koodali

Friday, February 24, 2012

చదువు, డబ్బు బాగా ఉంటేనే గౌరవిస్తారా ?


నేను ఇంగ్లీష్ మీడియం అర్ధం కాక ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాను కదా ! ఇక నాకు వివాహం చెయ్యాలని ఇంట్లో వాళ్ళు అనుకోవటం జరిగింది.

ఒక మంచి సంబంధం ఉంది . వాళ్ళు ఎప్పట్నించో మన సంబందం అంటే ఇష్టపడుతున్నారు. మగపిల్లాడి తరపు వాళ్ళే అడుగుతున్నారు. ఒప్పుకోమని మా నాన్నగారి కోరిక.


నేనేమో ఇంటర్ అయినా పూర్తి అయ్యాక వివాహం చేసుకుంటానని ఏడ్చాను. ఇంతలో ఊరినుంచి మా తాతగారు ( మా నాన్నగారి తండ్రి ) వచ్చి పోనీ ,కొంతకాలం అయ్యాక వివాహం చెయ్యి అని, మా నాన్నగారికి సలహా చెప్పారు. అందువల్ల వివాహ ప్రయత్నాలు కొంతకాలం వాయిదా పడ్డాయి.


కొంతకాలం ట్యూషన్ చెప్పించటం వల్ల నేను ఇంటర్ పాసయ్యాను.ఆ తరువాత కొంతకాలానికి మా నాన్నగారి దూరపు బంధువుల అబ్బాయితో నాకు వివాహమైంది.


మా మామగారు ఉద్యోగస్తులే.. మా అమ్మ, నాన్నగార్లకు బదిలీల ప్రాబ్లం లేదు గాని ... మా మామగారు, నా భర్తది ట్రాన్స్ఫర్స్ ఉండే ఉద్యోగాలే.

అలా.... వివాహం తరువాత హైదరాబాద్ జీవితం మొదలయ్యింది.


సిటీలో ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు నలుగురు చేరినప్పుడు కొంతమంది ఇంగ్లీష్ లోనే కబుర్లు చెప్పుకొనేవారు.కొందరు తెలుగువాళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడేవారు.


మళ్ళీ నా ఇంగ్లీష్ సమస్య మొదటికొచ్చింది. నాకేమో ఇంగ్లీష్ మాట్లాడాలంటే
తప్పులొస్తాయని భయం. ఒకసారి ఒకామె మీకు ఇంగ్లీష్ అస్సలు రాదా ? అని ఆశ్చర్యంగా అడిగింది.


మరి కొందరు తెలిసినవాళ్ళు, మాటల్లో నా చదువు వివరాలు అడిగి , నేను ఇంటర్మీడియట్ వరకు చదివాను . అని చెప్పగానే అదో రకంగా చూసేవారు.

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది.

నా భర్తను డిగ్రీ చదువుతానని అడిగాను. ఫీజు కట్టి ఇంట్లో చదివాను ( తెలుగుమీడియం ).అయితే పరీక్ష వ్రాసే సమయానికి వాళ్ళు ఏదో సర్టిఫికెట్ తెమ్మన్నారు. అది మా ఊరెళ్ళి తేవాలి.


ఈ గోలంతా భరించలేక ఇక చదువు ప్రక్కన పెట్టేసాను.

ఇక పిల్లల్ని స్కూల్లో వేసే సమయంలో...... మళ్ళీ నా ఇంగ్లీష్ సమస్య , నా చదువు నా ముందుకొచ్చి నిల్చున్నాయి.


పిల్లల్ని స్కూల్లో చేర్పించాలన్నా... పిల్లల తల్లిదండ్రులు కనీసం డిగ్రీ చదివిన వారికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ( కొన్ని స్కూల్స్ వాళ్ళు.) .
పేరెంట్స్ టీచర్లతో మాట్లాడాలంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు,.


తెలుగులో చెబుతూ ఇంగ్లీష్ నేర్పిస్తే సులభంగా అర్ధమవుతుంది.

కానీ, నా చిన్నప్పుడు స్కూల్ లో కూడా ఇంగ్లీష్ క్లాసులో ఎక్కువగా ఇంగ్లీష్ లోనే నేర్పించేవారు. .



అందుకే తరువాత నేను  తెలుగులో ఇంగ్లీష్ నేర్పే పుస్తకాలు కూడా కొన్నాను. అవి చదివి కొంతకాలం ప్రాక్టీస్ చేసాను.

ఈ బాధలు భరించలేక నేను హైదరాబాద్లో రామకృష్ణామఠంలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లో జాయినయ్యాను.

అక్కడ బేసిక్స్ నుంచి నేర్పిస్తారు. ఉదయం క్లాసులకు వెళ్ళేదాన్ని.


నాకు ఆ వాతావరణం విపరీతంగా నచ్చేసింది. రిటైర్ అయ్యిన ఫ్రొఫెసర్లు కూడా వచ్చి పాఠాలు చెప్పేవారు.

అడ్వాన్స్ వరకు వచ్చాను. కానీ నాకు వీలవక కోర్స్ పూర్తి చేయలేదు.

రామకృష్ణమఠంలో విద్యాభ్యాసం చేయటం అన్నది ఒక గొప్ప వరం. అక్కడ విద్యాభ్యాసం వల్ల నేను ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్నాను.

అక్కడ గ్రామర్ బాగా నేర్పించారు. అయితే ఎంత గ్రామర్ నేర్చుకున్నా .....ఏ భాష అయినా మనం మాట్లాడితేనే కదా వస్తుంది.


నాకేమో మాట్లాడాలంటే తప్పులు వస్తాయని భయం. ఇక ఇంగ్లీష్ మాట్లాడటం ఎలా వస్తుంది ?

అయితే , నాతో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వారి గ్రామర్ తప్పులు బాగా తెలిసేవి.

ఇక నాకు కొత్త భయం పట్టుకుంది. బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకే అన్ని గ్రామర్ తప్పులు వస్తుంటే ఇక నేను మాట్లాడితే ఏమవుతుందో ? అని .


ఇదంతా జరిగి చాలా కాలం అవ్వటం వల్ల ఇప్పుడు గ్రామర్ కూడా అంతగా గుర్తు లేదు. . అయితే చదివితే గుర్తు వస్తాయి. కానీ ఇప్పుడు అంత సమయం కుదరటం లేదు.

నా భర్తా, మా అమ్మనాన్న వాళ్ళు తప్పులు వచ్చినా..... మాట్లాడుతుంటేనే భాష వస్తుంది అంటారు.


నేనేమో అదేదో సామెత చెప్పినట్లు ..... నేను మాట్లాడాలంటే ఇంగ్లీష్ బాగా రావాలి.......ఇంగ్లీష్ బాగా రావాలంటే నేను మాట్లాడాలి. అని ఆ రెండూ ఒకేసారి అంటే కుదరనిపనికదా !


అయితే ఇంగ్లీష్ నేర్చుకోవటం వల్ల తరువాత నేను  M.A.
ఇంగ్లీష్ మీడియం

 చదవగలిగాను..


ఇవన్నీ చూస్తుంటే నాకు అనేక సందేహాలు వస్తుంటాయి. మనిషికి చదువు, డబ్బు బాగా ఉంటేనే గౌరవిస్తారా ? చదువు, డబ్బు లేని వాళ్ళలో కూడా ఎందరో మహాత్ములున్నారు కదా ! అని.


ఇంకా, మన మాతృభాషలో మనం మాట్లాడాలంటే ఇబ్బంది పడే దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి ? ఇలా అనేక సందేహాలు వస్తుంటాయి.

నాలాగే మరెందరో ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల .. చదువులో ఇబ్బందులు పడుతున్నారు.



8 comments:

  1. ఇంగ్లీష్ మాట్లాడ౦ అనే సమస్య భారతదేశాన్ని వదిలి ఇతర దేశాలకు వచ్చిన వారికే అనుకున్నాను. దేశంలో ఉన్నవాళ్ళను కూడా ఈ సమస్య బాధిస్తోందా..మీ టపా చదివి ఆశ్చర్యపోయాను.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయిగారూ మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      అవునండి . ఇక్కడ కూడా అలాంటి సమస్య ఉంది.

      ఇతర భాషల వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. కానీ తెలుగువాళ్ళలో అంత అభిమానం కనిపించదు. ( కొందరిలో )

      కానీ, విదేశాలకు వెళ్ళినవాళ్ళలో మాతృభాషాభిమానం ఉండటం చూస్తే సంతోషంగా అనిపిస్తుంది..

      Delete
  2. ధనమూలమిదంజగత్. డబ్బుంటే మీరే భాషలో మాటాడినా, అసలు మాటాడకపోయినా చెల్లిపోతుందండీ!

    ReplyDelete
  3. చాలా చక్కగా చెప్పారండి. ఈ రోజుల్లో , డబ్బుంటే చాలు ఇక ఎలా ప్రవర్తించినా చెల్లిపోతుంది అన్నట్లుగానే ఉంది..

    మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  4. తెలుగు మీడియం లో చదివి ,కాలేజీ లో ఇంగ్లీషు మీడియం మారినప్పుడు మీ లాగే నేను ఫీలయ్యాను కానీ పట్టుదలతో ప్రయత్నించి సాధించాను.మరీ హై లెవల్లో కాకపోయినా పరవాలేదు ..మీతోనే నేను కూడ ...

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. .

      విద్యార్ధి దశలో ఇంగ్లీష్ నేర్చుకోవటానికే చాలా సమయం వృధా అవుతోంది.

      మన దేశంలో ఎందరో పిల్లలు చదువులు మధ్యలోనే మానేస్తున్నారు. దానికి ఈ ఇంగ్లీష్ మీడియం కూడా ఒక పెద్ద కారణమని నాకు అనిపిస్తుందండి.

      ఇంగ్లీష్ మీడియంలో చదివేవారికి కూడా చాలా మందికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. వాళ్ళలో కొందరికి అటు తెలుగూ రాదు ఇటు ఇంగ్లీష్ సరిగ్గా రాదు.

      పిల్లలు ఈ అర్ధం కాని చదువులు చదవలేక నలిగిపోతున్నారు...

      Delete
  5. నిజానికి ఆంగ్ల భాష చాలా తేలిక. కాకపోతే, వంకర టింకర యవ్వారం. No - నో; Know కూడా నో. భారతీయ భాషలలో (phonetic languages) ఇటువంటి ఇబ్బందులు తక్కువ. ఆంగ్ల భాష కాదు కష్టం; అదో దైవీ భాష అనే మన అపోహను పక్కన పెట్టి దాన్ని అభ్యసించటం అసలైన కష్టం.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ఆంగ్ల భాష కొంచెం తేలిక......కొంచెం కష్టం.

      ( No - నో; Know కూడా నో. ).... ... ఆంగ్ల భాషలో ఎదురయ్యే ఇలాంటి ...... ఎన్నో పదప్రయోగాలను గుర్తుపెట్టుకోవటం కష్టమే.


      మాతృభాషలో చదువుకోవటం వల్ల విద్యార్ధులకు సగం భారం తగ్గుతుంది అనిపిస్తుందండి. ...

      Delete