koodali

Tuesday, June 12, 2018

కొన్ని విషయాలు...అనేక సందేహాలతో, అనేక నియమాలతో ..


 
ప్రాచీనులు  ఎన్నో ఆచారవ్యవహారాలు, నియమాలను ఏర్పరిచారు. వీటిలో ఎన్నో మంచివిషయాలున్నాయి.  అయితే,  క్రమంగా కొన్నిమూఢనమ్మకాలు ప్రవేశించాయి. ఇప్పుడు అన్నీ కలిసి బోలెడు అయ్యాయి.


ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, దైవభక్తి, ధర్మబద్ధంగా జీవించటం..వంటి విషయాల గురించి ఆలోచించటం కన్నా, ఇతరవిషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు.

  
భక్తి, జ్ఞానం గురించి ఎలా ఉన్నా,  అనేక  సందేహాల గురించి ఆలోచనలతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. పూజకన్నా, పూజా విధానాన్ని సరిగ్గా ఆచరిస్తున్నామా లేదా? అనే సందేహాలతోనే సమయం గడిచిపోతుంది.


దైవము మెచ్చేలా ఎలా ప్రవర్తించాలి? ధర్మబద్ధంగా ఎలా జీవించాలి? దైవకృపను ఎలా పొందాలి? ఇలాంటి వాటిగురించి ఎక్కువగా ప్రజలకు చెప్పాలి..ప్రజలు కూడా వీటి గురించి ఎక్కువ ఆలోచించాలి.


జీవితంలో నియమాలు, ఆచారవ్యవహారాలు తప్పక  ఉండాలి. అయితే, అతి పెరిగితే మంచిది కాదు. ఆహారం అయినా అతిగా తింటే ఆరోగ్యానికి మంచిదికాదు. ఏది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఆచారవ్యవహారాలను పద్ధతిగా పాటించాలి. అయితే, కొందరు ఆచారవ్యవహారాలను మూఢనమ్మకాలతో పాటిస్తారు. అలాంటివారికి చెప్పేదేమిటంటే, ఏ విషయంలోనైనా విపరీతధోరణి సరైనది కాదు.
 
 
ప్రతిదానినీ పెంచుకుంటూ ..ప్రతిదానికీ సవాలక్ష నియమాలు చెబుతూ వాటిని పాటించకపోతే కష్టాలొస్తాయని భయపెడుతుంటే.. భయపడి అన్నింటినీ పాటించలేక ఎందరో హిందువులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. 
 
 
ఇలాంటప్పుడు తేలికగా దైవాన్ని ప్రార్ధించుకునే విధానాల గురించి ఎవరైనా చెబితే అటువైపు మనస్సు వెళ్ళటం సహజం. జనాలు ఈ గోలలో ఉంటే ఇతరులు తమపనితాము కానిచ్చుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా కూడా ప్రజల బాధ పట్టించుకోని కొందరు తమకు తోచినట్లు తాము చెపుతూనే ఉన్నారు.

 

 ఇహానికి, పరానికి మంచిగా ఉండేలా ప్రాచీనులు ఎన్నో విషయాలను తెలియజేసారు. అయితే ఇప్పుడు   అనేక సందేహాలతో, అనేక నియమాలతో దైవపూజనూ సరిగ్గా చేయలేకపోతున్నారు. అనేక సందేహాలతో, అనేక నియమాలతో అయోమయంతో స్వధర్మాన్ని కూడా సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు.
 
 
ఈ విధంగా  ఇహానికి, పరానికి కూడా  సరిగ్గా   ప్రయత్నించలేకపోతున్నారు. కొందరు వారు భయపడుతూ అందరినీ భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.


మూఢనమ్మకాలను వదిలిపెట్టకుండా, పట్టువిడుపులు లేకుండా ఉన్నప్పుడు, మతం మారిపోతున్నారంటూ ఎంత గగ్గోలు పెట్టినా ఫలితం ఉండదు. మనమూ మన విధానాలను కొంత సరళం చేసుకోవాలి.


 
రోజూ నిత్యపూజ చేసుకుంటూ  ధర్మబద్ధంగా జీవిస్తూ దైవాన్నిస్మరించుకుంటూ చక్కగా ఉండవచ్చు.  


 
చక్కగా దైవభక్తి, ధర్మబద్ధమైన జీవితం, నిత్యపూజ, కొన్ని పండుగలు,  దేవాలయాలకు వెళ్లటం..ఇలా తేలికైన మార్గాన్ని వదిలి, ఏవేవో నమ్మకాలతో తాము సతమతమవుతూ, అందరినీ అయోమయం చేయటం ఏమిటో? అన్నింటికీ దైవమే దిక్కు.

.......................

ఒక సాధువు ఒక చెరువు లో స్నానానికి వెళ్ళదలచి, తన కమండలాన్ని  గట్టున ఇసుకలో దాచి, గుర్తుగా పైన ఇసుకతో గోపురంలా చేసి స్నానానికి వెళ్తారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఒక వ్యక్తి విషయం తెలియక, సాధువు చేసినట్లు తనుకూడా ఇసుకతో గోపురాన్ని నిర్మిస్తే తనకు మంచి జరుగుతుంది కాబోలు అని భావించి , తాను కూడా గోపురాన్ని నిర్మిస్తారు. అదిచూసిన మరికొందరు తాముకూడా ఇసుకతో  గోపురాలను చేస్తారు.... సాధువు స్నానం చేసి వచ్చి కమండలం కొరకు చూడగా ఎన్నో ఇసుకగోపురాలు కనిపించి అయోమయం అవుతారు. 
 
 
ఈ కధను గమనిస్తే సమాజంలో కొన్ని ఆచారవ్యవహారాలు, నమ్మకాలు ఇలా తెలిసితెలియక కూడా వచ్చి ఉండవచ్చనిపిస్తుంది. ఎన్నో మంచి విషయాలతో ప్రాచీనులు ఆచారవ్యవహారాలను ఏర్పరిచారు. అయితే కాలక్రమేణా కొన్ని మార్పులుచేర్పులతో ఎన్నో కొత్తవి కూడా వచ్చిఉండవచ్చు.


విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుల గురించి ఒకసారి నారదుల వారికి తెలుసుకోవాలనిపించిందట. విష్ణుమూర్తి వారు ఒక రైతును చూపించి, అతను కూడా తనయొక్క గొప్ప భక్తులలోని వారని చెప్పటం జరిగిందట. పెద్దగా పూజలు చేయని ఆ రైతు గొప్ప భక్తుడు ఎలా అవుతాడని నారదుల వారికి సందేహం రాగా, విష్ణుమూర్తి ఒక పరీక్ష పెడతారు......
 
 
 
 ఒక గిన్నెనిండా తైలమును పోసి ..ఒక్క చుక్కైనా ఒలకకుండా ప్రదక్షిణ చేసి రమ్మనగా.. వచ్చిన తరువాత ఎన్నిమార్లు దైవస్మరణ జరిగిందని అడిగితే, నూనె ఒలకకూడదనే గాభరాలో తాను ఒక్కసారి కూడా స్మరించలేకపోయానని నారదులవారు చెపుతారట. ఈ కధ ద్వారా చాలా విషయములు తెలుసుకోవచ్చు. గొప్ప సాధనలు చేయలేకపోయినా, సామాన్య భక్తులు కూడా దైవకృపకు పాత్రులవచ్చని కూడా తెలుసుకోవచ్చు.


ఆడంబరాలు లేకున్నా కూడా  మనస్సులో ప్రేమభక్తితో దైవాన్ని స్మరించుకున్నా కూడా దైవకృపను పొందవచ్చు.


ఈ రోజుల్లో చాలామంది పూజ కన్నా పూజా విధానాల గురించి ఎక్కువ తాపత్రయపడటం, భయపడటం జరుగుతోంది. సమాజం సరిగ్గా ఉండాలంటే దైవభక్తిని కలిగి ఉండాలి. ఇంకా, నైతికవిలువలు కలిగి, ఎవరి పనిని వారు సరిగ్గా నిర్వర్తించాలి. అప్పుడు దైవకృపను పొందవచ్చు. అంతేకానీ, దైవంపట్ల ధ్యాస సరిగ్గా లేకుండా..స్వధర్మాన్ని సరిగ్గా పాటించకుండా..మూఢత్వంతో ప్రవర్తించటం సరైనది కాదు.


వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే ,  దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్దిస్తున్నాను.

1 comment:



  1. రోడ్డుపై డివైడర్లు ఉన్నఫ్ఫుడు ట్రాఫిక్ జాం అవటం తక్కువ. కొన్ని ఫంక్షన్స్ జరిగినప్పుడు , డివైడర్ లేని రోడ్దుమధ్య తాడుతో టెంపరరీగా విభజించి ట్రాఫిక్ సరిగ్గా వెళ్లేటట్లు ఏర్పాటు చేస్తారు.

    అయితే కొన్నికారణాల వల్ల ఇలాంటి ఏర్పాట్లు చేయలేనప్పుడు అధిక జనం ఫంక్షన్ కు వస్తే, రోడ్దుపై వచ్చేవాళ్లు , పోయేవాళ్లతో ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది.

    ఇక జనం కూడా తామే త్వరగా వెళ్ళాలనుకుంటూ సందు దొరికితే బండిని ముందుకు పోనిస్తూ సన్నని రోడ్లపై మూడు నాలుగు వరుసలుగా ముందుకు వచ్చేస్తారు.

    ఇక ట్రాఫిక్ జాం అయి ఎన్ని గంటలైనా బండ్లు సరిగ్గా ముందుకు పోవు.

    సన్నని రోడ్దు మాత్రమే ఉన్నప్పుడు, జనం తమ ఇష్టానుసారంగా బండ్లను మూడు నాలుగు వరుసలుగా ముందుకు పోవటం కాకుండా ...

    వెళ్లే దారిలో వెహికల్స్ అన్నీ ఒకదాని తరువాత ఒకటి గా ఒకే వరుసలో ముందుకు వెళ్లేటట్లు... వచ్చేవి కూడా ఒకే వరుసలో వచ్చేటట్లు చూసుకుంటే... ట్రాఫిక్ జాం అవకుండా ఎన్ని వెహికల్స్ అయినా సునాయాసంగా ముందుకు వెళ్ళగలవు. ట్రాఫిక్ జాం అవదు.

    అయితే ప్రజలలో ఈ క్రమశిక్షణ ఎప్పుడొస్తుందో ? అందరూ ఒకేసారి ముందు కెళ్లాలనే దూకుడుతో భయంకరమైన ట్రాఫిక్ జాం కు ఎందుకు కారణమవుతారో ?

    ReplyDelete