koodali

Friday, February 3, 2012

ఈ సమస్యను మీరైతే ఎలా పరిష్కరిస్తారు ?

 
నా  వ్యాఖ్యలను దయచేసి .. " నాకు తెలిసినంతలో....ఉడుతా భక్తిగా... "  టపాలో  చదవండి.
*************

దైవం యొక్క ముఖభాగం నుంచి బ్రాహ్మణులు, చేతుల నుంచి క్షత్రియులు, ఊరుభాగాలనుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు వచ్చారంటారు. మనిషి జీవితం సజావుగా సాగాలంటే శరీరంలోని అన్ని భాగాలు ముఖ్యమే. (అవసరమే. )

పాదాలు కూడా ముఖ్యమైనవే. దేవుని పాదాలకు మనం మ్రొక్కటం లేదా ? అలాగే సమాజానికి అన్ని వర్గాల వాళ్ళూ ముఖ్యమే.

ఎవరి వృత్తిని వారు చేసుకుంటూ అందరూ గౌరవంగా , భోగభాగ్యాలతో జీవించాలని పెద్దల ఉద్దేశ్యం అని అనుకోవచ్చు కదా !
.................................................

ఒక ఊరి పాఠశాలలో ఒక నాటకం వేస్తున్నారు. అందులో నాలుగు పాత్రలున్నాయి.

రాజు., మంత్రి, కోశాధికారి, భటుడు..... ఇలా నాలుగు వేషాలున్నాయి.

నాటకంలో నటించటానికి విద్యార్ధులను పిలిచారు టీచర్లు.

రాజు పాత్ర, మంత్రిపాత్ర, కోశాధికారి పాత్రలకు పిల్లలు ఒప్పుకున్నారు. కానీ భటుడు పాత్ర వెయ్యటానికి మాత్రం ఏ పిల్లవాడు ఒప్పుకోలేదు.

కానీ భటుడు పాత్ర లేనిదే కధ నడవదు కదా !.

టీచర్లకు ఏం చెయ్యాలో తెలియలేదు. .

ఇదంతా చూస్తున్న చుట్టుప్రక్కల వారిలో ఒకాయన అన్నారు ...... నాలుగు వేషాలను నలుగురు పిల్లలు తప్పక వెయ్యాలని కఠినంగా ఆజ్ఞాపించండి. అన్నారు.

ఇంకొకాయ.. మంచి పనులు చేసిన పిల్లాడికి రాజు వేషము , తక్కువ మంచి పనులు చేసిన పిల్లలకి మంత్రి, తరువాత కోశాధికారి, తరువాత భటుడు ...ఇలా వేషాలు ఇయ్యండి అన్నారు,.

ఇంకొకాయన వచ్చి .. అందరికీ సమాన హోదా, జీతభత్యాలు ఇస్తే రాజు, బంటు అని తేడా ఉండదు కదా ! అప్పుడు పిల్లలు ఏ వేషం వెయ్యటానికైనా సంతోషంగా ఒప్పుకుంటారు అన్నారు.

ఇది విన్న కొందరు అందరికీ సమానహోదా, జీతభత్యాలు ఎలా ఇస్తాం ? ...సమానంగా .మనిషిగా గౌరవిస్తాం అంతే అన్నారు. 

ఇది విన్న ఇంకొకరు .... జీతభత్యాలు సరిపడా లేకుండా మనిషిగా గౌరవిస్తే కడుపు నిండుతుందా ? అన్నారు. .

ఇలా ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ...ఇక నాటకం సంగతి వదిలేసి చుట్టుప్రక్కల చేరిన జనం వాదులాడుకోవటం మొదలుపెట్టారు.

అంతా అంతులేని గందరగోళం. అదొక అంతులేని కధలా సా.....గిపోయింది. . ఎవరి వాదన వారిది.

ఈ సమస్యను మరి మీరైతే ఏం సలహా ఇస్తారు .? .

ఈ గొడవ ఇలా ఉంటే ... అందరూ రాజు అవ్వాలనే అనుకుంటే నాటకం నడిచేదెలా ? ఇప్పుడు భటుడి వేషం ఎవరు వేస్తారో ? అని బెంగపట్టుకుంది . టీచర్ కు.

. సమాజంలో కులాలు లేక వృత్తులు కూడా ఇలాంటివే.
కొన్ని ఉద్యోగాలు చెయ్యటానికి ఎవరూ ముందుకు రారు మరి. .....
.............................................

పూర్వం అయితే మనుషుల్లో అడ్జస్ట్ మెంట్ అనే గుణం ఉండేది. ఇప్పుడు సమాజంలో సర్దుకుపోవటం అనే గుణం తగ్గిపోయి పోటీ పెరిగిపోయింది ! అదే అసలు సమస్య.

కులాల సంగతి అలా ఉంచితే అందరూ ఒకటే అనే విషయం ఆచరణలో సాధ్యమా ?

ఒక ఆఫీసులో చైర్మన్, మానేజర్, అటెండర్ అందరూ అవసరమే. అందరమూ చైర్మన్లమే అవుతాము ... అంటే ఆఫీసు నడిచేదెలా ?

ప్రతిభ అనేది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి వృత్తికి ఉంటుంది. ఒక నర్స్ కు రోగులకు సేవ చేయటంలో ఎంత ప్రతిభ అవసరమో.. డాక్టరుకు వైద్యం చేయటంలో అంతే ప్రతిభ అవసరం.

ఒక సంస్థకు చైర్మన్, పై స్థాయి ఉద్యోగులు, క్రింది స్థాయి ఉద్యోగులు ఎంత అవసరమో సమాజానికి కూడా అన్ని రకాల వాళ్ళూ అవసరమే అనిపిస్తుంది.

  హోదా,  జీతాలలో విపరీతమైన  తేడాలు  లేనప్పుడే  ఈ అసమానతలు తొలగిపోతాయి. మరి ఇలా చేయటానికి ఎందరు ఒప్పుకుంటారు ?

ఎవరి ప్రతిభ, అర్హతను బట్టి వారికి హోదా, జీతాలు ఇవ్వటం అన్నది సరైనది అయినప్పుడు... ఎవరి పూర్వకర్మను ( పాపపుణ్యాలను ) బట్టి వారికి జన్మలు వస్తాయి అన్నది కూడా సరైనదే కదా ..
 
 
 

18 comments:

  1. మీరే అన్నట్లుగా అన్ని పాత్రలూ సమాన ఎరుక ఉన్నప్పుడూ మిగిలిన "అందరూ" అలాగే ప్రవర్తించినప్పుడు అసలీ సమస్యే తలెత్తదు. తరువాత రోజునుంచీ ఆ భటుడి పాత్రను పోషించిన విద్యార్ధికి హేళనలు, అవమానాలు తప్పలేదనుకోండి అప్పుడు బలవంతంగా ఎవరినో ఒకరిచేత ఆపాత్రను పోషింపచేయక తప్పదు.

    సరే భటుడి పాత్రను ఇంకొకరు చిన్నచూపుచూడకుండా చెయ్యడం మనవల్ల కాదంటారా. అప్పుడు రెండు solutions ఉన్నాయ్

    1) ఈసారి భటుడి పాత్ర పోషించడానికి ఒప్పుకున్న విధ్యార్ధికి తరువాతి సంవత్సరం రాజు పాత్ర పోషించడానికి అవకాశమిస్తామని ఒప్పించి అది నెరవేర్చుకోవాలి.
    2) రాజు పాత్ర పోషించడానికి ఆ విధ్యార్ధికుండవలసిన అర్హతలేమిటో నిర్ణయించి అవి సాధించమని ప్రోత్సహించాలి. అర్హతలు అన్నాంకదా అని పూర్వజన్మ అంటూ అర్ధంలేని వాదనలు చెయ్యకుండా ఉంటే సరి.

    పూర్వజన్మ విషయానికే వస్తే ఒక్క హిందూమతం అనేగాకుండా దాదాపు దాదాపు అన్నిమతాలు. ఆ "భటులు" తిరగబడకుండా ఉంచడానికి వాడిన ఒక cunning strategy. దాన్ని ఎంతబాగా ప్రచారం చేశారంటే "అదికాక ఇంకేమయ్యుంటుంది?" అని ఆలోచించడంకూడా చాలా పిచ్చి పని అనిపించేలా.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      ( తరువాత రోజునుంచీ ఆ భటుడి పాత్రను పోషించిన విద్యార్ధికి హేళనలు, అవమానాలు తప్పలేదనుకోండి అప్పుడు బలవంతంగా ఎవరినో ఒకరిచేత ఆపాత్రను పోషింపచేయక తప్పదు.)

      ఆ భటుడి పాత్రను పోషించిన విద్యార్ధికి హేళనలు, అవమానాలు రాకుండా చూడవలసిన బాధ్యత టీచరుదేనండి. ...... సమాజంలో అయితే రాజుది. బలవంతంగా భటుడి వేషం వెయ్యమంటే ఎవరూ వినరేమో అనిపిస్తుంది. ( ఇప్పుడు అదే ప్రాబ్లం .)


      1) ఈసారి భటుడి పాత్ర పోషించడానికి ఒప్పుకున్న విధ్యార్ధికి తరువాతి సంవత్సరం రాజు పాత్ర పోషించడానికి అవకాశమిస్తామని ఒప్పించి అది నెరవేర్చుకోవాలి.

      కానీ, అప్పటికే రాజుగా ఉన్న వ్యక్తి ఏ బాధ్యతను నిర్వహించాలి అన్నది ప్రశ్న అవుతుంది. నిజజీవితంలో అయితే ఇలా చేయటానికి రాజ్య రక్షణ దృష్ట్యా రాజు ఒప్పుకోరు.

      ఒక సంస్థలో అయితే చైర్మన్ గా ఉండే వ్యక్తి తాను చైర్మన్ బాధ్యతలనుంచి తప్పుకుని సాధారణ ఉద్యోగిగా ఉండటానికి ఒప్పుకోరు.

      ఒక సంవత్సరం ఒకరు .......తరువాత ఇంకొకరు ..... ఇదంతా ఆచరణలో కుదరదేమో అనిపిస్తుందండి. ఇలా అయితే వ్యక్తులు ఏ వృత్తి లోనూ ప్రావీణ్యాన్ని పొందలేరు. ఏ బాధ్యతను సరిగ్గా నిర్వహించటానికి కుదరదు అనిపిస్తుందండి.


      2) రాజు పాత్ర పోషించడానికి ఆ విధ్యార్ధికుండవలసిన అర్హతలేమిటో నిర్ణయించి అవి సాధించమని ప్రోత్సహించాలి.

      మీరన్నట్లు రాజు పాత్ర లభించాలంటే అర్హతలేమిటో నిర్ణయించి అవి సాధించమని ప్రోత్సహించాలి. వాటితోపాటు జీవితంలో ఎన్నో పుణ్యకార్యాలు చేసి కూడా అర్హతను సాధించుకోవాలి అని పెద్దలు చెప్పటం జరిగింది.

      Indyan Minerva గారూ నేను మీ వ్యాఖ్యకు ఇలా జవాబులు వ్రాయటం గురించి నేను వాదిస్తున్నానని తప్పుగా అనుకోవద్దండి..

      మీవ్యాఖ్య ద్వారా అభిప్రాయాలు చెబుతున్నాను అంతే. ఈ విషయాలను అందరూ ఆలోచిస్తారని ఇదొక మంచి చర్చ అంతేనండి. ..

      Delete
    2. ఫర్వాలేదండీ. నేనూ చర్చగానే భావిస్తున్నాను.

      క్రిందటి తరగతిలో చదవలేదు కాబట్టి, ఇప్పుడు ఫెయిలయ్యావు అని చెప్పడం, క్రిందటి జన్మలోని పాపఫలం చేత ఇలా ఈజన్మలో ఇలా ఉన్నావు అని చెప్పడం ఒకటవ్వవండీ. మొదటిదాన్ని భౌతికంగా verify చెయ్యవచ్చు. రెండవదాన్ని verify చెయ్యలేమి and దన్ని నమ్మాలంటే ఒక మతం ఆసరా కావాలి. ఆమతాన్నే కాదన్నవాళ్ళు ఈ కర్మఫలాలను నమ్మాల్సిన అవసరంలేదుకదా. ఈ జీవితంలో (జన్మలో) చేసిన మంచి/చెడ్డ పనులు మనల్ని ప్రభావితం చేస్తాయి నిజమే కానీ ఎప్పుడో క్రిందటి జన్మలో పాపం చేశావు కాబట్టి ఇప్పుడిలా ఉన్నావు, ఇలాగే ఉండాలి అనేది సరైనదెలా అవుతుంది చెప్పండి? ఏమో క్రిందటి జన్మలో కూడా మంచిపనులే చేసినప్పటికీ ఇప్పుడు చుట్టు ఉన్నవాళ్ళు దుర్మార్గులై హింసిస్తుండవచ్చుకదా. వాళ్ళే తప్పు తమమీదకు రాకుండా ఉండటానికి ఇలా కర్మఫలం పేరుతో నాతకాలాదుతూ ఉండుండవచ్చుకదా.

      అసలు రాజునెవరు ఎన్నుకుంటారు? రాజు తప్పుచేస్తే శిక్షించేదెవరు? అదే రాజును ప్రజలే ఎన్నుకుంటే రాజు తప్పుచేస్తే కనీసం శిక్షించే(పదవీచ్యుతుణ్ణి చేసే) అవకాశమైనా ఉంటుంది కదా. చైర్మన్ ని కూడా చాలా కంపెనీల్లో ఎన్నుకుంటారుకదండీ. ఒకవేళ వంశపారంపర్యంగా అయాడు అనుకున్నా, అతనికంటె సమర్ధుడు ఆ పసవిని అలంకరించవచ్చుకదండీ. మరి వర్ణ వ్యవస్థలో ఇలా promote అయ్యే అవకాశమే లేదు కదా.

      మీరు "మన" అని చెప్పి సమర్ధించాలని చూస్తున్నారులా ఉందిగానీ. ఈ వ్యవస్థ వల్ల బాధలనుభవించినవాళ్ళ వైపునుంచి ఆలోచించడానికి కూడా మీరు సిధ్ధంగాలేరు. మళ్ళి చెబుతున్నానండీ "పురాణ మిత్యేవ న సాధుసర్వం" అన్నాడు కాళిదాసు. పాతవైనంత మాత్రాన, "మన"వైనంత మాత్రాన అవన్నీ మంచికానఖ్ఖర్లేదు. నిజానికీ లోపాలు అన్ని వ్యవష్తల్లోనూ ఉన్నాయి. వాటిని అంగీకరించక అవి తమకుతామే చేటుచేసుకుంటున్నాయి. ఇక వర్ణవ్యవస్థ విషయానికే వస్తే (మనస్ఫూర్తిగా అన్నారోలేదో తెలీదుగానీ) "ఇది బాధాకరం" అని అభిప్రాయం వ్యక్తం చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మీరు అదే మంచిది, అలా ఉండలేకపోతున్నామే అని బాధపడుతున్నట్లుగా ఉంది. ఇది చాలా ఆస్చర్యకరంగా ఉంది.

      ఇలాంటి వ్యవస్థే "మన"ది కాక "ఇంకొకరిది" అయ్యుంటే దాన్ని మీరు ఖండించుండేవారుకదా?

      Delete
    3. పూర్వం రోజుల్లో లాగ వారసత్వంగా వచ్చే వృత్తులు చేయవలసి రావటం అన్యాయం అంటున్నారు.

      ఈ రోజుల్లో కూడా డాక్టర్లు తమ పిల్లల్ని డాక్టర్లుగానూ, రాజకీయనాయకులు, వాణిస్యసంస్థ అధిపతులు, వాళ్ళ వాళ్ళ సంతానానికే తమ తరువాత బాధ్యతలను అప్పగిస్తున్నారు కదా !

      డాక్టర్లు తమ పిల్లలకు డాక్టర్ చదవటం ఇష్టం లేకపోయినా లక్షల్లో డొనేషన్ కట్టి చదివిస్తుంటారు. ఎందుకంటే తమ తరువాత అప్పటివరకూ తాము నడుపుతున్న హాస్పిటల్స్ ఇతరులకు కాకుండా తమ సంతానమే చూసుకుంటారు కదా ! అని.


      అలాగే పెద్ద వాణిజ్యసంస్థ అధిపతులు కూడా తమ సంస్థ యొక్క బాధ్యతలను తమ తరువాత పిల్లలకే అప్పగిస్తుంటారు.

      ఇవన్నీ ఒకరకంగా కులవృత్తులవంటివే.


      నేను మతాన్ని పూర్వజన్మలను నమ్ముతానండి.

      ఆధునిక శాస్త్రవేత్తలు ప్రతిచర్యకు....ప్రతిచర్య ఉంటుందని నమ్ముతున్నట్లు .... మనం చేసిన ప్రతి కర్మకు తగ్గ ఫలితం ఉంటుందని నేను అనుకుంటున్నాను.

      అంటే చెడ్డపని చేస్తే చెడ్డ ఫలితం..మంచిపని చేస్తే మంచి ఫలితం.

      ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పాలకుల్ని మనమే ఎన్నుకుంటున్నాము.

      అవినీతిపరులైన పాలకులను పదవీచ్యుతులను చేయటం మాట అటుంచి ఆన్నాహజారేలాంటి వాళ్ళకు కూడా అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదంటున్నారు.

      ఇంక సామాన్యులు ఏం చేయగలరు ?

      వర్ణవ్యవస్థ ఉన్నా లేకపోయినా మనుషుల్లో స్వార్ధం ఉన్నంతకాలం ధనవంతులు పేదవారిని తక్కువగా చూస్తూనే ఉంటారండి.


      నేను కుల వ్యవస్థ ఉండితీరాలని అనటం లేదండి. మనం వద్దన్నా పోదు కదా !

      అలాంటప్పుడు అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ చక్కగా ఉండవచ్చు కదా ! అని..అంతే..

      Delete
    4. మీరు తల్లిదండ్రులు తమ సంతానాన్ని తమ వృత్తులు స్వీకరించమని ప్రోత్సహించడాన్నీ (పోనీ బలవంతపెట్టడాన్నీ), కులవృత్తి తప్ప ఇంకో గత్యంతరం లేనితనాన్నీ పోల్చుతున్నారు. మీరంటున్న వర్ణ వ్యవస్తలోనే ఒక తండ్రి తనవృత్తి తన పిల్లలకు వద్దనుకుంటే ఏమిచేయగలరు? మార్చుకొనే స్వాతంత్ర్యం ఉందా?

      కర్మఫలాన్ని అనిభవించవలసిందే కానీ క్రితం జన్మలో చేశామో లేదో తెలియని కర్మఫలాన్ని ఈ జన్మలో రుద్దడం అనేది ఒక కుటిలమైన policy అని మీకు అనిపించలేదా? ఒక వ్యక్తి నిజంగానే గత జన్మలో దుష్కర్మలాచరించాడని ఎలా verify చెయ్యగలం? దేవుడు నిజంగా అంత సమర్ధుడే అయితే స్వర్గాన్నీ, నరకాన్నీ తన ఆధీనంలోనే ఉంచుకున్న ఆపెద్దాయన మనుషుల్ని కర్మఫలపు బ్యాలెన్సు ఇంకా జీవుడి ఖాతాలోనే ఉండగా నేలమీదకి పంపడందేనికి? అదేదే ముగిసేదాకా అక్కడే ఎక్కడో ఉంచుకోవచ్చుకదా? ఇంక ఆమాత్రానికి ఆలోకాలెందుకు?

      ప్రజాస్వామ్యంలో పాలకుడు అవినీతిపరుడైతే పదవీచ్యుతుడిని చేయగల అవకాశమైనా ఉంది. మీరు అంటున్న వ్యవస్థలో అలాంటి అవకాశం ఉందా? ప్రస్తుతం మనదేశ్డంలో నెలకొన్న పరిణమాలన్నీ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవలేకపోవడమేమోగానీ అసలు అవకాశమే లేకపోవడమైతే కాదుకదా! పోనీ ఆ "మాట్లాడకూడదు" అని అన్నవారైనా అలా అని చట్తంచేయలేకపోయారు గమనించారా? దీనికితోదు ప్రజల్లో "వారిపాపానికి వారేపోతార్లే" అనే attitude తోడయితే ఏమవుతుందో ఊహించగలరా?

      వద్దంటే పోదన్నది నేనూ ఒప్పుకుంటానండి. వదులైన పట్టు మళ్ళి బుగుసుకోవాలనీ, మళ్ళీ అందులో గౌరవించుకోవాలనీ మీరంటున్నారు. ఎలా మొదలైనా అది చివరకు పరిణమించింది అవమానాల తీరుగా. ఇహ దానిలో గౌరవాలెలా సాధ్యమండీ. మీ సమస్యలోనే భటుడు చిన్నవాడనీ, ఎవరో ఒకరిచేత బలవంతంగా ఆవేషం వేయించక తప్పదనీ అన్న భావం ప్రస్ఫుటంగానే కనబ్వడుతుంది గమనించారా? మరి ఇలాంటప్పుడు గౌరవం సాధ్యమా?

      Delete
    5. * మీరంటున్న వర్ణ వ్యవస్తలోనే ఒక తండ్రి తనవృత్తి తన పిల్లలకు వద్దనుకుంటే ఏమిచేయగలరు? మార్చుకొనే స్వాతంత్ర్యం ఉందా?

      * మార్చుకున్న ఉదాహరణలెన్నో ఉన్నాయండి. క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యారు. బ్రాహ్మణుడైన అశ్వత్ధామ యుద్ధంలో పాల్గొన్నారు.
      .....................................
      * దేవుడు నిజంగా అంత సమర్ధుడే అయితే స్వర్గాన్నీ, నరకాన్నీ తన ఆధీనంలోనే ఉంచుకున్న ఆపెద్దాయన మనుషుల్ని కర్మఫలపు బ్యాలెన్సు ఇంకా జీవుడి ఖాతాలోనే ఉండగా నేలమీదకి పంపడందేనికి? అదేదే ముగిసేదాకా అక్కడే ఎక్కడో ఉంచుకోవచ్చుకదా? ఇంక ఆమాత్రానికి ఆలోకాలెందుకు?

      * జీవుల కర్మఫలానుభవం స్వర్గనరకలోకాల్లోనే పూర్తయిపోతే లోకంలోకి రావటానికి జీవులెవరూ ఉండరు. అప్పుడు సృష్టి జీవులు లేక నిస్సారమైపోతుంది. జీవుడు భూమిపై మరుజన్మను పొందాలంటే ఆ జీవి గతజన్మలో చేసిన కర్మలకు తగ్గ పరిస్థితులు ఏర్పడాలి. ( ఉదా.... ఆ జీవి పూర్వజన్మలో చేసిన కర్మకు తగ్గ తల్లితండ్రి , వగైరా .......) అటువంటి వాతావరణం ఏర్పడేవరకూ జీవులు స్వర్గం లేక నరకంలో కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు. జీవి పూర్వకర్మకు తగ్గ పరిస్థితులు ఏర్పడినప్పుడు భూమిపై జన్మించి , మిగిలిన కర్మ ఫలం తో కొత్త జీవితాన్ని ఆరంభిస్తారు.
      .............................
      * ప్రజాస్వామ్యంలో పాలకుడు అవినీతిపరుడైతే పదవీచ్యుతుడిని చేయగల అవకాశమైనా ఉంది. మీరు అంటున్న వ్యవస్థలో అలాంటి అవకాశం ఉందా?

      * అలాంటి అవకాశం ఉందండి. పూర్వం కూడా అధర్మపరులు, అవినీతిపరులైన సామంత రాజులను మహారాజు లేక మంచివారైన ఇతర రాజులు పదవీచ్యుతులను చేసేవారు. లేక భగవంతుడే అధర్మపరుడైన రాజుకు శిక్షను విధించేవారు.
      ఈ రోజుల్లో మాత్రం మనం అవినీతిపరులైన పాలకులను పదవీచ్యుతులను చెయ్యగలుగుతున్నామా ?
      ......................................

      * మరి ఇలాంటప్పుడు గౌరవం సాధ్యమా?

      * సాధ్యమేనండి. సాటి మనుషుల పట్ల ఎక్కువ తక్కువ తేడాలను చూపించకుండా ప్రవర్తించినప్పుడు అందరూ గౌరవప్రదంగా జీవించవచ్చు.

      Delete
  2. మనం పరిష్కరించ లేనంత క్లిష్ట మయిన సమస్య ... కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెప్పాలి .. బహుశా ఈ సమస్యకు కూడా కాలమే పరిష్కారం చెబుతుందేమో . ( ఇది వైరాగ్యం తో చెబుతున్న మాట కాదు . వాస్తవికంగా ఆలోచించి చెబుతున్నది ) ఇప్పుడు ప్రస్తుత కుల విధానం వల్ల నష్టం లేని వారు అంతా బాగానే ఉందంటారు. నష్ట పోయినా, పొతున్నా వారు దీనికి సరిగ్గా భిన్న మయిన వాదన చేస్తారు. ఒకరి వాదన మరొకరికి నచ్చదు.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      Delete
    2. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      మీరన్నట్లు .... కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెప్పాలి .. బహుశా ఈ సమస్యకు కూడా కాలమే పరిష్కారం చెబుతుందేమో.

      Delete
  3. ఇలాంటి వాదనలు వింటుంటే ఒక ప్రశ్న వేయాలనిపిస్తుంది.

    కులమతాల పేరు చెప్పి ఆర్షజీవనవిధానాన్ని తప్పుపట్టటం ద్వారా ఉదారవాదులుగా, మానవత్వవాదులుగా, మేధావులుగా ఇంకా అనేక రకాలుగా గొప్పదనం సంపాదించుకుంటున్న సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్న వాళ్ళలో యెంత మంది ఉదయం పని మనిషి రాగానే తాము తాగుతున్న కాఫీ ఫలహారాలు ఆ పనిమనిషికి కూడా ఇస్తున్నారు? తమతో పాటే తమ ప్రక్కనే డైనింగ్ టేబుల్ మీద ఆదరంగా కూర్చోబెట్టుకుని తినిపిస్తున్నారు? అంత దాకా యెందుకు పనిమనిషికి గౌరవప్రదమైన జీతభత్యాలు ఇస్తున్నారు? ఒక వంద పెంచండి అని అడిగితే యెంతమంది గంతులేయకుండా సంతోషంగా సరే నంటున్నారు? అసలెంతమంది పనిమనుషులను తమ కుర్చీలు సోఫాలలో కూర్చొననిస్తున్నారు? యెంతమంది వాళ్ళని కనీసం మనుషుల్లాగా మర్యాదగా చూస్తున్నారు?

    ఇంటి బయటికి వచ్చి ఈ పెద్దమనుషులు చూపే మూఖకవళికలూ, వాక్యవిన్యాసాలు యెంత వరకు నిజాయితీతో కూడుకున్నవి?

    వినటానికి బాగుండే మాటలు మాట్లాడే మనుషుల సంఖ్య పెరగటం సమాజంలో మార్పుకు దోహదపడదు. బాగుండే ఆచరణ గల మనుషుల సంఖ్య పెరగటం సమాజంలో మార్పుకు దోహదపడ గలదు.

    స్వస్తి.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      Delete
    2. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      .మీరు చెప్పినవన్నీ నిజమేనండి. మీరన్నట్లు ....

      వినటానికి బాగుండే మాటలు మాట్లాడే మనుషుల సంఖ్య పెరగటం సమాజంలో మార్పుకు దోహదపడదు. బాగుండే ఆచరణ గల మనుషుల సంఖ్య పెరగటం సమాజంలో మార్పుకు దోహదపడ గలదు..

      Delete
  4. మన పూజ్య పూర్వీకులు ఇచ్చిన పరిష్కారం ఒకసారి చూద్దాం.

    ఎవరు ఏ పాత్ర వేయాలో రాజు గారే నిర్ణయిస్తారు. తమకిచ్చిన పాత్ర వేయడానికి ఒప్పుకోని తక్కువ జాతి వెధవలను రాజు గారు కథినంగా శిక్షిస్తారు, అవసరమయితే ఊరి నించి వెలి వేస్తారు.

    వాడే కాదు, వాళ్ళ వంశంలో పుట్టిన ఖర్మకు వారసులు అందరూ అదే పాత్ర వేయాలని, ఎదురు తిరిగితే పుట్టగతులు ఉండవనీ వాడికి అర్ధం అయ్యేటట్టు చెప్తారు.

    ఎదురు తిరిగిన వాడికి ఈ లోకంలోనే కాదు పైలోకంలో కూడా అధోగతి పడుతుందని నూరి పోస్తారు. మేము చెప్పినట్టు వింటే వచ్చే జన్మలో మంచి అవకాశం దొరికోచ్చని కుక్క బిస్కట్టొకటి పారేస్తారు.

    రాజు పాత్ర వేయాలంటే కొన్ని లక్షణాలు (e.g. knowledge or education) ఉండాలి కదా. అవేవి మిగిలిన వారికి అందకుండా జాగ్రత్త పడితే పైన చెప్పినవి అంతగా అవసరం రావు. కుక్కిన పేనుల్లా వాళ్ళే పడి ఉంటారు.

    వర్ణ సంకరం జరగకుండా, దేశం భ్రష్టు పట్టకుండా ఈ పద్దతిలో కొన్ని వేల ఏళ్ల పాటు నాటకం నడిపించవచ్చు. మధ్యలో ఎప్పుడయినా ఎవడో తెలివి మీరితే వాడి తోక కోసి బుద్ధి వచ్చేలా చెయ్యాలి.

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      మీరన్నట్లు కులవివక్ష వల్ల చాలా మంది బాధపడ్డ మాట నిజమే.

      అయితే, పెద్దలు ఏం చెప్పారంటే .....రాజు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలని చెప్పారు.

      ఆ రోజుల్లో కూడా తన వద్ద పనిచేసే ఉద్యోగులను చక్కటి జీతభత్యాలు ఇచ్చి ఆదరంగా చూసుకున్న యజమానులూ ఉంటారు.


      ఈ రోజుల్లో కూడా పేద ప్రజలను మోసం చేసి కోట్లు సంపాదిస్తున్న వారు ఎందరో ఉన్నారు.


      ఎవరో చెప్పినట్లు..ఇప్పుడు ప్రపంచంలో రెండే కులాలు ఉన్నాయనిపిస్తుంది.

      1. డబ్బున్నవారు.

      2. డబ్బు లేనివారు....

      Delete
    2. రాజు ప్రజలను కన్న పిల్లలలా చూసుకోవాలనుకోవడం ఆశావాదం. అది జరిగేలా తగు జాగ్రత్తలు లేదా కట్టుబాటులు ఉంటె తప్ప జరగదు. రాజ్యం వీరభోజ్యం అనే సిద్ధాంతం అమలులో ఉన్నంత కాలం అది గొంతెమ్మ కోరికగానే ఉండిపోతుంది.

      Delete
  5. వ్యాఖ్యానించిన అందరికి మరొక్కసారి కృతజ్ఞతలండి.
    వ్యాఖ్యలను చూడాలన్నా వాటికి రిప్లై ఇవ్వాలన్నా భయంగా ఉంది.
    ఏం చెబితే ఏం తప్పుగా అనుకుంటారో ? నా అభిప్రాయం చెప్పాలన్నా వాదిస్తున్నాను అనుకుంటారేమో ? అనిపిస్తోంది..

    ReplyDelete
  6. మనుష్యులలో ఇంకా కుల మత భేదాలను పాటిస్తున్నారంటే అది వారిలో ఇంకా మిగిలి ఉన్న అనాగరిక లక్షణం. మన రాజ్యాంగం, చట్టాలు, రిజర్వేషన్లు ఇప్పటికే సమాజంలో చాల మార్పులు తెచ్చాయి. చక్కని విద్యార్హత, సామర్థ్యం గల ఎస్.సి. ఆఫీసర్ క్రింద చదువుకొనని బ్రాహ్మణుడు అట్టెండర్ గా పని చేస్తున్నాడు. ఆఫీసులలో అన్ని కులాల వారు లంచ్ టైం లో కలసి భోజనం చేస్తున్నారు. ఒకళ్ళ వంటలు మరొకళ్ళు పంచుకొని తింటున్నారు. అయితే ఇంకా... ఇంకా ... మార్పులు రావాలి. వస్తాయన్న నమ్మకం నాకుంది. బుద్ధుడు, రామానుజాచార్య, ఫూలే, గాంధి, అంబేద్కర్ ... ఇంకా ముందు ముందు రాబోయే మహానుభావుల పోరాటం వల్ల ఆ మార్పులు వస్తాయి. కాలం ఆ మార్పులకు సాక్షిగా నిలుస్తుంది. మనమనుకొంటున్నాం గాని ... దేవుడు ఆనాడే అన్ని కులాలలో జన్మించాడు. కృష్ణుడు యాదవుడు కాదా?
    ప్రాచీన కాలంలో కూడా విద్యార్హతలను కులం మారలేదా? బోయవాడైన వాల్మీకి ఋషిగా అంటే బ్రాహ్మణునిగా మారలేదా? క్షత్రియుడైన రాముడు గిరిజన స్త్రీ ఎంగిలి తిన లేదా? ఇప్పుడు మనుషులంతా ఇలాంటి positive విషయాలు తీసుకొని, అర్థం చేసుకోవాలి. సామరస్యాన్ని పెంచుకోవాలి. ఉత్తర రామాయణమే వాల్మీకి వ్రాయ లేదంటారు. దానిలో శంభూకుని వధ వివరాలే సరిగా తెలియవు. అనవసరమైన negative విషయాలపై చర్చించి ద్వేషాలు పెంచుకొని ఏం లాభం? అందరం సమానమే - అందరూ బాగుండాలి అనుకొని ముందుకు సాగుదాం.
    "సర్వే జనాః సుఖినో భవంతు!"

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.

      ఇప్పుడు దేశంలో పేదరికం వంటి అనేక సమస్యలు ఉన్నాయి.

      దైవం దృష్టిలో అందరూ సమానమేనని పెద్దలు చెప్పటం జరిగింది. పురాణేతిహాసాలలో దీనికి ఎన్నో ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి కదండి ..

      అయినా కూడా కొందరు ఏమంటున్నారంటే ......శూద్రుల విషయంలో పూర్వీకులు అన్యాయం చేసారు. అంటూ ....... ఇప్పుడు ఉన్న ప్రజల మధ్య అపార్ధాలు సృష్టించటం అన్యాయం కదండి.


      మీరు అన్నట్లు ... ప్రాచీన కాలంలో కూడా విద్యార్హతలను కులం మారలేదా ? అని.

      నిజమేనండి . ఒక కులానికి చెందిన వాళ్ళు ఇంకొక వృత్తిని స్వీకరించటం జరిగింది. ఉదా........ శాతవాహనులు, కాకతీయులు క్షత్రియులు కాదని చరిత్రకారులు చెబుతున్నారు.

      మీరు అన్నట్లు ....అందరం సమానమే - అందరూ బాగుండాలి అనుకొని ముందుకు సాగుదాం.
      "సర్వే జనాః సుఖినో భవంతు!",....

      Delete