koodali

Thursday, December 9, 2010

అలా.......అత్యంత స్వార్ధపూరిత తరాలుగా నేటి తరాలవాళ్ళు చరిత్రలో నిలిచిపోతారా ?

 

నా అభిప్రాయం నేటి విజ్ఞాన శాస్త్రములో క్రొత్త పరిశోధనలు జరగకూడదని కాదండి. ఇలా కనిపెడుతున్న వస్తువుల వలన ప్రపంచానికి హాని జరగకూడదన్నదే నా భావం.


మనకు కష్టమైన కొన్ని పనుల సౌలభ్యము కొరకు కొన్ని వస్తువులను అవసరమైనంతవరకూ వాడుకోవచ్చు. ఉదా..........నా చిన్నప్పుడు ఎడ్లబండిలో వెళ్తున్నప్పుడు , అయ్యో ! ఎద్దులు ఎంత బరువును లాగుతున్నయ్యో కదా ! పాపం ! అని బాధగా అనిపించేదండి. ఇప్పుడు వాహనముల వల్ల వాటికి ఆ బాధ తగ్గింది లెండి..........


కానీ...కారు, బస్సు ఇలాంటివాటికి పెట్రోల్ లాంటి ఇంధనముల బదులు సౌరశక్తిని వినియోగిస్తే బాగుంటుంది.


ఒక్కోసారి ఏమని అనిపిస్తుందంటేనండీ, ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తులు చేస్తున్న డాన్సులను మనం ఇంట్లో కూర్చునే టి.వి లో చూస్తున్నాము.. కానీ గ్రుడ్డివాళ్ళు తమ కళ్ళముందున్న ప్రపంచాన్ని కూడా చూడలేకపోతున్నారు.


ఈ నాటి విజ్ఞానశాస్త్రం ...తాను , దేనికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి ? విలాసాలకా ? నిత్యావసరాలకా ? అని ఆలోచించుకుంటే బాగుంటుంది కదండి.


అంధత్వాన్ని పోగొట్టటానికి పరిశోధనలు జరుగుతున్నాయని వింటున్నాము. ఎంతో ఆనందకరమైన విషయమిది.

ప్రాచీన గ్రంధాలలో కూడా విమానాల గురించి, పుష్పక విమానాల గురించి ఇంకా, ఆయుర్వేదములో అంధత్వ నివారణకు చికిత్స గురించి చెప్పబడిందట. కానీ విజ్ఞానము ఇప్పుడు అంతగా అందుబాటులో లేదు.


ఇంకా, మనకు ప్రమాదమని తెలిసినా టెక్నాలజీని వదలుకోవటానికి ఇష్టపడటం లేదు. అంతగా దానికి అలవాటుపడిపోయాము. కానీ ఈనాటి టెక్నాలజీ వల్ల ఎన్నో ఇతరజీవులు ఎంతో హింసని అనుభవిస్తున్నాయి.


ఉదా.. కాలుష్యం, .ప్లాస్టిక్ వల్ల , ఎన్నోజంతువులు, ఎన్నో సముద్రజీవులు ప్రాణములను కోల్పోతున్నాయి. మరి వాటిని అలా హింసించే అధికారాన్ని మనకు ఎవరిచ్చారు ?


కొన్ని కొత్త ఆవిష్కరణల వల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం అది లేకపోయినా బ్రతకగలం. ఉదా..........అణుశక్తి వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. ఇలాంటి వాటిదగ్గర ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ కట్టడాన్ని మొత్తం ముక్కలుగా చేసి వాటిని సిమెంట్ తో సీల్ చేసి వాటిని సముద్ర గర్భములో వదలటం , లేక భూమిలో లోతుగా పాతిపెట్టటం గానీ చేస్తారట.


లేకపోతే ఆ అణుధూళి వల్ల ప్రపంచానికి ఎంతో హాని కలుగుతుందట. నేను ఇవన్నీ వార్తాపత్రికల్లో చదివానండీ. నాకు అప్పుడు ............ చిన్నప్పుడు విన్న కధలలోని .......... ఒక భూతాన్ని సీసాలో బంధించి భూమిలో లేక సముద్రంలో వదలటం గుర్తుకు వచ్చిందండి.


ఇక భూమిలో పెట్రోల్, ఖనిజాలు తయారుకావటానికి ఎన్నో వేల సంవత్సరాలు పడుతుందట. మరి మనం వాటిని బయటకు తీసి ఎంత త్వరగా వాడేస్తున్నామో కదా ....


1 కిలో ముడి ఖనిజం తీయాలంటే ఎన్నో టన్నుల మట్టిని శుధ్ధి చేయాల్సి వస్తుందట.

గత కొన్ని వేల సంవత్సరాలుగా జరగని సహజవనరుల దుర్వినియోగం ... గత 100 సంవత్సరములలోనే జరిగిందని అంటున్నారు.


అంతులేనికోరికలతో తమ ముందు తరాల వాళ్ళకు కూడా సహజవనరులని మిగల్చకుండా వాడేస్తూ అలా.......అత్యంత స్వార్ధపూరిత తరాలుగా నేటి తరాలవాళ్ళు చరిత్రలో నిలిచిపోతారా ?



ఇంకా నా అబిప్రాయం ఏమంటేనండి, ఈ నాటి టెక్నాలజీని ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీగా మార్చుకోవాలి. అదే సమయంలో మన అంతులేని కోరికలను అదుపులో పెట్టుకోవాలి.


శాస్త్రవేత్తలలో ప్రపంచానికి మంచి చేయాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదైనా కొత్తవిషయాన్ని కనిపెట్టేముందు భవిష్యత్తులో దాని ప్రభావం ప్రపంచము పైన ఎలా ఉంటుంది ? ఇవన్నీ దయచేసి ఆలోచించాలని విన్నవించుకుంటున్నానండి. 

 

No comments:

Post a Comment