koodali

Wednesday, December 29, 2010

రెండుపిల్లులు, ఒక కోతి,................రొట్టెముక్క . కధలోలాగ అవకూడదని ఆశిద్దామండి.......

 

ఇప్పటి రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో ? ఒక్కోసారి ఒక్కోరకంగా అనిపిస్తోంది.

తెలుగు వాళ్ళంటే మొదటినుంచీ అందరికీ అలుసే. ఓట్ల కోసమే మనం కాని, ఏ రైల్వే బడ్జెట్ లోనూ, అభివృద్ధి నిధుల కేటాయింపుల లోను మనకి అంతగా ప్రాధాన్యత ఉండదు. ఇహ విడిపోతే మన మొహం డిల్లీలో ఎవరూ చూడరేమో అని ఒకోసారి అనిపిస్తుంది.


ఒకోసారేమో ఇంతగా అభిప్రాయభేధాలు వచ్చాక కలసి ఉండి ఏమి లాభం ? అసలు రెండు కాదు మళ్ళీమళ్ళీ విడిపోవటాలు లేకుండా ఒక్కసారే మూడో నాలుగో రాష్ట్రాలుగా విడిపోయి హాయిగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం అభివృధ్ధి చేసుకుంటే గొడవుండదు అని కూడా అనిపిస్తోంది. కానీ.....

ఈ రాష్ట్రం ఇలా కలిసి ఉన్నా బాగానేఉంటుంది అని కూడా అనిపిస్తోంది. కానీ.......

ఆ మధ్య ఒకరు ప్రాంతాలతో సంబంధం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని అన్నారు. ఇలా అందరు రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆఖరికి ఏమవుతుందో ?


మన రాష్ట్ర పరిస్థితి గురించి నాకు కూడా ఇలా కొన్ని ఆలోచనలు ఉన్నాయండి. కానీ నేను వాటిని సరిగ్గా పైకి చెప్పలేనండి. ఏమంటే పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి లాగ ఉంది కద.


అదీకాక మా బంధువులలో అన్ని ప్రాంతముల వాళ్ళు ఉన్నారు. వివాహసంబంధాలు కలుపుకోవటం , లాంటి కారణాలవల్ల చాలామందిది ఇదే పరిస్థితి.

అది అలా ఉంచి ఇంకో విషయం మీకు చెప్పాలని ఉందండి..........మనము ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే వాస్తు గురించి ఎంతో ఆలోచిస్తాము. ఒకవేళ అందులో తప్పులు వస్తే సరిచేసుకుంటాము. అంత ఖర్చు పెట్టలేకపోతే కనీసం వాస్తు దోష నివారణ యంత్రం అయినా పెట్టుకుంటాము.


ఇంటిలాగే నగరాలకు, రాష్ట్రాలకు కూడా వాస్తు ఉంటుందట. .ఇప్పుడు ఎటూ రాష్ట్ర మార్పుల గురించి చర్చలు జరుగుతున్నాయి గదా ! అందుకని వాస్తు పండితులని కూడా ఒక సలహా అడిగితే బాగుంటుంది ఏమో !


మన ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి ఆనక అరిష్టాలు వస్తే అందరూ బాధలు పడాలి. అందుకని ఏ విధంగా , ఎక్కడ మార్పులు చేస్తే బాగుంటుంది ఇలాంటివి పండితులకైతేనే బాగా తెలుస్తాయి.


ఇంకో చిత్రమయిన ధర్మ సందేహం కూడా వచ్చిందండి. మనకు శ్రీ శైలం మహా క్షేత్రం ఉంది కదండి. ఆ దేవాలయానికి నాలుగు ద్వారాలు, నాలుగు ఉపద్వారాలు ఉన్నాయట.

ద్వారాలు ...........ఉపద్వారాలు.

30 ఆమడల ( 384 కి.మీ.ల) పొడవు . 30 ఆమడల వెడల్పు గల యీ మహాక్షేత్రానికి , ప్రకాశం జిల్లాలోని ' త్రిపురాంతకం ' తూర్పు ద్వారం గానూ , కడప జిల్లాలోని ' సిధ్ధవటం ' దక్షిణ ద్వారం గానూ , మహబూబ్ నగర్ జిల్లాలోని ' అలంపురం ' పశ్చిమ ద్వారం గానూ , 'ఉమామహేశ్వరం ' ఉత్తర ద్వారం గానూ , పురాణాలు చెబుతున్నాయి. ఇంతేకాక నాలుగుమూలలా నాలుగు ఉపద్వారాలు చెప్పబడినాయి. అవి పుష్పగిరి క్షేత్రం ( ఆగ్నేయ ద్వారం ) , సోమశిల క్షేత్రం (నైరృతి ద్వారం ), సంగమేశ్వర క్షేత్రం ( వాయువ్య ద్వారం ) , ఏలేశ్వర క్షేత్రం ( ఈశాన్య ద్వారం ) .


అయితే ....... ఈ సంగమేశ్వరం శ్రీ శైలానికి ఉపద్వారంగా చెప్పబడుతున్నది .కానీ శ్రీ శైల ఖండం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. దీనిని ఒక మహా తీర్ధంగా శ్రీ శైలఖండం చెబుతున్నది. మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న ఏలేశ్వరం యీశాన్యద్వారంగా చెప్పబడుతున్నప్పటికి దీనిని శ్రీశైలఖండం తీర్ధంగానే వర్ణించింది తప్ప ద్వారంగా కాదు.


ఇవన్నీ చూశాక రాష్ట్రంలో మార్పులు జరిగితే ఈ క్షేత్రంలో కొంత భాగం ఒక ప్రాంతములో ............ కొంత భాగం ఇంకొక ప్రాంతములో వచ్చే అవకాశం ఉంది. అలా ఉండవచ్చా అని అనిపించిందండి.


అయితే దైవ క్షేత్రములకు ఇలాంటి రాష్ట్రము, ప్రాంతము , సరిహద్దులు వంటి పట్టింపులు ఉండవులే అనికూడా అనిపించిందండి. ఇలాంటివిషయాలు పండితులకే బాగా తెలుస్తాయి. అయితే క్షేత్రం అంతా ఒకే ప్రాంతములో ఉండేలా చూసుకుంటే బాగుంటుందేమో !


ఈ నాడు దేశం చాలా సమస్యలలో ఉంది. ప్రజల పేదరికాన్ని పోగొట్టడం, దేశాన్ని అభివృధ్ధిపధంలో నడిపించటం ప్రజాప్రతినిధుల ప్రధమ కర్తవ్యం. కొంతమంది ఇలా మంచిపనులు చేస్తున్నారు, కానీ కొంతమంది అవినీతి ఇలాంటివాటితో దేశానికి సమస్యలు తెచ్చిపెడుతున్నారు.


ఏమైనా మనం చేస్తున్న ప్రతీపనిని గమనిస్తున్న దైవశక్తి ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకుంటే ఇలా అవినీతి లాంటి పనులు చెయ్యలేరు.


తెలుగు వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. ఈ దేశ రాజకీయ, ఆర్ధిక, ఇంకా ఎన్నో రంగాల్లో వాళ్ళు ప్రముఖపాత్ర నిర్వహిస్తున్నారు. మనం ఇతరులకు చెప్పే స్థాయిలో ఉండాలేకానీ ఇతరులతో చెప్పించుకునే స్థాయికి పడిపోరాదు.

ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం యొక్క ప్రభావం దేశం పైన ఎంతో ఉంటుంది.

ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఎంతో గొప్పదిగా ఉండాలి. ఆవేశముతో కాకుండా ఆలోచించి విజ్ఞతగా నిర్ణయాన్ని తీసుకోవలసిన సమయమిది.


మనం ఎంతో తెలివిగలవాళ్ళమేకానీ, మన భాషను, సంస్కృతిని అంతగా గౌరవించని బలహీనత ఒకటి మనకు ఉంది. ఉదా........ఇద్దరు తెలుగువాళ్ళు ఎదురుపడితే ఇతర భాషలో మాట్లాడుకుంటారు.


ఇక్కడ ఒక కధ........ పీతలను ఇతరప్రాంతాలకు ఎగుమతి చేసే వ్యాపారి ఒకరు ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసేవారు ఒకసారి పీతలు ఉన్న పెట్టెలను వాన్లో ఎక్కిస్తున్నారట. అందులో కొన్ని పెట్టెలకు మూతలు వేసి లేవట.


ఆ వ్యాపారి కంగారుపడి పనివాళ్ళతో అదేమిటి మూతలు వెయ్యకపోతే అవి పైకి ప్రాకి పారిపోతాయికదా అని కోప్పడితే వాళ్ళేమన్నారంటే,...........అవి తెలుగు పీతలు సార్. ఒకటి పైకి రావటానికి ప్రయత్నించినా ఇంకొకటి వెంటనే క్రిందకు లాగేస్తుంది. అందుకే మూతలు పెట్టలేదు. అవి పైకి వెళ్ళి తప్పించుకుంటాయన్న భయం వద్దు. అన్నారట. మన గురించి ఇలా ప్రపంచానికి అంతా తెలుసుకదా !

రాష్ట్ర పరిస్థితి ఏమవుతుందో కానీ, రెండుపిల్లులు, ఒక కోతి,................రొట్టెముక్క . కధలోలాగ మాత్రం అవకూడదని ఆశిద్దామండి.......

ఇందులో తప్పులేమైనా ఉంటే భగవంతుడు దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను...........

No comments:

Post a Comment