koodali

Wednesday, July 1, 2015

కొన్ని విషయాలు....పేదవారికి క్యాంటీన్లు...


అద్భుతమైన అమరనాధ్ యాత్ర ప్రారంభమయింది.
..............

మరి కొన్ని విషయాలు ........... 

అమ్మ క్యాంటీన్లు  గురించి  వినే  ఉంటారు.  తమిళనాడులో  అమలవుతున్న  అమ్మ  క్యాంటీన్లలో  అతితక్కువ  ధరకే  భోజనాన్ని  అందిస్తున్నారట. 

ఇంకా  నిత్యావసర  వస్తువులనూ  అందిస్తున్నారట. ఇది   మంచి  పద్ధతే  అనిపిస్తుంది.

రేషన్  కార్డుల  ద్వారా  నిత్యావసర  వస్తువులను  అందించటమూ  మంచిదే.  అయితే, వంట  చేయాలంటే గ్యాస్  వంటివి ఎన్నో కావాలి.  


వంటచేసుకోవాలంటే  కుదరని వారికి  ఇలాంటి  క్యాంటీన్లు  ఎంతో  ప్రయోజనకరం.  

మనిషికి  ఆహారం  ముఖ్యం.  ఆకలితో  అల్లాడే  ప్రజలున్న  సమాజంలో  ఎంత  టెక్నాలజీ  ఉన్నా ఏం  లాభం ?  

అందరికీ  ఆహారాన్ని  అందించగలిగిన  రోజున  దేశంలో  ఎన్నో  సమస్యలు  పరిష్కారమవుతాయి.
...................

ఇక్కడ  ఒక విషయాన్ని  చెప్పుకోవాలి. 

 సమాజంలో  డబ్బున్న  వాళ్ళలో  కొందరు  మరీ  పిసినారివాళ్ళుంటారు.    ఇలాంటి  వాళ్ళు,  తక్కువ ధరకు  ఆహారం  లభిస్తుందంటే - ఇక  ఇంట్లో  వండుకోవటం  మానేసి  అన్నా  క్యాంటీన్లలోనే  భోంచేస్తారేమో ? 

  డబ్బున్న  వాళ్ళు  కూడా  ఇలా  చేస్తే , పేదవారికి  ఆహారం  సరిపోదు.  ఇలాంటి  క్యాంటీన్లను  ప్రారంభించిన   అసలు  ఉద్దేశ్యం  సరిగ్గా  నెరవేరదు. 


 ఎప్పుడో తప్పనిసరి  పరిస్థితిలో  తప్ప,  డబ్బున్నవాళ్ళు  ఇలాంటి  క్యాంటీన్లను  ఉపయోగించకుండా  ఉంటేనే మంచిది.  పీనాసితనాన్ని  తగ్గించుకుంటే  పేదవారి  కడుపు నింపిన వారవుతారు.
 
****************
      marikonni vishayamulu...
             
ఆహారం, ఆవాసం(ఇల్లు), వైద్యం, విద్య, రక్షణ..ఇలాంటివి మనుషులకు ప్రాధమిక అవసరాలు. ఇవి అందరికీ ఉండాలి. ప్రపంచంలో అందరికీ ప్రాధమిక అవసరాలు తీరటం చాలా తేలిక.


 ప్రకృతిలోనే అన్నీ ఉన్నాయి. బోలెడు మొక్కలనుంచి అందరికీ ఆహారం, ప్రకృతి నుంచి లభించే వాటితో పర్యావరణహితమైన ఇళ్ళు, ఇక,చక్కటి పద్ధతితో జీవిస్తే అనారోగ్యాలు రావు. ప్రకృతి నుంచి లభించే వాటితో మందులు తయారీ విధానాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేని  సహజవిధానాలతో వైద్యం, ఎన్నో విద్యలు..ఇలా ప్రాధమిక అవసరాలు తీరటం అందరికీ తీరటం సులభమే. మనుషులే వ్యవస్థను పాడుచేసుకుంటున్నారు.


అయితే,  ఇప్పటి ప్రజలు చాలామంది ప్రాధమిక అవసరాలను కూడా విలాసంగా మార్చుకుంటున్నారు. అంటే, ఆహారం విషయంలో సరిపడినంత మంచి ఆహారం కాకుండా, జంక్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటున్నారు...ఇల్లు విషయంలో..సరిపడినంత చక్కటి ఇల్లు కాకుండా,  విలాసవంతమైన ఇళ్ళకు బోలెడు డబ్బును ఖర్చుపెడుతున్నారు... ఇక వైద్యం, విద్య విషయంలో .. వీటిని చాలాచోట్ల వ్యాపారధోరణితో మార్చుకున్నారు..ఇక రక్షణ విషయంలో..ప్రపంచంలో  మనుషులు అనేకకారణాలతో గొడవలు పడుతున్నారు కాబట్టి, రక్షణకొరకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి ఉంది.


 ఈ రోజుల్లో చాలామంది ప్రజలు  విలాసావసరాలనే ప్రాధమిక అవసరాలుగా భావిస్తూ వాటికొరకు తాపత్రయపడుతూ జీవితాలను అశాంతిమయం చేసుకుంటున్నారు. 
 
విలాసవంతమైన కార్లు, విమానప్రయాణాలు, హోటల్స్ ఖర్చులు, ఆభరణాలు, దుస్తులు, కాస్మెటిక్స్..ఇలాంటి విలాసాలు ఎన్నో ఉన్నాయి. ఇలా చెపితే చాలామందికి కోపం వస్తుంది. మా డబ్బు మేము ఖర్చుపెడితే మీకేమిటి ? అంటారు. డబ్బు సంపాదనకు కొన్ని పరిమితులుంటాయి. మీరు ఆ డబ్బును ఎలా సంపాదిస్తున్నారు? న్యాయంగానా? అన్యాయంగానా? న్యాయంగా సంపాదించాలంటే ఎక్కువడబ్బును సంపాదించలేము.


ప్రకృతికి హాని కలిగేలా పనులు చేసి డబ్బును సంపాదించటం, సమాజంలో పెడధోరణులు వ్యాప్తి చెందేలా చిత్రాలు, రచనలు చేసి డబ్బు సంపాదించటం, మద్యాన్ని అమ్మి డబ్బు సంపాదించటం, ఇతరులను మాటలతో చేతలతో హింసించటం, జీవులను చంపి తినటం..ఇలా చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇలాంటివి చేసినప్పుడు ఆ కర్మ ఫలితాలూ వస్తుంటాయి.



 బోలెడు సంపదను ప్రోగేసుకునే హక్కు ఎవరికీ లేదు.   తరతరాలకు సరిపడ ప్రోగుచేసుకోవటం పాపమే. కొందరు కొద్దిగా దానాలు చేసి, తమకొరకు బోలెడు దాచిపెట్టుకుంటారు.


దైవం ఇచ్చిన తెలివిని, బలాన్ని  తమకొరకు మరియు ఇతరుల కొరకు వాడటం ధర్మం. అంతేకానీ, సాటిజీవులు ప్రాధమిక అవసరాలు తీరక ఇబ్బందులు పడుతుంటే, కొందరు విపరీతంగా విలాసాలు అనుభవించటం న్యాయం కాదు. అలాగని ఎవరైనా విపరీతంగా దానధర్మాలు, అపాత్రదానాలూ.. చేయకూడదు. అలాగని బోలెడు ప్రొగేసుకోవటం కూడా చేయకూడదు. కొంతవరకూ సంపాదించి దాచుకుని, ఇతరులకు కూడా సాయపడాలి.

 ప్రపంచంలోని కొందరు, తరతరాలకూ బోలెడు సంపదను ప్రోగేసుకోవటం చేయకపోతే ప్రపంచంలో పేదరికం ఉండదు.                                                                                                                

 పెద్ద పరిశ్రమల వాళ్లు ప్రభుత్వాల వద్ద తక్కువధరకు బోలెడు భూములు తీసుకుని కొంతమందికే ఉద్యోగాలు ఇస్తారు. యంత్రాలను ఎక్కువగా వాడి, మనుషులకు తక్కువ ఉద్యోగాలను ఇస్తారు. అందువల్ల పర్యావరణహితమైన చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, చేతివృత్తులు, మొదలైనవాటిని ప్రోత్సహించాలి.


 ప్రభుత్వాలు బోలెడు ఉద్యోగాలు ఇవ్వవచ్చు. ఉదా..పార్కుల్లో పచ్చదనానికి, రహదారుల శుభ్రతకు చాలామందిని నియమించవచ్చు. బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లను, ఇద్దరు కండక్టర్లను నియమించవచ్చు. హాస్పిటల్స్లో ఎక్కువమంది నర్సులను నియమించి పనివత్తిడిని తగ్గించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో తగినంతమంది సిబ్బందిని నియమించి పనులు త్వరగా జరిగేలా చేయవచ్చు.


 ధరలు అదేపనిగా పెంచకుండా వ్యాపారులను నియంత్రించాలి. అలా నియంత్రించడానికి సిబ్బందిని నియమించాలి. ప్రభుత్వ ఉద్యోగులు అదేపనిగా జీతాలు పెంచమని కోరకుండా వారిపై చర్యలు ఉండాలి. వారిపై పనిభారం విపరీతంగా లేకుండా తగినంతమంది సిబ్బందిని నియమించాలి. ఇలా ఎన్నో చేయవచ్చు. ప్రజలు నీతినియమాలతో ఉంటే చాలా సమస్యలు తగ్గుతాయి.
                                                                                                                      

No comments:

Post a Comment