koodali

Friday, December 10, 2010

శ్రీ టెంబెస్వామి

 

 

శ్రీ టెంబెస్వామి
ఈ కధ శ్రీ శిరిడి సాయిబాబా జీవిత చరిత్రము గ్రంధము లోనిదండి.

యోగులు ఒకరినొకరు అన్నదమ్ములవలె ప్రేమించుకొనెదరు. ఒకానొకప్పుడు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు ( టెంబెస్వామి ) రాజమండ్రిలో మకాం చేసిరి. ఆయన గొప్ప నైష్ఠికుడు , పూర్వాచారపరాయణుడు, జ్ఞాని, దత్తాత్రేయుని యోగిభక్తుడు.


నాందేడు ప్లీడరగు పుండలీకరావు వారిని జూచుటకై కొంతమంది స్నేహితులతో పోయెను. వారు స్వాములవారితో మాట్లాడుచున్నప్పుడు సాయిబాబా పేరు శిరిడీ పేరు వచ్చెను.


బాబా పేరు విని స్వామి చేతులు జోడించి, ఒక టెంకాయను దీసి పుండలీకరావు కిచ్చి యిట్లనిరి. " దీనిని నా సోదరుడగు సాయికి నా ప్రణామములతో నర్పింపుము. నన్ను మరువవద్దని వేడుము. నా యందు ప్రేమ చూపుమనుము. " ఆయన స్వాములు సాధారణముగా నితరులకు నమస్కరించరనియు కానీ బాబా విషయమున ఇది యొక అపవాదమనియు చెప్పెను.


పుండలీకరావు ఆ టెంకాయను , సమాచారమును శిరిడీకి దీసికొని పోవుటకు సమ్మతించెను. బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండెను. ఏలన బాబా వలె వారును రాత్రింబవళ్ళు అగ్నిహోత్రమును వెల్గించియే యుంచిరి.

ఒక నెల పిమ్మట పుండలీకరావు తదితరులును శిరిడీకి టెంకాయను దీసికొని వెళ్ళిరి. వారు మన్మాడు చేరిరి. దాహము వేయుటచే ఒక సెలయేరు కడకు బోయిరి.


పరగడుపున నీళ్ళు తాగకూడదని కారపు అటుకులు ఉపాహారము చేసిరి. అవి మిక్కిలి కారముగా నుండుటచే టెంకాయను పగులగొట్టి దాని కోరును అందులో కలిపి యటుకులను రుచికరముగా జేసిరి. దురదృష్టము కొలది యా కొట్టిన టెంకాయ స్వాములవారు పుండలీకరావు కిచ్చినది.


శిరిడీ చేరునప్పటికి పుండలీకరావుకీ విషయము జ్ఞప్తికి వచ్చెను. అతడు మిగుల విచారించెను. భయముచే వణకుచు సాయిబాబా వద్దకేగెను.

టెంకాయ విషయమప్పటికే సర్వజ్ఞుడగు బాబా గ్రహించెను. బాబా వెంటనే తన సోదరుడగు టెంబెస్వామి పంపించిన టెంకాయను దెమ్మనెను.


పుండలీకరావు బాబా పాదములు గట్టిగా బట్టుకొని , తన తప్పును , అలక్ష్యమును వెలిబుచ్చుచు , పశ్చాత్తాపపడుచు , బాబాను క్షమాపణ వేడెను. దానికి బదులింకొక టెంకాయను సమర్పించెదననెను.


కానీ బాబా యందులకు సమ్మతించలేదు. ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయ కెన్నో రెట్లనియు దాని విలువకు సరిపోవునదింకొకటి లేదనియు చెప్పుచు నిరాకరించెను.


యింకను బాబా ఇట్లనెను. " ఆ విషయమై నీవే మాత్రము చింతింప నవసరములేదు. అది నా సంకల్పము ప్రకారము నీ కివ్వబడెను. తుదకు దారిలో పగులగొట్టబడెను. దానికి నీవే కర్తవని యనుకొననేల ? మంచిగాని చెడ్డగాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు. గర్వాహంకారరహితుడవయి యుండుము. అప్పుడే నీ పరచింతన యభివృద్ధి పొందును. "ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెనో చూడుడు. !


( ఇక్కడ " మంచి గాని చెడ్డ గాని చేయుటకు నీవు కర్తవని యనుకొనరాదు ) అంటే ........ కొంతమంది అవకాశవాదులు దీనిని సాకుగా తీసుకుని ......... చెడ్డ పనులు చేసి వాటికి తాము కర్తలం కాదు అని భావించమని దీనికి అర్ధం కాదు.


ఈ కధలో జరిగిన సంఘటనలా ........... పూజల్లో పొరపాటుగా,....... పొరపాట్లు జరిగినప్పుడు భక్తులు అదే ఆలోచిస్తూ భయపడకూడదని సాయి ఆ సంఘటనను ఆ భక్తుని ద్వారా ఇలా జరిపించారేమో....... అని కూడా భావించవచ్చునేమో. ( అయితే పొరపాటు జరిగిన తరువాత పశ్చాత్తాపం చెందటం బాగుంటుంది )


ఇంకా జీవితంలో జరుగుతున్న ప్రతి కష్టమునకు విపరీతంగా క్రుంగిపోకుండా తేరుకుని భగవంతునిపై భారం వేసి మన కర్తవ్యాన్ని నిర్వహించాలని .......... మనకు జీవితంలో లాభం కలిగినప్పుడు ................ అంతా నా గొప్పే అని విర్రవీగకుండా భగవంతుని దయ అని భావించి గర్వాహంకారరహితులమై ప్రవర్తించాలి అని కూడా భావించవచ్చు.

 

No comments:

Post a Comment