koodali

Tuesday, July 21, 2015

ధర్మము అధర్మంపై విజయాన్ని సాధించిన కధ రామాయణము....

 
ఓం లీలాకల్పితబ్రహ్మాండమండితాయై నమః 
ఓం శ్రీ సుదాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమః
 ఓం సూర్యమండలమధ్యస్థాయైనమః 
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః 
.....
అగస్త్యుడు ఆదిత్యహృదయాన్ని రామునికి ఉపదేశించారు. 

శ్రీ దేవీ భాగవతము ద్వారా నారదుడు శ్రీ రామునితో నవరాత్రవ్రతం చేయించారని తెలుస్తుంది. 

విజయదశమినాడు వానరసేనతో లంకాపట్టణం పైకి దండయాత్ర సాగించారు.సేతు బంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుణ్ణి సంహరించాడు.
....................... 
యుద్ధానికి సిద్ధం..విభీషణ శరణాగతి....భల్లూక, వానర సేన....సాగరంపై వారధి....రామ లక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగించాడు ఇంద్రజిత్తు..నాగపాశ విమోచన...రాక్షస వీరుల మరణం..రావణునికి పరాభవం.....ఇంద్రజిత్తు మరణం...రామరావణ యుద్ధం ఆరంభం...లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ...మూర్ఛనొందిన లక్ష్మణుని రక్షణ కోసం ఓషధీ పర్వతాన్ని తీసుకువచ్చిన హనుమంతుడు....రాముని చేత రావణ సంహారం.... 

(రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. )
...................... 
 పిదప విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు.
 విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతకు నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతకు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.

రాముడు "సీతా, ఇక్ష్వాకుకుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను. రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను. కలక బారిన కనులకు దీపం వలె నీవు నాకు చాలా బాధాకరంగా కనుపిస్తున్నావు. నువ్వు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును." అని కఠినంగా మాట్లాడాడు.


(సీత అంటే రామునికి ఎంతో ప్రేమ. సీతాపహరణం తరువాత రాముడు సీతకోసం ఎంతో విలపించాడు.సీతను తలచుకుని దుఃఖించాడు. అయితే, సీతపట్ల ఎంతో ప్రేమ ఉన్నాకూడా దాచుకుని, సీతతో కఠినంగా మాట్లాడవలసివచ్చింది.)

రాముని మాటలు విని సీత దుఃఖంతో బావురుమంది. "ఆర్యపుత్రా, వీరాధివీరా, నీవు పామరునివలె మాట్లాడుతున్నావు. రావణుడు నన్ను తాకిన దోషం నాది కాదు. దైవానిది. నా హృదయం నీమీదే లగ్నం అయి ఉన్నది. నేను జనకుని పెంపుడు కూతురిని. భూమి సుతను. నా భక్తినీ శీలాన్నీ విశ్వసించలేక పోతున్నావా?" అని విలపించింది.

సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా, కళంకిని అనిపించుకొని నేనింక బ్రతుకలేను. నా సుగుణాలని కీర్తించని నా భర్త నలుగురిముందు నన్ననరాని మాటలన్నాడు. అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది.

 సీత అవనత శిరస్కయై రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయాలి" అని పలికి మంటలలోనికి నడచింది. 

అందరూ హాహాకారాలు చేశారు. 
అప్పుడు బ్రహ్మ రాముని సమక్షంలో నిలిచి "రామా నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? ప్రాకృతునిలా సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. నీవు విష్ణువు అవతారానివని చెప్పాడు.

అగ్ని సీతను వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు. సీత అప్పుడు ఉదయసూర్యబింబంలా ఉంది. "రామా! ఇదిగో నీ సీత. ఈమె పునీత. పాపహీన. నిన్నే కోరిన సాధ్వి. ఈమెను అవశ్యం పరిగ్రహించు. నాకడ్డు చెప్పవద్దు. నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను" అని చెప్పాడు. 

రాముడు "సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింప జాలను. ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీత చేతినందుకొన్నాడు.
........
రాముని కోరికపై ఇంద్రుడు చనిపోయిన వానరులందరినీ బ్రతికించాడు. సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. 

అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు. 

విభీషణుడు, వానరులు తోడు రాగా పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు.

 దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు. 

 హనుమంతుడు నందిగ్రామం చేరుకొని , భరతునికి సీతారామలక్ష్మణుల పునరాగమన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు.

 రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రామునికి, సీతకు, లక్ష్మణునికి ప్రణమిల్లాడు.

 సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. రాముని పేరుతో తాను రాజ్య సంరక్షణ చేస్తున్నానని, రాజ్యభారాన్ని తిరిగి చేకొనమని  భరతుడు శ్రీరాముని ప్రార్ధించాడు. 

భరతుడే సారధ్యం వహించగా, శత్రుఘ్నుడు శ్వేతచ్ఛత్రం పట్టగా, లక్ష్మణ విభీషణులు వింజామరలు వీయగా, వానరవీరులు వెంటరాగా సీతారాములు పరివార సమేతులై శంఖభేరీ భాంకారాలతోఅయోధ్యలోనికి ప్రవేశించారు.

 తల్లులకు, పెద్దలకు, గురువులకు మ్రొక్కారు. 

వనవాస విశేషాలు, సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుని మైత్రి, హనుమంతుని అసమాన కార్య సాధన, విభీషణ శరణాగతి, లంకాయుద్ధాది వివరాలు విని అయోధ్యాపౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు.

శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయమయ్యింది.  పట్టాభిషేకం వైభవంగా జరిగింది.

శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. 

అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది.

 సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. 

అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారం తో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. 

రాముని సెలవు తీసికొని విభీషణుడు లంకకు, వానరులు కిష్కింధకు తరలిపోయారు.

యువరాజుగా ఉండడానికి లక్ష్మణుడు సమ్మతించలేదు. భరతునకు యౌవరాజ్యాభిషేకం చేశాడు రాముడు.

 తరువాత శ్రీరాముడు అశ్వమేధం, పౌండరీకం, మరెన్నో క్రతువులు చేశాడు. లక్ష్మణుడు తనకు సాయపడుతూ ఉండగా పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన  చేశాడు. శ్రీరాముని రాజ్యంలో జనులు సుఖసంతోషాలతో ఉన్నారు.

వాల్మీకి రచించిన  రామకథను చదివినవారు, విన్నవారు కూడా పాపవిముక్తులై ధనధాన్యసంపదలను పొందుతారని , ఇంకా  ఎన్నో విషయాలను పెద్దలు తెలియజేసారు . 
........................ 
రామాయణాన్ని అంతర్జాలం ద్వారా  చదవవచ్చు.

ఈ లింక్ వద్ద ఏకశ్లోకి రామాయణము. చదవగలరు.

వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


5 comments:

  1. సీతాదేవి అగ్నిప్రవేశం చేయటానికి ముందు రాముడు కఠినంగా మాటలాడటం గురించి...( కఠినంగా మాట్లాడటం ..ప్రక్షిప్తమా ? లేక నిజమా? అనే విషయం తెలియదు.)

    సీత ఎంతో మహిమ కలది. రావణుడు సీతను అపహరించినా, ఆమెకు ఏ హానీ చేయలేకపోయాడు. అంతఃపురంలో కాకుండా అశోకవనంలో అందరి మధ్యనా ఆరుబయట ఉంది సీత.

    రామునికి సీత యొక్క పాతివ్రత్య మహిమ గురించి తెలుసు.

    అయితే, పరపురుషుని ఇంట కొంతకాలం ఉండివచ్చిన స్త్రీ పట్ల ప్రజలు ఎలాంటి ఊహలు చేస్తారో కూడా రామునికి తెలుసు.

    రాముడు కఠినంగా మాట్లాడిన తరువాత సీతాదేవి అగ్నిప్రవేశ ఘటన జరిగింది.

    సీత సురక్షితంగా ఉండటం.. దేవతలు ప్రత్యక్షం కావటం .. సీత యొక్క గొప్పతనం లోకానికి వెల్లడికావటం జరిగింది.

    ఇవన్నీ గమనిస్తే, సీత గొప్పదనం లోకానికి వెల్లడి చేసే ప్రయత్నంలో భాగంగా.. రాముడు అలా కఠినంగా మాడ్లాడి ఉండవచ్చు.. అనిపిస్తుంది.

    ReplyDelete
  2. సీత కఠినంగా మాట్లాడిన సంఘటన గురించి.. ...( కఠినంగా మాట్లాడటం ప్రక్షిప్తమా ? లేక నిజమా? అనే విషయం తెలియదు.)


    బంగారు లేడిని వెదుకుతూ రాముడు వెళ్ళిన తరువాత రాముని ఆర్తనాదాల వంటి ధ్వనులు వినిపించగా, సీత రామునికి ఏమైనా ఆపద సంభవించిందేమోనని భయవిహ్వల అయి, లక్ష్మణుని రామునికి సహాయంగా వెళ్లమంటుంది.

    రామునికి ఏమీ కాదనీ..తాను అన్నగారి మాట ప్రకారం సీతకు రక్షణగా ఉంటానని లక్ష్మణుడు అన్నాడు.

    దానితో సీత లక్ష్మణుని పరుషంగా నిందించి, దుర్బుద్ధితో రామునికి కీడు జరుగాలని అతను కోరుకొంటున్నాడని దూషించిందంటారు.

    రామునికి ఏమయ్యిందోననే ఆందోళన వల్ల, లక్ష్మణుడిని ఎలాగైనా రాముడికి సహాయంగా పంపాలని సీత ఆ విధంగా కఠినంగా పలికిందే గానీ, లక్ష్మణుడు ఎలాంటివాడో సీతకు తెలుసు.

    లంకలో అశోకవనంలో ఉన్నప్పుడు సీతాదేవి.. హనుమంతునితో రాముడి గురించి, లక్ష్మణుని గురించి..క్షేమసమాచారాలను అడిగినప్పుడు,

    లక్ష్మణుని గురించి..వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు, ఆ లక్ష్మణుడిని కుశలమడిగానని చెప్పు. అంటుంది.

    ఇవన్నీ గమనిస్తే, రాముని గురించిన ఆందోళనతో, లక్ష్మణుని రామునికి సహాయంగా పంపాలనే ఆరాటంతో సీత అలా కఠినంగా మాట్లాడి ఉండవచ్చు.. అనిపిస్తుంది.

    రామాయణంలో ఎన్నో ప్రక్షిప్తాలు ఉన్నాయని అంటున్నారు. ఏవి ప్రక్షిప్తాలో ఏవి కావో భగవంతునికే తెలియాలి.

    ReplyDelete
    Replies
    1. తప్పనిసరి పరిస్థితిలో తప్ప, లక్ష్మణుడు రాముని మాటను మీరటం జరగదు.
      లక్ష్మణుని రాముని కొరకు పంపాలంటే సీత కఠినంగా మాట్లాడవలసిన అవసరం ఉంది.
      అందుకే తప్పనిసరి పరిస్థితిలో సీతాదేవి అలా మాట్లాడి ఉండవచ్చు.

      Delete
  3. విభీషణుడు రాజ్యం కోసం ఆశపడి అన్నను వదిలి వచ్చాడని కొందరు అంటారు.

    రావణుడు పరస్త్రీలను చెరపట్టేవాడు.ఇతరుల విలువైన సంపదలు తనకు కావాలనే కోరికలు కలవాడు.

    రావణుని ప్రవర్తన వల్ల అతని బంధువులు, మిత్రులు, లంకలో ప్రజలు చాలామంది నాశనమైపోయారు.

    రావణుడు చనిపోయిన తరువాత ఇంకో రాక్షసుడు పాలనకు వస్తే, రాక్షసులు మానవులను పీడించటం..వంటివి మళ్ళీ కొనసాగుతాయి.

    ఇలా జరగకుండా ఉండాలంటే రాక్షసప్రవృత్తి లేని విభీషణుడు రాజ్యపాలన చేపట్టాలి.

    అప్పుడు లంకలో మిగిలిఉన్న వాళ్ళ రాక్షసప్రవృత్తికి చాలావరకూ అడ్దుకట్ట పడుతుంది.

    కొందరు ఏమంటారంటే, విభీషణుడు తన అన్నకు ద్రోహం చేశాడంటారు. మరి రావణుని వల్ల ఎంతో మందికి ద్రోహం కలిగింది. దాని సంగతి ఏమిటి ?

    అన్న పక్షాన ఉండటం ధర్మమే అయినా, విభీషణుని అన్న రావణుడు అధర్మపరుడు. అతని వల్ల ఎందరో బాధలు పడుతున్నారు.అలాంటి అధర్మపరుడైన అన్నకు సపోర్ట్ చేస్తేనే అధర్మం అవుతుంది .

    న్యాయమూర్తి అయిన వ్యక్తికి తన సొంత బంధువులు తప్పు చేసినా న్యాయం ప్రకారమే తీర్పును ఇవ్వవలసి ఉంటుంది. అంతేకానీ నా అన్న కాబట్టి అతనికి అనుకూలంగా వ్యవహరిస్తాను అంటే కుదరదు కదా!

    బంధుత్వం ముఖ్యమే కానీ.... ధర్మపక్షాన నిలబడటం ఎంతో ముఖ్యం.

    సీతాదేవిని రామునికి అప్పగించేయమని విభీషణుడు రావణునికి ఎంతో నచ్చచెప్పాడు. అయినా రావణుడు వినలేదు.

    ఆ తరువాతే విభీషణుడు రావణుని వదిలి వచ్చేసాడు.విభీషణుడు రాజ్యం కోసమే అన్నను వదిలి వచ్చేవాడయితే సీతాదేవిని రామునికి అప్పగించమని చెప్పేవాడేకాదు.

    ఇవన్నీ గమనిస్తే, విభీషణుడు రావణుని వదిలి, రాముని చెంత చేరటం, తదుపరి లంకకు రాజు కావటం సరైనవే.

    ReplyDelete
  4. కొందరు ఏమంటారంటే, పురాణేతిహాసాలలో ఉన్నవి అతిశయోక్తులు అంటారు.( అవి అతిశయోక్తులు కాదు నిజాలే.)

    భారీ ఆకారాలున్న జటాయువు వంటివి, పశుపక్ష్యాదులు ఎక్కడైనా ఉంటాయా ? అంటారు.

    ప్రాచీన కాలంలో భారీ ఆకారాలున్న డైనోసార్లు, ఇతర జంతువులు జీవించటం నిజమేనని ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా!

    పురాణేతిహాసాల కాలంలో కూడా భారీ ఆకారాలలో పశుపక్ష్యాదులు ఉండేవికావచ్చు.
    .............
    రామాయణంలో ఎందరో వ్యక్తులు ఎన్నో మహిమలు చూపారు. ఆకాశంలో ఎగరటం, రూపాలను మార్చుకోవటం వంటివి ఎన్నో జరిగాయి.దేవతలు ప్రత్యక్షమవటం వంటివీ జరిగాయి.

    కొందరు ఏమంటారంటే, పురాణేతిహాసాల్లో చెప్పబడిన మహిమలు కట్టుకధలు అంటారు.అవన్నీ కట్టుకధలు కాదు. ప్రాచీన విజ్ఞానం.

    ఇప్పటికన్నా అద్భుతమైన విజ్ఞానం ప్రాచీనకాలంలో ఉండేదనిపిస్తుంది.
    .........
    ఆధునికకాలంలో.. షిర్డిసాయిజీవితచరిత్రములో ఖండయోగం అనబడే అద్భుతవిధానం గల మహిమ గురించి చెప్పబడింది.
    ..........
    ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు అందరికీ సాధ్యం కాని విధంగా అత్యంత బరువులను అవలీలగా లాగేస్తున్నారు.
    యోగా ద్వారా కొందరు నీటిపై పడుకుని చూపిస్తున్నారు.
    ...........
    ఈ రోజుల్లో కూడా శాస్త్రవేత్తలకు అంతుపట్టని విషయాలెన్నో జరుగుతున్నాయి.

    ఆధునిక శాస్త్రవేత్తలకు అంతుపట్టని విషయాలెన్నో సృష్టిలో ఉన్నాయి.

    ReplyDelete