koodali

Friday, June 8, 2018

కొన్ని ఆహార విషయాలు... ఒకటవ భాగం...



ఇంటికి దూరంగా చదువుకుంటున్న  లేక ఉద్యోగం చేసుకుంటున్న టీనేజ్ యువత కొన్ని వంటలను నేర్చుకుంటే మంచిది.  రోజూ  వంట చేసుకోవటానికి సమయం కుదరకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు ఖాళీ కుదిరినప్పుడు కొన్ని రకాలు వండుకుని తినవచ్చు.

కారెట్, బీన్స్, ఆలు.వంటి కూరగాయ ముక్కలు ఎక్కువగా వేసి  పులావ్ చేయటం.... బియ్యం, కందిపప్పు, కూరగాయలు వేసి  సాంబార్ బాత్  చేయటం..

బియ్యం, పెసరపప్పు తో పొంగలి, ఇష్టమయితే పొంగలిలోనే  బీన్స్, ఆలూ, కారట్, వంటి కూరగాయల ముక్కలు వేసుకుని  కిచిడీ.. వంటివి సులువుగా వండగలిగే పుష్టికరమైన వంటలు.

పులావ్, సాంబార్ బాత్  , పొంగలి, గోధుమ రవ్వ ఉప్మా.. వంటివి పక్కాగా చేయితిరిగిన వాళ్లు అన్ని దినుసులు సమపాళ్ళలో వేసి వండినట్లు వండకపోయినా....  మామూలుగా వండినా రుచిగానే ఉంటాయి. 
*******

పులావ్ ..  కుక్కర్లో  కొద్దిగా నూనె  వేసి... అందులో కారెట్, బీన్స్, ఆలు...వంటి కూరగాయముక్కలు, కొద్దిగాఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా తరిగిన పుదీనా, కొత్తిమీర, మసాలా దినుసులు ..పావు టీ స్పూన్ షాజీర, పులావ్ ఆకులు రెండు, రెండు ఇలాచి, కొద్దిగా లవంగాలు, ఒక స్టార్పువ్వు, ఒక స్పూన్ గరం మసాలా, సగం స్పూన్ అల్లం.. వెల్లులి..
పచ్చిమిర్చి ముద్ద ...వేసి కొద్దిగా వేయించి...
 
కడిగి ఉంచుకున్న బియ్యం వేసి , రుచికి సరిపడినంత ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి, తరువాత వెయిట్ పెట్టాలి. అన్నంలా వండుకుని దింపేస్తే , పులావ్ తయారవుతుంది. 

మామూలు అన్నం కన్నా, పులావ్ కు బియ్యంలో కొద్దిగా నీళ్ళు తక్కువ పోయాలి.

పులావ్ తో పాటు పెరుగులో ఉల్లిముక్కలు, మిర్చి వేసి తినవచ్చు.  
పులావ్లో ధనియాలు+జీలకర్ర పొడి వేయనవసరం లేదు.  ధనియాలు+జీలకర్రపొడి మసాలా గ్రేవీకూరల్లో వేయాలి.
................

పులావ్ తో కూర..అల్లం..వెల్లుల్లి..పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. పచ్చికొబ్బరి, జీడిపప్పు, వేయించిన చాలాకొన్ని వేరుశనగపప్పు రుబ్బి,  అందులోనే టమేటోముక్కలు వేసి రుబ్బి పెట్టుకోవాలి.
 
నూనెలో సన్నగా తరిగినఉల్లిముక్కలు లేక మిక్సీలో కచ్చాపచ్చగా (coarse)చేసిన ఉల్లిముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి వేయించి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి వేసి వేయించాలి. బటాణి, కారట్, ఆలూ, బీన్స్ వేయాలి.

  జీడిపప్పు, కొబ్బరి,  కొద్దిగా 
వేరుశనగపప్పు , టమేటోముక్కలు..రుబ్బి  పేస్ట్   వేయాలి. 3 టీ స్పూన్లు (1Table spoon) ధనియాలు+జీలకర్ర పొడివేయాలి....టీ స్పూన్  గరం మసాలా పొడివేయాలి
 
కూరలో నీరుపోసి చిక్కగా అయ్యేవరకు ఉడికించుకుంటే పులావుతో  పాటు  తినే  గ్రేవీ తయారవుతుంది.  దింపేముందు కొద్దిగా కసూరిమెంతిపొడి కూడా వేసి రెండునిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసుకోవచ్చు.కుక్కర్లో కూడా వండుకోవచ్చు.
 
ఈ విధంగా ఆలూ ముక్కలు వేసి వండితే ఆలూకూర , పూల్మఖానా వేస్తే మఖానా కూర, బీన్స్, కారట్, ఆలు వేసి మిక్స్ వెజిటబుల్ కూర చేయొచ్చు.
 
ఉల్లి, వెల్లుల్లి తిననప్పుడు కొబ్బరి, జీడిపప్పు, కొద్దిగా వేరుశనగపప్పు, గుమ్మడివిత్తనాలు పేస్ట్ చేసి వేస్తే గుజ్జు వస్తుంది. గ్రేవీలో వేరుశనగపప్పు ఎక్కువవేస్తే రుచి వేరేగా ఉంటుంది, కొద్దిగా వేస్తే చాలు.

 
*******
 సాంబార్ బాత్.. బియ్యం, కందిపప్పు, కూరగాయలు వేసి సాంబార్ బాత్  చేయటం..కూరగాయల ముక్కలు, టమేటో మరియు కొద్దిగా చింతపండు ఉడికించుకుని ఉంచుకోవాలి. 

ఒక గ్లాస్ బియ్యానికి పావుగ్లాస్ కందిపప్పు,  సరిపడినంత నీరు పోసి, కుక్కర్ మూత పెట్టి తరువాత వెయిట్ పెట్టాలి. 

అన్నం, పప్పు ఇలా ఉడికించుకుని, మెత్తగా మెదిపి అందులో ఉడికిన కూరగాయల ముక్కలు, చింతపండు పులుసు, ఉప్పు, కారం, ధన్యాలు, జీలకర్రపొడి, సాంబార్ పౌడర్.. వేసి నీరు పోసి పల్చగా చేయాలి.

అయిదు నిమిషాలు ఉడికిన తరువాత నూనె, నేయి వేసి , ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొద్దిగా మెంతిపొడి, కరివేపాకుతో తిరగమోత వేసుకుని, అంతా గరిటెతో మెత్తగా తిప్పుకుంటే రుచికరమైన సాంబార్ బాత్ రెడీ. 

ఇది కొద్దిగా వండినా చాలా అవుతుంది. కొద్దిగా తిన్నా బోలెడు తిన్నట్లుంటుంది.

************
మాములుగా అన్నం కొరకు .... రేషన్ బియ్యం, సోనామసూరి..ఇంకా రకాలుంటాయి.
కొన్ని రకాల బియ్యానికి, ఒకకప్పు బియ్యానికి..ఒకటిన్నర నుండి రెండుకప్పుల నీరు పడుతుంది. పాతబియ్యం అయితే, ఒకకప్పు బియ్యానికి..రెండు కప్పుల నుండి రెండుంపావు లేక రెండున్నర కప్పుల నీరు పట్టవచ్చు.

బాస్మతి బియ్యం అయితే, కొద్దిగా తక్కువ నీరు పోస్తారు. కుక్కర్లో ఒకకప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు నీరు పోస్తారు. విడిగా గిన్నెలో వండితే గ్లాసుకు రెండుగ్లాసుల నీరు పోస్తారు.

బాస్మతి బియ్యంతో కాకుండా, సోనామసూరి బియ్యంతో కూడా పులావ్ చేయవచ్చు. అయితే, కొంత తక్కువ నీరు పొయ్యాలి. 
 
******
పొంగలి.. కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు కడిగి ఉంచుకోవాలి. కుక్కర్లో కొద్దిగా నూనె, కొద్దిగా నేయి వేసి అందులో కొద్దిగా జీలకర్ర వేసి, కడిగి ఉంచిన బియ్యం, పెసరపప్పు అందులో వేసి బియ్యం, పెసరపప్పు కొద్దిగా వేయించుకుని, అందులో తగినన్ని నీరు పోయాలి. 

బియ్యంకప్పు, పెసరపప్పుకప్పు కూడా వేసుకోవచ్చు.ఆ నీటిలో ఉప్పు వేయాలి. కుక్కర్ మూత పెట్టి, తరువాత వెయిట్ పెట్టాలి.

విడిగా మూకుడులో నూనె లేక నెయ్యి వేసి, జీడిపప్పు,దంచిన మిరియాలపొడి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పొంగలిలో కలిపి రెండునిమిషాలు ఉడికించాలి.

ముందే బియ్యంలో కొద్దిగా నీరు ఎక్కువ పోసుకోవచ్చు. నీరు ఎక్కువయితే పొంగుతుందనుకుంటే, ఉడికిన తరువాత పొంగలిని     గరిటతో మెత్తగా మెదిపి, ఒక అరగ్లాస్ నీటిని వేడి చేసి,  పొంగలిలో కలిపితే  పొంగలి  పల్చగా అవుతుంది.  మళ్ళీ  గరిటెతో ఒకసారి తిప్పితే సరిపోతుంది. 

*******
నిమ్మకాయ పులిహోరకు .. అన్నం వండి ఒక పళ్ళెంలో ఆరబెట్టాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసుకుని , ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఇంగువ, మెంతిపొడి, కరివేపాకు, పచ్చిమిరపకాయముక్కలు, పసుపు..  వేసి వేయించాలి. వేగిన తరువాత అన్నంలో కలపాలి. 

 అన్నం  వేడి ఆరిన తరువాత  అందులో  ఉప్పు, నిమ్మకాయ రసం పిండుకుని బాగా కలుపుకుంటే నిమ్మకాయ పులిహోర తయారవుతుంది.
..................

గోధుమ రవ్వ ఉప్మా.. పొయ్యి పైన కడాయి పెట్టి  రెండు టేబుల్స్పూన్ల  నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిసెనగపప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు, వేసి వేయించి, ఒక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, తరిగిన చిన్న ఆలూ, ఒక చిన్న కారెట్, ఒక చిన్న టమేటో ముక్కలు, ఉంటే కొన్ని పచ్చి వేసి కొద్దిసేపు వేయించాలి. టమేటో ముక్కల బదులు మిక్సీలో మెత్తగారుబ్బిన టమేటోగుజ్జు కూడా వేయవచ్చు.

ఇవన్నీ లేకపోయినా ఉన్నవి వేసుకోవచ్చు. ఒక గ్లాసు సన్నగోధుమ రవ్వకు మూడు లేక మూడున్నర గ్లాసుల నీరు పోసి సరిపడినంత ఉప్పు వేసి పది లేక పదిహేను నిమిషాలు ఉడికించాలి.పల్చగా కావాలంటే, మరికొన్ని నీరు పోసుకోవచ్చు.

గోధుమరవ్వను కొద్దిసేపు ముందు ఒకగ్లాసు నీరు పోసి నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఉప్మాలో నీరు పోసేటప్పుడు రవ్వ నానపెట్టటానికి పోసిన నీటిని కూడా లెక్కించి పోయాలి.

*******************
ఎవరి కుక్కర్ అలవాటు బట్టి వారు  ఎన్ని విజిల్స్ అవసరమో అలా వండుకోవాలి. 
కుక్కర్ అల్యూమినియంది కాకుండా , స్టెయిన్ లెస్ స్టీల్ కుక్కర్ అయితే ఆరోగ్యానికి మంచిది.

ఒక టేబుల్ స్పూన్ అంటే సుమారుగా మూడు టీ స్పూన్లు. 
*****************

ఇవన్నీ పెద్దవాళ్లకు దూరంగా ఉన్న టీనేజ్ పిల్లలకు తేలికగా వండుకునేలా వ్రాసిన పుష్టికరమైన వంటలు. 

టీనేజ్ వాళ్ళు వీలుకుదిరినప్పుడు  కొంచెం ఓపికతో వండుకుంటే మంచిది.  ఎప్పుడూ బయటే తినడం కాకుండా ఇంటివద్ద  వండుకుని తినడం వల్ల ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది.
....................
 
ఈ రోజుల్లో పురుగుమందులు వేయకుండా, హైబ్రిడ్ కాని, పాతకాలపు బియ్యపు రకాలు లభిస్తున్నాయి. ఉదా.. నవారా బియ్యం, బహురూపి బియ్యం... రకాలు.
 
 ఆ బియ్యం వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని విజయరాం గారు తెలియజేసారు.
.................................

లడ్దూ... కొద్దిగా వేరుశనగపప్పు, కొద్దిగా  నువ్వులు   వేటికవి  విడివిడిగా వేయించి  మిక్సీలో తిప్పితే పొడి అవుతుంది. తరిగిన బెల్లం  వేసి  మరల  మిక్సీలో తిప్పాలి. 

 ఈ పొడిని ప్లేట్లో వేసి కరిగించిననెయ్యి లేక వేడిచేసిన నూనె కలిపి లడ్దూలు చుట్టుకోవాలి. వేయించిన జీడిపప్పు, బాదం పలుకులు లడ్దూలో కలిపితే ఇంకా బాగుంటాయి. ఇందులో వేయించిన డ్రైఫ్రూట్స్ పొడి కూడా కలపవచ్చు.

  వేరుశనగపప్పు, నువ్వులు వేయించి .. బెల్లం పాకం వేసి చిక్కీలు చేయవచ్చు. ఇలాంటివి పెద్దవాళ్ళు తయారుచేసి  పిల్లలకు  పంపవచ్చు.

..........................

 టీనేజ్ పిల్లలు తేలికగా స్వీట్ .... చేసుకోవాలంటే ఇలాగ చేయొచ్చు...... 

రెండు లేక మూడు టీ స్పూన్ల గోధుమపిండిని కొద్దినీటిలో కలిపి ఉండలు రాకుండా పొయ్యిపై జావలా కాచి కొద్దిగా  పాలు , కొద్దిగా నేయి, వేయించిన జీడిపప్పు కలిపి కొద్దిసేపు కాచితే చక్కటి పాయసం రెడీ అవుతుంది. అందులో  తరిగిన బెల్లాన్ని కానీ, పంచదార కానీ కలుపుకోవాలి.

దీనిని ఫ్రిజ్లో ఉంచి త్రాగితే చల్లగా బాగుంటుంది.

గోధుమపిండితో పాటు రెండు స్పూన్ల జొన్నపిండి కలుపుకుంటే మంచిది. అయితే ఎక్కువ స్పూన్ల పిండి కలిపితే మరీ చిక్కగా అయిపోతుంది. అప్పుడు మరిన్ని నీళ్లు, పాలు  కలుపుకోవాలి. ఇది  ఉత్తరాది వారు తయారుచేసే ఫిర్నీ వంటిది. 

 రాగి పిండి, జొన్నపిండి తో జావ  ... రెండు టీ స్పూన్ల  రాగి పిండిని రెండు టీ స్పూన్ల జొన్న పిండిని ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా జావలా కాచి బెల్లం లేక పంచదార వేసుకుని త్రాగవచ్చు.ఇష్టమయిన వారు బోర్నవిటా వంటివి  కూడా కలుపుకోవచ్చు.

 రాగి పిండి, జొన్నపిండి తో  సూప్.... బాణలిలో ఒక స్పూన్   నూనె  లేక వెన్నవేసి,   సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా మిరియాల పొడి  వేసి వేయించి అందులో   రెండు   టీ  స్పూన్ల  రాగిపిండి, రెండు టీ స్పూన్ల   జొన్నపిండి కలిపిన నీరు పోసి,  ఉప్పు వేసి  సూపులా కాచినా బాగుంటుంది. 

 సన్నగా  తరిగిన  కారట్, బీన్స్, ఆలు..వంటి  కూరగాయ ముక్కలను ఎక్కువగా  నీరుపోసి కుక్కర్లో  మెత్తగా  ఉడికించి, మెత్తగా మెదిపి  వడకట్టి.  ఆ రసాన్ని కూడా  సూప్ లో  వేసి కాచినా సూప్  బాగుంటుంది. 
 
*******************
కొబ్బరి పైన ఉండే పొట్టుతో సహా తింటే త్వరగా అరగదట.
పచ్చికొబ్బరి అయితే పై పొట్టును పీలర్ తో తేలికగా తీయవచ్చు.

 పచ్చికొబ్బరి చిప్పపైన తోలును పీలర్ తో తీసి.. కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి.. అవి ఎండలో ఎండిన తరువాత డబ్బాలో నిల్వ చేసుకుని(ఫ్రిజ్లో కూడా పెట్టవచ్చు).. అవసరమైనప్పుడు వాటిని మిక్సీలో పొడి చేసుకుని వంటలో వాడుకోవచ్చు.

పచ్చికొబ్బరిని ఇడ్లిపాత్రలో కొద్దిసేపు వేడిచేసి, తరిగి, ఎండలోపెట్టి వాడుకుంటే చాలాకాలం నిల్వ ఉంటాయి.    
లేదంటే, వేడినీటిలో కొబ్బరిచిప్పలను కొద్దిసేపు ఉంచి, తుడిచి ఎండలో పెట్టాలి.

................................
 
 
కొన్ని వేపుడు కూరలు తక్కువనూనెతో మాడిపోకుండా చక్కగా ఉడకాలంటే, వాటిని కడాయిలో కొద్దిగా నూనెవేసి తిరగమోతవేసి, కూరగాయల ముక్కలు వేసి,  కొంత ఎర్రగా అయ్యేవరకు సగం వేయించాలి. 
 
అప్పుడు ఆ కూరను ఒక గిన్నెలో తీసి, కుక్కర్లో కొద్దిగా నీరుపోసి, ఈ కూరగిన్నెను కుక్కర్లో పెట్టాలి. గిన్నెపై మూతపెట్టక్కర్లేదు. కుక్కర్ మూతపెట్టి విజిల్ కూడా పెట్టి సుమారు మూడు విజిల్స్ వచ్చిన తరువాత పొయ్యి ఆఫ్ చేయాలి.

దొండకాయ త్వరగా వేగదు. దొండకాయ వేపుడు  ఇలా చేయొచ్చు. గుత్తివంకాయ కూర కూడా ఇలా చేయవచ్చు. పచ్చికూరగిన్నెను కుక్కర్లో పెట్టటం కన్నా, కొద్దిగా వేయించిపెడితే వేగిన రుచి వస్తుంది.మూత పెట్టకపోయినా కుక్కర్ నీరు గిన్నెలో పడదు. ఒకవేళ కొద్దిగా నీరు వస్తే, ఇంతకుముందు కూరవేపిన మూకుడులో ఈ కూరను వేసి ఒకనిమిషం వేయించితే నీరు పోతుంది.
 
దొండకాయ వేపుడుకు కొంచెం నూనె ఎక్కువవేసి, అడుగుభాగం మందంగా ఉన్న మట్టి మూకుడులో నిదానంగా వేయించినా చక్కగా వేగుతుంది.
 
పూజలలో అఖండదీపము పెట్టడానికి మందంగా ఉండే మూకుడు వాడతారు. అలాంటిది కొత్తది కొని కూరలు వండుకోవచ్చు.
 .................................................

 ఈ రోజుల్లో కొలతలతో స్పూన్లు అమ్ముతున్నారు. ఉప్పుజాడీలో అర టీస్పూన్ కొలత ఉన్న ప్లాస్టిక్ స్పూన్ వేసుకుంటే, కొన్నిసార్లు రుచి చూడకుండా కూడా,  కూరలో ఉప్పు సరిపోయేలా వేసుకోవచ్చు.

ఉదా..అరకిలో బీన్స్ కూరకు ఒకటీస్పూన్ ఉప్పు వేసి చూడండి. సరిపోతే ప్రతిసారి అలా వేయొచ్చు. 

యితే, బీన్స్ లో కొబ్బరి పొడికానీ, ఉడికించిన పెసరపప్పు కానీ, తరిగిన ఉల్లిపాయ కానీ వేయించి వేస్తే, ఆ పరిమాణాన్ని బట్టి మరికొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. టమేటో , చింతపండు , నిమ్మరసం పిండినా మరికొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు.

....................................

రసం.. ...రెండు  లేక మూడు  మీడియం సైజ్ టమేటోలను మిక్సీలో మెత్తగా రుబ్బి,  రసాన్ని గిన్నెలో పోసి, అరలీటర్ నీటిని అందులో పోయాలి. అందులో కొద్దిగా(సగం నిమ్మకాయంత)   చింతపండు, ఒక టీస్పూన్ లేక ఒకటిన్నర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు..జీలకర్ర పొడి, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, చిటికెడు బెల్లం, కొద్దిగా కొత్తిమీర వేయాలి.  ఒక టీస్పూన్ శనగపప్పు..కందిపప్పు వేయించి కొట్టిన పొడి వేయాలి. ఇవన్నీ వేసి ఐదు నిమిషాలు మరిగించి దించాలి.

చింతపండు బదులు నిమ్మరసం కూడా పిండవచ్చు.అలాంటప్పుడు, పొయ్యి బంద్ చేసాక ఒక నిమ్మకాయ రసాన్ని రసంలో పిండాలి. 

 చిన్న గిన్నెలో ఒకస్పూన్ నూనెవేసి వేగాక.. ఆవాలు, జీలకర్ర వేయించచాలి. ఇంగువ, చిటికెడు మెంతిపొడి, కరివేపాకు కూడా వేసి వీటిని ఎక్కువ వేపనక్కరలేదు. దించి రసంలో వేసి, రెండు నిమిషాలు కాచి దింపాలి. 
............
తిరగమోత ఆఖరికి కాకుండా, ముందే కూడా వేయవచ్చు. ముందే గిన్నెలో తిరగమోత వేసి, అందులో టమేటో గుజ్జు, నీరు, మిగతా దినుసులు అన్నీ వేసి కూడా కాచుకోవచ్చు.
.................

నేను రసంలో శనగపప్పు..కందిపప్పు వేయించిన పొడి వేసాను. ఇలా కాకుండా, అన్ని దినుసులతో చేసిన రసం పొడి వేయవచ్చు, కొద్దిగా ఉడికించిన కందిపప్పును మెత్తగా మెదిపి వేయవచ్చు లేదా ఉడికించిన పప్పు పైన నీటిని కలపవచ్చు....పప్పులపొడి ఎక్కువ వేస్తే పప్పు చారులా అయిపోతుంది కాబట్టి, రసంలో పప్పు ఎక్కువ వేయకూడదు.

..........................................
 
కొబ్బరి ఎండబెట్టి పొడి, మిరియాలపొడి, ధనియాలు+జీలకర్ర వేయించిన పొడి, కందిపప్పు+పచ్చిశనగపప్పు వేయించిన పొడి, నువ్వులు వేయించిన పొడి, కరివేపాకు+పప్పులు వేయించిన పొడి..ఇలా కొన్ని పొడులు ముందే కొట్టి డబ్బాలలో ఉంచుకుంటే రోజూ అప్పటికప్పుడు కొట్టనవసరం లేదు.

 ................................

 రసం, సాంబారు, పులిహోర, పప్పుకూరలు, పులుసు, దప్పళం..లో తిరగమోతలో మెంతిపొడి కొద్దిగా పావుటీస్పూన్ వేస్తే బాగుంటుంది.ఎక్కువ వేయకూడదు. ఎక్కువవేస్తే కూర చేదు వస్తుంది.
......... 


3 comments:



  1. ఈ మధ్య చాలా గిన్నెలు అడుగుభాగం మందంగా లేకుండా పలుచగా ఉంటున్నాయి. వీటిలో కూరలు వేయించాలంటే పదార్ధం త్వరగా మాడిపోతుంది.ఈ గోలతో పల్చటి మందం ఉన్న పాన్లు వాడటం మానేసాను.

    అయితే,  పలుచటి గిన్నె క్రింద మెష్ వంటిది పెడిదే మంట ఒకే పద్ధతిలో వ్యాపించి కూర త్వరగా మాడకుండా ఉంటుంది.. అని తెలుస్తోంది.

    నేను కొన్నిసంవత్సరాల క్రితం... పొయ్యి మీద పెట్టే గుండ్రని మెష్ వంటిది కొన్నాను. ఈ మెష్ వాడితే గాస్ సేవ్ అవుతుందని చెబితే కొన్నాను. అయితే, అవి వాడకుండా పక్కన ఉంచేసాను.

     పల్చటి గిన్నెల క్రింద మెష్ పెడితే , వేడి తగ్గి గిన్నె మాడటం తగ్గుతుందేమోనని ఈ మధ్య ఆలోచన వచ్చి, మెష్ బయటకు తీసి వాడాను. మెష్ చాలా ఉపయోగపడుతున్నాయి.

     పొయ్యిపైన ఈ మెష్ పెట్టిన వెంటనే వేడి ఎక్కువగా వస్తుంది.  అర నిమిషం తరువాత వేడి సర్దుకుంటుంది.

    అప్పుడు గిన్నె పెట్టి వంట చేస్తే పదార్ధాలు త్వరగా మాడకుండా నిదానంగా వేగుతాయి.

    Buy LPG Gas Saver Grill - Mini Tandoor Online -

    ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నవి కూడా మార్కెట్లో ఉన్నాయి.

    ReplyDelete

  2. కొబ్బరి పైన ఉండే పొట్టుతో సహా తింటే త్వరగా అరగదట.

    పచ్చికొబ్బరి అయితే పై పొట్టును పీలర్ తో తేలికగా తీయవచ్చు.

    ఎండుకొబ్బరి అయితే ఎండుకొబ్బరిని నీటిలో కొద్దిసేపు నానబెట్టి, పొట్టు ఉన్న భాగాన్ని కొబ్బరికోరు పై కోరితే పొట్టు వస్తుంది.

    లేకపోతే, కొబ్బరి చిప్ప నీటిలో నానిన తరువాత పీలర్ తో నిదానంగా పొట్టును తీయవచ్చు.

    ReplyDelete
  3. చక్కగా వంటకాలవి తెలిపారు అనురాధ గారు. బిర్యాని నాకెంతో ఇష్టమని మా అమ్మ వండే బిరియానిలా చేయమంటే నా ధర్మపత్ని కి కాస్త చేయ్యి తిరగక దానిని చివరాఖరుకి ఉడికి ఉడకని నూనన్నం లా చేసి పెడితే రెండే రెండు ముద్దలు దిగమింగి తూర్పు దిక్కుకి దణ్ణం పెట్టాల్సి వచ్చింది నిన్ననే..
    పైపెచ్చు ఈ మధ్యాహ్నం పనీర్ కూర్మ చక్కగా చేసింది కాని మా చిట్టితల్లి కి గోరుముద్దలు తినిపిస్తు అన్నాన్ని ఇలెక్ట్రిక్ కుకర్ లో వేసి, అనక ఉప్పు డబ్బను అక్కడే పెడితేను మా గారాల పట్టి అందులో పావు డబ్బ ఉప్పు వంపేసినట్టుంది.. ఈమె చూసుకోలేదు అలానే ఆన్ చేసేస్తే చివరాఖరున రైత చేసుకుని ఉత్త పనీర్ కూర ముక్కలతో తినాల్సి వచ్చింది. అన్నం ఎంత ఉప్పగయిందో బాబోయి.. కనీసం అమ్మ చెప్పిన టిప్స్ కొన్ని నేను అపుడపుడు చెబుతుంటే చక్కగ చేసి పెడుతోంది. మా రెండున్నర ఏళ్ళ కాపురం లో తనకు తానుగా చక్కని పొళ్ళు పచ్చళ్ళు, అన్నం, ఆకుకూరలు, చపాతి, సేమియ, ఉప్మ, పులిహోర వంటివి చకచకా చేసే నా సతిమణి అపుడపుడిలా తప్పుల తడ్కాతో జడిపిస్తు ఉంటుంది. ఐనా నా భార్య అంటే నాకు ఎనలేని గౌరవం.

    మీరు పైన తెలిపిన కొన్ని రెసిపీలు తనకి చెబుతాను ట్రై చేయమని. ధన్యవాదాలు

    ReplyDelete