koodali

Friday, February 17, 2012

కొన్ని సంగతులు.....


శ్రీ రామకృష్ణ పరమహంస వారి జన్మదినం ఫిబ్రవరి 18. శ్రీ రామకృష్ణ పరమహంస శారదాదేవిలకు అనేక నమస్కారములు ..........................................
టాపిక్ ను మార్చానండి. మా నాన్నగారు ఒక ఉద్యోగి, మా అమ్మగారు ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేసారు.


మా నాన్నగారి తల్లిదండ్రులు , మా అమ్మగారి తల్లితండ్రులు పల్లెటూరిలో ఉండేవారు. . సెలవులలో ఊర్లు వెళ్తే మా తాతగార్లు మాకు తాటిముంజెలు, ఈతకాయలు ఇలా రకరకాలు తెచ్చి ఇచ్చేవారు. ఇంకా ఆటవస్తువులు తెచ్చి ఇచ్చేవారు. మా నాయనమ్మ, అమ్మమ్మ మాకు ఎన్నో పిండివంటలు చేసిపెట్టేవారు. మా అమ్మమ్మకు నాన్నమ్మకు కూడా చదవటం వచ్చు.ఇప్పుడు అమ్మమ్మ ఉన్నారు. ( తాతగార్లు, నాన్నమ్మ ఇప్పుడు లేరు. )

మా అమ్మగారునాన్నగారు ఉద్యోగరీత్యా ఇంకో ఊరు వచ్చారు. మా ఇంట్లో వాళ్ళకు ఆ ఊరు కొత్త కావటం వల్ల మంచి హాస్పిటల్స్ గురించి అంతగా తెలియదట. .

నేను అమెరికన్ హాస్పిటల్లో పుట్టాను. ( అంటే ఇండియాలోనే .... మా ఊళ్ళో ఆ హాస్పిటల్ను అలా అంటారు. ) మా అమ్మగారు నేను పుట్టబోయే రోజున కూడా స్కూల్ కు వెళ్ళారట. ఆమెకు ఒంట్లో బాగా నలతగా అనిపించగా ... మా అమ్మగారు పనిచేసే స్కూల్
ప్రధానోపాధ్యాయురాలు అమెరికన్ హాస్పిటల్ గురించి చెప్పగా.... అప్పటికప్పుడు హాస్పిటల్కు వెళ్లారట..

ఇప్పుడు కూడా ఆ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ గేటు సమీపంలో ఏసుక్రీస్తు విగ్రహం పెద్దది ఉంటుంది. .

మేము కొంతకాలం క్రిందట అమరనాధ్ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడి ముస్లిం మతస్థులు మాకు బాగా సాయం చేసారు. ఆ విధంగా నాకు ఆన్ని మతాలు అంటే గౌరవం. .

దైవం అందరికీ సమానమే కదా !

మా అమ్మగారికి ఉద్యోగం వల్ల నా చిన్నతనంలో నన్ను చూసుకోవటానికి ఎవరూ దొరకక ఇబ్బందులు పడ్డారట. పనిపిల్లలను పెడితే వాళ్ళు నన్ను సరిగ్గా చూసేవారు కాదట. ( వాళ్ళూ పిల్లలే కదా ! )


కొంతకాలం అలా జరిగాక మా అమ్మగారి మేనత్త వాళ్ళు ( ఒకపెద్దావిడ . ఆమెకు పిల్లలు లేరు. ) మాఊరు వచ్చి ఉండటం జరిగింది. . ఇక నన్ను రోజూ వాళ్ళింట్లో వదిలి సాయంత్రం మా ఇంటికి తీసుకు వచ్చేవారట. మా చెల్లెలు, తమ్ముడ్ని కూడా ఆమే చూశారు.


మా ఇంటికి బంధువులు బాగా వస్తుండేవారు. ఒక ప్రక్క స్కూల్ , ఒక ప్రక్క ఇంటినిండా బంధువులు .. ఇలా మా అమ్మగారికి చాలా
పని ఒత్తిడి ఉండేది.

నేను చిన్నప్పుడు చాలాకాలం ఒక్కదాన్నే పెరిగాను కదా ! అందుకని మా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే నాకు చాలా ఇష్టం. ఇక నేను వాళ్ళని నా ప్రశ్నలతో వేధించేదాన్ని. వాళ్ళ చిన్నప్పటి కబుర్లు చెప్పమనీ, వాళ్ళ తాతముత్తాత కబుర్లు చెప్పమనీ ఇలా ప్రశ్నలు అడిగేదాన్ని . వాళ్ళూ ఓపిగ్గా చెప్పేవారు.

పెద్దవాళ్ళకి తమ చిన్నతనం కబుర్లు చెప్పటమంటే ఇష్టమే కదా ! బ్లాగుల్లో వ్రాసిన పాతకాలం నాటి విషయాలు వాళ్ళ ద్వారా తెలుసుకుని వ్రాసినవి కూడా ఉన్నాయి. అయితే నేను అంతటితో ఆగకుండా చిత్రమైన ప్రశ్నలు కూడా అడిగి వేధించేదాన్ని. వాళ్ళు వాళ్ళకి తెలిసినవి చెప్పేవారు.


నా అతితెలివి చూసి మా నాన్నగారు ఆడపిల్లలకు అతితెలివి ఉంటే కష్టమని భావించి ఏదో ఒక డిగ్రీ వరకూ చదివించి పెళ్ళిచేసేయాలని మా నాన్న గారి అభిప్రాయం. నాకేమో డాక్టర్ లేక అలా ఏదైనా చదివి దేశాన్ని
ఉద్ధరించాలని చాలా ఆశలు ఉండేవి.

నాకు చదవటం అంటే చాలాచాలా ఇష్టం. అది ఏదైనా కావచ్చు . బజ్జీలకు పొట్లంగా చుట్టిన కాగితం పైన వ్రాసి ఉన్న విషయాలను కూడా చదివే ఆ కాగితాన్ని పారేస్తానన్నమాట. ఇప్పుడు అంత సమయం ఉండటం లేదు లెండి. .

మా అమ్మగారు ఉద్యోగిని కాబట్టి నన్ను చాలా చిన్నతనంలోనే బళ్ళో వేసేసారు. ఆ స్కూల్ ఇప్పుడు కూడా పేరున్న స్కూలే. చిన్నప్పుడు స్కూల్లో నాకు చాలా ప్రైజులు వచ్చాయి.మా నాన్నగారికి తెలిసిన వారు క్రొత్తగా స్కూలు ప్రారంభిస్తే అక్కడ మరి కొంతకాలం చదివాను.

తరువాత ఆరవ తరగతిలో మా అమ్మగారు పనిచేసే స్కూల్ లో వేసారు. ( అది బాలికల స్కూల్ .ఆ స్కూల్ లో ఆరవ తరగతి నుంచే చెబుతారు. ) ఆ స్కూల్ లో టీచర్ గారి అమ్మాయిగా నాకు బాగానే గౌరవమర్యాదలు ఉండేవి.

స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక మా అమ్మగారూ పక్కింటి పిన్ని గారూ, వదినగారూ కబుర్లు చెప్పుకుంటుంటే .... చుట్టు ప్రక్కల పిల్లలందరం కూర్చుని రకరకాల కధలు చెప్పుకునేవాళ్ళం. ( రోజూ కాదులెండి. )


మా అమ్మగారు చాలా నిదానం. స్కూలుకు వెళ్ళటం ఇల్లు చూసుకోవటం అంతే .
నేను ఇప్పటికీ అంటుంటాను అమ్మా నీ అంత ఓపిక, సహనం నాకు ఎంత ప్రయత్నించినా రావటం లేదు .అని. మా నాన్నగారు ఏమనేవారంటే మన చుట్టూ ఉన్నవారు పేదరికంలో ఉంటే మనకు డబ్బు ఉన్నా సంతోషంగా అనుభవించలేము అనేవారు. ఊరు నుంచీ తెలిసినవాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఇచ్చేవారు. వారిలో కొందరు తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేవారు . కొందరు తిరిగి ఇచ్చేవారు కాదు.ఇంకా చాలామందికి సహాయం చేసేవారు.


మా అమ్మగారికి ఉద్యోగం వల్ల పిల్లల్ని పెంచటం, ఇంకా ఉద్యోగంలోని కష్టాలు ఇవన్నీ చూసి మా నాన్నగారు నేను బాగా చదివి ఉద్యోగం చెయ్యాలని భావించలేదు. నేను డిగ్రీ వరకూ చదివి గృహిణిగా ఇల్లు చూసుకుంటే చాలు అనుకునేవారు. ( మమ్మల్ని పెంచటానికి మా బామ్మగారు ఉన్నారు కానీ.... నేను ఉద్యోగం చేస్తే మా పిల్లలు కష్టపడతారని ).

ఇంకా, మా నాన్నగారు ఏమనేవారంటే,....
నువ్వు ఉద్యోగం చేస్తే నెలనెలా ఎంత ఆదాయం వస్తుందో నేను నీకు అంత ఆదాయం వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాను .,నాకు ఉన్న ఆస్తి నా పిల్లలకు సమానంగా ఇస్తాను .... ఆడపిల్లలైనా మగపిల్లలైనా నాకు సమానమే అనేవారు. అలాగే చేశారు కూడా. ఇంకా , ఆడవాళ్ళకు ఉద్యోగంలో బోలెడు కష్టాలు ఉంటాయి అనేవారు.

అయితే స్త్రీలకు చాలా విషయపరిజ్ఞానం ఉండాలి అనేవారు. అందుకే రోజూ ఇంటికి వచ్చాక బయట జరిగిన విషయాలను చెప్పేవాళ్ళు. అలా నాకు బయట జరిగే విషయాలన్నీ తెలిసేవి.
నేను ఇప్పటికీ చాలాసార్లు మా అమ్మానాన్నగార్లను సలహాలను అడుగుతాను.

మమ్మల్ని సినిమాలకు ఎక్కువగా పంపేవారు కాదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి నన్ను పెంచిన బామ్మగారిని తోడురాగా మా చుట్టాల పిల్లలం అందరం భక్తి సినిమాలకు వెళ్ళేవాళ్ళం అంతే. అయితే మా ఇంట్లో వివిధభారతి తెలుగుపాటలు వినేవాళ్ళం.

అయితే నాకు సినిమా పరిజ్ఞానం చాలానే ఉంది. ఎలా అంటారా ? మా స్కూలులో నా ఫ్రెండ్స్ బాగా సినిమాలు చూసేవారు. ఇక అవన్నీ డైలాగులతో సహా ఒక వారం రోజుల్లో నాకు చెప్పేసే వారు.

ఆ రోజుల్లో చదువు ఇప్పటిలా చిత్రహింస కాదులెండి. ఎన్ని సినిమాలు చెప్పుకున్నా మా ఫ్రెండ్స్ అందరికీ ఎక్కువమార్కులు వచ్చేవి. .

మరికొన్ని విషయాలు తరువాత .....


2 comments:

  1. చిన్న నాటి ముచ్చట్లు అందరికి ఆనంద దాయకమే! బాల్యం మళ్ళీ వస్తే బాగుణ్ణు, రాదే!!!

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి .

      కల్లాకపటం తెలియని వయసులోని పిల్లలను , స్వచ్చమైన వారి నవ్వులను చూసినప్పుడు భగవంతుని చూసినట్లుగా అనిపిస్తుంది నాకు ..

      Delete