koodali

Monday, July 13, 2015

రాముడు వనవాసంలో ఉండగా ఆయుధాలను ధరించి రాక్షసులును సంహరించటం..

 
మహర్షులు ఆయుధాలను ధరించటం గురించిన ఒక ఉదాహరణ..

ఒకానొకప్పుడు ధర్ముని కుమారులైన నరనారాయణులు ధనుర్బాణాలను ప్రక్కనే ఉంచుకుని తపస్సులు చేసిన విషయం గురించి..శ్రీ దేవీ భాగవతము.. ద్వారా తెలుస్తుంది. 
నరనారాయణులు విష్ణుమూర్తి అంశతో జన్మించిన మహర్షులు) 

...........
రాముడు వనవాస సమయంలో నార వస్త్రాలను ధరించి, ఆయుధాలు చేపట్టి రాక్షస సంహారం చేయటం ఏమిటనిపిస్తుంది కొందరికి.

( ఈ విషయం గురించి రామాయణంలోనే సీతారాముల మధ్య జరిగిన సంభాషణ ద్వారా సందేహనివృత్తి చేసారు.)
............

అయినాకూడా కొంతమంది ఏమంటారంటే,

 రాముడు అరణ్యాలకు వెళ్ళి జీవించాలని కైకేయి చెప్పింది, నారవస్త్రాలను కూడా ఇచ్చింది కాబట్టి..రాముడు తాపసిలా జీవించాలి కానీ, ఆయుధాలను ధరించి రాక్షసులను చంపటమేమిటి ? అంటారు.

అయితే, వనవాసానికి వెళ్ళే సమయంలో దశరధుడే  రామునికి ఆయుధాలను ఇవ్వటం జరిగింది కదా!

  తరువాత అగస్త్య మహర్షి కూడా రామునికి ఆయుధాలను ఇచ్చారు.
.................
రాముడు వనవాసం చేస్తున్నంత మాత్రాన , మునులను బాధలను పెడుతున్న రాక్షసులను ఏమీ చేయకుండా చూస్తూ ఊరుకుంటే బాగుంటుందా ?

 తన భార్యను ఎత్తుకుపోయిన రావణాసురుని చంపకుండా  ఊరుకుంటే ఎలా ?
...................

ఎవరైనా సరే తమ ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం ఆయుధాలను ఉపయోగిస్తే తప్పేముంది ? 

మునులైనా సరే తమను ఎవరైనా చంపబోతే తమను తాము రక్షించుకోవటానికి ప్రయత్నిస్తారు కదా ! 

తమను, తోటివారిని  రక్షించుకోవటానికి, తమ తపస్సులను భగ్నం చేసే రాక్షసుల బారినుండి కాపాడుకోవటానికి కొందరు మహర్షులు తమ తపశ్శక్తిని ఉపయోగించారు కదా !

  అగస్త్యుడు తమ తపశ్శక్తితో చెడ్డగా ప్రవర్తించేవారిని శిక్షించారు కదా !

తమ తపశ్సక్తిని వృధా చేయటం ఇష్టం లేనప్పుడు కొందరు మునులు, రాక్షసుల బారి నుండి కాపాడమని ఇతరులను అడుగుతుంటారు.
.....................

 మునులు తపస్సులు చేసుకునే ప్రదేశాలను ఆక్రమించి, వారి తపస్సులను చెడగొట్టటానికి రాక్షసులను నియమించేవాడు రావణాసురుడు.

మునులు తపస్సులు చేయనీయకుండా రాక్షసులు వారిని బాధలు పెడుతుంటే ఆ మునులు రాముని సహాయం కోరారు. 

రాక్షసుల బారి నుండి కాపాడతానని రాముడు వారికి మాట ఇచ్చాడు.
...................

వనవాసంలో చాలా సంవత్సరాలు రాముడు ఆశ్రమాల వద్ద ఉండి తపస్వులను దర్శిస్తూ.. రాక్షసుల బారి నుండి మునులను రక్షిస్తూ ఉన్నాడు.

తరువాత శూర్పణఖ రావటం, అది రాముని మోహించటం , సీతను చంపబోవటం.. జరిగింది.

సీతాదేవిని చంపబోతే రాముడు చూస్తూ ఊరుకోడు కదా ! తరువాత శూర్పణఖ తరపు వాళ్లైన కొన్నివేలమంది రాక్షసులు దండెత్తి రాగా రాముడు వాళ్ళను సంహరించాడు. 
.............

సత్యం..  విషయంలో అనేక ధర్మసూక్ష్మాలను తెలియజేసారు పెద్దలు.
..........
 ఇతరుల ప్రాణాలకు నిష్కారణంగా హాని కలుగుతుంటే ..సత్యం పేరుతో... శక్తి ఉన్నవాళ్ళు  చూస్తూ ఊరుకుంటే , అలాంటి సత్యం.. సత్యం అనిపించుకోదు. 

 ఋషులు రాముడిని శరణు వేడి, రాక్షసుల బారినుండి రక్షించమని అడిగినప్పుడు, రాముడు ఆయుధాలను ధరించి , వారికి రక్షణను ఇవ్వటమే ధర్మం.
..............

  రాముడికి పట్టాభిషేకం నిర్ణయించిన ముహూర్తంలోనే భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని కైక కోరిందట.

అప్పుడు  భరతుడు అయోధ్యలో లేడు. భరతుడు అయోధ్యకు రావటానికే కొన్ని రోజులు పట్టినప్పుడు, అదే ముహూర్తంలో పట్టాభిషేకం చేయటం అంటే ఎలా  కుదురుతుంది ?  

దశరధుడు రాముడితో... నన్ను కారాగారంలో  వేసి  ఈ రాజ్యం పాలించు. ఆ విధంగానైనా నిన్ను రోజూ చూస్తాను. నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నప్పుడు..

.మరి అది కూడా తండ్రి మాటే కదా ! అని రాముడు రాజ్యాన్ని తీసుకోవచ్చు.  అయితే, రాముడు అలా చేయలేదు. 

 రాజ్యసుఖాలను  వదలి,  అరణ్యాలకు వెళ్ళి కష్టాలు అనుభవించిన  రాముడిని తిట్టే  వాళ్ళని ఏమనాలి ?


1 comment:

  1. ఇప్పటి వాళ్ళు కొందరు ఏమంటారంటే...
    ఋషులు రాముడిని శరణు వేడి, రాక్షసుల బారినుండి రక్షించమని అడిగినప్పుడు..

    రాముడు మునులతో...నేను రుషి జీవనమే గడపాలి. క్షత్రియ ధర్మం ఆచరించటానికి నాకు హక్కులేదు. అని రుషులతో చెప్పాలి గానీ, ఆయుధాలు పట్టడమేమిటీ ? రాక్షసులను చంపడమేమిటీ ? అని విమర్శిస్తున్నాను.

    నేను తపస్విని కదా ! నేను మీకేమీ సహాయం చేయలేను.. అని రాముడు రుషులతో చెప్పినట్లయితే, అప్పుడూ రాముని విమర్శించేవారు...వీళ్ళు.

    ( రాముడు ఏం చేసినా విమర్శించటమే వీళ్ల పని.) అప్పుడు ఏమనేవారంటే..

    ఒక క్షత్రియుడై యుండీ కూడా రుషులను రక్షించకుండా తపస్సు పేరు చెప్పి రాముడు హాయిగా కూర్చున్నాడు. అని వీళ్లు విమర్శించేవారు.

    ReplyDelete