koodali

Friday, December 3, 2010

నైతిక విలువలతో కూడిన విద్య ద్వారా ఎన్నో సమస్యలను నివారించవచ్చు............


అసలయిన విద్య ద్వారా వ్యక్తులు క్రమముగా తన పరమలక్ష్యమును సాధించగలరు.

ఇప్పటివాళ్ళు చాలామంది ప్రాచీనకాలం వాళ్ళకు ఏమీ తెలియదని వాదిస్తారు.

కానీ వాళ్ళకు విశ్వమును గురించిన పరిజ్ఞానం, ఆయుర్వేదం, అర్ధశాస్త్రం, లోహశాస్త్రం, జీవశాస్త్రం ఇంకా ఎంతో ప్రపంచజ్ఞానం తెలుసని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము.


మన అశ్రధ్ధ, దురదృష్టం వల్ల అప్పటి విలువైన గ్రంధములను మనం జాగ్రత్తగా భద్రపరచుకోలేకపోయాము.


అప్పుడు పిల్లలను చిన్నతనం నుండే ఆదర్శ వ్యక్తులుగా తీర్చిదిద్దేవారు. ఉదా......పంచతంత్రం లోని కధలను పిల్లలకు చెప్పటం ద్వారా వారికి భవిష్యత్తులో ఎలా పధ్ధతిగా జీవించాలి ........ లాంటి విషయాలను నేర్పటం జరిగేది.


జంతువులను పాత్రలుగా చేసి కధలుగా చెప్పటం వలన పిల్లలకు వినటానికి ఉత్సాహముగా ఉండేది.


ఇక పురాణముల ద్వారా జీవితములో ఎదురయ్యే సమస్యలు, జీవితములో ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి ,........ ఇలా విలువలను నేర్పటం జరిగేది.

పాతకాలంలో కూడా చెడ్డ వ్యక్తులు ఉన్నా వారి శాతము చాలా తక్కువగా ఉండేది.


ఇంకా ఈ మధ్య కాలం వరకూ కూడా వినాయక చవితి పండుగ వచ్చిందంటే పత్రిని సేకరించేసమయములో పిల్లల పాత్ర ఎక్కువగా ఉండేది. అలా వాళ్ళు తమ చుట్టుప్రక్కల పరిసరాలలోని మొక్కల గురించి వాటి ఔషధ గుణముల గురించి తెలుసుకునేవారు.


దైవభక్తి, పాపము,పుణ్యం, స్వర్గనరకాలు ఇత్యాది భయభక్తులతో కూడిన జీవనం వల్ల వారు జీవితములో సత్ప్రవర్తనను కలిగిఉండటానికి అవకాశం ఉండేది.


అందుకే వారు ఇతరులకు హానిచెయ్యటానికి, అన్యాయంగా జీవించటానికి జంకేవారు. ఇతరజీవుల పట్ల దయతో ప్రవర్తించేవారు.


తమకు జీవితములో ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే వస్తువులను వాడుకొనేవారు.

ఇప్పటిలా తమ సుఖముకొరకు పర్యావరణాన్ని ,ఇతరజీవులను పీల్చిపిప్పి చేయటాన్ని పాపముగా భావించేవారు.


ఇలా రకరకాల మార్గముల ద్వారా అప్పటి పిల్లలు ఎన్నో విషయములను నేర్చుకొనేవారు. ప్రాచీన కాలం లోని ఈ పధ్ధతులన్నీ చదువులో భాగం కాదా ?


అప్పటివాళ్ళు జీవితానికి అవసరమైన వృత్తివిద్యలూ నేర్చుకుంటూనే జీవితపు విలువలను నేర్చుకునేవారు.


ఇప్పటిలా పిల్లల్ని ప్రొద్దున్న నుంచి రాత్రి వరకూ కుర్చీలకు కట్టేసి, ఏకధాటిగా గంటలతరబడి ఒక సబ్జెక్ట్ తరువాత ఇంకొకటి బోధించటం వల్ల ............... భవిష్యత్తులో వారికి వెన్నెముక సమస్యలు, మోకాళ్ళ సమస్యలు ఇంకా రకరకాల అనారోగ్యాలు రావటం తప్ప ఒరిగేదేమీ ఉండదు.


పిల్లలను క్లాస్ మధ్యలో బాత్రూంకి కూడా వెళ్ళనివ్వక పోవటం నాకు తెలుసు.


ప్రొద్దున, మధ్యాహ్నం సబ్జెక్ట్ ల పీరియడ్స్ రెండు కాన్సిల్ చేసి అయినా ............ పిల్లలు క్లాస్ లో బిగుసుకుపోయి కూర్చోకుండా కాస్త అటూ ఇటూ కదిలేలా ఆటలు, డ్రాయింగ్ , బొమ్మలు తయారుచెయ్యటం ........ ఇలా వేరే ఇతర క్లాసెస్ ఉండేలా విద్యావిధానం మార్చాలి.


కొంచెం సిలబస్ తగ్గించటం వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు.


సమాజములో పెరుగుతున్న నేరాలను ఆధునిక విజ్ఞానం ద్వారా తగ్గించటం అసాధ్యం. చిన్నప్పటినుంచీ పిల్లలకు నైతిక విలువలతోకూడిన విద్యను అందించటం ద్వారా మాత్రమే పిల్లలు ఆదర్శపౌరులుగా తయారుకాగలరు.


నేరములు జరిగినతరువాత వాటిని అరికట్టే పరిజ్ఞానంకన్నా అసలు నేరస్తులే తయారుకాకుండా చూడటం విజ్ఞత అనిపించుకుంటుంది.


ఈ రోజుల్లో పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పాలంటే ముందు ఈనాటి పెద్దవాళ్ళు చాలామంది తమ నడవడికను మార్చుకోవలసిన అవసరం ఎంతోఉంది.

 

4 comments:

  1. మీరు చెప్పింది అంతా అడవి గాచిన వెన్నెలవుతుంది.... మంచి చెపితే వినే వారేరి? ప్రతీ సంవత్సరం సిలబస్ పెంచడమే విద్యాభివృధి అనుకునే వారితో, అసలు విద్య అంటే ఏమిటో తెలియని వాళ్ళు విద్యా శాఖ మంత్రులయినంత కాలం, మన లాంటి వారి వేదనలు అరణ్య రోధనలే అవుతాయి.

    ReplyDelete
  2. నేరములు జరిగినతరువాత వాటిని అరికట్టే పరిజ్ఞానంకన్నా అసలు నేరస్తులే తయారుకాకుండా చూడటం విజ్ఞత అనిపించుకుంటుంది.
    -----
    చాలా చక్కగా చెప్పారు. రాబోయే నాయకులు ఇది చదవచ్చు. మంచిది అని తెలిసినప్పుడు మన ఇంటితోనే ప్రారంభించవచ్చు. ఈ పోస్ట్ చదివి కొందరయినా గ్రహించి పాటిస్తే మనం వ్రాసిన దానికి ఫలితం దక్కినట్లే. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  3. జవాబు ఇవ్వటం ఆలస్యమయినందుకు దయచేసి క్షమించండి.

    ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇన్ని గంటలు స్కూల్లో ఉండటాన్ని సమర్ధిస్తున్నారు. పిల్లలు స్కూల్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేస్తే ఇంటిలో పెద్దవాళ్ళు ఎవరూ ఉండకపోవటం ఈ రోజుల్లో సాధారణమైన విషయం కదా.......

    ఒకవేళ .ఇంట్లో ఉన్నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి టి.వి, కంప్యూటర్ చూడకుండా ఆపలేకపోతున్నాము కాబట్టి వాళ్ళు స్కూల్లోనే చదువుకోవాలి రాత్రి వరకూ అనేవారు కొందరు.

    ఇలా రకరకాల కారణాలతో ఈ రోజుల్లో కుటుంబసభ్యుల మధ్య ప్రేమ ఉన్నా వారి మద్య కమ్యూనికేషన్ గాప్ ఎక్కువగా కనిపిస్తోంది.
    ఎవరూ ఏమీ చేయలేని విధంగా సమాజంలో చిత్రవిచిత్రమైన మార్పులు వస్తున్నాయి.. మనలాంటి వాళ్ళం ఏమైనా అంటే పాతకాలం వాళ్ళు, చాదస్తం , అభివృధ్ధినిరోధకులు అన్నా అనేస్తారు...

    ReplyDelete
  4. జవాబు ఇవ్వటం ఆలస్యమయిందండి. దయచేసి క్షమించండి.
    ఈ రోజుల్లో ఇలాంటి అభిప్రాయములు కలిగిన మనందరినీ అభివృధ్ధి నిరోధకులంటారు చాలామంది.
    మా బంధువులు కొందరు నాతో ఇలాగే వాదిస్తారండి. ఈ రోజుల్లో ఇలా అంటే జీవితంలో పైకి రాలేము అంటూ.... పిల్లలు మరింత కష్టపడాలి అంటారు.

    పిల్లలు చదవకూడదని నేను అనటంలేదు. పిల్లల శక్తికి మించిన విపరీతధోరణి వద్దని మాత్రమే నేను అంటున్నాను ఆన్నా వారు వినిపించుకోరు.

    ఒకసారి నేను మా పిల్లల స్కూల్ కి వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడికి 95% మార్కులు వచ్చాయి. కానీ అతనికి 98% , మరియు క్లాస్ ఫస్ట్ రాలేదని ఆ పిల్లవాడి తల్లి వాడిని మా అందరిముందు చెంప మీద కొట్టిందండి. ఇలా ఉన్నారు కొంతమంది మూర్ఘపు పేరెంట్స్.

    ఇక పిల్లలకు దేవుడే దిక్కు............

    పెద్దలు మాత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి అబ్బా అలసిపోయాము.. అంటూ రిలాక్స్ గా టి.వి చూస్తారు. పిల్లల్ని మాత్రం స్కూల్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చినా వాళ్ళని మళ్ళీ ట్యూషన్స్ కు తోలేస్తారు. ఎక్కడుంది న్యాయం.

    తమ బాధ చెప్పుకునే దిక్కు లేక కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
    అందరికీ క్లాస్ ఫస్ట్ రావటానికి పిల్లలందరికీ ఒకేరకమైన తెలివితేటలు ఉండవు కదండీ...

    ReplyDelete