koodali

Monday, December 27, 2010

విదేశాల్లో స్థిరపడటమే ఇక్కడ పుట్టిన ప్రతిఒక్కరి లక్ష్యమా ? .

 

ఈ రోజుల్లో , ఈ దేశంలో చాలామంది విదేశాల్లో స్థిరపడటమే జీవితలక్ష్యముగా భావిస్తున్నారు.

ఈ నాడు చాలామంది తల్లిదండ్రులు తమపిల్లల్ని విదేశాలకు పంపటమే ధ్యేయంగా చిన్నప్పట్నించి పిల్లలను ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకు ? డబ్బు సంపాదనే జీవిత ధ్యేయమా ?


ఇలా విదేశాల్లో స్థిరపడినవాళ్ళు ఏమంటారంటే ............... వారి వల్ల దేశానికి ఎంతో విదేశీమారకద్రవ్యం వస్తోందని అంటూ తమని తాము సమర్ధించుకుంటారు. ఇక్కడ సమస్య మన దేశంలో సంపద లేకపోవటము కాదు.................. ఉన్న సంపద ఒక ప్రణాళిక ప్రకారం సద్వినియోగపరుచుకోలేకపోవటం.


మన దేశంలో కావాలసినంత నీరు, మంచిపంటపొలాలు, ఇలా అనేకసహజవనరులు ఉన్నాయి. ఇక్కడ కావలసినంత సంపద ఉంది. అయితే అది కొద్దిమంది దగ్గర ప్రోగయి ఉండటం అసలు సమస్య.


పాత తరం వాళ్ళు చాలామంది తమ ఆస్తులను, జీవితాల్ని త్యాగం చేసి మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించారు. కానీ ఇప్పుడు మనవాళ్ళే విదేశాలకు వెళ్తున్నారు. ఇక్కడి యువత అంతా ఇలా వెళ్ళిపోతే దేశం ఎలా అభివృధ్ధి చెందుతుంది ?


మన దేశంలో పేదరికం, అవినీతి ఇలా ఎన్నో సమస్యలు ఉన్నమాట నిజమే . మన ఇల్లు బాగోలేదని ప్రక్క ఇంటికి వెళ్తే ఎంతకాలం గౌరవం ఉంటుంది ? మన ఇల్లు మనమే బాగు చేసుకోవటం పధ్ధతిగా ఉంటుంది.


ఉన్నత చదువులు, ఉద్యోగాలు అంటూ వెళ్ళి అక్కడ అలవాటుపడి మనసుకు సర్ది చెప్పుకుని అక్కడే ఉండిపోతున్నారు. అలా కాకుండా ఒక్క తరం వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారము .................. కష్టపడి ఈ దేశాన్ని అభివృధ్ధి చేసుకుంటే ...తరతరాల వాళ్ళు ఈ తరం త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. ఎవరూ గుర్తించకపోయినా మంచి పనులను భగవంతుడు గుర్తించటం జరుగుతుంది.


ఒక్క తరం కష్టపడితే చాలు ....... భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలవటానికి.

అలా కాకుండా విదేశాల ఆకర్షణలకు లోబడి అక్కడే స్థిరపడితే అక్కడ కొంతకాలం గౌరవాన్ని పొందవచ్చు. తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము.


ఎవరికయినా స్థానబలం, స్వధర్మం ముఖ్యం. మొసలి చూడండి.......దానికి నీళ్ళలో ఉన్నబలం నేల మీద ఉంటుందా ? మనింట్లో వేడి అన్నములో పచ్చడి ముద్దలు తిన్న తృప్తి పరాయి ఇంట్లో పాయసం తింటే వస్తుందా ?


మనం మన దేశం విడిచి ఇతరచోట్లకు వెళ్తే అక్కడ మనము పేదవారిగా ఉన్నంతవరకూ ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కొంచెం డబ్బు సంపాదించామంటే చాలు ఇక సమస్యలు మొదలవుతాయి. ఎప్పుడు ఎవరి బుధ్ధి ఎలా మారుతుందో చెప్పలేము.


మన తరువాతి తరాలవాళ్ళని మీ దేశం మీరు వెళ్ళిపోండి........లేకపోతే అక్కడే ఉంటే ,వాళ్ళని రెండో తరగతి పౌరులుగా బ్రతకమనే పరిస్థితి కూడా రావచ్చు. అప్పుడు ,.. ఇప్పుడు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళ పిల్లలు తమ తల్లిదండ్రుల మాతృదేశానికి తిరిగిరాలేక, ( వచ్చినా ఇక్కడి సంస్కృతికి అలవాటుపడలేక ) తాము పుట్టిపెరిగిన దేశంలో రెండవ తరగతి పౌరులుగా బ్రతకలేక ఎన్నో కష్టాలు పడతారు.


అందుకే ఎక్కడివాళ్ళు అక్కడే ఉండి తమదేశాన్ని అభివృధ్ధి చేసుకుంటే మంచిదేమో.

ఈ సామాజిక సమస్యలను ఆలోచించే మన పూర్వులు సముద్రం దాటితే పాపమని చెప్పారేమో ! అయితే అప్పట్లో కూడా కొన్ని దేశాలమధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి.


అయితే కొంతమంది మేధావులు అక్కడివాళ్ళు ఇక్కడికి , ఇక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళటం వల్ల దేశాల మధ్యన మంచి స్నేహసంబంధాలు ఉండే అవకాశం ఉంది. అయితే దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పటిలాగ................ వేలంవెర్రిగా........ పుట్టిన ప్రతిఒక్కరూ పరాయి దేశాలకు వెళ్ళిపోవాలని అప్పటి వారు అనుకునేవారు కాదు.


ఇప్పుడు కూడా కొంతమంది మన దేశంలోనే ఉండి , ఇక్కడి అభివృధ్ధికి పాటుపడాలనుకునే వాళ్ళు కూడా........ ఉన్నత ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్స్ ఇలాంటివాటి వల్ల తప్పనిసరిగా పరాయి దేశానికి వెళ్ళవలసి వస్తోంది.

అన్ని దేశాలు, ప్రాంతాలు సమానంగా అభివృధ్ధి చెంది, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటే ఈ సమస్య ఉండదు.


అందరూ ప్రపంచమంతా తిరిగితే సమసమాజం ఏర్పడుతుందేమో అని ఒకోసారి అనిపించినా .......ఒకోసారి అది పూర్తిగా సరి కాదేమో అని కూడా అనిపిస్తోంది.


ఏది ఏమైనా ఈ రోజుల్లో , విదేశాల్లో స్థిరపడాలన్న ఆలోచన
ఇంత వేలంవెర్రిగా......... చాలా ఎక్కువ మందిలో ఉండటం దేశానికి ఆందోళన కలిగించే విషయం.

భారతదేశం గొప్ప పుణ్యభూమి. ఇక్కడ ఒక చెట్టుగా అయినా జన్మ లభిస్తే చాలని దేవతలు కూడా కోరుకుంటారట. అలాంటప్పుడు నేటి పరిస్థితి ఎంతో బాధాకరం.

కష్టాలలో ఉన్న కన్నతల్లిని వదిలి వెళ్ళటం ఎంత తప్పో ................. కష్టాలలో ఉన్న మాతృభూమిని వదిలి వెళ్ళటం అంతే బాధాకరమైన విషయం.. ( అయితే పిల్లలు మన మాట వినకపోతే మనమేమీ చెయ్యలేము ).

 

22 comments:

  1. welsaid.. anni meere chepparu.. pillalani aalochinchamani.. cheppdam ..minahaa.. yem cheyalem.. anakoodadhemo..try cheddam.

    ReplyDelete
  2. Well Said.
    Good Logic.

    ReplyDelete
  3. చాలా బాగుందండి అందరూ ఆలోచించ వలసిన విషయం.

    ReplyDelete
  4. మీరు చెప్పిన వన్నీ నిజాలు. కానీ దేశం వదిలి రావటానికి చాలా కారణాలు. నా ఉద్దేశం లో పుట్టిపెరిగిన తిండి అలవాట్లు,పరిచయ్యలూ, ఆత్మీయతలూ వదిలిపెట్టి ఎక్కడో ఏదేశం లోనో పరిచయం లేని చోట, అపరిచితుల లోకం లోకి, కానీ లేకుండా వెళ్ళా రంటే ధైర్యం కావాలి.ఆ ధైర్యం తెచ్చుకునే పరిస్థితులు కూడా కావాలి. జీవితం లో ఆసరా ఇచ్చే వ్యవస్థ లేక పోతే దేశం వదలి వెళ్ళి పోయి, సంవత్సరాలు కష్టపడి అన్నీ కుదుర్చుకున్న తరువాత వచ్చి మాకు సేవ చెయ్యి ఇప్పుడు నీవు బాగున్నావు కదా అనటం కూడా తప్పే.

    పిల్లలు అందరూ విదేశాలకి పోవాలి అని కష్టపడుతున్నారు అనుకోటం కూడా పొరపాటే. అది పిల్లలకన్నా చుట్టుపక్కల చూసి, విని స్వార్ధంతో
    పిల్లలని ఎగతోసే పెద్దవాళ్ళే ఎక్కువ. విదేశాలకి వచ్చిన తరువాత ఎంత బాధ పడాలో పెద్దలకి తెలియదు, సామాన్యంగా ఎవరూ చెప్పారు గూడా; వాళ్లకు కనపడేవి మిరుమిట్లు కొలిపే నగిషీ జీవన విలాసాలు తప్ప. ఏ పిల్లవాడు చక్కగా చదువులూ, ఆటలు,పాటలు సమానంగా ఉండాలని కోరుకోడు?

    ReplyDelete
  5. ధన్యవాదములండి. మీరన్నట్లు తల్లిదండ్రులు పిల్లలకు నచ్చచెప్పటానికి తప్పక ప్రయత్నించాలి.

    ReplyDelete
  6. ధన్యవాదములండి.

    ReplyDelete
  7. ధన్యవాదములండి.

    ReplyDelete
  8. ధన్యవాదములండి. మీరు చెప్పినట్లు చాలామంది రకరకాల కారణాలవల్ల వారికి ఇష్టం లేకపోయినా మాతృదేశం వదలి పరాయి దేశానికి వెళ్ళవలసి వస్తుంది. ఇలా వెళ్ళిన వారిలో మా బంధువులు కూడా ఉండటం వల్ల అక్కడి ప్రాబ్లంస్ కొన్ని నాకు తెలుసు.

    కానీ నా అభిప్రాయమేమిటంటేనండి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి అక్కడ స్థిరపడినతరువాత ఇది మనదేశం అని నిబ్బరంగా జీవించే పరిస్థితులు అక్కడ ఉంటాయా ? అని నాకు సందేహం కలిగింది. ఈ మధ్యన విదేశాలలో భారతీయులమీద దాడులు, ఇంకా ప్రపంచములోని కొన్ని సంఘటనలు చూశాక.

    అంటే పరాయి దేశం వెళ్ళి స్థిరపడిన రెండుమూడు తరాలతర్వాత కూడా వారిని పరాయివారిగా భావిస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాముకదా ! అదే మన దేశమయితే మనలో మనం కొట్టుకున్నా అది వేరే కధ. మన దేశం అని ధైర్యంగా ఉంటుంది.

    అదీకాక ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాతృదేశంలో ఉండి దేశానికి సహాయపడుతూ జీవించటం లో ఉన్న తృప్తి ఎంతో గొప్పది అని నా అభిప్రాయమండి.

    అంతేకానీ, తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళినవారిని చిన్నబుచ్చటం నా అభిప్రాయం కాదండి. అసలు ఈ పోస్ట్ వ్రాసే ముందే చాలా ఆలోచించానండి . ఇది చదివి ఎవ్వరూ హర్ట్ కాకూడదని.

    ఇక మీరన్నట్లు ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు నలుగురిలో తమ గొప్పకోసం పిల్లలను ఫోర్స్ చేసి విదేశాలకు పంపుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వారిని , మరియు విదేశాలలో శాశ్వతముగా స్థిరపడాలనుకునేవారిని ఒకసారి గట్టిగా ఆలోచించమన్నదే నా విన్నపము... .. ..

    ReplyDelete
  9. మనం మన దేశాన్ని పేద దేశం అనుకుంటాము. కానీ విదేశీయులు ఇక్కడి సంపదను, ఇక్కడ ఎదిగే అవకాశాలను గుర్తించి వందల సంవత్సరాలనుంచీ ఈ నాటి వరకూ కూడా ఇక్కడ వ్యాపారాలు చెయ్యటానికి తహతహలాడుతూనే ఉన్నారు.

    ముందుముందు విదేశీయులు ఇక్కడ ఉద్యోగాలు కూడా చేస్తారట. మనదేశంలోని సంపదను వారు గుర్తించినట్లు మనం గుర్తించలేకపోతున్నాము. రత్నగర్భ , ఒకప్పుడు వీధులలో రత్నాలను రాశులుగా పోసి అమ్మిన ఈ దేశాన్ని పేదదేశంగా భావించి ఈనాడు మనము ఉద్యోగాల కొరకు విదేశాలకు పరుగులు పెడ్తున్నాము. విదేశీయులేమో ఈ దేశంలో వ్యాపారములు ,ఉద్యోగాలు చెయ్యటానికి ఉత్సాహపడుతున్నారు.

    మనకు ఈ దేశం విలువ తెలియకపోవటం మన దురదృష్టం.. ఇతర దేశాలవాళ్ళు మన దేశ సంస్కృతిని , విజ్ఞానాన్ని మెచ్చుకుంటుంటే మనము ఇక్కడ అంతా చాదస్తం అని మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాము. ...

    అసలు ఇక్కడి వాళ్ళు ఎవరూ విదేశాలు వెళ్ళకూడదని నా అభిప్రాయం కాదండి. ఆ సంఖ్య ఈ మధ్య విపరీతంగా పెరిగి చదువుకున్న ప్రతిఒక్కరూ అలా ఆలోచిస్తున్నందువల్ల ఆందోళన కలుగుతోంది. ఇంత మేధోవలస వల్ల దేశాభివృధ్ధికి ఆటంకం కలుగుతుంది కదా !.

    ReplyDelete
  10. ఇంత మేధోవలస వల్ల దేశాభివృధ్ధికి ఆటంకం కలుగుతుంది కదా !.
    ------
    "మేధావులు" దేశాన్ని పరిపాలిస్తుంటే, మేధోవలస ఎందుకు జరుగుతోంది అని ఆలోచించి ఆపగల శక్తీ ఉంటుంది అని నా అభిప్రాయం.

    ReplyDelete
  11. మీకు నా ధన్యవాదములండి. అయితే పాలకులలో ప్రతిఒక్కరు మేధావులు, విజ్ఞత గలవారు అయితే ప్రజలకు నిజంగానే ఉపయోగం కలుగుతుందండి...

    ReplyDelete
  12. /డబ్బు సంపాదనే జీవిత ధ్యేయమా ?/
    కాదు, దేశాలు చూడాలనే ధ్యేయం. :)

    /ఇక్కడ సమస్య మన దేశంలో సంపద లేకపోవటము కాదు...ఉన్న సంపద ఒక ప్రణాళిక ప్రకారం సద్వినియోగపరుచుకోలేకపోవటం./
    అవును. కల్మాడీలు, కరుణానిధులు, రాజాలు, వైఎస్సార్లు, లల్లూలు బాగానే సద్వినీయోగించుకుంటున్నారు కదా! అది చేతకాని వాళ్ళు బయటికి వెళుతున్నారు. పైగా ఇక్కడ 50%శాతం పైన కుల రిజర్వేషన్లు కూడా. మెరిట్ వున్నోడికి చప్రాసీ వుద్యోగం రావడం కూడా కష్టమే. 'అమ్మ పెట్టదు, అడుక్కు తిన నివ్వదు ' లా వుంది. ఏమంటారు? :)

    ReplyDelete
  13. @snkr
    నా నోట్లో ఉంది పైకి అనలేని మాటలను చక్కగా చెప్పారు. థాంక్స్.

    ReplyDelete
  14. మీకు నా ధన్యవాదములండి. మీ కామెంట్ కొద్దిసేపటిక్రితమే చూశానండి.

    మీరు చెప్పిన మన వ్యవస్థలోని లోపాలు, మీరు చెప్పిన వ్యక్తుల లాంటివారు విదేశాలలో ఉండరా అండీ ? చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉంటాయి ఇలాంటి లోటుపాట్లు.

    మెరిట్ ఉండి చప్రాసీ ఉద్యోగానికి సిధపడ్డ వ్యక్తి ఉద్యోగానికి ఎదురుచూడకుండా ఒక చిన్న ఇడ్లీ, బజ్జీలు అమ్మే షాప్ పెట్టుకుని కూడా బ్రతికే అవకాశం ఉందండి. విదేశాలలో ఇలాంటి పనులు చేస్తూ తమ కాళ్ళమీద తాము నిలబడి చదువుకునే వ్యక్తులు కూడా ఇక్కడ ఆ పనులు చెయ్యటానికి ప్రిస్టేజీ ఫీలవుతారు.

    ఉదాహరణకు ఇలా చెప్పాను. ఇడ్లీలు అవి అమ్మటం నామోషీ ఏమీ కాదు. పదిమందికి అన్నం పెట్టే గౌరవమైన పని. అలా పైకి వచ్చి స్టార్ హోటల్ స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అదొక్కటే కాదు. వ్యవసాయం, ఇంకా , తానే ఒక చిన్న సంస్థ ఇద్దరితో మొదలుపెట్టి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కూడా చేరవచ్చు. ..

    ఇక్కడ........ ఇప్పుడు కోటీశ్వరులుగా ఉన్నవాళ్ళలో చాలామంది ఒకప్పుడు పేదరికం నుంచి కష్టపడి జీవితంలో పైకి వచ్చినవారే.

    విదేశాలలో జీవించటం అంత ఈజీ ఏమీ కాదు కదండి. అక్కడ పడే కష్టాలు ఇక్కడ పడితే ఇక్కడ కూడా జీవితం బాగానేఉంటుంది.

    అక్కడయితే సరిగ్గా పనిచేయకపోతే ఉద్యోగము ఉండదు. ఇక్కడ చాలా ఉద్యోగాలు పనిచేసినా చెయ్యకపోయినా జీవితాంతం ఉంటాయి. ఇలాంటి ప్లస్ పాయింట్స్ కూడా మనము మర్చిపోకూడదు.

    అక్కడ కష్టానికి తోడు ఇంకా పరాయి దేశం అన్న అనీజీనెస్ కూడా ఉంటుంది.

    అక్కడ రోడ్ పైన చిత్తుపేపర్ వెయ్యటానికి భయపడి దానిని డస్ట్ బిన్ లో వేసే వ్యక్తే ఇక్కడకు వచ్చేటప్పటకి ఎవరూ పట్టించుకోరులే అని చిత్తుకాగితాన్ని రోడ్ పైనే వేసేవాళ్ళు కూడా ఉన్నారు..

    అక్కడ ఉన్నంత బాధ్యతగా ఇక్కడ కూడా ఉంటే అంతా సరిగ్గానే ఉంటుందండి.. మన దేశాన్ని మనం చక్కదిద్దుకోకపోతే ఎవరు చక్కదిద్దుతారు ?.

    ReplyDelete
  15. మీకు నా ధన్యవాదములండి. నాకు తెలిసింది చెప్పానండి.

    ReplyDelete
  16. @anrd
    అసలు సంగతి చెప్పేదా నేను. జేవితం లో ఒక ధ్యేయం ఉన్నవాళ్ళు అది నెరవేర్చు కోవటం కొరకు ఎన్ని కష్టాలయినా పడతారు ఎంత దూరమయినా వెళ్తారు. గెలుపు ఓటమి లు లెక్క లేకుండా ప్రయత్ నిం చామనే త్రుప్తి కోసం అలా వెళ్తారు. దాన్ని ఎవరూ ఆపలేరు. మిగతా కారణాలు ఎన్నయినా చెప్పచ్చు కానీ ఇది అక్షరాలా నిజం.

    ReplyDelete
  17. /మీరు చెప్పిన మన వ్యవస్థలోని లోపాలు, మీరు చెప్పిన వ్యక్తుల లాంటివారు విదేశాలలో ఉండరా అండీ ? చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఉంటాయి ఇలాంటి లోటుపాట్లు./

    అక్కడ కూడా వున్నారు, కాని ఇక్కడిలా బరితెగించి లేరు. చెత్తవూడ్చేవాడి దగ్గరినుంచి, ప్రధానమంత్రి దాకా ఇక్కడ అవినీతిపరులు. లక్షల కోట్ల డబ్బు పోతున్నా ఏమీ జరగదు. కోర్టుల్లో అవినీతి! ఆర్మీలో అవినీతి! ఆఖరుకు క్రీడల్లో కూడా! అవినీతి లేని ప్రదేశమంటూ లేదు.

    కులం మీద రిజర్వేషన్లు ఇక్కడ తప్ప ఇంతలా ఎక్కడా లేవండి. 30% మార్కులు తెచ్చుకోలేని ఎదవకు కులం సర్టిఫికేట్తో ఐ.ఐ.టిలో సీటొస్తుంది, సివిల్ సర్వెంట్ అవుతాడు. అదే 90% వచ్చిన అగ్రకులస్తుడికి JNTUలో కూడా సీటు కష్టమే!

    ఇక్కడ ఇడ్లీలు అమ్ముకుంటే వచ్చే ఆదాయం కన్నా అక్కడ చెత్తవూడ్చినా ఇంతకన్నా ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఓ సగటు కుటుంబం నుంచి వచ్చినవారు ఆపని చేస్తే, అదోలా చూస్తారు. అక్కడ ఆ సమస్య వుండదు. ఇక్కడ ఇంజనీర్లు ఇడ్లీలమ్ముకునే బదులు అక్కడ వెళ్ళి నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం మేలు కాదా?

    ఆ వెళ్ళేవారు ఏ కొద్దిమందో! దేశ్ జనాభాలో పోలిస్తే <1%, తక్కిన 99+% మందితో దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించుకోవచ్చు, మరి అవ్వట్లేదే!?

    మీ ఆవేదన అర్థమయ్యింది, నేనూ ఒకప్పుడలా ఆలోచించేవాడిని. విశాలంగా ఆలోచిస్తే, కుటుంబంలో ఒక్కడు బయటికి వెళ్ళినా ఆ కుటుంబం ఆర్థికంగా కొంత ఎదుగుతుంది. అదేకదా మనకు కావాల్సింది.
    ======
    /మన దేశాన్ని మనం చక్కదిద్దుకోకపోతే ఎవరు చక్కదిద్దుతారు ?. /
    దేశం సంగతి సరే, మీ బ్లాగులో వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తారా? కమెంటెట్టడానికి కాస్త ఇబ్బందిగా వుంది.

    ReplyDelete
  18. / జేవితం లో ఒక ధ్యేయం ఉన్నవాళ్ళు అది నెరవేర్చు కోవటం కొరకు ఎన్ని కష్టాలయినా పడతారు ఎంత దూరమయినా వెళ్తారు./

    రావ్ గారు, ఇది కొద్దిగా భావావేశంతో వుంది. ఎందుకు పోతున్నారు అంటే -
    1) అక్కడ 4డాలర్లు వెనకేస్తే, ఇక్కడ X45=180రూ వెనకేసినట్టు
    2) అక్కడ వున్నామంటే అదో ' చెట్టెక్కామన్న ఫీలింగ్ ' :D
    3) అక్కడ కార్లు, లాంగ్-డ్రైవింగ్, ఏదో విలాసవంతమైన జీవితం గడుపుతామన్న భావన. :)

    దేశమంటే మట్టి కాదు, మనుషులు. మనం బాగు పడితే(కల్మాడీ, రాజాల్లాగ కాదు) దేశం బాగుపడినట్టే! :)

    ReplyDelete
  19. @snkr గారూ
    మీరు చెప్పిన మూడు కూడా కొందరి ధ్యేయం అవ్వచ్చు. వాటిల్లో తప్పేమి లేదు కదా.

    తర్వాత మీరన్నది

    "దేశమంటే మట్టి కాదు, మనుషులు. మనం బాగు పడితే(కల్మాడీ, రాజాల్లాగ కాదు) దేశం బాగుపడినట్టే!"

    చాలా నిజం. అందరూ స్వశక్తితో బాగుపడదామని ప్రయత్నిస్తే దేశం ప్రపంచమూ బాగు పడుతుంది.

    ReplyDelete
  20. మీకు నా ధన్యవాదములండి.

    మీరు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక ఇంట్లో ఒక మనిషి సంపాదించినా ఆర్ధిక పరిస్థితి బాగుపడుతుందని. ఒక శాతం మంది విదేశాలకు వెళ్తే ఇక్కడౌన్న 99 శాతం మంది దేశాన్ని అభివృద్ధి చెయ్యవచ్చుగదా అన్నారు.

    అంటే ఒక వ్యక్తి సంపాదిస్తుంటే మిగతా అందరూ రకరకాలకారణాలవల్ల సంపాదించే స్థితిలో లేరని మీ అభిప్రాయం. కాబోలు. అలాగే ఈ దేశంలో కూడా 90 శాతం మంది ఈ దేశంలోనే ఉన్నా వారు పేదవారు, మధ్యతరగతి వారు. వాళ్ళ జీవితాల్ని దిద్దుకోవటానికే వారికి దారితెలియటంలేదు. ఇక దేశాభివృద్ధికి వారు ఏమి చేయగలరు ? అవినీతిపరులనుంచి రక్షించటానికే వారికి ఇతరుల సహాయం అవసరం . మిగతా పదిశాతం మందిలో ఎక్కువమంది , ....... కాస్త డబ్బు , చదువు ఉన్నవాళ్ళు ఇలా విదేశాలకు వెళ్ళిపోతే అభివృద్ధి ఎలా అనే నేను చెబుతున్నది.

    మీరు ఇతరదేశాలలో అవినీతి లేదన్నారు. అది సరే. అయితే వాళ్ళు
    మనవాళ్ళలా లక్షలు, కోట్లకు ఆశపడరు. ఇతర దేశాల ఆర్ధికవ్యవస్థను, వీలయితే దేశాలను చాపకింద నీరులా చక్కదిద్దటానికి ప్రయత్నిస్తారు. ఈ ఆధిపత్య ధోరణిని మనకు స్వాతంత్రం రాకముందు ప్రత్యక్షంగానూ, ఇప్పుడు పరోక్షంగానూ మనం చూస్తూనే ఉన్నాము.
    రిజర్వేషన్స్లో మార్కులు తగ్గించటం లేకుండా ఉంటే మంచిది.


    రిజర్వేషన్స్ ప్రపంచములో ఎక్కడా లేవన్నారు, రిజర్వేషన్స్ లేకపోయినా ఉద్యోగాల కొరకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు మగవాళ్ళతో పోటీపడుతున్నారు. అందువల్ల మగవాళ్ళకు చాలా ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. దాని గురించి మాట్లాడితే ఆడవాళ్ళు ఏమైనా అంటారని చాలామందికి భయం ,



    ఇంకా , రకరకాలకారణాలవల్ల ఒకోసారి ఇతరదేశాలకు, మనదేశానికి స్నేహ సంబంధాలులో ఎప్పుడైనా తేడావచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు అక్కడకు వెళ్ళిన మన వారికి ఇబ్బందే. ఈ మధ్యన భారతీయులమీద దాడులు జరగటం కూడా చూస్తున్నాము. ఈ దేశాన్ని అవినీతి దేశం, అస్సలు పనికిరాని దేశం అన్నవాళ్ళే ఎప్పుడైనా వాళ్ళకి విదేశాల్లో ప్రాబ్లంస్ వస్తే మాతృదేశ సాయం కోసం ఎదురు చూస్తారు. మాతృదేశం నచ్చక వెళ్ళిపోయినా అక్కడవారికి ఎప్పుడయినా ఇబ్బందులు వస్తే చేతనయినంత ఆదుకోవటానికి మాతృదేశం ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. ఎంతయినా మాతృదేశం ( తల్లి ) కదా !


    అయితే ఈ దేశాన్ని చిన్నబుచ్చేవాళ్ళే కాదు విదేశాలకు వెళ్ళినా ............ మనదేశ గొప్పదనాన్ని మరచిపోక తిరిగి ఇక్కడకు వచ్చినవాళ్ళు ఉన్నారు. రాలేని పరిస్థితిలో అక్కడే ఉండి ఈ దేశ సంస్కృతిని తమపిల్లలకు నేర్పిస్తున్నవాళ్ళు ఎందరో ఉన్నారు.

    అయితే నేనెప్పుడూ ఎవరూ విదేశాలు వెళ్ళకూడదని అనలేదండి. అలా వెళ్ళకుండా కుదరదు కూడా . ఒక లిమిట్ దాటి విపరీతంగా మేధోవలస జరుగుతోందనే ఇలా అంటున్నాను. అసలు దేశాల మధ్య కొందరి రాకపోకలు ఉంటేనే అన్నిదేశాల మధ్యన స్నేహసంబంధాలు బాగుంటాయి. కొందరు శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనల కోసం ఇలా వెళ్తుంటారు. మన జ్ఞానసంపదను ప్రపంచానికి తెలపటానికి వివేకానందులవారే ఇలా ప్రపంచములో కొన్ని దేశములు వెళ్ళివచ్చారు..


    విదేశీయులంటే నాకు చాలా గౌరవం కూడా ఉంది. మనదేశంలోని పేదవారికి వారిద్వారా ఎన్నో నిధులు సహాయంగా అందుతున్నాయి కూడా .

    అయితే ఎక్కువమంది విదేశాలకు వెళ్ళకుండా మనదేశంలోనే ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని అని నాకు తోచింది వ్రాసానండి. అయితే ఎవరి జీవితం వారిష్టమే కదండి.... ... .......

    ReplyDelete
  21. :))

    Ok, I am unable to agree with your opinions/conclusions though I agree with your spirit,in principle.

    One request as a co-citizen of motherland:

    In the name of motherland, please disable word verification.... :)

    ReplyDelete
  22. మీకు ధన్యవాదంలండి. జవాబు కోసం దయచేసి మీరు ఈ పోస్ట్ .2. వ భాగంలో ( జనవరి 3 న వ్రాసిన పోస్ట్ క్రింద కామెంట్స్ ) చూడగలరా ?

    ReplyDelete