koodali

Saturday, September 24, 2011

శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము గ్రంధములోని విషయములు.



హరి వినాయక సాఠే

సాఠే యనువాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగియుండెను. కాలాంతరమున వ్యాపారములో చాల నష్టము పొందెను. ఇంక మరికొన్ని విషయములతనిని చీకాకుపరచెను. అందుచే నతడు విచారగ్రస్తుడయ్యెను: విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే నిల్లు విడచి చాలా దూరము పోవలెననుకొనెను.


మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు, నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్ధించును. వాని పాపకర్మములు ముగియువేళకు భగవంతుడు వానినొక యోగీశ్వరునితో కలిసికొనుట సంభవింపజేయును. వారు తగిన సలహా నిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాఠేగారికి కూడ అట్టి యనుభవము కలిగెను. అతని స్నేహితులు శిరిడీకి వెళ్ళుమని సలహానిచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి యనేకమంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు గూడ నెరవేరుచుండెను. సాఠేగారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో శిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై, నిర్మలుడు శుద్ధస్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే యతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను.



అతడు గొప్ప మనోబలము కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా యానాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది యిట్లుండెను :బాబా గురు చరిత్రము చేతిలో బట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు ,అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు జూచెను. సాఠే నిద్రనుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుఋరుపెట్టి నిద్రపోవుచున్న తనవంటి వారిని లేపి, గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమె గదా యనుకొనెను.



ఆ మరుసటి దినమా దృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయి యుండునో సాయిబాబా నడిగి తెలిసికొనుమనెను. ఒక సప్తాహము చాలునో లేక యింకొక సప్తాహము చేయవలెనో కనుగొనుమనెను. సమయము దొరికినప్పుడు కాకాసాహెబు బాబాను ఇట్లడిగెను. " ఓ దేవా ! యీ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి ?అతడూరుకొనవలెనా లేక యింకొక సప్తాహము చేయవలెనా? అతడు అమాయిక భక్తుడు: అతని కోరిక నెరవేరవలెను.అతనికి దృష్టాంతార్ధమును బోధించవలెను.వానినాశీర్వదింపు"డన బాబా" అతడు గురుచరిత్ర నింకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంధమునే జాగ్రత్తగా పఠించినచో,నాతడు పావనుడగును: మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును." అనెను.


ఆ సమయమున హేమాడ్ పంతు అచ్చట నుండి , బాబా కాళ్ళనొత్తుచుండెను. బాబా పలుకులు విని యతడు తన మనస్సులో నిట్లనుకొనెను. " సాఠే యొక్కవారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా ? నేను నలుబది సంవత్సరములనుంచి పారాయణ చేయుచున్నాను గాని నాకు ఫలితము లేదా ! అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేనో 7 సంవత్సరముల నుంచి యున్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి ?చాతక పక్షి మేఘము నుంచి పడు నీటిబిందువులకై కనిపెట్టుకొని యున్నట్లు నేను కూడ బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొనియున్నాను. "ఈ యాలోచన వాని మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో నుండెడి యాలోచనలన్నియు బాబా గ్రహించెడివారు. అంతియే గాక , చెడ్డ యాలోచనలను అణచుచు , మంచి యాలోచనలను ప్రోత్సహించువారు.


హేమాడ్ పంతు మనస్సును గనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి, శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసికొని, అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యెను. కాన వారిట్లాజ్ఞాపించిరి. బాబా యాజ్ఞను జవదాటగల వారెవరు ?


హేమాడ్ పంతు వెంటనే మసీదు విడచి శ్యామా గృహమునకు వచ్చెను.అప్పుడే యతడు స్నానము చేసి ధోవతి కట్టుకొనుచుండెను. అతడు బయటికి వచ్చి హేమాడ్ పంతు నిట్లడిగెను. " మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడయేలయున్నారు ? మీరు మసీదునుండి వచ్చుచున్నట్లున్నదే ! మీరేల చీకాకుతో చంచలముగా నున్నారు ?మీరొంటరిగా వచ్చినారేల ?కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈ లోగా తాంబూలము వేసికొనుడు. పిమ్మట సంతోషముగా కొంతసేపు కూర్చొని మాట్లాడెదము. " ఇట్లనుచు నతడు లోపలికి పోయెను.


హేమాడ్ పంతు ముందర వసారాలో గూర్చొనెను. కిటికీలో 'నాధభాగవత ' మనుప్రసిద్ధ మరాఠీ గ్రంధముండెను. ఇది భాగవతములోని యేకాదశస్కందమునకు ఏకనాధుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపుసాహెబు దీక్షితు ప్రతిదినము శిరిడీలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానము ' నానార్ధదీపిక ' లేదా జ్ఞానేశ్వరి ( శ్రీ కృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ )నాధభాగవతము, ( శ్రీ కృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ ) భావార్ధ రామాయణమును, నిత్యము చదువుతుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయునప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి , అటుపైన వారిని ఆ గ్రంధముల పురాణ కాలక్షేపము వినుమనుచుండెను. ఈ గ్రంధములే భాగవత ధర్మములోని ముఖ్యగ్రంధములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంతు కూడ నిత్యము నాధభాగవతమును పారాయణము చేయువాడు.

ఆ దినము చదువు భాగము పూర్తిచేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామా ఇంటి కిటికీలో నున్న నాధభాగవతమును తీయగా తానానాడు పూర్తిచేయని భాగము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా యచ్చటికి పంపెనని యనుకొనెను. కావున దానిని పూర్తి చేసెను. పిమ్మట శ్యామా తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను.


హేమాడ్ పంతు....నేను బాబా వద్దనుండి యొక వార్త తీసికొని వచ్చినాను. నీ వద్దనుండి 15 రూపాయలు దక్షిణ తీసికొని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించి యున్నారు.కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడి పిమ్మట మసీదుకి రమ్మని యన్నారు.


శ్యామా..( ఆశ్చర్యముతో ) నా వద్ద డబ్బులేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు డబ్బునకు బదులుగా తీసికొని బాబా వద్దకు వెళ్ళుము.


హేమాడ్ పంతు...సరే నీ నమస్కారములామోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనెదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలును, కధలును చెప్పుము.

శ్యామా ...అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ భగవంతుని ( బాబా ) లీలలు మిక్కిలి యాశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియును. నేను పల్లెటూరువాడను :నీవా చదువుకొన్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చినతరువాత కొన్ని లీలలను చూచియే యుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను ? సరే యీ తమలపాకులు, వక్క, సున్నము తీసికొని తాంబూలము వేసికొనుము. నేను లోపలికి బోయి దుస్తులు ధరించి వచ్చెదను.


కొద్ది నిమిషములలో శ్యామా బయటికి వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడిట్లనియెను. " ఈ భగవంతుని ( బాబా ) లీల కనుగొన శక్యము కానిది. వారి లీలల కంతు లేదు. వాని నెవరు గమనించగలరు ? వారీ లీలలతో వినోదించునట్లగుపడినను వారు వానినంటినట్లు కనిపించరు. మావంటి జానపదులకేమి తెలియును ? బాబాయే యీ కధలనెందుకు చెప్పరాదు ?మీ వంటి పండితులను నా వంటి మూర్ఘుని వద్దకేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. " ఈ ఉపోధ్ఘాతముతో శ్యామా యిట్లనెను ' నాకొక కధ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియును. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో
;బాబా యంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠినపరీక్ష చేసినపిమ్మట వారికి ఉపదేశము నిచ్చును.( ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశనము.)

ఉపదేశమనుమాట విన్నతోడనే హేమాడ్ పంతు మనస్సులో నొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తననచ్చటకు పంపియుండునని యనుకొనెను. అయినప్పటికి ఈ భావము నణచుకొని , శ్యామా చెప్పుకధలను వినుటకు సిద్ధపడెను. ఆ కధలన్నియు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామా ఈ దిగువ కధను చెప్పదొడంగెను.

శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్

రాధాబాయి యను ముసలమ్మ యుండెను. ఆమె ఖాశాబా దేశ్ ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలసి శిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసికొని యేదైన యుపదేశమును పొందవలెనని మనోనిశ్చయమును చేసికొనెను. ఆమె కింకేమియు తెలియకుండెను. బాబా యామెను ఆమోదించక మంత్రోపదేశము చేయనిచో నుపవాసమునుండి చచ్చెదనని మనోనిశ్చయము చేసికొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము, నీరు మూడురోజులవరకు మానివేసెను.

ఆమె పట్టుదలకు నేను ( శ్యామా )భయపడి యామె పక్షమును బాబాతో నిట్లంటిని. " దేవా ! మీరేమి ప్రారంభించితిరి ? నీ వనేకమంది నిచ్చటకు ఈడ్చెదవు. ఆ ముదుసలిని నీవెరిగియే యుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీ పైన ఆధారపడి యున్నది. ఆమె చచ్చువరకు ఉపవసింప నిశ్చయించుకొని యున్నది. నీవు ఆమె నామోదించి ఉపదేశమిచ్చునంతవరకామె యిట్లు చేయనున్నది. ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశమివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి యామెను కరుణించుము. ఆశీర్వదించుము. తగిన సలహా యిమ్ము. " ఆమె మనోనిశ్చయమును జూచి , బాబా యామెను బిలిపించి, ఈ క్రింది విధముగా బోధించి యామె మనస్సును మార్చెను.

" ఓ తల్లీ ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నావు ? నీవు నిజముగా నా తల్లివి ; నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగ వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగుగా వినినచో నీకది మేలు చేయును.


నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు; మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాల కాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారే మంత్రము నూదలేదు. వారిని విడుచు తలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారి సేవ చేయుటకు. వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి; రెండుపైసలు దక్షిణ యడిగిరి. వెంటనే యిచ్చితిని." మీ గురువుగారు పూర్ణకాములయినచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల ? వారు నిష్కాములని యెట్లనిపించుకొందురు ?" అని మీరడుగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది ?వారు కోరిన రెండు కాసులు. 1. దృఢమైన విశ్వాసము. 2. ఓపిక లేదా సహనము. నేనీ రెండు కాసులను లేదా వస్తువులను వారి కర్పించితిని. వారు సంతోషించిరి.

నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి. భోజనమునకు గాని వస్త్రమునకు గానీ నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చును. నేను దానినెట్లు వర్ణించగలను ? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు. నేను వారిని జూచునప్పుడు , వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనుపించుచుండిరి. మేమిద్దరమానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా యాశ్రయము. నా మనస్సు యెల్లప్పుడు వారియందే నాటుకొని యుండెడిది. ఇదియే ఒక పైసా దక్షిణ. సాబూరి ( ఓపిక ) యనునది రెండవ పైసా. నేను మిక్కిలి యోరిమితో చాలకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని.


ఈ ప్రపంచమనే సాగరమును ఓపికయను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సాబూరి యనునది పురుష లక్షణము. అది పాపములన్నిటిని తొలగించును; కష్టములను పారద్రోలును. అనేక విధముల అవాంతరముల తొలగించి , భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగజేయును. సాబూరి యనునది సుగుణములకు గని, మంచి యాలోచనకు తోడువంటిది. నిష్ఠ ( నమ్మకము ), సాబూరి ( ఓపిక ) అన్యోన్యము ప్రేమించు అక్కచెల్లెండ్రవంటివారు.


నా గురువు నానుండి యితరమేమియు నాశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాలసర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను, వారి ప్రేమకు ఎన్నడును లోటు కలగలేదు.వారు తమ దృష్టిచేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచునట్లు నన్ను కూడ మా గురువు దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక యొడ్డున యుండును. బిడ్డ తాబేలు రెండవయొడ్డున యుండును. తల్లితాబేలు, పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట గాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దవి యగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నా యందు నిల్పి నన్ను ప్రేమతో గాపాడిరి. ఓ తల్లీ ! నా గురువు నాకు మంత్రమేమియు నుపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను ? గురువుగారి ప్రేమమయమయిన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రముగానీ యుపదేశము గాని యెవ్వరి వద్దనుంచి పొందుటకు ప్రయత్నించకుము. నీ యాలోచనలు నీ చేష్టలు నాకొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్ధమును పొందెదవు. నావైపు సంపూర్ణహృదయముతో చూడుము. నేను నీవైపు అట్లనే చూచెదను.


ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనలు గాని యారు శాస్త్రములలో ప్రావీణ్యము గాని యవసరము లేదు. నీ గురువునందు నమ్మకము విశ్వాసము నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని హరిహరబ్రహ్మల ( త్రిమూర్తుల ) యవతారమని యెంచెదరో వారే ధన్యులు "

ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యా ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదలుకొనెను.

ఈ కధను జాగ్రత్తగాను , శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును , సందర్భమును గుర్తించి , హేమాడ్ పంతు మిక్కిలి యాశ్చర్యపడెను. ఈ యాశ్చర్యకరమైన బాబా లీలను జూచి అతని యాపాదమస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను. ఒక్క మాటైన మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామా ఆతని నీ స్థితిలో జూచి " ఏమి జరిగినది ; యేల యూరకున్నావు ?అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను ?'అని యడిగెను.

అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను.మధ్యాహ్నహారతి పూజ ప్రారంభమయ్యెనని గ్రహించిరి. కనుక శ్యామా, హేమాడ్ పంతు మసీదుకు త్వరగా పోయిరి. బాపుసాహెబు జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరు బాజాభజంత్రీలతో నొకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామా ; ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని జూచి బాబా హేమాడ్ పంతును శ్యామా యిచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామా రూపాయలకు బదులు నమస్కారముల నిచ్చెననియు, శ్యామా ప్రత్యక్షముగా గలడు కనుక అడుగవచ్చుననెను.


బాబా యిట్లనెను. " సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడితిరా ?అట్లయినచో మీరేమి మాట్లాడితిరో చెప్పుము. " గంటల చప్పుడును, మద్దెల శబ్దమును, పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించిన దంతయు చాల ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కధ మిక్కిలి యాశ్చర్యమును కలుగ జేసినదనియును , దానిని విని బాబా లీలలు అగోచరమని, తెలిసికొంటిననియు ఆ కధ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించిరని హేమాడ్ పంతు చెప్పెను.


అప్పుడు బాబా యిట్లనియె. " కధ చాల అద్భుతమైనది. నీవెట్లు ఆనందించితివి ? నాకా విషయమై వివరములన్నియు చెప్పుము . " అప్పుడు హేమాడ్ పంతు తానింతకు ముందు విన్న కధను పూర్తిగ బాబాకు వినిపించి ,యది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. " ఆ కధ నీకు నచ్చినదా ?దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా?"యని బాబా హేమాడ్ పంతునడిగెను.


" అవును బాబా ! నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగితిని. "అని హేమాడ్ పంతు బదులిచ్చెను.


బాబా యిట్లు చెప్పెను. " నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కధను జ్ఞప్తి యందుంచుకొనుము. అది మిక్కిలి యుపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానమవసరము. దానినలవరచుకొన్నచో వృత్తులన్నియు శాంతించును. కోరికలన్నియు విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశియందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానించిన అదియే జ్ఞానస్వరూపము; చైతన్యము ఆనందము. మీరిది చేయలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా యాకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత,ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు, చైతన్యముతో నైక్యమై, బ్రహ్మముతో నభిన్నమగును. తల్లితాబేలు నదికి ఒక యొడ్డున నుండును. దాని పిల్లలింకొక యొడ్డున నుండును. వానికి పాలిచ్చుటగాని, పొదువుకొనుట గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తి నిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లితాబేలు చూపు చిన్నవానికి యమృతధార వలె పని చేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమున కాధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే ." బాబా యీ మాటలు పూర్తి చేయుసరికి , హారతి పూర్తియాయెను.


అందరు " శ్రీ సచ్చిదానంద సద్గురుసాయినాధ్ మహారాజ్ కీ జై " యని కేక పెట్టిరి. ఓ ప్రియమైన చదువరులారా ! యీ సమయమందు మనము కూడ మసీదులోని గుంపులో కలిసి యున్నట్లు భావించి మనము కూడ జయజయ ధ్వనులలో పాల్గొందము.


హారతి పూర్తి కాగానే, ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపుసాహెబు జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడ్ పంతు చేతిలో పెట్టి యిట్లనెను. ఈ కధను నీవు మనసుకి పట్టించుకొని జ్ఞప్తి యందుంచుకొనినచో, నీ స్థితి కలకండ వలె తియ్యగా నుండును.నీ కోరికలన్నియు నెరవేరును. నీవు సుఖముగా నుందువు."


హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి " ఇట్లు ఎల్లప్పుడు నాకు మేలు చేయుము. ఆశీర్వదించుము. కాపాడుము. " అని బతిమాలెను. అందుకు బాబా యిట్లు జవాబిచ్చెను. ఈ కధను వినుము. దీనిని మననము చేయుము. నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును."


ఓ ప్రియమైన పాఠకులారా ! అప్పుడు హేమాడ్ పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కధయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా త్రాగి , ధ్యానించి, మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తధాస్తు...


నాకు ఇలా అనిపించిందండి. . హేమాడ్ పంత్ తాను సాఠే కన్నా ఎక్కువసార్లు పారాయణం చేసానని అనుకొంటారు. అందుకేనేమో హేమాడ్ పంతుకు సాయి జీవితచరిత్రను వ్రాసే అదృష్టం కలిగింది అని నాకు అనిపించిందండి.

ఇంకా, భక్తులకు ( నిష్ఠ) నమ్మకము. (సాబూరి ) ఓపిక  ఉండాలని బాబా చెప్పటం జరిగింది. అధ్భుతంగా చెప్పారు..

నా అభిప్రాయములలో ఏమైనా పొరపాట్లు వచ్చినచో దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నానండి....

No comments:

Post a Comment