koodali

Friday, August 24, 2012

మరి కొన్ని ముఖ్యమైన విషయాలు ......


* కురువపురం  శ్రీ పాదశ్రీవల్లభస్వామి  వారి  దేవస్థానం  నది  మధ్యలో  ఉన్నది.


*  ఆ  మధ్య     భారీ వరదలు  వచ్చినప్పుడు  కురువపురం  గ్రామములోకి ,    ఇంకా  ,  శ్రీవల్లభపురంలోని  శివాలయం  వద్దకు     వరదనీరు  వచ్చిందట.  కానీ,  నది  మధ్యలోని  శ్రీ పాదశ్రీవల్లభస్వామి  వారి   దేవస్థానానికి   మాత్రం   ఇబ్బంది  అవలేదట.


 *  శ్రీ పాదశ్రీవల్లభస్వామి వారి    దేవస్థానానికి   జూరాల  ప్రాజెక్ట్    10  కిలోమీటర్లు    దూరం  మాత్రమే  ఉండటం  వల్ల ,  భవిష్యత్తులో  ఏం  జరుగుతుందో !  అని     కొందరు  భక్తులు   తమ  అభిప్రాయాలను     వ్యక్తపరుస్తున్నారు.  



* ఒక  బ్లాగులో  కురువపురం  గురించి   ఇలా  వ్రాసారు....


 (  Latest information: The Government of Andhra Pradesh intends to construct “JOORALA RIVER PROJECT†which is about only a distance of 10 kms from Kuravapur. The people who are staying in the sorrounding areas narrate their woes and fear that the Kurvapur Kshetra will be submerged in water due to this callous project. So it is the time for every one of us to pray Lord dattatreya not to give any trouble on the powerful Kurvapur due to this proposed project.I'm sure Lord Dattatreya would save the Kshetra and ultimately He decides what has to happen.Please visit this sacred place before it submerges in the waters. )  .........
..........................

 *   దైవం  ఏం  చేస్తారో  !

* ప్రసిద్ధమైన  శ్రీ లలితాసంగమేశ్వర క్షేత్రం   శ్రీశైలం    ప్రాజెక్ట్  కట్టినప్పుడు  ఆ  నీటిలో  మునిగిపోయింది.  వేసవిలో   నీరు  తగ్గినప్పుడు  ఆ  గుడి  కనిపిస్తుంది.  అప్పుడు  భక్తులు  ఆ  దేవాలయాన్ని  దర్శించుకుంటారు.  ఆ  దేవాలయంలోని  కొన్ని భాగాలను  తీసుకువచ్చి  వేరొకచోట  భద్రపరిచారు.   చారిత్రిక  ప్రాధాన్యమున్న  నాగార్జున  కొండ కూడా  నాగార్జునసాగర్  నీటిలో మునిగిపోయిందట. 



* ఇప్పటికే  కట్టిన  ఆనకట్టల  ఎత్తు  భవిష్యత్తులో  పెంచకుండా  ఉంటే  బాగుండు.

*  ఆశ్చర్యమేమిటంటే,  ఇలా  ఎన్నో  విలువైన   ప్రదేశాలను   నీటిలో  ముంచివేస్తూ,  వేలాది, లక్షలాది  కోట్లు  ఖర్చు  చేసి    మనం    భారీ  ప్రాజెక్టులను   కట్టుకుంటున్నా  కూడా ,  రాష్ట్రంలోని  అనేక  ప్రాంతాల్లో  నీటి  ఎద్దడి,  ఆహారకొరత,  రైతుల  బాధలు  ఇప్పటికీ   కొనసాగుతూనే  ఉన్నాయి.


 * మన  రాష్ట్రంలో    ఎన్నో   ఆనకట్టలున్నాయి.  అయినా  
  రాయలసీమ,   కోస్తా,  ఉత్తరాంధ్రా , తెలంగాణా ,   లోని    ఎన్నో    ప్రాంతాలు  ఇప్పటికీ   నీటి  కరువుతో  అల్లాడుతున్నాయి. 


* ఆశ్చర్యమేమిటంటే,  భారీ  నాగార్జున సాగర్  ప్రాజెక్ట్  చుట్టుప్రక్కల  .... నల్గొండ,   ఖమ్మం,  కృష్ణా ,   గుంటూరు,  ప్రకాశం  ....    జిల్లాలలో  కూడా  ఇప్పటికీ   అనేక    ప్రాంతాలు    చాలినంత  నీరు   లేక    సతమతమవుతున్నాయి.


*నల్గొండ  మరియు  ఎన్నో  జిల్లాలలోని    ఫ్లోరైడ్  నీటి సమస్య    గురించి  అందరికి  తెలిసిన  విషయమే.

 
* ఆనకట్టలు  అవసరమే  కానీ,   భారీ  ఖర్చు  చేసి   భారీ  ఆనకట్టలు  కట్టడం  కన్నా ,  చిన్నతరహా  ఆనకట్టలు  ,  మరియు   చెక్  డ్యాంస్,   వర్షపునీటిని  నిలువ  చేసే  గుంతలు  ఏర్పాటు  చేసుకోవటం,  ఎప్పటికప్పుడు  చెరువులు,  కాలువల్లో  పూడిక  తీసుకోవటం  వంటి  జాగ్రత్తల  వల్ల  తక్కువ  ఖర్చుతో    నీటిని    భద్రపర్చుకోవచ్చు.

* అతి పెద్ద  ఆనకట్టల  వల్ల  కొన్ని  ప్రయోజనాలతో  పాటు  అనేక  సమస్యలు  కూడా  ఉంటాయంటున్నారు.



*  నదీతీరంలోని  సారవంతమైన వ్యవసాయ భూములు  మరియు    ఎన్నో  వందల  గ్రామాలు  , డ్యాం    క్రింద   నీటమునిగిపోవటం, ఎంతో  విలువైన  చారిత్రక  సంస్కృతి    కనుమరుగైపోవటం,  ఎందరో  ప్రజలు  నిర్వాసితులవటం ,  అడవులు ,  ఇంకా  అందులో  ఉండే  పశుపక్ష్యాదులు  . ...జీవావరణ వ్యవస్థ     అస్తవ్యస్తం  కావటం  జరుగుతోంది.


* పెద్దమొత్తంలో  నీటిని  కృత్రిమంగా  నిలువ  చేసే  డ్యాముల  వల్ల  భూకంపాలు  వచ్చే  అవకాశాలు  బాగా  పెరుగుతాయని  అంటున్నారు.  ఆ  చుట్టుప్రక్కల  ప్రాంతాలు  క్రమంగా  భూకంపజోన్  క్రిందకు  వచ్చేస్తాయట. 



* భారీ  డ్యాంస్  కట్టి  బోలెడు  భూమిని  ముంపుకు  గురి  చేస్తే  భూమి  ఎక్కడ  లభిస్తుంది  ? నీరు  కావాలంటే,  వాడిన  నీరు  తిరిగి  శుద్ధి  చేసి   పరిశ్రమలకు , పొలాలకు  సరఫరా  చేయవచ్చు.  కానీ  భూమి  కావాలంటే  దొరకటం  కష్టం  కదా  !  జపాన్  లో  భూమి  సరిపోక   అక్కడి  వాళ్ళు  ఎన్నో  ఇబ్బందులు  పడుతున్నారట.  మనమేమో  ఉన్న  భూమిని   పోగొట్టుకుంటున్నాము..  భూమి,  నీరు  రెండూ  ముఖ్యమైనవే,  రెండింటినీ  జాగ్రత్తగా   చూసుకోవాలి.



*  భద్రత  అనేది  మరో   పెద్ద  సమస్య.  మేము  కొంతకాలం  క్రిందట  ఒక    డ్యాం   ప్రాంతానికి    వెళ్ళాము.    అక్కడ  చాలామంది   పోలీసులు  ఉండి , సందర్శకులు   ఎవరినీ   లోపలికి  వెళ్ళనివ్వటంలేదు.  ఎందుకంటే,  ఆ  ప్రాంతానికి  బెదిరింపు  హెచ్చరికలు    వచ్చాయట.


*  భద్రత  రీత్యా  చూసినా  ....విద్యుత్  ఉత్పత్తికి  .... జలవిద్యుత్   ఉత్పత్తి  కేంద్రాలను ,  అణువిద్యుత్ కేంద్రాలను  ఏర్పాటు  చేయటం  కన్నా,   సౌరవిద్యుతుత్పత్తి  కేంద్రాలను    ఏర్పాటు  చేసుకోవటం    మంచిది.


* పెద్ద  ఆఫీసులు,  అపార్ట్మెంట్స్,  హాస్పిటల్స్,   పరిశ్రమలు  ...ఇలా  ఎవరికి  వారు  సోలార్  ప్యానల్స్  ఏర్పాటు  చేసుకోవచ్చు.  జర్మనీ  వంటి  దేశాల్లో  ఇళ్ళకు  కూడా  సోలార్  విద్యుత్  ను  ఉపయోగిస్తున్నారట.  దీనివల్ల  విద్యుత్  కష్టాలు  చాలా  వరకూ  తగ్గుతాయి.


* సౌరవిద్యుత్  గురించి  అంతగా  తెలియని  రోజుల్లో ,  పంటలకు  నీరు  మరియు     జలవిద్యుత్  వంటి  అవసరాలకు    భారీ  డ్యాంస్  కట్టారు.    ఇప్పుడు  సౌరవిద్యుత్  యొక్క  ఉపయోగాలు  తెలిసాయి  కాబట్టి  ,  జలవిద్యుత్  ను  నెమ్మదిగా  తగ్గించి  పూర్తిగా  సౌరవిద్యుత్ ను  అభివృద్ధి  చేసుకోవటం  ఎంతో  మంచిది.


*  పూర్వం  ప్రతి  గ్రామానికి  చెరువు  ఉండేది.  వేసవి  వస్తే  గ్రామస్తులు   చెరువులో   పూడిక  తీసి   వర్షాకాలానికి  సిద్ధం  చేసుకునేవారు.  అప్పుడు  చెరువులో  నీరు  సమృద్ధిగా  ఉండేది.  ఇప్పుడు  పూడికలు   తీయని  చెరువులు ,   ప్లాస్టిక్  గుట్టలు  అడ్డంబడి  పూడుకుపోయే   కాలువలు  వల్ల ..... వరదలు  ఊళ్ళను  ముంచెత్తుతున్నాయి.


*  వర్షపు  నీరు  సముద్రంలోకి   వెళ్ళటం,  మళ్ళీ  ఆ  నీరు  ఆవిరై  వానలా  పడటం  ...ఈ  చక్రం  సరిగ్గా  ఉంటేనే  సకాలంలో  వర్షాలు  పడటం  జరుగుతుంది.  మనుషులు  తమ    మితిమీరిన  కోరికలతో   ఈ  వ్యవస్థను  అస్థవ్యస్థం  చేయటానికి  ప్రయత్నిస్తున్నారు. 


* సముద్రంలోకి  బొట్టు  నీరు  కూడా  పోగూడదంటూ     అతిగా  ఆనకట్టలు   కట్టేస్తూ,  తాము  వాడిన  మురికి  నీటిని,  పారిశ్రామిక  వ్యర్ధాలను      మాత్రం   ధారాళంగా  నదుల్లోకీ,  సముద్రాల్లోకి  వదిలేస్తున్నారు.


*  పూర్వం  త్రాగటానికి,  ఇతర  అవసరాలకు  నీటిని  ఉపయోగించేవారు.  ఇప్పుడు  త్రాగటానికన్నా  పారిశ్రామిక  అవసరాలకు  ఎక్కువ  నీటిని  వినియోగిస్తున్నారు.  ఇలా  మన  అవసరాలను  పెంచుకుంటూ  పోతే  ఎక్కడెక్కడి  వనరులూ  చాలవు.  మానవులు  కోరికలను  తగ్గించుకుంటేనే  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.


* పూర్వీకులు  కూడా డ్యాంస్    కట్టారు. అయితే,  పూర్వీకులు  తక్కువ   ఆనకట్టలు      కట్టి  చెరువులను  ,  కాలువలను   చక్కగా    అభివృద్ధి  చేసుకున్నారు.  ఇప్పటి  వాళ్ళు  ఎక్కువ  ఆనకట్టలు    కట్టి  చెరువులను,  కాలువలను  పూడిక  తీయకుండా  వదిలేయటం,  నిర్లక్ష్యం  చేయటం  జరుగుతోంది.

 * భారీ  డ్యాంస్  కట్టడం  అంత  మంచిది   కాదని   ప్రపంచవ్యాప్తంగా    ఇప్పుడు   ఎందరో  అభిప్రాయపడుతున్నారు.    మేధాపాట్కర్  వంటి  వారు  కూడా  ఇలాగే  అంటున్నారు  . 



2 comments:

  1. మీకు తెలియదేమో కాని కోనసీమలో, వేసవిలో మంచి నీళ్ళు దొరకవు, తీర గ్రామాల్లో, విచిత్రం కదా. అదీ మన గొప్ప తనం.

    ReplyDelete
  2. * ఇంకా, ఈ మధ్య కోస్తా ప్రాంతాలలోని బోర్లలో మంచినీటికి బదులు బాగా ఉప్పటి నీరు వస్తోందట.

    * ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ, విపరీతంగా బోర్లు వేసి తోడేయటం వంటి కారణాల వల్ల సముద్రపు నీరు భూమిలోకి చొచ్చుకు వస్తోందనీ , అందుకే మంచి నీరు బదులు ఉప్పనీరు వస్తోందనీ కొందరు అంటున్నారండి.

    ReplyDelete