koodali

Friday, June 8, 2018

కొన్ని ఆహార విషయాలు... రెండవ భాగం...

ఇక స్నాక్స్ విషయానికొస్తే

పకోడి...  సెనగపిండిలో   చాలా  కొద్దిగా  బియ్యపు పిండి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కలిపి పకోడీ వేయటం కూడా తేలికే. ఉల్లిముక్కలు తిననివారు సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కలు, పచ్చిమిర్చి   వేసి పకోడి వేసుకోవచ్చు.

పకోడి కోసం కలిపే పిండిలో ఎక్కువ నీరు పోయకూడదు. క్కు నీరు పోస్తే నూనె బాగా పీల్చుకుంటుంది.  తక్కువ నీటితోనే  పిండి కలపాలి 
......

 మసాలా వడ...పచ్చిశనగపప్పు నానబెట్టి..నీరు అసలు పోయకుండా  పప్పును కచ్చపచ్చగా (coarse) రుబ్బుకుని , కొత్తిమీర, పుదీనా, ధనియాలపొడి, అర  టీ  స్పూన్   అల్లంవెల్లుల్లి ముద్ద , కొంచెం గరం మసాలాపొడి వేసి కలిపి మసాలా వడలు వేసుకోవచ్చు మసాలా వడలు  నూనె ఎక్కువగా పీల్చవు.
 
బైండింగ్ కొరకు రెండు టీ స్పూన్ లు బియ్యంపిండి కాని, శనగపిండికాని, జొన్నపిండి కాని కలుపుకోవచ్చు.  
..................................

 మిర్చిబజ్జీ...  రెండుకప్పుల శనగపిండి మరియు ఒకటీ స్పూన్ బియ్యంపిండి తీసుకుని, సుమారు  ముప్పావుకప్పు లేక ఒక కప్పు నీరు పోసి కలపాలి. 

బజ్జీ పైన పిండి ఎక్కువ ఉండాలంటే ముప్పావు కప్పు నీరు, పిండి తక్కువ ఉండాలంటే ఒకకప్పు నీరు పోయవచ్చు.
 
 ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె కూడా కలపాలి. చిటికెడు వాము, ఒక టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి.
 
 పిండిని రెండు నిమిషాలు చేతితో బాగా గిలకొడితే బజ్జీలు బాగా పొంగుతాయి. రెండు కప్పుల శనగపిండికి పెద్ద మిరపకాయలతో సుమారు 12 నుండి 14 బజ్జీలు వేయొచ్చు.
 
మిరపకాయలు చివర కొద్దిగా కట్ చేసుకోవాలి. బజ్జీని పిండిలో ముంచి నూనెలో వేసేటప్పుడు గిన్నెకు రాస్తూ మిరపకాయ బయటకు కనపడేలా నూనెలో వేయాలి. మిరపకాయ మొత్తం పిండి ఉంటే మిరపకాయ వేగక కారంగా ఉంటుంది. 
 
సోడావేసాక బజ్జీలపిండిని రెండునిమిషాలు చేతితో బాగా గిలకొట్టాలి. ఇలా చేస్తే పిండిపొంగి, బజ్జీలు గుల్లగా వస్తాయి. బజ్జీలలో సోడా కలిపాక 15 నిమిషాల లోపు బజ్జీలు వేస్తే మంచిదట.
 
బజ్జీ లో నిలువుగా  చాకుతో  గాటుపెట్టి, అందులో ఉల్లిపాయ, కొత్తిమీర..సన్నగా తరిగి నిమ్మకాయ పిండి వేసుకోవచ్చు. లేకపోతే ఉడికించిన ఆలుముక్కలు కూడా పెట్టవచ్చు....గింజలు వద్దనుకుంటే తీసి, ఉల్లితరుగు లేక ఆలు పెట్టవచ్చు.
 
బయట బజ్జీలు వంటివి న్యూస్ పేపర్లో పెట్టి ఇస్తారు. అలా పేపర్లో తింటే అక్షరాలలో ఉండే ఇంక్ ఆహారంలో కలిసే ప్రమాదముంది. అలా న్యూస్ పేపర్లో ఆహారాన్ని పెట్టి ఇవ్వకూడదు.
.............
 
స్త్రీలు వంటలకు పచ్చిమిర్చి కోసి చేతులు బాగా కడుక్కున్నా కూడా, మంట పోదు. ఆ చేతులతో చంటిపిల్లలకు నలుగుపెట్టి స్నానం చేయిస్తే, కళ్ళు, వళ్ళు రుద్దినప్పుడు పిల్లలు మంటపుట్టి ఏడుస్తారు. 
 
వాళ్ళు మంట అని చెప్పలేరు, ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు కాబట్టి, చిన్నపిల్లలకు స్నానం చేయించే స్త్రీలు మిర్చి తరగాలంటే చేతులకు గ్లవ్స్ వేసుకోవటం మంచిది.
........................

ఉప్మాకు.. ఒకకప్పు సన్నగోధుమరవ్వకు సుమారు మూడున్నర గ్లాసుల నీరు పడుతుంది. పల్చగా రావాలంటే  నాలుగున్నర  లేక అయిదు 
గ్లాసుల నీరు కూడా పోసి, సుమారు పది నిముషాలు ఉడికించుకుని మూతపెట్టి 10 నిముషాల తరువాత వడ్దించుకోవాలి. 
 
వేయించిన గోధుమ రవ్వ వేయవచ్చు లేదంటే,   గోధుమరవ్వను ముందే కొద్దిగా నీరు పోసి నానబెట్టుకుంటే ఉప్మా త్వరగా అవుతుంది.
..........
 
  అంబలి...ఒకగ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి కాని, జొన్న పిండి కాని వేసి బాగా కలిపి సుమారు అర్ధగంట అయినా నానబెట్టాలి. తరువాత పొయ్యిమీద కలుపుతూ గడ్డకట్టకుండా, సుమారు పది లేక పదిహేను నిమిషాలు ఉడికించాలి. పొయ్యి ఆఫ్ చేసి బెల్లం కలపాలి. 
 
ఈ అంబలి రాత్రంతా ఉంచి ఉదయం తాగితే చాలా మంచిది.  ఉదయం తయారుచేసి రాత్రి కూడా తాగవచ్చు.
.........................
 
మామూలుగా అరకప్పు బియ్యం ఒక మనిషికి సరిపోతుందట

ఉప్మా కు కూడా అరకప్పు రవ్వ ఒక మనిషికి లెక్క.

అంటే, నలుగురు మనుషులుంటే నాలుగు అరకప్పులు అంటే రెండు కప్పుల రవ్వ   సరిపోతుంది

అయితేతినే వారి అలవాటును బట్టి కొంచెం ఎక్కువ, తక్కువా తీసుకోవచ్చు.

*********************
* అర్ధ కిలో మినపప్పుకు సుమారు 30 గారెలు వేయొచ్చు .
* ఒక కప్పు శనగపప్పుకు సుమారు 15 మసాలా వడలు వేయొచ్చు. 
* రెండు కప్పుల గోధుమపిండితో సుమారు 15 పూరీలు చేయవచ్చు.
* రెండు కప్పుల గోధుమపిండితో సుమారు 10 చపాతీలు చేయొచ్చు.
 .......................................
 
చపాతి ....కలపటానికి ఒక కప్ గోధుమ పిండి అయితే, సుమారు సగం కప్ లేక ఇంకా కొద్దిగా తక్కువ నీరు సరిపోతుంది.  గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్ స్పూన్  నూనె వేసి పిండిని కలపాలి.
 
చపాతి కాల్చిన వెంటనే ఒక బాక్స్ లో వేసి, వెంటనే  పైన మూత పెడితే గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి.
.................
 
1.  ఇడ్లీలోకిదోసెలకు పచ్చడి... ఈ పచ్చడి 5 నిమిషాల్లో చేయవచ్చు.  
 
  మిక్సీలో మూడుపచ్చిమిర్చి, చిన్నగా తరిగిన పచ్చికొబ్బరి ముక్కలు,  వేయించిన శనగపప్పు (పుట్నాల పప్పు) , చాలాకొద్దిగా చింతపండు, ఉప్పు..నీళ్ళు వేసి రుబ్బి కావాలంటే తిరగమోత వేసుకోవాలి. పచ్చడిలో కొద్దిగా వేయించిన వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు. (నేను పచ్చిమిర్చి వేయించను. 
 
  చట్నీలో చింతపండు వేయకపోయినా ఫరవాలేదు. కొబ్బరి లేకుండా పుట్నాల పప్పు, వేయించిన వేరుశనగపప్పు వేసి కూడా చట్నీ చేయవచ్చు. 
 
వేరుశనగపప్పు అరకిలో అలా ముందే బాణలిలో వేయించి డబ్బాలో పెట్టుకుంటే, చట్నీ కోసం ఉదయాన్నే పల్లీలు వేయించే పని ఉండదు. కడాయిలో అసలు నూనె వేయకుండా వేయించవచ్చు. లేదంటే, కడాయిలో పావుటీస్పూన్ నూనె మాత్రం వేసి వేయించినా త్వరగా వేగుతాయి.
 
వేరుశనగపప్పు వేయించి డబ్బాలో పెట్టుకుంటే, బూజు రాకుండా ఉంటుంది.  బూజు వచ్చిన వేరుశనగపప్పు
(ground nuts)  ప్రమాదం,  వాడకూడదు.  
  ................. 
 
2.  ఇడ్లీలోకిదోసెలకు పచ్చడి... బాణలిలో నూనె వేసి, అందులో   సొరకాయముక్కలు, టమేటో ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకు,  పసుపు, ఉప్పు..కొద్దిగా నూనెలో వేయించి రుబ్బి,  పచ్చడి చేసి ఈ పచ్చడి కూడా ఇడ్లీ, దోసెలతో తినవచ్చు. బీరకాయపచ్చడి  లేక దోసకాయ పచ్చడి కూడా చేయవచ్చు.
 
కూరగాయలతో చేసే ఈ పచ్చళ్లు సులభంగా అరుగుతాయి.

**********************
 సొరకాయ గింజల పచ్చడి ... సొరకాయఆనపకాయ } లేత  గింజలు ఉంటే  గింజలు తీసి పచ్చడి చేసుకోవచ్చు.  సొరకాయ  గింజలుమిర్చిచింతపపండుఉప్పుపసుపుటమేటో , కరివేపాకుకొత్తిమీర..అన్నీ బాణలిలో వేయించి , మిక్సీలో మెత్తగా రుబ్బి పోపు పెట్టుకుంటే సొరకాయ గింజల పచ్చడితయారవుతుందిసొరకాయలో మిగతా భాగం కూర వండుకోవచ్చు.

*************************

పెసరట్టు...   ఒక కప్పు పొట్టుతో ఉన్నగుండు పెసలను రెండు కప్పుల నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి.

పెసలను ముందే శుభ్రంగా కడుక్కుని, మంచినీరుపోసి నానబెట్టి మూతవేసుకుంటే, 
 
ఉదయం ఆ నానిన నీటిని వడకట్టి ఒకగిన్నెలో పోసుకుని, పెసలను మిక్సీలో వేసి రుబ్బటానికి,  నానగా వచ్చిన నీటిని పోసి, ఇంకా కావాలంటే మరికొన్ని నీరు పోయాలి. 

 పెసలను మిక్సీలో రుబ్బటానికి సుమారు ఒకకప్పు + అర కప్పు..నీరు పోయాలి. రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని పెసలలో వేసి రుబ్బుకోవచ్చు.
అల్లం, పచ్చిమిర్చి వేసి కూడా రుబ్బుకోవచ్చు. 
 
 రుబ్బిన పిండిలో కొద్దిగా జీలకర్ర కలపాలి, లేదంటే అట్టు పైన జీలకర్ర వేయవచ్చు.
 
పెసరట్టు పిండిని.. మినపట్టు పిండిలా పులవబెట్టకూడదు 
పెసరట్టు పిండిని రుబ్బిన వెంటనే దోసెలు వేసుకోవాలి
 పిండి మిగిలితే వెంటనే ఫ్రిజ్లో పెట్టుకోవాలి
 
 ఊల్లిముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర....దోస పైన వేసి కాల్చుకోవాలి. 

 
(అయితే, పొట్టులేని పెసరపప్పు నానటానికి అరగంట చాలు. ఉదయమే నానబెట్టి పెసరట్టు వేయవచ్చు,  పొట్టులేని పెసరపప్పు రుబ్బి పెసరట్లు వేయటానికి తక్కువనీరు సరిపోతుంది.)
...........
మినప్పప్పు+ బియ్యంతో చేసే దోసెపిండిని, పెసరట్టు పిండిని కలిపి కూడా దోసెలు వేయవచ్చు. 

...................................
 
 పిల్లలకు....    పెసలు, వేరుశనగపప్పు, శనగలు, రాగులు, బొబ్బర్లు.. ..వంటి రకరకాల గింజలను  తెచ్చి   రాత్రి పూట నానబెట్టి   ఉదయాన్నే అల్పాహారంలా తినవచ్చు

అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కీరదోసముక్కలు, నిమ్మరసం, ఉల్లిముక్కలు వేసుకోవచ్చు.

లేకుంటే,  నానబెట్టిన  గింజలను  కుక్కర్లో ఉడికించి , గుగ్గిళ్లలా తినవచ్చు

ఇందులో  కొంచెం కొత్తిమీరపుదీనాకీరదోసముక్కలునిమ్మరసంఉల్లిముక్కలు వేసుకోవచ్చు.

పాతకాలంలో  నూనెవంటలు ఎప్పుడో పండుగల్లో వండుకునేవారట

పాతకాలంలో  గుగ్గిళ్లను ఎక్కువగా తినేవారట.  . కాలంలో శారీరికశ్రమ తగ్గి, తిన్నది   అరగటం లేదు కాబట్టిగుగ్గిళ్ళ్ను  కొద్ది మొత్తంలో తినవచ్చు.
 
 
పెసలు, శనగలు అన్నీ నానబెట్టినవి అమ్ముతున్నారు . 

అయితే, బయటవాళ్ళు నానబెట్టటం కాకుండా,   రకరకాల గింజలను కలిపి చిన్నప్యాకెట్లలో అమ్మితే, ఇంటికి తెచ్చి నానబెట్టుకోవచ్చు.  

**********************
ఉలవలను నానబెట్టి, కుక్కర్లో ఎక్కువసేపు ఉడికించాలి. తరువాత  చారులా చేయవచ్చు. 

లేదంటే ఉలవచారు బయట అమ్మేవి తెచ్చుకోవచ్చు. ఉలవలు ఆహారంలో తీసుకోవటం మంచిది. 

*********************
ఇక డ్రైఫ్రూట్స్ సంగతి తెలిసిందే. రోజూ కొద్దిగా తినవచ్చు. ఏదైనా,  ఎవరి అరుగుదలను బట్టి వారు తీసుకోవాలి
.............................

పప్పుల పొడి..... బాణలిలో కొంచెం మినప్పప్పు, కొంచెం కందిపప్పు, కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర  విడివిడిగా వేయించుకుని తీసి   ప్రక్కన పెట్టుకోవాలి
బాణలిలో  కొద్దిగా  నూనె వేసి, అందులో  ఎండుమిరపకాయలు, కరివేపాకు  వేసి వేయించుకోవాలి
 
 పైన వేయించుకున్న పప్పులు, ఎండుమిరపకాయలు, కరివేపాకువేయించిన శనగపప్పు ( పుట్నాల పప్పు ) ,  ఉప్పు, వెల్లుల్లి ....ఇవన్నీ పొడి కొట్టి పిల్లలకు పంపిస్తే వేడి అన్నంలో నేయి వేసుకుని తినవచ్చు. ఇడ్లీలో , దోసెల్లో తినవచ్చు


పొడిని వేపుడు కూరల్లో కూడా వేసుకోవచ్చు. కూరల్లో వేసి కొన్ని నీరు పోసుకుంటే గ్రేవీ కూర  కూడా తయారవుతుందిఇష్టమున్నవారు   పొడిలో  ఎండుకొబ్బరి కూడా వేసుకోవచ్చు.  
..............................
 
ఇడ్లీ..ఒక కప్పు మినప్పప్పు రెండుగంటలు నానబెట్టి, రెండు కప్పులు  సన్న  ఇడ్లీరవ్వలో రెండుకప్పులు నీరుపోసి పక్కన పెట్టుకోవాలి.

 మిక్సీలో పిండి రుబ్బటానికి, రవ్వలో పోయటానికి మొత్తం మూడుకప్పులు నీరు పడుతుంది...కప్పు బాగా పైకి రవ్వ తీసుకుంటే, ఇంకో పావుకప్పు నీరు కూడా పోయవచ్చు.
ఇడ్లీరవ్వ నీటిలో నాని, కొంతసేపటికి చిక్కగా అవుతుంది.
 
( కొందరు, ముందే ఇడ్లీరవ్వను కడిగి, నానబెట్టి,  రుబ్బిన మినప్పప్పులో వేస్తారు.  )
  .
  మినపప్పు  రుబ్బి, రవ్వలో కలిపి ఒక టీస్పూన్ ఉప్పువేసి, ఇడ్లీపిండిని కిందనుండి పిండి, రవ్వ అంతా బాగా కలిసేలా  చేత్తో కానీ,  గరిటతో కానీ,  రెండునిమిషాలు బాగా కలిపితే, పిండి బాగా పొంగుతుంది.
  
పిండి రాత్రంతా ఉంచి, ఉదయం ఇడ్లీ వేసుకోవచ్చు.  ఇడ్లీ 15 నిమిషాలు మీడియం మంటతో ఉడికినతరువాత పొయ్యి తీసి, 10 నిమిషాల తరువాత మూత తీయాలి. 
....

ఇడ్లీ పిండి పొంగకుంటే, కొంతపిండిని గిన్నెలో తీసుకుని ఆ పిండితో 
 దిబ్బరొట్టి,  గుంతపొంగనాలు కానీ వేసుకోవచ్చు. పిండి పొంగిన తరువాత ఇడ్లీలు వేసుకోవచ్చు.
 ..................
 
ఇడ్లీ పిండిలో కొద్దిగా తక్కువ నీళ్లు పోసి,  నూనెలో  వేయించే  పునుగులు కూడా వేయవచ్చు..
మినప్పప్పు, బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కొలతలు తీసుకోవాలి.   పునుగులుకి 2+పావు కప్పు   నీరు పడుతుంది... 
...................... 
 
పిండి గ్రైండర్లో కాకుండా, మిక్సీలో రుబ్బటం గురించి ఈ లెక్కలు ..

 ఇడ్లిపిండి గట్టిగా ఉంటే ఇడ్లీలు గట్టిగా ఉంటాయి. అలాగని పిండి పల్చగా అవకూడదు. 
 
ఇడ్లీ పిండి చలికాలంలో త్వరగా పులవాలంటే, పిండి గిన్నెను ఇంకో పెద్ద గిన్నెలో పెట్టి పైన మూత పెట్టాలి. ఖాళీగా ఉన్న కుక్కర్ల్ లేక హాట్ కేస్లో పెట్టి మూత పెట్టవచ్చు. గిన్నెను తలుపులు ఉన్న అలమారులో పెడితే చల్లగాలి తగలకుండా త్వరగా పులుస్తుంది.
 
*******************
* ఒక కప్పు మినప్పప్పు నానబెట్టి రుబ్బి, రెండుకప్పుల ఇడ్లీరవ్వ వేసి కలిపి, ఆ పిండిలో అర్ధకప్పు రాగిపిండి లేక అర్ధకప్పు జొన్నపిండి కలుపుకుని సుమారు 7 గంటలు తరువాత ఇడ్లీ వేసుకోవచ్చు.
 
 * జొన్న లేక రాగిపిండిలో రెండు టేబుల్ స్పూన్ల నీరుపోసి కలిపి, రుబ్బిన ఇడ్లీపిండిలో వేసి బాగా కలపాలి. లేదంటే, పప్పు రుబ్బేటప్పుడు రాగి లేక జొన్న పిండిని కూడా వేసి రుబ్బవచ్చు.
 
కప్పు మినప్పప్పు, కప్పు బియ్యం తో పాటు, కప్పు రాగులను కానీ,కప్పు జొన్నలను కానీ నానబెట్టి రుబ్బి ఇడ్లీలు, దోసెలు వేయవచ్చు..నానబెట్టిన రాగులు, జొన్నలకు బదులు రాగిరవ్వ, జొన్న రవ్వతో కూడా ఇడ్లీలు, దోసెలు చేయవచ్చు. 
 
* బియ్యం  లేకుండా..మినప్పప్పు, రాగులుకానీ, జొన్నలుకానీ వేసి కూడా చేస్తారు.
 
ఒకకప్పు మినప్పప్పు నానబెట్టి మెత్తగా రుబ్బి, రెండుకప్పుల జొన్నలు నానబెట్టి రవ్వలా బరకగా రుబ్బి..రెండూకలిపి ఇడ్లీలు వేసుకోవచ్చు.ఉప్పు వేయాలి. 
 ................................
 
 దోసె....ఒక గ్లాస్ మినప్పప్పు, రెండు గ్లాసుల బియ్యం, ఒక టీ స్పూన్ మెంతులను పగలు 3 గంటలు   నానబెట్టి, సాయంత్రం  రుబ్బి,  రాత్రంతా పులవనిచ్చి , ఉదయం  దోసెలు వేసుకోవచ్చు.  ఇలా అయితే, దోస క్రిస్పీగా ఉంటుంది.
 
దోసెలు మెత్తగా రావాలంటే ఒకపావుకప్పు అటుకులను  నానబెట్టి,  కలిపి రుబ్బుకోవాలి.
  
ఈ పిండి రుబ్బిన తరువాత  పిండిలో అర్ధ కప్పు రాగిపిండి కాని, జొన్న పిండి కాని కలిపి  పులవనిచ్చి , ఉదయం  దోసెలు వేసుకోవచ్చు.   

మినపప్పు ఎక్కువగంటలు నానితే,దోసెలు  త్వరగా పులుస్తాయని యూట్యూబులో ఒక చానల్ ద్వారా విన్నాను. 3 గంటలు నానితే సరిపోతుందట. 
 
 దోసెల పిండి తక్కువ నీటితో రుబ్బి పునుగులు  వేసుకోవచ్చు. మరికొన్ని ఎక్కువ నీరు కలిపి దోసెలు, ఊతప్పం.. వేసుకోవచ్చు....పునుగులకు రెండు గ్లాసుల నీటితో రుబ్బుకోవచ్చు. దోసెలకు మూడున్నర గ్లాసుల నీరు పడుతుంది. 
 
మినప్పప్పు, రేషన్ బియ్యం, సోనామసూరి, పాతబియ్యం రకాలను బట్టి, కొన్నిసార్లు నీరు కొంత ఎక్కువకానీ, తక్కువకానీ పట్టవచ్చు. 

దోసపిండిలో మెంతులు నానబెట్టి రుబ్బితే మిక్సీకి మెంతులు అంటుకుని శుభ్రం చేయటం కష్టం. అందుకని, ఒక టీస్పూన్ నీటిలో పావుటీస్పూన్ మెంతిపిండి వేసి కలిపి, రుబ్బినపిండిలో వేసి బాగా కలిపి పిండిని రాత్రంతా పులవనివ్వాలి. 
 
మెంతిపొడి డబ్బాకూడా పురుగు రాకుండా ఫ్రిజ్లో పెట్టాలి.
............................

బయట ఫుడ్ ఎక్కువగా తినకుండా ,అప్పుడప్పుడు అయినా  కొంచెం ఓపికతో ఇంట్లో చేసుకుంటే అనారోగ్యం రాకుండా బాగుంటుంది
 
******************************
 links..
 
 
ఈ రోజుల్లో ఆహారం గురించి కొన్ని విషయాలు.. మరియు స...
 
 

12 comments:



  1. పాలు త్వరగా తోడుకోవాలంటే, కొందరు ఒక ఎండుమిరపకాయను తోడుపెట్టిన పాలలో వేస్తారు. ఇంకొక పద్ధతి ఏమిటంటే, . గోరువెచ్చని పాలలో కొద్దిగా పెరుగు వేసి ఆ పెరుగు పాలలో బాగా కలిసేలా స్పూ న్ తో తిప్పాలి. ఆ గిన్నెను చల్ల గాలి తగలకుండా మూత ఉన్న అలమారలో పెట్టాలి. లేకపోతే పాలగిన్నెను మరొక పెద్ద గిన్నెలో లో పెట్టి పైన ఇంకొక మూత పెట్టాలి. అలా ఉంటే త్వరగా తోడుకుంటుంది.


    బౌర్నవిటా వంటివి గడ్డకట్టకుండా ఉండాలంటే బాటిల్ ఫ్రిజ్లో పెట్టాలి.



    ReplyDelete
    Replies


    1. ఈ మధ్య చాలామంది భోజనంలో ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం కాకుండా తక్కువగా పాలిష్ చేసిన బియ్యాన్ని వాడుతున్నారు.

      అయితే ఈ అన్నం తెల్లగా ఉండదు కాబట్టి, కొందరు ఇష్టపడరు.

      ఇలాంటప్పుడు ఈ బియ్యాన్ని పిండి పట్టించి దోసెలు వేయటానికి వాడుకోవచ్చు.


      Delete

  2. బయట కొనే పంచదార, బెల్లం వాడటం ఇష్టంలేనివారు చెరకుగడలు తెచ్చుకుని, ఇంట్లోనే చెరుకురసం తయారుచేసుకుని, ఆ రసాన్ని వేడిచేసి పాకం పట్టుకుని స్వీట్స్ తయారుచేసుకోవచ్చు.

    ఈ క్రింద ఇచ్చిన మెషిన్ల ద్వారా చెరకును ముక్కలుగా కొట్టి,రసం తీసుకోవచ్చు.

    Manual Sugarcane Bud Cutter Machine
    agrow.shop

    Sugarcane Juice Machine, Sugarcan Machine ( With Italiyan Gear Box), Latest Prices Manufacturer & Supplier in India
    www.aajjo.com

    ReplyDelete

  3. రవ్వ లేకుండా రవ్వ దోసెలుగా...

    ఒక కప్పు బియ్యపుపిండిని ఒక గిన్నెలో పోసి, కుక్కర్లో కొంచెం నీరు పోసి బియ్యం పిండి ఉన్న గిన్నెపై మూత పెట్టి కుక్కర్లో ఉంచి కుక్కర్ విజిల్ పెట్టకుండా 15 నిమిషాలు ఉడికించాలి.( ఇడ్లీలు ఉడికించే విధంగా..)

    తరువాత బియ్యంపిండి గిన్నెను కుక్కర్లో నుండి తీసి, ఆ పిండి లో సుమారు ఒకటిన్నర గ్లాసుల నీరు పోయాలి.

    ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి ఉంచుకుని, అందులో కొంచెం జీలకర్ర కలుపుకోవాలి.

    పిండిని పెనం పై నుండి జారుగా దోసెలుగా వేసుకుని, పైన ఉల్లితరుగు జల్లుకుని, కొంచెం నూనె వేసుకోవాలి. దోసెను దోరగా కాల్చుకోవాలి.

    ఈ పిండిని మామూలు దోసెలాగ గరిట ను పెనానికి తగిలేలా పిండిని తిప్పితే పిండి పెనానికి ముద్దలా అంటుకునే అవకాశం ఉంది. అందువల్ల కొంత పైనుంచి రవ్వ దోసెలా వేయాలి.

    పిండి ఉడికించినదే కాబట్టి రెండో వైపు ఎక్కువ కాలకపోయినా పరవాలేదు.

    ReplyDelete
    Replies
    1. కావాలంటే పైన చెప్పిన పిండిలో కొంత జొన్నపిండికానీ, రాగుల పిండి కానీ కూడా కలుపుకోవచ్చు.

      Delete
    2. మరి కొట్టిన పిండిని ఏమి చేస్తారు అనురాధ గారు. ఒక సందేహం.. అసలే వరిపిండి అన్నారు దానిని కుక్కర్ లో ఇడ్లిల మాదిరి ఉడకబెట్టారు.. అపుడది పేద్ద ఇడ్లి ఐతది కదా.. అటువంటప్పుడు నీరు పోస్తే మళ్ళి దోస పిండిలా జారుగా ఎలా మారుతుంది. అలా ఐతే ముందుగానే ఆ బియ్యపు పిండిలోనే చొళ్ళ పిండి కలుపుకుని జారుడు దోశెల మాదిరిగానో.. లేదంటే బొర్లించిన కుండపై గుడ్డతో పెట్టే పూతరేకు మాదిరిగానో తయారౌతాయి కదా అని మాయావిడువాచ.. అదేదో మూవిలో లా నెయ్యేసి కాల్చాలా.. కిరస్నాయిలేసి కాల్చాల్.. అసలు కాల్చాలా వద్దా..!
      మా ఘమ్సిబాయి కి (ఝాన్సి లక్ష్మీ బాయి లాటి దాని నేనంటు తనకు తానే బిరుదు ఇచ్చుకుంటే.. సరదాగా ఆటపట్టిస్తు నా ధర్మపత్నిని నేను అపుడపుడు అలా పలకరిస్తాను, అనురాధ గారు) వచ్చిన ధర్మ సందేహమిది. రెండు సార్లు కుక్ చేస్తే ఇడ్లి, ఖమన్ ఢోక్లా, మోమో, శర్వపిండి, రాగి సంగటి ముద్దలా గట్టిగా ఐపోదు, జొన్న పిండి ముద్ద విరిగిపోతుంది తదా శ్రీవారు అని అడిగితేను.. అమ్మ కు వంటవార్పు వచ్చు కదా అని ఈ రెండేళ్ళు తన కోడలికి పని చెప్పలేదు. ఇపుడేమో తనకి వంట ఎలా చేయాలో అమ్మను అడిగి, యూట్యూబ్ లో చూసి, వంటల బ్లాగ్ లలో వెతికి ఇలా గట శ్రీమతి అంటే మీరు పిల్లల్ని చూస్తు ఉండండి నేను చేసుకోస్తా చిటికెలో అంటు అపుడపుడు మాడు దోశెలు చేస్తా వుంటుంది నా ధరణి..!

      Delete
    3. sridhar+anitha=sri[dharani]tha.. మీకు ధన్యవాదములండి.

      బొంబాయ్ రవ్వ లేకుండా రవ్వ దోసెలుగా...

      బొంబాయ్ రవ్వ, మైదా వంటివి వాడటం మంచిది కాదని అంటున్నారు.అయితే, బొంబాయ్ రవ్వ బదులు బియ్యపు రవ్వ వేసుకోవచ్చు.

       ముందురోజు రుబ్బిన పిండి లేనప్పుడు  దోసెలు వేసుకోవాలనుకుంటే కూడా (ఇన్స్టెంట్ దోసెలు)ఇలా వేసుకోవచ్చు.

       అయితే, ఇక్కడ పిండిలో నీరు పోయకుండా పొడిపిండిని కొంతసేపు ఉడికిస్తాము.

      పొడిపిండి ముందే కొంత ఉడికించటం వల్ల, దోసె పచ్చిగా ఉందేమో ? సరిగ్గా ఉడికిందో? లేదో? అనే సందేహం ఉండదు.

      ఒక కప్పు బియ్యపుపిండిని ఒక గిన్నెలో పోసి.. కుక్కర్లో కొంచెం నీరు పోసి.. బియ్యం పిండి ఉన్న గిన్నెపై మూత పెట్టి.. కుక్కర్లో ఉంచి, కుక్కర్ విజిల్ పెట్టకుండా సుమారు 10 నిమిషాలు ఉడికించాలి.(ఇడ్లీలు ఉడికించే విధానంలో..)
      (అయితే, ఇడ్లీలు తప్పనిసరిగా 15 నిమిషాలు ఉడికించుకోవాలి.)

      తరువాత బియ్యంపిండి గిన్నెను కుక్కర్లో నుండి తీసి, ఆ పిండి లో సుమారు ఒకటిన్నర గ్లాసులు ..లేక రెండుగ్లాసులు నీరు పోయాలి.

      ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి ఉంచుకుని, అందులో కొంచెం జీలకర్ర కలుపుకోవాలి.

      పిండిని పెనం పై నుండి జారుగా దోసెలుగా వేసుకుని, పైన ఉల్లితరుగు జల్లుకుని, కొంచెం నూనె వేసుకోవాలి. దోసెను దోరగా కాల్చుకోవాలి.

      ఈ పిండిని మామూలు దోసెలాగ గరిట ను పెనానికి తగిలేలా పిండిని వేసి తిప్పితే.. పిండి పెనానికి ముద్దలా అంటుకునే అవకాశం ఉంది. అందువల్ల కొంత పైనుంచి రవ్వ దోసెలా వేయాలి.

       మంటను బాగా తగ్గించి కాకుండా కొంత పెద్ద మంట ఉండేలా ఉంచి, పిండిని రవ్వదోసెలుగా కొంత పలుచగా కలిపి, పెనంపైన కొంత ఎత్తునుంచి దోసెలుగా వేస్తే హోల్స్ బాగా వస్తాయి.

      పిండి ఉడికించినదే కాబట్టి రెండో వైపు ఎక్కువ కాలకపోయినా పరవాలేదు.

       కొంచెం ఎక్కువసేపు కాల్చుకుంటే  క్రిస్పీగా వస్తాయి.

      మొత్తం బియ్యంపిండి అయితే తెల్లగా క్రిస్పీగా వస్తాయి. కొంత జొన్నపిండికానీ, రాగిపిండికానీ బియ్యంపిండిలో కలుపుకుని  కూడా దోసెలు వేసుకోవచ్చు. అంతా  రాగిపిండితోనే వేస్తే కూడా దోసెలు వచ్చాయి.

      * ఇడ్లీలు ఉడికించే విధంగా అంటే ..ఇడ్లీపిండిలో నీరు కలిపి ఉడికిస్తాము కాబట్టి, ఆ పిండి ఇడ్లీలుగా ఉడికిపోతాయి.

       ఇక్కడ బియ్యపుపిండిలో నీరు కలపకుండా పొడిపిండిని ఉడికిస్తాము.
      (బియ్యంపిండిలో కొంత  జొన్నపిండికానీ, రాగిపిండికానీ  కలుపుకుని కూడా ఉడింకించుకోవచ్చు.)

      * పిండి గట్టిగా అయినాకూడా.. నీరుపోసి గరిటెతో కలిపితే వెంటనే దోసెల పిండిలా జారుగా అవుతుంది.


      Delete
    4. అనురాధ గారు.. చాలా ఓపికగా వివరించినందుకు ధన్యవాదాలు.. నా శ్రీమతి కి తెలియజేస్తాను. మీ బ్రాగ్ లో చాలా విషయాలు పొందుపరిచారు. మరొకమారు ధన్యవాదాలు.. మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నందుకు అభినందనలు మీకు.

      Delete

  4. మరికొన్ని విషయాలండి..

    పిండిని వేడి చేయకుండా కూడా అప్పటికప్పుడు పిండిని నీటిలో కలిపి దోసెలు వేసుకోవచ్చు.

    పచ్చి పిండితో అప్పటికప్పుడు వేసిన దోసెలను కూడా వేడి పెనం పైన సరిగ్గా కాల్చితే సరిపోతుంది.

    ****
    అయితే, కొందరికి దోసె ఉడికిందో? లేదో? అని సందేహాలు ఉంటాయి.
    ఇలాంటప్పుడు.. పొడిపిండిని ఒకసారి వేడిచేసి దోసెలు వేస్తే, పిండి ఉడకలేదనే సందేహం ఉండదు కాబట్టి ఇలా చేసాను.

    ఈ పిండి గిన్నె అడుగుభాగానికి వెళ్లి నీరు పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, దోసె వేసినప్పుడల్లా పిండిని ఒకసారి గరిటెతో కలుపుకుని దోసె వేసుకోవాలి.

    ********

    ఇవన్నీ రాస్తుంటే మామూలుగా వేసుకునే మినపదోసెలు, పెసరట్లు విషయంలో
    నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి..

    రుబ్బిన మినప్పప్పు, పెసరపప్పు వంటివి త్వరగానే ఉడుకుతాయేమో.. వాటిని కొన్నిసార్లు నానబెట్టి పచ్చివి తింటారు కూడా.
    బియ్యం, జొన్నలు.. వంటివి మాత్రం సరిగ్గా ఉడకటం అవసరం.

    అయితే..మినపప్పును, బియ్యాన్ని కొన్ని గంటలు నానబెట్టి, రుబ్బి కొంత సమయం తరువాత దోసెలు వేసుకుంటే అవి ఉడకకపోవటం అనే సమస్య ఉండకపోవచ్చు.

    ***********
    దోసెలను ఇనుప పెనంపై వేస్తే త్వరగా కాలుతాయి. అయితే, పెనం తుప్పు పట్టకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

    ఇక, Soapstone Kalchatti Tawa (Maakal).... అనేవి కూడా ఉన్నాయి.

    ***********
    ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నా కూడా .. మేము కూడా అప్పుడప్పుడు మైదా, బొంబాయ్ రవ్వ వాడుతాము.

    **********
    నాకు ఒక సమస్య ఉంది. నాకు ఆలోచనలు అన్నీ ఒకేసారి తట్టవు.

    బ్లాగులో పోస్టుకానీ, కామెంట్ కానీ వ్రాసిన తరువాత కూడా కొత్త ఆలోచనలు వస్తుంటాయి. వీలైనంతలో వాటిని కూడా వ్రాస్తుంటాను.

    చదివేవారికి విషయాన్ని వివరంగా తెలియజేయాలనే తాపత్రయంలో కొత్తగా తట్టిన ఆలోచనలను కూడా రాస్తుంటాను.
    *******
    వ్రాసిన వాటిలో ఏమైనా సందేహాలుంటే అడగవచ్చండి.
    ప్రతిసారి ధన్యవాదాలు చెప్పనవసరం లేదండి.

    ReplyDelete

  5. మినపప్పు,బియ్యం కలిపి ఇడ్లీలు, దోసెలు, పునుగులు..వంటివి ఎక్కువ వద్దనుకుంటే పెసలు, మినపప్పు నానబెట్టి రుబ్బి దోసెలు వేసుకోవచ్చు.

    మినప్పప్పు, జొన్నలు కలిపి దోసెలు వేయటం కూడా అంతర్జాలంలో చూపిస్తున్న.

    మినప్పప్పు, జొన్న రవ్వ కలిపి ఇడ్లీలు వేసుకోవచ్చు. పెసర్లతో కూడా ఇడ్లీలు వేయటం అంతర్జాలంలో తెలియజేస్తున్నారు.

    గోధుమపిండికి కొద్దిగా బియ్యంపిండి కలిపి కూడా పునుగులు వేసుకోవచ్చు.

    బియ్యంపిండి లేదా బియ్యపు రవ్వకు, కొద్దిగా జొన్నరవ్వ లేదా జొన్నపిండిని కలిపి పునుగులు వేసుకోవచ్చు.

    ReplyDelete

  6. ఈ మధ్య కొందరు ఉప్పుడు బియ్యపు రవ్వను ఇంట్లోనే తయారుచేస్తున్నారు.

    బియ్యాన్ని వేడినీటిలో కొద్దిసేపు ఉంచి ఆ నీటిని వార్చి, బియ్యాన్ని ఎండలో ఎండించి రవ్వ పట్టిస్తున్నారు.


    ReplyDelete
  7. నేను ఇంతకుముందు ఏమనుకున్నానంటే, ధాన్యాలు సరిగ్గా ఉడికించకుంటే అజీర్ణం చేస్తుందనుకున్నాను.
    అయితే, ఈ మధ్య ఒకరు తెలియజేసిన అమృతాహారం అనే విధానం గురించి చూసాను.
    వారు ఏం చెప్తున్నారంటే ..కాయగూరలు, పండ్లను ఉడికించకుండా తింటే మంచిదని చెబుతున్నారు. ఇంకా కూడా ధాన్యాలను నానబెట్టి, రుబ్బి కొంతసేపు తరువాత( ఉడికించకుండా) తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.
    ఇది విన్న తరువాత ఏమనిపించిందంటే, ఎప్పుడయినా దోసెలు అవి వేసుకున్నప్పుడు దోసెలు పూర్తిగా వేగకపోయినా ప్రమాదం ఉండకపోవచ్చని ధైర్యం వచ్చింది.

    ReplyDelete