koodali

Monday, July 27, 2015

ఉత్తర రామాయణం ..

 
ఉత్తర కాండము: సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - 

(కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)

రామరాజ్యం.. సీత గురించిన నింద.. అడవుల పాలైన సీత.. ముని ఆశ్రమం, కుశలవులు.. రాజసూయం.. రామాయణ గానం..జానకీదేవి కళంక రహిత..సీత భూప్రవేశం..లక్ష్మణునికి ధర్మ సంకటం.. లక్ష్మణుడి యోగ సమాధి.. రాముని నిర్ణయం.. రామావతార పరిసమాప్తి..

శ్రీ రామ పట్టాభిషేకం తరువాత అయోధ్యలో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. 

ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు.
 అందుకు సీత " నాధా గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. 

అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే వ్యాకులచిత్తుడవుతాడు.

 అక్కడనుండి సభామంటపానికి వెళ్ళిన రాముడిని విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, పింగళుడు, కుటుడు, సురాజు, మొదలైన వారు హాస్య కథలు చెప్పి రాముడిని సంతోషపరుస్తారు.

 రాముడు ప్రసన్నుడై భద్రునితో " భద్రా! నా పరిపాలన ఎలావున్నది? ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవుగదా? నిజం చెప్పు.?" అని అడుగుతాడు. 

అందుకు భద్రుడు" మహారాజా! సత్యసంధుడివైన నీకు నిజం చెప్తున్నాను. ప్రజలు నీ పరక్రమాలను, రావణ సంహారాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. అయితే, రావణ చెరలో కొన్నాళ్ళు ఉన్న సీతను తిరిగి మీరు భార్యగా స్వీకరించడం గురించి మాత్రం రక రకాలుగా చెప్పుకొంటున్నారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి" అన్నాడు.

 రాముడు సరేనని వారినందరిని పంపించి విషాదచిత్తుడై తమ్ముళ్ళను పిలిపిస్తాడు. వారు రావడంతోనే రాముని వదనం చూసి నిశ్చేష్టులవుతారు.


రాముడు వారిని కూర్చోమని జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. " లక్ష్మణా! సూర్య చంద్రులు, అగ్ని,ఇంద్రాది దేవతలు కూడా ఆమె సౌశీల్యాన్ని శ్లాఘించారు. కానీ ఆమెపై అయోధ్యలో ఇంకా అపవాదు తొలగలేదు. ప్రజాభీష్టం లేని పరిపాలన సూర్యుడులేని పగలు వంటిది. ఇప్పుడు నాకు ఆమెను పరిత్యజించడం తప్ప వేరు మార్గం కనపడ్డం లేదు. కొద్ది సమయం కిందటే సీత తనకు మున్యాశ్రమాలు చూడాలని కోరికగా ఉన్నదని కోరగా ఆమెకు సరే అని అనుమతిచ్చాను. నువ్వు మారు మాటాడక ఆమెను గంగానదీ తీరంలోని ఆశ్రమాల వద్ద వదిలిరా. ఇది నా ఆజ్ఞ" అంటాడు. 


గంగానదిని దాటిన పిదప మున్యాశ్రమతీరంవద్ద లక్ష్మణుడు సీతాదేవితో  " తల్లీ! నా పాపాన్ని క్షమించు. నిన్ను నేను ఇక్కడకు తీసుకువచ్చినది ఈ తీరంలో వదిలి వెళ్లడానికే గాని తిరిగి అయోధ్యాపురికి తీసుకు వెళ్ళడానికి కాదు" అని అసలు సంగతి చెప్పగా,


 ఆమె మూర్చపోయి తేరుకొని "నాయనా సౌమిత్రీ! నేను కష్టాలు అనుభవించడానికే పుట్టాను అని అనిపిస్తున్నది.... అప్పుడు అరణ్యాలలో భర్త తోడుతో గడిపాను. ఇప్పుడు ఒంటరిగా ఉండగలనా? నీభర్త నిన్నెందుకు విడిచిపెట్టాడని అడిగే ముని పత్నులకు ఏమి జవాబు చెప్పేది? సరే. విధిరాత అనుభవింపకతప్పదు. ఆయన మాటను గౌరవిస్తానని చెప్పు. నా నమస్కారాలు తెలియచెయ్యి. " అంటుంది. 

లక్ష్మణుడు ఆమె పాదాలకు మొక్కి ప్రదక్షిణం చేసి వెళ్ళలేక వెళ్లలేక గంగా తీరం దాటి వెడతాడు.

సీత అతను వెళ్ళేంతవరకూ అక్కడే ఉండి పెద్దగా ఏడుస్తూ కుప్పకూలిపోయింది. 

ముని బాలకుల ద్వారా ఈ సంగతి తెలుసుకొన్న వాల్మీకి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి" అమ్మాయీ! నీవు జనకుని కూతురువు. దశరధుని కోడలివి. రాముని ఇల్లాలువు. నీవు అతి పవిత్రురాలివి. నేను నా తపశ్శక్తితో సర్వం గ్రహించాను. నీవు నిశ్చింతగా ఉండు. ఇక్కడి మునిసతులందరూ నిన్ను కన్న కూతురివలె చూసుకొంటారు. " అని ఓదారుస్తాడు.

 ఆయన ఆశ్రమంలో ఉన్న అందరినీ పేరు పేరునా పిలచి జానికీ దేవికి ఎలాంటి కష్టం కలుగకుండా చూసుకొనే భాధ్యతను అప్పగిస్తాడు. 

అక్కడ కొంతకాలానికి జానకీ దేవి ఇద్దరు బాలలకు జన్మనిస్తుంది. వారు లవకుశనామధేయులై దినదిన ప్రవర్దమానులౌతూ అటు వేద విద్యలోనూ, ఇటు క్షాత్ర విద్యల్లోనూ తిరుగులేని బాలురుగా ప్రకాశిస్తుంటారు.

తరువాత,  లవకుశులు రామకధను గానం చేయటం..రాముడు వినటం..మొదలైన విషయాలు జరుగుతాయి.

తరువాత, కొన్ని సంఘటనల తరువాత ..  సీతాదేవి అవతారసమాప్తి జరుగుతుంది . రాముడి దుఃఖానికి అంతే లేదు... 

అప్పుడు బ్రహ్మ వారించి "రామా ! ఇది నీకు తగదు. నిన్ను స్వర్గధామంలో తప్పక కలుసుకొంటుంది. నీ చరిత్ర ఇతిహాసంగా ఉండిపోతుంది...అంటూ ఎన్నో విషయాలను తెలియజేస్తారు.

 లవకుశులతో రాముడు అయోధ్యకేగాడు. కాలం ఎవరికోసమూ ఆగదు.

తరువాత కొంతకాలానికి ఎన్నో సంఘటనలు జరగటం ... వారి సంతానానికి రాజ్యాన్ని అప్పగించటం.. మరి కొన్ని సంఘటనల తరువాత..  రామావతారపరిసమాప్తి జరిగింది.
........................ 

రామాయణము - వికీపీడియా


.. నుంచి  ఎన్నో విషయములు  చదవవచ్చు.   
...................... 
వ్రాసిన వాటిలో ఏమైనా పొరపాట్లు ఉన్నచో దయచేసి దైవం క్షమించాలని ప్రార్ధిస్తున్నాను . 


3 comments:

  1. సీతాపహరణం తరువాత రాములవారు ఎంతో శోకించి , ఎన్నో కష్టాలు పడి భార్యను వెదికి తెచ్చుకున్నారు.

    ఈ ఆధునికకాలంలో అయినా , ఎంతమంది మగవాళ్ళు అలా చేయగలరు ? కొంతమంది భార్యను వెదకటం మాని మరొక వివాహం చేసేసుకుంటారు.

    భర్తగా రాములవారు సీతాదేవిని ....లంక నుండి తీసుకువచ్చి రక్షించుకున్నారు. .....తరువాత ఒక రాజుగా కొందరు ప్రజల అభిప్రాయం ప్రకారం ... సీతాదేవిని అడవులకు పంపించవలసి వచ్చింది.

    కొందరు వ్యక్తులు అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది.( పైకి అనకపోయినా.)

    అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను, ఇన్ని ఆలోచించి ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేశారు...

    ప్రజలు ఎలా భావించినా అశ్వమేధ యాగం సందర్భంలో రాములవారు సీతాదేవి యొక్క బంగారు ప్రతిమను భార్యగా భావించటం ద్వారా .... ఎవరు ఎన్ని అన్నా తన భార్య సీతాదేవే .... అన్న విషయాన్ని లోకానికి తెలియజేశారు. దీనిని బట్టి సీతాదేవి గురించి శ్రీరామునికి గల గొప్ప అభిప్రాయం తెలుస్తుంది.

    రాములవారు సీతాదేవిని అడవులకు పంపించిన తరువాత తానురాజ్యాన్ని పాలించినా చాలా సాధారణ జీవితం గడుపుతూ సీతమ్మ వారి లాగే భోగాలు లేని సాధారణ జీవితాన్ని గడిపారు.

    లవకుశులను రామునికి అప్పగించిన తరువాత సీతాదేవి భూదేవిని ఆశ్రయించటం గురించి.......మళ్ళీ సీతాదేవి రాజ్యానికి తిరిగి వచ్చినా ఎవరైనా ఏమైనా అంటే సమస్య మొదటికొస్తుంది. అవన్నీ ఆలోచించి రాములవారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సీతాదేవి ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు.

    ( అయితే సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. సీతాదేవి రాముని వద్ద ఉంటే మరింత బాగుండేదనీ నాకు అనిపిస్తుంది. )

    తన ఇంటికి తాను రాలేని పరిస్థితి సీతమ్మది...తన భార్యను తాను పిలవలేని పరిస్థితి రామయ్యది.

    రామాయణము నుంచి ప్రజలు అనేక విషయములను తెలుసుకోవచ్చు.

    ReplyDelete
    Replies
    1. తరువాత..రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల.. సంతానం రాజ్యాలను పరిపాలించారు.

      Delete
  2. లోకంలో ఉండే రకరకముల వ్యక్తుల మనస్తత్వమూ, వారి ప్రవృత్తి, వాటి వల్ల జరిగేసంఘటనలు, పరిణామములు ..ఇలా ఎన్నో మనకు తెలియని గొప్ప విషయములు పెద్దలు మనకు పురాణేతిహాసముల ద్వారా తెలియచేశారు...

    రాములవారు సీతాదేవిని అడవులకు పంపించిన తరువాత తాను రాజ్యాన్ని పాలించినా చాలా సాధారణ జీవితం గడుపుతూ సీతమ్మ వారి లాగే భోగాలు లేని సాధారణ జీవితాన్ని గడిపారు.

    సీతారాములు ఆదర్శ దంపతులు. వారు అంత ధర్మమూర్తులు కాబట్టే వారి కుమారులు లవకుశులు చక్కగా జీవించారు, రాజ్యాన్నీ పాలించారు.

    మరి రావణుని సంతానం అలా అయ్యారు.

    శ్రీ రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా కొంతమంది ఎంతో పరాక్రమవంతులు. వానరులు కూడా దేవాంశసంభూతులట.

    సాధారణ దృష్టితో చూస్తే ఎంతో క్రూరులు, బలవంతులైన రాక్షసులు ఎక్కడ ? సామాన్య బలం కలిగిన వానరులు ఎక్కడ ?

    ధర్మం అధర్మం పై విజయాన్ని సాధించిన కధ ఇది......

    రామతత్వం రావణతత్వం పై విజయాన్ని సాధించిన కధ ఇది......

    అందుకే రామాయణ పారాయణం ఎంతో శుభకరమని పెద్దలు తెలిపారు......

    ఎవరికయినా జీవితములో కష్టములు వస్తే ఆత్మహత్యలకు పాల్పడటం, లేక అధర్మాన్ని ఆశ్రయించటం వంటి పనులు చేయకుండా.. ఈ కధలను గుర్తు తెచ్చుకుని అంత గొప్పవాళ్ళే అన్ని కష్టాలు అనుభవించారు మనమెంత అని ధైర్యం తెచ్చుకోవాలి.

    వారు ధైర్య, సాహసములతో ధర్మంగా విజయాన్ని ఎలా సాధించారో మనమూ నేర్చుకోవాలి. ఎక్కడయినా, ఎప్పటికయినా ధర్మమే గెలుస్తుంది అని తెలుసుకోవచ్చు.

    అంతా దైవం దయ..............

    ReplyDelete