koodali

Saturday, November 10, 2012

కొందరు ప్రజల చిత్రమైన ప్రవర్తనలు....


ఈ  రోజుల్లో  చాలామంది   చిత్రవిచిత్రంగా  ప్రవర్తిస్తున్నారు. . భక్తులం  అని  చెప్పుకుంటూనే   భక్తులైనవారు  చేయకూడని  విధంగా  ప్రవర్తిస్తున్నారు.

   పురాణేతిహాసాలలోని  అవతారమూర్తుల  గురించి  తమకు  తోచినట్లు  కామెంట్  చేయటం   చాలామందికి   ఇప్పుడొక  ఫేషన్  అయిపోయింది.


    రామాయణ గాధ జరిగి తరాలు గడిచినా,  అప్పటి వారి ప్రవర్తన  గురించి...ఇప్పటికీ  ప్రజలు  చర్చించుకుంటున్నారు  కదా ! 

 ఇవన్నీ  ఊహించి,   తరువాత  తరాలవారికి    ఆదర్శంగా  ఉండటానికి  ఆ  అవతారమూర్తులు    తమ  జీవితాల్లో  ఎన్నో  త్యాగాలు  చేసారు.

1....... ఇప్పుడు  ఒకాయన  రాముడు  మంచి  భర్త  కాదు  అన్నారు. (  సీతాదేవిని  శ్రీ రాముడు అడవులకు  పంపినందుకు ..)

2......అప్పుడు  ఒకాయన  రాముడు  మంచి  భర్త  కాదు  అన్నారు. (  సీతాదేవిని  శ్రీ రాముడు  ఇంటికి  తీసుకువచ్చినందుకు.  )

కొందరు  లోకులు  ఎటుపడితే  అటు  మాట్లాడతారు.

1..  భార్యను    ఇంటికి  తీసుకురావటం   తప్పు  ...  అంటారు  కొందరు.

2...  భార్యను  అడవికి  పంపించటం  తప్పు  ....  అంటారు    కొందరు.

3.  అసలు  సీతారాములు  ఏం చేసి ఉంటే  ,  లోకంలోని  అందరూ  మెచ్చుకునేవారో ? 


*  తప్పనిసరి  పరిస్థితుల్లోనే ,  భవిష్యత్  తరాలను  కూడా  దృష్టిలో  ఉంచుకునే ,  ఆ  నాడు  సీతారాములు  అలాంటి  త్యాగాలు  చేసారు.
..............


*    కొన్ని  సినిమాల్లో  కూడా   మనం  పూజించే  దేవుళ్ళనే  పాత్రధారులుగా  చేసి  కామెడీ  చేయిస్తున్నారు. మనం కూడా   అలాంటి  సినిమాలను  విరగబడి  చూస్తుంటాం.  పగలబడి  నవ్వుకుంటున్నాం. (  నేను  కూడా  ఆ  సినిమాలను  చూసి  నవ్వాను  లెండి..),

అయితే  ఇప్పుడు  ఏమనిపిస్తుందంటే,  అలా    చేయటం  తప్పనిపిస్తోంది.

*దేవుళ్ళంటే   భయభక్తులు  లేకుండా    సినిమాల్లో  కామెడీ  పాత్రలుగా    యమధర్మరాజు  వంటి   దేవుళ్ళను  చూపించటం    అనేది  ఎంతో  పాపం .   భక్తులైన  వారు  ఇలా  దేవుళ్ళను  తక్కువ  చేయటం  అనేది  ఎంతో  తప్పు.

..............................
పురాణేతిహాసాలలోని  విషయాల   గురించి  నేను  వ్రాసిన   కొన్ని   పాత  టపాలు...వ్యాఖ్యలలోని  కొన్ని    అభిప్రాయాలు... .....మరియు  ఇప్పటి   కొన్ని  అభిప్రాయాలు...

*  రామాయణం లోని పాత్రలు,   వారి అవతార విశేషాలు,    వారి పూర్వ కర్మ విశేషములు,    శాపములు ......ఇవన్నీ చాలా.....  పెద్ద కధ . ఇవన్నీ ముందే   ఒక ప్రణాళిక ప్రకారం   జరిగిందని   పెద్దలు చెప్పటం  జరిగింది.


* రాములువారు  ఏం  తప్పు చేశారు ?  సీతాపహరణం తరువాత రాములవారు ఎంతో శోకించి , ఆమెకోసం ఎంతో ఆరాటపడి,   ఎన్నో కష్టాలు పడి   భార్యను   వెదికి తెచ్చుకున్నారు.   రాముడు   భార్యను   రక్షించుకున్న మంచి భర్త.    ఆ సందర్భములో ఎంతోమంది   రాక్షసులను కూడా సంహరించారు..


* ఈ ఆధునిక  కాలంలో అయినా , ఎంతమంది మగవాళ్ళు అలా   చేయగలరు ?  కొంతమంది  అయితే ,  భార్యను వెదకటం మాని ,  మరొక వివాహం   చేసేసుకుంటారు.

 *
ఒక భర్తగారాములవారు సీతాదేవిని ....లంక నుండి  రక్షించి  తీసుకు వచ్చారు.

ఒక రాజుగా,   ఒక  పామరుని   అభిప్రాయాన్ని ప్రజల అభిప్రాయంగా భావించి ... సీతాదేవిని అడవులకు పంపించవలసి వచ్చింది.

* అశ్వమేధ యాగం   సందర్భంలో  రాములవారిని  మళ్ళీ  వివాహం  చేసుకొమ్మని  కొందరు   సలహా  ఇచ్చారట.

*  అయితే,  అశ్వమేధ యాగం సందర్భంలో రాములవారు సీతాదేవి యొక్క బంగారు ప్రతిమను భార్యగా భావించటం ద్వారా .... ఎవరు ఎన్ని అన్నా,  తన భార్య సీతాదేవే .... అన్న విషయాన్ని లోకానికి   దృఢంగా   తెలియజేశారు.

* ఈ  విషయాన్ని  గమనించితే,   సీతాదేవిని  గురించి శ్రీరామునికి గల గొప్ప అభిప్రాయం తెలుస్తుంది.

* సీతమ్మవారు కూడా ,   రాజభోగాలు   అన్నీ  వదలి    భర్తతోపాటు అడవులకు వెళ్ళారు. ఎన్నో  కష్టాలను    అనుభవించారు.   సీతాదేవి  ఎంతో ఉత్తమ ఇల్లాలు.



* సీతమ్మను అడవులకు పంపించటం గురించి . .. ఇక్కడ గమనించవలసినది ఏమంటే, ఆ పామరుడు అలా అన్న తరువాత మాత్రమే రాములవారు భార్యను అడవులకు పంపించారు.



* ఒక వ్యక్తి అలా అన్న తరువాత నెమ్మదిగా మిగిలిన ప్రజలలో కూడా ఆ ఆలోచనలు వచ్చే ప్రమాదముంది. (పైకి అనకపోయినా.) ....అందుకే భవిష్యత్తులో దీనిపైన వాదోపవాదములు, అనవసర చర్చలు, అపార్ధములు రాకుండాను, ఒక్కోసారి కొంతమంది అవకాశవాదులు తమ చెడ్డపనులకు ఇలాంటి సంఘటనను తమకు అనుకూలంగా మలచుకుని అధర్మానికి పాల్పడకుండాను,ఎన్నో  రకాలుగా ఆలోచించి,   ప్రజల క్షేమం కొరకు సీతారాములు తమ జీవితాన్ని, సంతోషాలను త్యాగం చేశారు.


* సీతమ్మవారిని అడవులకు   పంపిన    తరువాత రాములవారు    ప్రజల కొరకు రాజ్యాన్ని పాలించినా..తాను రాజభోగాలకు    దూరంగా సామాన్యంగా జీవించారు .


 ( సీతాదేవి అడవిలో ఏ విధంగా నిరాడంబరంగా జీవిస్తుందో అలాగ). 

 ( హంసతూలికా తల్పం పైన శయనించటం కాకుండా , నేలపై  దర్భలు  పరిచిన  తల్పంపైన  శయనించటం లాంటివి.)
....................................


* సీతాదేవి లవకుశులను రాములవారికి అప్పగించి,  తాను భూదేవి ఒడిలోకి వెళ్ళిపోవటం గురించి నాకు ఇలా అనిపిస్తుంది....


అగ్నిపరీక్షలో నెగ్గిన తరువాత సీతాదేవిని   ఇంటికి తెచ్చుకున్నా కూడా ........ కొంతమంది ప్రజలు ఏదేదో మాట్లాడారు  కదా  !    అప్పుడు   సీతాదేవిని రాములవారు అడవికి పంపించటం జరిగింది.

ఇప్పుడు,   లవకుశులతో పాటు సీతాదేవి కూడా   రాజ్యానికి తిరిగి  వస్తే,

ఒకవేళ ,మళ్ళీ కొందరు ప్రజలు ముందులా మాట్లాడితే?
అప్పుడు సమస్య   మళ్ళీ మొదటికొస్తుంది. ఇవన్నీ ఆలోచించి ,
ఆ ఇబ్బంది  ఎదురు  కాకుండా   సీతమ్మవారు  అలా త్యాగం చేసి ఉంటారు.

*  తన ఇంటికి   తాను వెళ్ళలేని పరిస్థితి సీతమ్మది ....

*తన భార్యతో తాను జీవించలేని పరిస్థితి రామయ్యది.....

 ( ఇది ఎంత విచిత్రమైన విపరీత పరిస్థితి ! )

* అయ్యో  ! సీతాదేవి  భూదేవి  ఒడిలోకి  వెళ్ళిపోకుండా  ఉంటే   బాగుండేది. అనిపిస్తుంది.  వాల్మీకి  వారి  ఆశ్రమంలో  ఉంటే ,  భవిష్యత్తులో  పరిస్థితులు  చక్కబడేవేమో ?  అని  కూడా  అనిపిస్తుంది.

* అయితే,  అప్పటికే  జీవితంలో  ఎన్నో  కష్టాలను  సహించి,  సమీపభవిష్యత్తులో   చక్కటి  భవిష్యత్తు  ఉండే  ఆశ  కనిపించక,   ఎన్నో  విధాలుగా  ఆలోచించి,    వేరే  మార్గాంతరం  లేక  సీతాదేవి  ఆ  నిర్ణయం  తీసుకుని  ఉండవచ్చు  .  అనిపిస్తుంది.


*  సీతమ్మవారు ఎంత త్యాగమూర్తియో   రాములవారు   కూడా  అంతే  త్యాగమూర్తి.

*   రాముల వారు మళ్ళీ వివాహం చేసుకోలేదు. 

రాములవారు ఆదర్శ పుత్రుడు, ఆదర్శ సోదరుడు,, ఆదర్శ భర్త, ఆదర్శ తండ్రి, ఆదర్శ పాలకుడు, ఆదర్శవ్యక్తి, సీతమ్మవారు అన్నింటా ఆయనకు సాటి వచ్చే ఆదర్శ వ్యక్తి.

* సీతారాములు ఆదర్శ దంపతులు.


* మనిషిగా  జన్మను  ధరించిన  తరువాత  అవతారమూర్తులు  కూడా  మానవులకు  వలే  భావాలను  ప్రకటిస్తారు.
.....................
 
*  లక్ష్మణుల  వారు  కూడా  ఎంతో  ఆదర్శమూర్తి..  వారు  తనకు  వనవాసం  చేయవలసిన  అవసరం  లేకపోయినా ,  అన్నగారి     కష్టంలో  పాలు  పంచుకోవటానికి  సాయంగా  తానూ  త్యాగాలు  చేసారు.  లక్ష్మణుని  భార్య  ఊర్మిళాదేవి  కూడా  ఆదర్శ పత్ని.  ఊర్మిళాలక్ష్మణులు   కూడా  ఆదర్శ దంపతులు.

లక్ష్మణుడు  కూడా  సీతాదేవిని  అన్వేషించుటలో ,  ఇంకా    యుద్ధం  జరిగినప్పుడు  ఎంతో  శ్రమించారు. హనుమంతుడు  మొదలైన  వారు   కూడా   సీతాన్వేషణలో  ఎంతో  శ్రమించారు.

........................
* రామాయణ  గాధ  నుంచి  మనం  ఎన్నో  విషయాలను  నేర్చుకోవచ్చు. వాటిలో  కొన్ని.....

* శ్రీ  రామునికి  తెల్లవారితే పట్టాభిషేకం అనుకుంటే......దాని బదులు 14 ఏళ్ళ అరణ్యవాసం చేయవలసి రావటం.....

* అరణ్యవాసం ముగింపుకు వచ్చిందిలే    అనుకుంటే .....అంతలోనే    సీతాపహరణం జరగటం..

*  సరే ,  రావణవధ జరిగింది . సీతారాములు రాజ్యానికి తిరిగి వచ్చి.... ఇక అంతా సవ్యంగా ఉందిలే అనుకునేంతలో......కొందరు ప్రజల మాటలవల్ల  సీతాదేవిని   అరణ్యాలకు పంపవలసి రావటం...

* మరి   కొంతకాలానికి సీతాదేవిని, లవకుశులను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చూసిన తరువాత.... పిల్లలను చూసిన ఆనందములో రాములవారు ఉండగానే ..సీతాదేవి భూమాతను ఆశ్రయించటం.

*  ఇలా ఎన్నో ఆటు....పోట్లు, ఆశ....నిరాశలతో కూడిన  జీవితం. 


*  రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా కొంతమంది ఎంతో పరాక్రమవంతులు. వానరులు కూడా దేవాంశసంభూతులట.

*
అయితే,  సాధారణ దృష్టితో చూస్తే ఎంతో క్రూరులు, బలవంతులైన రాక్షసులు ఎక్కడ?   సామాన్య బలం కలిగిన వానరులు ఎక్కడ ?

* ధర్మం అధర్మం పై   విజయాన్ని సాధించిన   కధ ఇది........

*రామతత్వం  రావణతత్వం పై  విజయాన్ని సాధించిన కధ ఇది......

* అందుకే ,  రామాయణ పారాయణం   ఎంతో శుభకరమని పెద్దలు  తెలిపారు......


*  ఎవరికయినా జీవితములో కష్టములు వస్తే ,  ఆత్మహత్యలకు పాల్పడటం, లేక  అధర్మాన్నిఆశ్రయించటం  వంటి  పనులను   చేయకుండా ఈ కధలను గుర్తు తెచ్చుకుని ,  అంత గొప్పవాళ్ళే అన్ని కష్టాలను  అనుభవించారు .  మనమెంత..... అని ధైర్యము తెచ్చుకోవాలి.

* వారు ధైర్య, సాహసములతో ధర్మంగా విజయాన్ని ఎలా  సాధించారో.. మనమూ నేర్చుకోవాలి. 


*ఎక్కడయినా, ఎప్పటికయినా , చివరకు   ధర్మమే గెలుస్తుంది అని తెలుసుకోవాలి.

* వ్రాసిన  విషయాలలో   ఏమైనా   పొరపాట్లు   ఉంటే   దయచేసి  క్షమించాలని   దైవాన్ని   ప్రార్ధిస్తున్నాను.

* అంతా  భగవంతుని దయ.
 

5 comments:

  1. హిందూ పురాణాలను, దేవతలను, అవతార పురుషులను, పురాణ స్త్రీలను, నేటి స్త్రీలను చులకనగా చూసే ఒక వర్గం బయలుదేరింది నేటి కాలంలో, వీరూ కాలంలో కలిసిపోతారు, తప్పదు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      హిందూ పురాణాలను, దేవతలను, అవతార పురుషులను, పురాణ స్త్రీలను, నేటి స్త్రీలను చులకనగా చూసే ఒక వర్గం బయలుదేరింది నేటి కాలంలో, వీరూ కాలంలో కలిసిపోతారు, తప్పదు....చక్కగా చెప్పారు.
      ............

      వాక్స్వాతంత్ర్యమైనా, మరే స్వాతంత్ర్యమైనా సమాజంలో ప్రతిదానికి కొన్ని నియమాలు, హద్దులుంటాయన్న విషయాన్ని పట్టించుకోవటం లేదు కొందరు.

      Delete

  2. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.

    ReplyDelete
  3. కృతజ్ఞతలండి.
    మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.

    ReplyDelete
  4. ఈ రోజుల్లో,పోటీని,ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారికి ఇటువంటి మంచి విషయాలు చెప్పి,వారిని సన్మార్గంలో నడిపించడం అత్యంత అవసరం.

    ReplyDelete