీ  ఎంతో  బాగుండేవి. 

తాటి  ముంజెలు,  ఈతపళ్ళు  తినటం,  పెరట్లోని  చెట్ల  పండ్లు  కోసుకు  తినటం,  పెరట్లోని  కమ్మని  కూరలతో  భోజనం  ఎంతో  బాగుండేవి.  


రాత్రయితే  వేడివేడి  పప్పుచారులో  నేయి  వేసుకుని  పిల్లలందరం  వెన్నెలలో  కూర్చుని  భోజనాలు  చేసేవాళ్ళం. 


  వెన్నెలలో  ఎన్నో  ఆటలు  ఆడుకునేవాళ్ళం.  ఎన్నో  కధలు  చెప్పుకునే  వాళ్ళం.

 పిల్లలం  ఇలా  ఆడుకుంటుంటే  మా  పెద్దవాళ్ళు  అరుగుల  మీద  కూర్చుని  కబుర్లు  చెప్పుకునే  వాళ్ళు.  ఆ  రోజులే  వేరు.


 ఇప్పుడు  పిల్లలకు  ప్రకృతితో  సంబంధమే  తగ్గిపోయింది.   ఇప్పుడు    ఎన్నో   సరదాలు   డబ్బుతోనే  ముడిపడి  ఉన్నాయి.


 ఇప్పటి  పెద్దవాళ్ళకు  తీరిక   లేదు.  పిల్లలకు  తీరిక  లేదు.  


పిల్లలకు  బండెడు  సిలబస్ తోనే  బాల్యం  గడిచిపోతోంది.  ఇక  ఆటలకు  సమయమెక్కడ  ? 

పిల్లలకు   కొంచెం  సమయం  దొరికితే   టీవీలు,  కంప్యూటర్  గేంస్  ఆడటానికే  ఇష్టపడుతున్నారు.  


 ఒకవేళ  తల్లితండ్రులకు  తీరిక  దొరికితే  షాపింగ్  మాల్స్ కు  పిల్లలను  తీసుకువెళ్ళటమే    గొప్ప  అనుకుంటున్నారు.   అలా  అనుకునేటట్లు  పరిస్థితులు  ఉన్నాయి.   

చిన్నతనం  నుంచి  పంజరంలో  బ్రతకటం  అలవాటయిన  పక్షులను    ఒక్కసారిగా  బయటకు  వదిలితే  వెంటనే  అవి   విశాలమైన  ప్రకృతిలోకి  ఎగిరిపోవటానికి  ఆసక్తిని  చూపించవట.  


వాటికి  పంజరం  బ్రతుకు  అలవాటవటం  వల్ల  ఆ  బ్రతుకే  బాగుంది  అనుకుంటాయేమో  ? 

ఇప్పటి  పిల్లలు  కూడా  చిన్నతనం  నుండి  ప్రకృతికి  దూరంగా  జీవించటానికి  అలవాటుపడటం  వల్ల    ప్రకృతికి  దూరంగా  నాలుగు  గోడల  మధ్య  
టీవీలు చూడటం,  కంప్యూటర్  ఆటలకే  ఇష్టపడుతున్నారేమో ?   అనిపిస్తోంది.




2 comments: