koodali

Saturday, June 16, 2018

సోషల్మీడియాలో కొందరు..మరి కొన్ని విషయములు...



సోషల్మీడియాలో కొందరు రకరకాలవిషయాలను చెబుతూ అవన్నీ పాటించకపోతే కష్టాలొస్తాయంటూ చెబుతున్నారు.


 సమాజం సరిగ్గా నడవాలంటే ఎన్నో వృత్తులు అవసరం. అందరూ పనిచేస్తేనే సమాజం సరిగ్గా నడుస్తుంది. కుటుంబంలో కూడా స్త్రీలుపురుషులు తమ బాధ్యతఇవన్నీ తెలిసిన ప్రాచీనులులను సరిగ్గా నిర్వర్తిస్తేనే కుటుంబవ్యవస్థ బాగుంటుంది.
 
 
 ఉదయాన్నే చద్దన్నం తిని పొలానికి వెళ్ళే రైతులు చాలా నియమాలను పాటించలేరు. కుటుంబానికి దూరంగా మంచుకొండలలో ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడే సైనికులు ఉపవాసాలు వంటి అనేక నియమాలను పాటించలేరు.


ఎవ్వరైనా అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం ఆరోగ్యానికి మంచిదే కానీ, ఎప్పుడూ ఏదో ఒక విశేషం అంటూ అస్తమానం ఉపవాసాలు ఉంటే నీరసం వస్తుంది, అనారోగ్యం వచ్చే అవకాశముంది.


 కొన్ని వృత్తుల వారు పెద్దగా పూజలు చేయకపోయినా వారి పనులను వారు చక్కగా చేస్తే చాలు పుణ్యం లభిస్తుందని ప్రాచీనులు తెలియజేసారు. అందరూ పనులన్నీ ఆపేసి ఉపవాసాలు ఉంటూ కూర్చుని తపస్సు చేస్తూ ఉండమని ప్రాచీనులు చెప్పలేదు.


  అందరూ అన్నీ పనులు మాని విరక్తులైతే సమాజం ఏమవుతుంది. చెడ్డవారైన శత్రువుల చేతిలోకి పోతుంది. అలా జరగకుండా ఉండాలంటే, మంచివారు తమ బాధ్యతలను తాము నిర్వర్తించాలి.


    శ్రీకృష్ణులవారు యుద్ధరంగంలో అర్జునునితో  ..అప్పుడు యుద్ధం చేయడము అర్జునుని కర్తవ్యమని బోధించారు..
ఇంకా ఎన్నో విషయములను కూడా బోధించారు.

 
జీవితంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ కూడా దైవాన్ని స్మరించుకోవచ్చు..
 

ఎవరైనా ఒకదగ్గర కూర్చుని పూజ చేయవచ్చు..
ఇంకా,  ధర్మబద్ధంగా తమ బాధ్యతలను నిర్వర్తించటం కూడా పూజయే.


 జీవితంలో  ఏ పని చేయాలన్నా అనేక సందేహాలతో అనేకనియమాలు ముందుకాళ్ళకు బంధాలుగా తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితి వల్ల ప్రజలు నిరాశావాదులుగా, నిస్తేజంగా తయారవుతారు. విసుగుతో నియమాలను పాటించడమూ మానేస్తారు. 
 
 
సోషల్మీడియాలో  ఏదో ఒకటి చెప్పాలని కొందరు.. ప్రతిదీ అలా చేయకూడదు, ఇలా చేయాలి..అంటూ చెపుతూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.


  కలికాలంలో ప్రజలు శారీరికంగా, మానసికంగా బలహీనంగా ఉంటారని తెలిసిన ప్రాచీనులు, కలికాలంలో సులభంగా పూజ దైవస్మరణ చేసినా చాలని తెలియజేసారు. అయితే, కొందరు అనేక పూజలు, అనేక నియమాల గురించి  చెబుతూ అందరూ అలా పాటించాలని ..పాటించకపోతే కష్టాలు వస్తాయని చెబుతూ భయపెడుతున్నారు. ఇలా చేయటం ప్రాచీనులు తెలియజేసినవాటికి విరుద్ధం.


సనాతనధర్మం మూఢాచారాలను పాటించమని చెప్పలేదు. కొందరు ప్రజలే వాటిని ప్రవేశపెట్టారు. ఇలా అతిగా చేయటం సరైనది కాదు.


 పాతకాలంలో హిందువులలోనే కొందరు తమలో తాము గొడవలు పడ్దారు.వైష్ణవులు శైవులు అని కూడా గొడవలు జరిగాయి.  కొన్నిమూఢాచారాల వల్ల ఎందరో ఇబ్బందులుపడ్దారు.   ఏ కర్మల ఫలితమో కానీ,  కారణాలేమైనా భారతదేశం చాలా సంవత్సరాలు  విదేశీదాడుల వల్ల బాధలు పడింది.


 అయితే, అనేకమంది పుణ్యాత్ముల ధర్మనిరతి వల్ల, పూజలు.. దైవం దయవల్ల అనేకదాడుల తరువాత కూడా భారతదేశం  ఇంకా నిలబడింది. ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా  మనం  కొన్ని విషయాలలో  సరిదిద్దుకుంటే మంచిది.


సనాతనధర్మంలో చక్కటి జీవన విధానాన్ని తెలియజేసారు. చతురాశ్రమ ధర్మాలను, ఇంకా ఎన్నో గొప్ప విషయాల గురించి తెలియజేసారు. అయితే, కాలక్రమేణా  గ్రంధాలలో ఎన్నో ప్రక్షిప్తాలు ప్రవేశించాయి. అందువల్ల, మూఢత్వంతో కాకుండా విచక్షణతో,  ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి.


వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే ,  దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్దిస్తున్నాను.
 
**********
 
 

No comments:

Post a Comment