koodali

Friday, November 2, 2012

ఆధునిక పరికరాల వాడకం గురించి.........


  ఆధునిక  విజ్ఞానం  వల్ల  కొన్ని  లాభాలూ  ఉన్నాయి ....... పర్యావరణ  కాలుష్యం  వంటి  కొన్ని  నష్టాలూ  ఉంటున్నాయి.   కొన్ని  ఆధునిక  పరికరాల  అతి  వాడకం  వల్ల  ఆరోగ్యం,  పర్యావరణం  పాడైపోతుందని  పరిశోధకులు  తెలియజేస్తున్నా,   ప్రస్తుతం  ఆ  పరికరాలను  వాడకుండా  ఉండలేని  పరిస్థితిని   తెచ్చుకున్నాము  కదా  ! 


* పర్యావరణానికి  హాని  చేయని  విధంగా    టెక్నాలజీ  మారేవరకు ..   పర్యావరణాన్ని,  తద్వారా  మన  ఆరోగ్యాన్నీ  కాపాడుకోవాలంటే  సాధ్యమయినంతవరకూ    కొన్ని  జాగ్రత్తలన్నా   పాటించక  తప్పదు.



* మనం  రోజూ  ఎంతో  కొంత  ప్లాస్టిక్ కవర్స్  వాడుతుంటాము. . మనం  ఎంత  ప్లాస్టిక్   సంచులు  వాడకపోయినా ,  సూపర్  బజార్లో  వస్తువులను  ప్లాస్టిక్  కవర్లలోనే   ప్యాక్  చేస్తారు  కదా  !  ఇలా  వచ్చే  ప్లాస్టిక్  సంచులను   ఎప్పటికప్పుడు  బైట  వెయ్యకుండా  ఒక  పెద్ద  ప్లాస్టిక్  సంచీలో  వేసి  10  రోజులకొకసారో , నెలకొకసారో  ఆ  సంచి  నిండిన  తరువాత ,   సంచి  మూత  గట్టిగా  కట్టి ,   బైట  వేస్తే  అవి  గాలికి  కొట్టుకుపోయి  ఎక్కడపడితే  అక్కడకు  ఎగరకుండా  ఉంటాయి.  ప్లాస్టిక్  వ్యర్ధాలను    తీసుకువెళ్ళేవారికి  కూడా  పని  సులువవుతుంది.



 *  ప్రజలు  ప్లాస్టిక్   వాడకాన్ని   పూర్తిగా  మానేలోపు   కొన్ని   జాగ్రత్తలు  తీసుకుంటే  కొంతలో  కొంతన్నా  ప్లాస్టిక్  వల్ల  కలిగే  హాని  తగ్గుతుంది.
.

* అసలు  ప్రభుత్వమే  ప్లాస్టిక్  వేస్ట్  పడేయటానికి  రోడ్ల  పై  విడిగా  ప్లాస్టిక్  చెత్త బుట్టలను  ఏర్పాటు  చేయాలి. (అదేదో  సామెత  చెప్పినట్లు , అంత సంబరమే   ఉంటే  ఇక  చెప్పుకోవటం  ఎందుకూ . అనిపిస్తోందా..)


*  చిన్నప్పటినుంచి  నాకు  పుస్తకాలు,  వార్తాపత్రికలు  చదవటం  అంటే  చాలా  ఇష్టం.   అప్పుడు   ఎంత  చదివినా  నాకు   కళ్ళజోడు  పడలేదు. అయితే, నేను  టీవీలో  వచ్చే  వినోద  కార్యక్రమాలను  కూడా   చూస్తాను.   అందుకే  ఇప్పుడు  కళ్ళజోడు    కూడా  వచ్చింది.  టీవీలు,  కంప్యూటర్ల  వాడకం  పెరిగిన  తరువాత  ఇప్పుడు   చిన్నపిల్లలు   కూడా  కళ్ళజోళ్ళు వేసుకోవలసి  వస్తోంది  కదా !



* నేను  సెల్  ఫోన్ కన్నా  లాండ్  లైనే  ఎక్కువగా  వాడతాను.  e.. మెయిల్  సౌకర్యాన్ని   కూడా   తక్కువగా  వాడతాను.


*  కొద్ది  దూరాలకు  వాహనం  వాడకుండా   నడిచే  వెళ్ళటం  వల్ల  పెట్రొల్  ఆదా  మరియు  మనకు  ఆరోగ్యం. నేను  దగ్గర  ప్రాంతాలకు   చాలాసార్లు   నడిచే   వెళ్తుంటాను.



* వాషింగ్  మెషిన్  వాడకం  వల్ల  కరెంట్ ,  నీళ్ళు  ఎక్కువగా  వృధా    అవుతాయి  కదా  ! అందుకని   కొన్ని  దుస్తులు  మాత్రమే  మెషీన్లో  వేస్తాము.  మిగతావి  చేతులతోనే  ఉతుకుతాను.

 

* నేను  మిక్సీ  వాడతాను.  కొంతకాలం  క్రిందట  మేము  ఒక  అపార్ట్మెంట్లో  ఉన్నప్పుడు    చిన్నరోట్లో  నూరుతుంటే  క్రింది  పోర్షన్  వాళ్ళొచ్చి  రోలు  వాడొద్దని  వార్నింగ్  ఇచ్చారు.  శబ్దం  రాకూడదని  రోలు  క్రింద  పట్టా  కూడా  వేసే  వాడాను.  అయినా   ఆ  శబ్దానికి  వాళ్ళకు  తలనెప్పి  వస్తోందట. 



* పూర్వం  పెద్దవాళ్ళు  చక్కగా  రోట్లో  పప్పు  రుబ్బుకోవటం  వంటి     పనులు  చేసుకున్నా  కూడా   ఆరోగ్యంగా  ఉండేవారు.  ఇప్పుడు  మిక్సీలు  వంటివే  పనులు  చేసి  పెడుతున్నా,   చాలామంది  ఆడవాళ్ళకు  కీళ్ళనెప్పులు,  భుజాల  నెప్పులు     వంటివి  వస్తున్నాయి.  పూర్వం  మగవాళ్ళు    చాలా  దూరం  నడిచి  వెళ్ళినా  కూడా  ఆరోగ్యంగానే  ఉండేవారు.  ఇప్పుడు  వాహనాలు  వాడుతున్నా
కూడా   చాలా  మంది  మగవాళ్ళకు  కీళ్ళనెప్పులు,  కాళ్ళ నెప్పులు   వస్తున్నాయి.


 *  ఇప్పటి  ఆహారం , రసాయన  మందులతో   పెంచిన   ఆహారం  కదా  !  పాతకాలం  వాళ్ళు   సహజమైన  ప్రకృతి  సిద్ధమైన  ఆహారం  తిని  చక్కగా  పనిచేసుకునే  వారు.  అందుకే  వాళ్ళకి  కీళ్ళనెప్పులు  అవి  లేకుండా  ఆరోగ్యంగా  ఉండేవారు.



* కొందరు   ఫెళ్ళున  వెలిగిపోతూ   ఇల్లంతా  లైట్స్  వేసి  ఉంచుతారు  . అలా  కాకుండా    అవసరమైన   దగ్గరే  వేసుకోవాలి.   కరెంట్  ఆదా  అంటే,  సహజవనరుల  ఆదా...  తద్వారా  మనం  సమాజ  సేవ  చేసినట్లే  కదా!



* ఇప్పుడు  కరెంట్  కోత  గురించి  అందరూ  బాధ  పడుతున్నారు  కదా  !  పల్లెటూర్లలో  కరెంట్  ఉండదు  కానీ ,  పట్నాలలో  షాప్స్  చూడండి.  వాళ్ళు   ఇప్పుడు  కూడా  అవసరానికి  మించి , దేదీప్యమానంగా  లైట్స్   వాడుతూనే  ఉన్నారు. 


* పూర్వం  ఇన్ని  రకాల  ఆధునిక  పరికరాలు  లేవు  కాబట్టి,   చెత్త  కూడా  తక్కువగానే  ఉండేది. ఆ  చెత్త  కూడా  మట్టిలో  కలిసిపోయే  విధంగా  ఉండేది.  ఇప్పుడు  మనం  వాడే  ప్లాస్టిక్,   e...వ్యర్ధాలు   వంటి   అనేక  రకాల   వాడిపారేసిన   వస్తువుల   నిల్వలు    మట్టిలో  త్వరగా  కలవవు.  వాటిని  ఎక్కడ  పడేయాలో  తెలియదు.



* ఒక  వాన  పడితే  చాలు    చెత్తతో   రోడ్లన్నీ  మరింత  చీదరగా  తయారవుతున్నాయి.
దేశంలోని   పేదరికాన్ని  , అపరిశుభ్రతను  ......ఇంకా  ఇలాంటి  ఎన్నో  సమస్యలను    పోగొట్టడానికి  చిత్తశుద్ధితో   ప్రయత్నిస్తే ,  అప్పుడే  అభివృద్ధి  జరుగుతుంది.


............................... 
* దయచేసి   క్రింది  టపా  కూడా చదవండి.

* మితిమీరిన పారిశ్రామీకరణవల్ల నిరుద్యోగం , ఉద్యోగాలు పోవటం , ఇంకా పర్యావరణానికి హాని.......

ఇది పాత టపానే. కానీ మళ్ళీ వేయాలనిపించింది.
........................


ఈ రోజుల్లో నిరుద్యోగం , ఉన్న ఉద్యోగాలు పోవటం.... ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మితిమీరిన పారిశ్రామీకరణ వల్ల కూడా నిరుద్యోగసమస్య వస్తోందని నా అభిప్రాయమండి.

పనులన్నీ
యంత్రములే చేసేయ్యటం వల్ల మనకి చెయ్యటానికి ఇక పనులు ,ఉద్యోగాలు ఎలా వస్తాయి?


1. పాతకాలంలో ఇప్పటిలా ఇన్ని యంత్రాలు ఉండేవి కావు. ఉదా...వాళ్ళు ఒక వస్తువును తయారుచేయాలంటే ఒక వారం రోజులు సమయం తీసుకునేవారనుకుందాము. దీనివల్ల ఆ వారమంతా రోజూ చేతి నిండా పని ఉండేది. ఇలా చెయ్యటానికి ఎప్పుడూ పని ఉంటుంది.



అయితే ఇలా నెమ్మదిగా ఎక్కువ వస్తువులు తయారు చెయ్యలేము కాబట్టి, భూమి పైన ఎక్కువ చెత్త వస్తువులు పేరుకుపోకుండా పర్యావరణం శుభ్రంగా ఉంటుంది.



2. ఈ రోజుల్లో అదే వస్తువును యంత్రాల సహాయంతో ఒక గంట సమయంలోనే ఒక వంద తయారుచేస్తున్నారు. దానివల్ల ఏమి జరుగుతుందంటే ,.... పని త్వరగా అయిపోయి ఇక చేయటానికి పని ఉండదు . నిరుద్యోగం ఉంటుంది.

ఇంకా , ఇలా గుట్టలుగా వస్తువులను ఉత్పత్తి చేయటం వల్ల ఖనిజనిల్వలు ఖాళీ అయిపోవటం , భూమి పైన గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వస్తువులతో ఎన్నో సమస్యలు.



.కంపెనీలు ఇలా గుట్టలుగా వస్తువులు తయారు చేస్తాయి . ఇలా గుట్టలుగా వస్తువులను తయారుచేసిన తర్వాత వాటిని ఎవరైనా కొంటేనే వారికి లాభాలు వచ్చి ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలరు. ఎవరూ కొనకపోతే నష్టాలు వచ్చి జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను తీసివేస్తారు.


అలాగని ఎవరు మాత్రం ఎంతకని వస్తువులు కొంటారు? మనకు అప్పటికే ఇంటినిండా వస్తువులు ఉంటాయి, ఎన్నని కొంటాము? కొత్తవి కొనేకొద్దీ ఇల్లంతా గజిబిజి.

మా ఇల్లు ఇలాగే చూసినవన్నీ కొని, అలా కొన్నవాటితో కొంచెం గందరగోళంగా ఉంటుంది.వాటిని పారవెయ్యలేము.



పారవేసినా అవి ఎక్కడో ఒకచోట భూమిపైనే చెత్తలా ఉంటాయి గానీ మాయమయ్యేవి తక్కువ . అందుకని ఇప్పుడు ఎంతో అవసరమయితే తప్ప , కొత్తవి కొనటం మానేసామండి.

ఎవరికయినా కొంతకాలానికి ఇలాగే విరక్తి వస్తుంది. అంటే దీనిని బట్టి మనకి ఏమి తెలుస్తుందంటే,

1. వస్తువులను ఎవరూ కొనకపోతే , కంపెనీలకు నష్టం వచ్చి అందులోని వారికి ఉద్యోగాలు పోతాయి.

2. వస్తువులను కొంటే కంపెనీలకు లాభాలు వచ్చి ఉద్యోగాలు ఉంటాయి. కానీ,  భూమి ,పర్యావరణం మట్టికొట్టుకుపోతాయి.



3.అందుకే నాకు ఏమనిపిస్తుందంటేనండి ,పారిశ్రామీకరణ పూర్తిగా తప్పని అనటం లేదు. దానివల్ల కొన్ని లాభాల ఉన్నాయి. అయితే , మనకి కావలసినంత అంటే , మనిషి చేయలేని కష్టమయిన పనులకు యంత్రములను వాడుకోవాలి .

4. గుట్టలుగా వస్తువులను తయారుచేయటం మానాలి.

5. చేతి వృత్తులను ప్రోత్సహించాలి.

6. అంతగా వస్తువులు తయారుచేయటం అవసరం లేని.. అర్ధ శాస్త్రం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ , పర్యాటకం , ఆటలు , సంగీతం, వినోదం.. ఇలాంటివాటితో ఆర్ధికాభివృద్ధిని సాధించటానికి ప్రయత్నించాలి.


ఈ వినోదం లాంటివి మితిమీరి ప్రజలు తప్పుదారిన వెళ్ళకుండా , వారిలో సోమరితనం పెరగకుండా చూడాలి .


దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ లాంటివి తగ్గుతాయి. అన్నిటికన్నా కొత్త వస్తువులు కొనాలన్న మోజు ,వంటి ... మన కోరికలను కొంచెము తగ్గించుకోవాలి.



దైవభక్తి , వంటి  వాటి విషయంలో తప్ప ,....ప్రతి పనికీ ఒక పరిధి ( లిమిట్ ) ఉంటుంది. ఉదా.....ఆరోగ్యానికి మంచిది కదా అని విటమిన్ టాబ్లెట్స్ విపరీతంగా వేసుకుంటే అనారోగ్యం కలుగుతుంది.

 

అలాగే పెద్దలు చెప్పినట్లు , దేనినయినా ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి.. యంత్రములను వీలయినంత తగ్గించటం వల్ల అందరికీ పని దొరికే అవకాశం ఉంది. పర్యావరణం బాగుంటుంది.

* ఇంకా , మనము ఒళ్ళు వంచి పనులు చేసుకోవటం వల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది....

.............

అసలు అభివృద్ధి అంటే పరిశ్రమలు విపరీతంగా పెడితే అభివృద్ధి ఉన్నట్లా ? పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందటం అంటే సహజవనరులను విపరీతంగా వినియోగించటం. సహజవనరులు ఏర్పడాలంటే ఎన్నో వేల సంవత్సరాల కాలం పడుతుందట. సహజవనరులు అన్నీ మన అంతులేని కోరికల కోసం వాడేసుకుని రాబోయే తరాలకు ఖాళీ చిప్ప చేతికిస్తామా?(పొల్యూట్ అయిపోయిన ప్రపంచంతో సహా).



* ప్రజల పేదరికం పోవాలంటే సంపద అందరికి సమానంగా అందటం ముఖ్యం. అంతేకానీ పరిశ్రమలు విపరీతంగా స్థాపించటం వల్ల అభివృద్ధి జరగదు.

ఉన్న సంపదంతా కొందరు బడావాళ్ళు అందినంతవరకూ దోచేస్తుంటే, ఇక పేదరికం ఎలా పోతుంది ?

పారిశ్రామీకరణ వల్ల కొంతకాలం బాగానే ఉన్నట్లు కనిపించినా, అది బలుపు కాదు వాపు అని ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతటా ఆర్ధికమాంద్యం సమస్య చూస్తూనే ఉన్నాము కదా !


పారిశ్రామీకరణ తప్పుకాదు కానీ , ఆధునికవిజ్ఞానాన్ని ఎంతలో వాడుకుంటే మంచిదో అంతలోనే వాడుకోవాలి. అతి పనికిరాదు.... యంత్రాలే అన్ని పనులు చేసేస్తే, ఇక మనుషులకి మిగిలేది
నిరుద్యోగమే కదా!

.............



6 comments:

  1. మీరు చెప్పిన విషయాలు నిజమే.జాగ్రత్త వహించాలి

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మీ వ్యాఖ్యని ఇప్పుడే , కొత్త టపాను పొస్ట్ చేసిన తరువాత చూసాను. రిప్లై ఇవ్వటంలో ఆలస్యం అయినందుకు దయచేసి క్షమించండి.

      Delete
  2. chaalaa baaga cheppaaru...ilaa taamu paatistoo cheppe vishayaalu naaku chaalaa nachchutaayi anooradha gaaroo!...
    sandesam ichchetapudu paatistoo aa sandesam ivvaali tappa gaali kaburla sandesaalu viluva lenivani naa uddesyam...meeru prakruti parirakshanaki chese vaatilo chaalaa varaku memoo paatencheve...abhinandanalu meeku...@sri

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మీ వ్యాఖ్యని ఇప్పుడే కొత్త టపాను పొస్ట్ చేసిన తరువాత చూసాను. రిప్లై ఇవ్వటంలో ఆలస్యం అయినందుకు దయచేసి క్షమించండి.

      నిజమేనండి, ఈ రోజుల్లో చాలామంది పర్యావరణాన్ని రక్షింటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తున్నారు.

      Delete
  3. మంచి విషయాలు చక్కగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మీ వ్యాఖ్యని ఇప్పుడే కొత్త టపాను పొస్ట్ చేసిన తరువాత చూసాను. రిప్లై ఇవ్వటంలో ఆలస్యం అయినందుకు దయచేసి క్షమించండి.


      Delete