పురాణేతిహాసాలలోని పాత్రలను కొందరు అపార్ధం చేసుకుంటారు. అంత గొప్ప వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేసారు కదా ! అంటారు. నిజమే , గొప్పవారు అయినా కొన్నిసార్లు పొరపాట్లు చేసే అవకాశం ఉంది.
ఇతరులు చేసిన గొప్పపనులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇతరులు చేసిన పొరపాట్ల నుంచి మనం పాఠాన్ని నేర్చుకోవాలి.
( మనం అలాంటి పొరపాట్లు చేయకూడదనే పాఠాన్ని నేర్చుకోవాలి. )
..........................................
సమాజం అన్నాక ఎంతో వైవిధ్యం గా ఉంటుంది. భిన్న మనస్తత్వాల వారు ఉంటారు.
ఒకే వ్యక్తి ( వివిధ కారణాల వల్ల ) ఒకోసారి ఒకోరకంగా కూడా ప్రవర్తిస్తాడు.
ఇప్పుడు సమాజంలో చూడండి ........ ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. మంచి సంఘటనలూ జరుగుతున్నాయి.మంచివారూ ఉన్నారు ........ చెడ్డవారూ ఉన్నారు.
మరి వీటన్నిటి మధ్య మనం ఎలా జీవించాలి ? ఏది ధర్మం ? ఏది అధర్మం ? ఎవరు చెబుతారు ? ....... అని అయోమయంలో పడకుండా ,
దైవం, పెద్దలు ... పురాణేతిహాసాలలోని పాత్రలు, సంఘటనల ద్వారా.....ఈ జగన్నాటకంలో మనం ఎలా ప్రవర్తించాలో ,ఎలా ప్రవర్తించకూడదో , .......ఎలా ప్రవర్తిస్తే పర్యవసానం ఎలా ఉంటుందో .......మనకు చక్కటి దిశానిర్దేశం చేశారు అనిపిస్తుంది.
అందుకే ఈ గ్రంధాలలో, లోకంలో ఉండే విభిన్న వ్యక్తిత్వాలూ, విభిన్న సంఘటనలు కనిపిస్తాయి.
...........................................
పురాణేతిహాసాలలోని పాత్రల నుంచి మనం ఎన్నెన్నో విషయాలను నేర్చుకోవచ్చు.
ఉదా...వివాహం కాని అమ్మాయిలు ఉన్న తల్లితండ్రులకు కొంత భయం ఉంటుంది. అమ్మాయికి జాగ్రత్తలు చెప్పాలంటే ఎలా చెప్పాలో తెలియక మొహమాటంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు శకుంతలదుష్యంతుల కధను అమ్మాయికి తెలియజేస్తే ,
తల్లితండ్రులకు తెలియకుండా రహస్య వివాహాలు చేసుకుంటే కలిగే ఇబ్బందులు వంటి వాటిని శకుంతల పాత్ర ద్వారా తెలుసుకుని అమ్మాయిలు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది.
........................................
కుంతీదేవి కధను తెలుసుకోవటం ద్వారా పిల్లలు, పెద్దలు కూడా ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కుంతీదేవి సహనంతో, దృఢత్వంతో జీవించటం జరిగింది.
కుంతీదేవి వ్యక్తిత్వంలోని సహనం, దృఢత్వం వంటి ఎన్నో గొప్ప విషయాలను మనము నేర్చుకోవచ్చు.
అయితే తెలిసితెలియని చిన్నతనంలో , మహర్షి ప్రసాదించిన వరాన్ని పరీక్షించకోరిన సందర్భములో సంభవించిన కర్ణజననం , లోకోపవాదానికి భయపడి కర్ణుని వదిలిపెట్టడం వంటి సంఘటనల వల్ల కుంతీదేవి జీవితాంతం వరకు మానసిక క్షోభను అనుభవించింది. కర్ణునికి తాను అన్యాయం చేశానని కుమిలిపోయింది.
కుంతీదేవి జీవితంలోని ఈ సంఘటన ద్వారా వివాహానికి పూర్వమే బిడ్డలను కంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అమ్మాయిలకు వివరంగా తెలుస్తుంది.
.....................................
ధర్మరాజు ఎంతో గొప్పవ్యక్తి. ధర్మాన్ని చక్కగా ఆచరించిన వ్యక్తి. వారు పాటించిన నైతిక విలువలతో కూడిన గొప్ప జీవితం ద్వారా మనం ఎన్నో మంచి విషయాలను నేర్చుకోవచ్చు.
అయితే, జీవితమంతా ధర్మాన్ని పాటిస్తూ జీవించినా కూడా జూదం వంటి ఒక్క చర్య వల్ల వారు వనవాసం వంటి కష్టాలను అనుభవించవలసి వచ్చింది.
ఈ విషయం గురించి మనం ఏం నేర్చుకోవాలంటే , ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే జీవితంలో కష్టాలు రాకుండా ఉంటాయి అని తెలుసుకోవాలి.
Wednesday, December 11, 2013
******************
దయచేసి ఈ లింక్ కూడా చదవగలరు.
ఆలోచన రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది...
No comments:
Post a Comment