koodali

Friday, June 1, 2018

అయితే, అతిగా ఉండకూడదు....


ఆధునికకాలంలో కుటుంబవ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. విదేశాలవారికి కూడా కుటుంబపద్ధతులు ఉంటాయి. 


అయితే, ఆధునికకాలంలో కొన్ని విదేశాల్లో టీనేజ్ నుండే పిల్లలు చదువు, ఉపాధి కోసం తలీతండ్రి సపోర్ట్ లేకుండా తమసొంత ప్రయత్నాలు తాము చేసుకోవలసిన పరిస్థితి  ఉన్నది.


 ధన సంపాదన కష్టంగా మారిన ఈ రోజుల్లో టీనేజ్ పిల్లలు తమ చదువులకోసం, ఉపాధికోసం ప్రయత్నించే   సమయంలో ఎన్నో కష్టాలు పడే పరిస్థితి ఉండవచ్చు. అమ్మాయిల విషయంలో అయితే మరెన్నో కష్టాలు ఉంటాయి. 


భారతదేశంలో అయితే, పిల్లలు జీవితంలో చదువు, వివాహం  వంటి పరిస్థితి వరకూ కూడా తల్లితండ్రి అండగా ఉంటారు. 


అయితే, కొన్ని  విదేశాల్లో వలే  పిల్లలను  టీనేజ్లోనే వారి బ్రతుకు వారిని బ్రతకమని వదిలేయటం సరైనది కాదనిపిస్తుంది.


కొన్ని  విదేశాల్లో స్వేచ్చ మరీ ఎక్కువ. భారతదేశంలో ఆంక్షలు మరీ ఎక్కువ. రెండూ సరైనవి కాదనిపిస్తుంది. 

స్వేచ్చ కొంతవరకూ అవసరమే...అయితే,  అతిగా ఉండకూడదు.

ఆంక్షలు కొంతవరకూ అవసరమే... అయితే,  అతిగా ఉండకూడదు.

........................

 ఇక, విదేశాలకు వెళ్లిన భారతీయుల పిల్లల పరిస్థితి చూస్తే, దేశం కాని దేశంలో తమ బాధలు ఎవరికీ చెప్పుకోలేక,  చెప్పుకున్నా అర్ధం చేసుకునేవాళ్ళు లేక, తల్లితండ్రికి సరిగ్గా చెప్పలేక... పిల్లలు పడుతున్న బాధలు ఎన్నో ఉన్నాయి.

 ముఖ్యంగా మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వాళ్లు అప్పులు చేసి పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారు. ఇలాంటి వారి పరిస్థితి కష్టంగా ఉంటుంది.

ఒక పక్క విపరీతంగా చదవవలసి ఉంటుంది.

 విదేశాల్లో  ధరలు ఎక్కువగా ఉంటాయి. వంట చేసుకోవడానికి సమయం సరిపోదు. ఇక వండుకునే ఓపిక లేక పిల్లలు  ఒక పూట తినీతినకా అలా ఉంటుంటారట.  

ఇంత కష్టపడి చదివినా ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. విదేశాల్లో అనారోగ్యం వస్తే మరింత కష్టం.

 ఉన్నత చదువులు చదవడానికి వెళ్లిన కొందరు పిల్లల పరిస్థితి చాలా బాధ కలిగిస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో భారతదేశంలోని తల్లితండ్రులు పిల్లలకు ఇష్టం లేకపోయినా  వారిని  బలవంతంగా విదేశాలకు పంపడం చేయకూడదు.

విదేశాల్లో జీతాలు ఎక్కువగా వస్తాయని అనుకోవటమే కానీ, అక్కడ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఇండియాలో నెలకు లక్ష వచ్చినా ఇక్కడ ధరలు తక్కువ. విదేశాల్లో నెలకు నాలుగు లక్షలు జీతం వచ్చినా అక్కడ ధరలు బాగా ఎక్కువ. ఏదైనా ఒకటే.
............

 విదేశాల్లో స్థానికులకేమో తమ  ఉద్యోగాలు తమకు కాకుండా చేస్తున్నారని భారతీయులపై కోపం.

ఇండియాలోనే ఒకే రాష్ట్రం, ఒకే భాషవాళ్లు కూడా సర్దుకుపోలేక  మా ఉద్యోగాలు మాకే కావాలంటూ  విడిపోతున్నారు.


ఇక ఎక్కడో విదేశాల్లో వాళ్లు మా ఉద్యోగాలు మాకే కావాలి... అంటున్నారంటే ఆశ్చర్యం ఏముంది. 

 కొన్ని విదేశాల్లో కొందరు  పిల్లలకు పేరెంట్స్ సపోర్ట్ అంతగా ఉండదు. పిల్లలు ఉపాధి కోసం వాళ్ళ బాధలు వాళ్లు పడవలసి వస్తుంది.

 ఈ రోజుల్లో నిరుద్యోగసమస్య బాగా పెరిగింది. ఇలాంటప్పుడు భారతదేశం వంటి దేశాల నుంచి  వెళ్లి ఉపాధి పొందుతున్న వారి పట్ల కొన్ని సార్లు  నిరసన వ్యక్తమవుతోంది.


 ఎక్కడో ఇతరదేశాలనుంచి వచ్చి తమ ఉపాధికి అడ్దుపడుతున్నారనే అభిప్రాయం అక్కడి స్థానికులలో కలుగుతోంది.

ఇవన్నీ గమనిస్తే,  మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవటం మంచిదనిపిస్తుంది.  




No comments:

Post a Comment