koodali

Friday, October 31, 2025

చేసిన తప్పు లకు పశ్చాత్తాపాన్ని పొంది.....

 

 దైవానుగ్రహం పొందాలన్నా, గురువు అనుగ్రహం పొందాలన్నా సత్ర్ప్రవర్తన అవసరం.


    కొందరు పాపాలు చేసి, తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తారు.  తాము పశ్చాత్తాపం చెందాం కాబట్టి,  ఇక తమకు ఎటువంటి శిక్షా లేకుండా ఉండాలని కూడా కొందరు ఆశిస్తారు. 

ఇలాంటి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపం చెందారా లేక పరిస్థితి అనుకూలిస్తే మళ్ళీ నేరం చేస్తారా? అనేది తెలియదు.

        నిజంగా పశ్చాత్తాపం చెందినా కూడా కొంతయినా  శిక్ష పడక తప్పకపోవచ్చు. ఎందుకంటే, నేరస్తుల వల్ల బాధితులకు జరిగిన అన్యాయం, బాధ, ఆక్రోశం ఉంటాయి కదా!

   చిన్న నేరం అయితే బాధితులు నేరస్తులను క్షమించే అవకాశం ఉంది, లేక కొద్దిపాటి శిక్షతో సరిపెట్టుకోవచ్చు.

  పెద్ద నేరం, క్రూరమైన నేరం చేస్తే మాత్రం.. నేరం చేసిన వాళ్ళు పశ్చాత్తాపాన్ని ప్రకటించినా కూడా శిక్ష తప్పకపోవచ్చు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు.  అప్పుడు, నేరస్తులు ఎంత ప్రాధేయపడినా ఉపయోగం ఉండకపోవచ్చు.

  అయితే, నేరం చేసిన కొంతకాలం తరువాత కానీ,మరణానికి ముందు కానీ .. పశ్చాత్తాపం కలిగితే దానివల్ల మరుజన్మలో కొంత మంచి జన్మ రావటానికి ఉపయోగపడవచ్చు.
    ..........................
       
    సమాజంలో క్రూరమైన నేరం చేసిన తరువాత ఉరిశిక్ష పడితే ఆ శిక్ష నుండి తప్పించాలని జడ్జి ముందు ఎంత ఏడ్చి ప్రాధేయపడినా ఏం లాభం? 

జడ్జి ఎంత దయకలవారైనా వారికి కొన్ని నియమాలు ఉంటాయి కదా..వారు చట్టం ప్రకారం నడచుకోవాలి.

   జీవులు తమను తాము నిగ్రహించుకోలేక పాపాలు చేసి, తత్ఫలితంగా కష్టాలు వస్తే దైవాన్ని నిందించటం సరికాదు.  .

   కొందరు పాపకర్మలను పరిహారాలు చేయటం ద్వారా తొలగించుకోవాలనుకుంటారు. అయితే, పాపకర్మల పరిహారం కొరకు పరిహారక్రియలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి.
  .....................................................

      భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు. భక్తులనే వాళ్లు పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు? 

బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు, లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక తిరిగి తప్పులు చేస్తారు.

    ****************

    ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి.  ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.

    అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం ..అనేది అసలు ఉద్దేశం కాదు. 

తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం.

    చెడుపనుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు. అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.

    ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.
 ..............................

కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.

ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.

    ****************
    రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి. అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.

    పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.
    ****************


    కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.

    తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?

    దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు.
    ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.

    శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు.
    శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.

(రావణాసురునికి తాను గొప్పసంపదలు ఉన్న వ్యక్తిని అనే అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది, తాను ఎలా ప్రవర్తించినా కూడా ..దైవం కూడా తన భక్తికి లొంగక తప్పదు.. అనే అహంకారం ఉండి ఉంటుంది.అందుకే అతనిపరిస్థితి అలా అయ్యిఉంటుంది. )


    శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు.

    అందువల్ల, అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.

 దైవం పట్ల ప్రేమతో కూడిన శరణాగతి ఉంటే,
 దైవం  కాపాడుతారు.

    ......................

ఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.

    చెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి. 

అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.

     ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది. 

అయితే, కర్మలకు సంబంధించి ఎవరికర్మ ఏమిటి? దానికి ఫలితాలు ఎలా ఉంటాయి? అనేది..మనకు తెలియని విషయాలెన్నో ఉంటాయి. అవన్నీ దైవానికి తెలుస్తాయి.
  .................


    కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.

ఉదా..ఒక మంచి వ్యక్తికి కోపం బాగా ఉండి అందువల్ల ఇతరులకు బాగా ఇబ్బందులు కలిగితే, అందువల్ల కూడా ఆ మంచివ్యక్తికి కొన్ని బాధలు కలిగే అవకాశముంది.

    ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.
 .................................

  
   ఎన్ని పాపాలు చేస్తునా కూడా కొన్ని పరిహారాలు చేస్తే చాలు సరిపోతుందని అనుకోవద్దు. దైవము ఏమీ అమాయకులు కాదు.

ఉదా.. చేసిన పుణ్యాలకు చాలా డబ్బును ఇచ్చి, చేసిన పాపాలకు ఫలితంగా ఇష్టమైన ఆహారాన్ని తినలేని విధంగా సుగర్ వంటి వ్యాధులను వచ్చేలా చేస్తారు.

 కష్టాలు రాకుండా ఉండాలంటే, మనస్సును నిగ్రహించుకోవటానికి ప్రయత్నించక తప్పదు. 

...........................

links... ఓం ..కొన్ని విషయములు..

 

Tuesday, October 28, 2025

గ్రహ స్థితులు ఎలా ఉన్నా ...

 

  కొందరు జోతిష్కులు చెబుతున్న ప్రకారం.. రాబోయేరోజుల్లో తీవ్రమైన బాధాకరమైన సంఘటనలు ప్రపంచంలో జరుగుతాయని చెబుతున్నారు. అవి వింటే ఎవరికైనా భయాందోళనలు కలుగుతాయి. 

అయితే, భక్తితో దైవస్మరణ, దైవనామస్మరణ,  లోకక్షేమం కొరకు యజ్ఞయాగాదులు చేయటం, ధర్మబద్ధంగా జీవించటం..వంటి వాటివల్ల రాబోయే విపత్తులు గణనీయంగా తగ్గుతాయి. 

గ్రహ స్థితులు ఎలా ఉన్నా .. దైవభక్తి, మన ప్రవర్తనను బట్టి కూడా పరిస్థితులను మార్చుకోవచ్చు. గాయత్రి మంత్రాన్ని .. అందుకు సంబంధించిన విధులను చక్కగా ఆచరించటం మంచిది. అందువల్ల లోకక్షేమం కలుగుతుంది. ఎక్కువసార్లు చేయకపోయినా, కొన్నిసార్లు అయినా శ్రద్ధతో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

అయితే, గాయత్రి మంత్రాన్ని అందరూ చేయకూడదంటారు. పెద్దవాళ్లు చెప్పినట్లు పాటించటం మంచిది.    సర్వగాయత్రి మంత్రాన్ని అందరూ చేయవచ్చు,  సర్వగాయత్రిని చేసినా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.
 

అయితే, కొందరు సర్వగాయత్రి మంత్రాన్ని చదవటంలో కూడా.. అలా కాదు, ఇలా చదవాలంటూ..చెబుతున్నారు. ఇవన్నీ సందేహాలు ఎందుకనుకుంటే.. దైవస్మరణ, దైవనామస్మరణ చక్కగా చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. కలికాలంలో దైవస్మరణ, దైవనామస్మరణ సులభోపాయమని పెద్దలు తెలియజేసారు. 

 ********************
దైవపూజలు చేసినప్పుడు ప్రజలు , ప్రపంచంలో అందరికి తమతో సహా బుద్ధి సరిగ్గా ఉండాలని కూడా దైవాన్ని ప్రార్ధించుకుంటే మంచిది. బుద్ధి సరిగ్గా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. సరైన విధంగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధించితే మంచిది.

*********************

 వ్రాసిపెట్టి ఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు.

ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును  మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.


ఉదా.. భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని  పొందగలిగితే  మంచి జరుగుతుందని తెలుస్తుంది.
********* 

గ్రంధాల ద్వారా మరి కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు.  

 ఎవరైనా బాగా పట్టుదలగా తపస్సు చేస్తే, దేవతలు  వరాలనివ్వటం జరుగుతుంది.
 
కొందరి విషయాలలో.. తపస్సు వల్ల  విపరీతమైన వేడి వచ్చి, ఆ వేడి లోకమంతా వ్యాపిస్తే.. ఆ వేడిని తట్టుకోలేని ప్రజలు దేవతలను ప్రార్ధిస్తే.. దేవతలు వరాలనివ్వటం జరుగుతుంది. ఆ వరాలను పొందిన తరువాత, వరాలను పొందినవారు వరగర్వంతో  ప్రజలను బాధ పెడితే, అప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా లోకక్షేమం కొరకు  దైవం వారిని చంపివేస్తారు.

ఈ విషయాలను గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, ఒక్కరు దృఢంగా తపస్సు చేస్తేనే లోకంపై చాలా ప్రభావం ఉన్నప్పుడు....కొందరైనా మంచివాళ్ళు లోకక్షేమం కొరకు గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తే ... దైవం వరాలను ప్రసాదిస్తారు.. అనిపించింది.

 ******************

లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు  మనకు ఏమనిపిస్తుందంటే,   దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. 

అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం  చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా? 
 
దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా,   సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.

మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అంతా దైవము దయ.


*************************

 Sunday, August 18, 2024
ఈ పోస్టును పైనవ్రాసిన తేదీన మొదట పోస్ట్ చేయటం జరిగింది. కొన్ని కారణాల వల్ల అక్కడ పోస్టును ఇక్కడ వేసి, ఇక్కడ పోస్టును అక్కడ వేయటం జరిగిందండి.

 

 

ఏవి నిజమో? ఏవి ప్రక్షిప్తాలో? మరికొన్ని విషయములు..

 

గ్రంధాలలో 
ఎన్నో అర్ధం కాని విషయాలుంటాయి.  ప్రక్షిప్తాలు కూడా ఉంటాయి. 

ఇవన్నీ  అదేపనిగా ఆలోచిస్తూ, వాదిస్తూ సమయాన్ని గడపటం కన్నా, ఇవన్నీ విని గందరగోళం పడటం కన్నా..కొంతవరకు తెలుసుకుని..అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుని మన శక్తికొలది చక్కగా దైవాన్ని ఆరాధించుకోవటం మంచిదనిపిస్తుంది.
................

ఒకప్పుడు వేదములను రాక్షసులు అపరించినప్పుడు,  దైవము రాక్షస సంహారం చేసి వేదాలను రక్షించారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. 

వేదాలనే అపహరించగలిగినప్పుడు, ఎవరైనా గ్రంధాలలో మార్పులుచేర్పులు(ప్రక్షిప్తాలు) చేయటంలో ఆశ్చర్యం ఏముంటుంది.
..................
 

మాంసాహారం వల్ల ఎంతో జీవహింస జరుగుతుంది. మద్యం వంటి మత్తు పదార్ధాల వల్ల మనస్సు అదుపు తప్పి ఎన్నో నేరాలు జరిగే అవకాశముంది. అందువల్ల, వాటిని ప్రోత్సహించేలా మాట్లాడటం సరైనదేనా?
...................
మాంసాహారం తినకూడదని వేదములలో ఉందని కొందరు చెబుతున్నారు.

 చక్కగా గాయత్రిని ఆచరించే కుటుంబాలవారు ఎన్నో నియమాలను పాటిస్తారు. అలా చేయలేనివారు తక్కువ నియమాలను పాటిస్తారు.

అయితే ఈ మధ్య కొందరు, ఎవరైనా కూడా అనేక నియమాలను పాటించాలన్నట్లు చెబుతున్నారు. ఉదా.. ఉల్లి,వెల్లుల్లి వంటివి తినకుండా నియమాలు పాటించాలన్నట్లు చెబుతున్నారు.

మరికొందరు ఏమంటున్నారంటే, గాయత్రిని ఆచరించే కొన్ని అగ్రవర్ణాల వారు (ఉదా..క్షత్రియులు..)మాంసాహారం తినొచ్చు అంటున్నారు.

ఒకరు ఏమంటున్నారంటే, బ్రాహ్మణ,క్షత్రియులు..యజ్ఞంలో వ్రేల్చబడిన బలిని  (మాంసాహారాన్ని) తీసుకోవాలని గ్రంధాలలో ఉందని చదివినట్లు గుర్తు ..అని చెబుతున్నారు.

 గాయత్రి మంత్రాన్ని చేసేవారు మాంసాహారాన్ని తీసుకోవచ్చా?

 ఎలా తిన్నా కూడా మాంసాహారం మాంసాహారమే కదా...అప్పుడు ఎవరైనా దైవం పేరు చెప్పి జీవహింస చేసి మాంసాహారం తిని, మేం చేసింది తప్పుకాదు అంటే సరిపోతుందా?

నియమాలను పాటించేటప్పుడు ఉల్లివెల్లుల్లి వంటివే తినకూడదంటే, మాంసాహారాన్ని ఎలా తీసుకుంటారు? ఏమిటో ?

................

భారతదేశం విదేశీపాలనలో ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించో, ప్రలోభపెట్టో గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు( ప్రక్షిప్తాలు)చేయించారేమో?

హిందువుల్లోనే కొందరు తమలోతాము గొడవలు పడి తమకుతోచినట్లు ప్రక్షిప్తాలు చేసారేమో? ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.

..............
నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే, యుద్ధరంగంలో పోరాడేవారు పౌరుషం రావటానికి బహుశా మాంసాహారం అలవాటుచేసుకున్నారేమో?..అనుకున్నాను.

ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, రాజ్యం మీదకు దండెత్తి వచ్చిన శత్రువులను చూస్తే.. వారిని ఎదుర్కునే ధైర్యం దానికదే రావాలి. అంతేకాని, ధైర్యం రావటం కొరకు మూగజీవులను చంపనవసరం లేదు.

తామసాహారాన్ని తింటే కోపం, ఆవేశం..వంటి తామస గుణాలు కలుగుతాయంటారు. ఆ విధంగా ఆహారం ద్వారా ఆవేశం రావాలంటే, మాంసాహారమే తిననవసరం లేదు. ఉప్పు,కారం బాగా ఉండే నిల్వ పచ్చళ్ళు, చద్ది ఆహారం.. కూడా తామసాహారమే. అలాంటివి తిన్నా సరిపోతుంది.

...........................

కలికాలంలో దైవస్మరణ..దైవనామస్మరణ చేసినా చక్కగా తరించవచ్చని ప్రాచీనులు తెలియజేసారు. దైవానుగ్రహాన్ని పొందటానికి సులభమైన మార్గాలెన్నో ఉన్నాయి.

 చక్కగా తన్మయత్వంతో దైవ ప్రార్ధన చేసుకోవటం, దైవస్మరణ, భజనలు, భక్తి పాటలు పాడటం కూడా చేయవచ్చు. ఇలాంటివాటికి డబ్బు ఖర్చు కూడా అంతగా ఉండదు. 

 

Monday, October 27, 2025

ఎన్ని చేసినా ..

 

 ఎన్ని పూజలు చేసినా కష్టాలు తీరట్లేదని కొందరు వాపోతుంటారు. అలా జరగటానికి అనేక కారణాలుంటాయి. 

మరి కొన్ని విషయాలను చెప్పుకుందాము..

ఆవుపాలు, నెయ్యి..వంటివి తీసుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయని ప్రచారాలు ఎక్కువవటం, పూజలకంటూ పెద్ద ఎత్తున ధారాళంగా పాలు, నెయ్యి వాడకాలు పెరిగాక కూడా పాలు, నెయ్యి, పెరుగుకు డిమాండ్ బాగా పెరిగింది.

 వేలాదిగా జనం వచ్చే కొన్ని దేవాలయాలలో ప్రసాదాల కొరకు వేల లీటర్ల నెయ్యిని వాడుతారు. 

ఇంకా, మామూలుగా కూడా పాలు, నెయ్యి తో తయారుచేసిన స్వీట్స్ తినటానికి, కాఫీలు, టీలు..తాగటానికి జనాలు బాగా అలవాటు పడ్డారు. 

ఇంతమంది జనాలకు ఇన్ని పాలు కావాలంటే ఆవులు, గేదెలు..ఎన్ని సార్లు గర్భధారణ చేసి అలసిపోవాలి?

 మేము ఒకసారి కొద్దిగా ఆవుపాలకొరకు ఒక దగ్గరకు వెళ్తే, అక్కడ  
మసక వెలుతురులో ఉన్న ఒక బిల్డింగ్లో ఆవులను ఉంచి పెంచుతున్నారు. సిమెంట్ గచ్చు ఆవులకు గుచ్చుకుంటుంది కదా..

 అక్కడ పరిసరాలు మురికిగా ఉన్నాయి.  ఆ మసక వెలుతురులో ఆ ఆవులు పాపం ఆకలి కొరకు తినటం చేస్తున్నాయి. అవన్నీ చూశాక నాకు చాలా బాధనిపించింది. 

 చక్కగా ఆరుబయట పచ్చికబయళ్ళలో తిరగాల్సిన ఆవులను డబ్బుకొరకు అలా కట్టేసి వ్యాపారం చేయటం..అలాంటి పాలు, నెయ్యి తెచ్చి దైవానికి ఇస్తే దైవము మెచ్చుకుంటారా? 

ఇక ముసలి ఆవుల పరిస్థితి అయితే చెప్పలేము. కొందరు వాటి పాలు పిండుకుని అవి ముసలివి అయ్యాక కబేళాకు పంపేస్తారు.ఇవి దారుణమైన విషయాలు. 

వాటిని జీవితాంతము చక్కగా పెంచగలిగితేనే వాటిని పెంచాలి. 

 మనకు పుణ్యం కొరకో, ఆరోగ్యం కొరకో, మనం అదేపనిగా స్వీట్స్ తినటానికి, కాఫీలు, టీలు..తాగటం కొరకో..వాటిని అలా  బాధించటం ఏమిటి? 

 తమ కష్టాలు తీరటం కొరకు మొక్కుకుని దూడలను పుట్టించి దేవాలయాలకు దానం ఇస్తారు కొందరు. ఇక అంతటితో అయిపోతుందా? అవేమీ బొమ్మలు కాదుకదా..ప్రాణమున్న జీవులు. 

వాటిని జీవితాంతము పోషించడానికి ధనం కావాలి, చక్కగా చూసుకునే మనుషులు ఉండాలి. 

వేలసంఖ్యలో గోవులు అయినప్పుడు,  ఒకవేళ వాటిని ఎవరైనా సరిగ్గా చూసుకోకుంటే,  ఆ పాపం ఎవరికి తగులుతుందో? మన కష్టాలు పోవాలని వాటిని కష్టపెట్టకూడదు కదా..

.....................

అభిషేకాల కొరకు లీటర్ల పాలు, పెరుగులు సమర్పించటం కన్నా, మంచినీటితో అభిషేకం చేసినా దైవానుగ్రహం కలుగుతుందని నా అభిప్రాయం. 

లేదంటే ఆవులను మంచిగా పెంచుతూ కొద్దిపాటి పాలతో అభిషేకించినా చాలు.

ఒక్కొక్కరు అభిషేకం చేయటం కంటే, సామూహికంగా  పూజ చేస్తూ పూజ చేయించుకునేవారు పక్కన ఉండి, వారి గోత్రనామాలు చదివి పూజారులు అభిషేకం చేయవచ్చు. అప్పుడు తక్కువ పాలు, నెయ్యి..సరిపోతుంది.
కొన్ని దేవాలయాలలో ఇలాగే అభిషేకాలు చేస్తారు. 

 ...................

అందరికి వేల లీటర్ల స్వచ్చమైన పాలు, నెయ్యి లభించక కల్తి చేస్తున్నారు. 

అన్యాయార్జిత సొమ్ముతో సంపాదించిన ద్రవ్యాలతోను, కల్తీ వాటితోను పూజలు చేసినా సరైన ఫలితాలు రాకపోవచ్చు.

......................
 జీవితంలో జాలి, దయ, నైతిక విలువలు పాటిస్తేనే దైవానుగ్రహాన్ని పొందగలరు కానీ, మానవత్వం లేకుండా ఎన్ని చేసినా ..

 

అంతా దైవము దయ...

 
ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి.

 ప్రపంచంలో మతాల పేరిట, అధికారం గురించి, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం.

 ప్రపంచంలో జరుగుతున్న హింస చాలా బాధగా ఉంది.

ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ,  పాపాలు చేసి  అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. 

డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.

మద్యపానం, మత్తుపదార్ధాల వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతోంది. 

సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు. 

ఎవరైనా ఘోరమైన నేరాలు చేస్తే వారిని కఠినంగా  శిక్షించేలా చట్టాలు ఉండాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే,  ఎవరైనా నేరాలు చేయాలంటే ..భయంతో వణికిపోయేలా ఉండాలి.    హింసతో కూడిన ప్రసారాలకు, సమాజానికి హాని కలిగించే వ్యవహారాలకు.. ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకట్ట వేయాలి.  ప్రభుత్వాలు ఎప్పుడు ఇవన్నీ చేస్తాయో అర్ధం కావటం లేదు.

    ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా,  నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం?  వారి సంగతి దైవం చూసుకుంటారు.

 కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.

ఆ మధ్య ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు చెప్పినదాన్ని బట్టి.... ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది... 

అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు. 

మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.

కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న  ఘోరాలు వింటుంటే చాలా బాధగా ఉంది. రాక్షసప్రవృత్తి కలవారి పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి. 

అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి. 

************** 

మనుషులు చేస్తున్న పాపాల వల్ల ఎవరి కర్మ వారిదని దైవము ఊరుకుంటున్నారేమో? 

   అయితే, యుద్ధాలు, హృదయవిదారకమైన ఘటనలు, యాక్సిడెంట్లు, రక్తపాతాలు జరిగినప్పుడు అమాయకులైన పిల్లలు, మంచివారైన పెద్దవాళ్లు, అమాయకజీవులు.. కష్టాలు పడినప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. 

దైవం చెడ్డవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది. 

గ్రంధాల ద్వారా దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.

 అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు. 

కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. అలా జరగడానికి గల కారణాలు మనకు తెలియకపోవచ్చు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు. దైవానికి అన్నీ తెలుస్తాయి.

  మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి.  దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.
...............
 ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి.  దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.

అంతా దైవము దయ...

oka link.... గ్రహ స్థితులు ఎలా ఉన్నా ...

 

Sunday, September 7, 2025

ఎప్పటికైనా..

 
భారతదేశం ఎంతో సుందరమైనది. ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్న దేశం. కొన్ని విదేశాల్లో అందంగా ఉన్నా కూడా ,  అక్కడ కొన్ని చోట్ల విపరీతమైన చలి కూడా ఉంటుంది. భారతదేశంలో వాతావరణం ఎండాకా
లం, వర్షాకాలం, చలికాలం తట్టుకోలిగే విధంగానే ఉంటుంది. 

అయితే ప్రజలు ఈ దేశాన్ని శుభ్రత లేకుండా మురికిగా చేయటం బాధాకరం. ఎక్కడపడితే అక్కడ చెత్తవేయటం, కిళ్లీలు ఉమ్మటం..మలమూత్రాలు చేయటం చేస్తున్నారు. ఇలా చేసేవారిని శిక్షించటం, జరిమానాలు వేస్తేనే వారు మారతారు. 
ప్రభుత్వాలు కూడా పబ్లిక్ టాయిలెట్స్ కట్టించాలి. 

చెట్లు ఎక్కువగా నాటి పెంచటం,రోడ్లు, పార్కులు శుభ్రం చేయటం, పరిసరాలు అందంగా ఉంచటంలో అనేకమంది కార్మికులను నియమిస్తే ఎందరికో ఉపాధి లభిస్తుంది.


మన భారతదేశం ఎప్పటికైనా ఇలా శుభ్రంగా ఉంచుకోగలమా? ఈ లింక్ లో  చూడండి... దీనికి సంబంధించిన ఫొటోలు ఈ పోస్ట్ క్రింద 
కూడా ఉన్నాయండి.

Beautiful Village Giethoorn of Netherlands |

విదేశాల్లో వాళ్లు తమ దేశాన్ని ఎంత అందంగా ఉంచుకున్నారో..మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాము? ఎవరి వద్ద నుండి  అయినా చెడును నేర్చుకోకూడదు కాని, మంచిని నేర్చుకోవచ్చు.

 పరిసరాలు శుచిగా, శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రాచీనులు తెలియజేసారు.

చండీగఢ్ కొంత శుభ్రంగా ఉంటుందంటారు. అలా శుభ్రంగా ఉండటానికి అక్కడ పనిచేసిన ఒక కమిషనర్ గారు..
ఇతర సిబ్బంది కూడా కారణట. వారు ప్రజలలో శుభ్రత గురించి ఎప్పటికప్పుడు అవగాహన తెస్తూ చైతన్యవంతులను చేస్తూ చిన్నపిల్లలకు  కూడా శుభ్రత గురించి చెబుతూ ఎంతో కృషి చేసారట.

 కమీషనర్ గారు..
సిబ్బంది చెప్పినవి విని ప్రజలు  పాటించటం కూడా గొప్ప విషయమే. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు అందరూ సరిగ్గా పాటిస్తేనే ఏదైనా బాగుంటుంది.
..................................
 కొందరు మైకుల ద్వారా పెద్దగా శబ్దాలు పెడుతున్నారు. వార్తలు చెప్పేవారు కూడా ఎందుకో గట్టిగా అరుస్తూ  వార్తలు చెబుతున్నారు.
..................................

  ఇతరదేశాల వాళ్లు భారతీయులను వెళ్ళిపొమ్మంటున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మనము మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటే ఎక్కడికో వెళ్లి మాటలు పడే పరిస్థితి ఉండదు కదా..

భవిష్యత్తులో విదేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో? తమ తరువాత తమ పిల్లల పరిస్థితి అక్కడ ఎలా ఉంటుందో? (భయపడుతూ బతకాలేమో?) ఇవన్నీ విదేశాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.
................
 

ఎవరైనా గొప్పవాళ్లం అనుకుంటే.. వారు తమ గొప్పతనంతో  తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు.  తామూ బాగుండవచ్చు.

........................

మన దేశంలో చిన్న పరిశ్రమలు నెలకొల్పితే,  విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తిరిగివస్తారు. మన యువత కూడా ఐటీ రంగంలో మాత్రమే కాకుండా వ్యాపారాలు చేయటానికి ముందుకు రావాలి..

ఐటీలో ఉద్యోగాలు చేస్తూ ఎప్పుడు ఉద్యోగాల నుంచి తీసేస్తారో అని భయపడటం కన్నా, స్వంతంగా వ్యవసాయ రంగం, వ్యాపారం, కుటీర పరిశ్రమలు ఉపాధిపొందటం చెయ్యాలి.
...............

 ఇరుగుపొరుగు దేశాలనుండి అనేకమంది అక్రమంగా భారతదేశంలోకి వచ్చి ఇక్కడ స్ఠిరపడుతుంటే, మన వాళ్లు ఉపాధి వెతుక్కుంటూ విదేశాలకు వెళ్లి కష్టాలు పడుతున్నారు. 

ఎన్నో సంవత్సరాలనుండి విదేశీయులు వస్తుంటే ఎందుకు సమర్ధవంతంగా అడ్దుకోలేదో అర్ధం కావటం లేదు. ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలి.
...........

జనాభా అదేపనిగా పెరిగితే అందరికీ ఉద్యోగాలు లభించాలంటే కష్టం. భారతదేశంలో జనాభా ఎక్కువ..భూమితక్కువ. కొన్ని విదేశాల్లో జనాభా తక్కువ.. భూమి ఎక్కువ. 

యంత్రాల వినియోగం పెరిగిన ఎక్కువైన తరువాత ప్రపంచం అంతటా నిరుద్యోగం ఎక్కువవుతోంది.

యంత్రాలతోనే ఎక్కువగా పనులు చేయించుకుంటున్న ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు లభించాలంటే కష్టమే. కష్టమైన పనులను యంత్రాలతో చేయించి, మిగతా పనులను మనుషులే చేయాలి.
.............

మనుషులు బతకటానికి అవసరమైన గాలి, నీరు, సూర్యరశ్మితో కూడిన వాతావరణం, ఆహారానికి అవసరమైన మొక్కలు, చెట్లు..వంటివెన్నో దైవమే ఏర్పాటు చేసారు. అయినా మనుషులు సరిగ్గా బతకలేకపోతున్నారు.

 ఆహారం,ఇల్లు, వైద్యం, విద్య, రక్షణ..ఇలా నిత్యావసరాలు బాగుంటే చాలు చక్కగా బ్రతకవచ్చు. అయితే, అనేకకోరికలతో విలాసాలనే నిత్యావసారాలుగా చేసుకుని వాటికోసం అదేపనిగా కష్టపడుతున్నారు. 

కొందరు మనుషులు సరిగ్గా బతకలేకపోవటానికి బలవంతులైన కొందరు బలహీనులను అణచివేయటం కూడా కారణమే.కొందరు చెడ్దవాళ్ళు ఇతరులను బాధిస్తూ పెత్తనం చేస్తున్నారు.
.............

కంపెనీల్లో ఒక పనికి ఎక్కువ జీతాన్ని ఇచ్చి (సుమారు లక్షన్నర అనుకోండి..) ఒక్కరితో ఎక్కువ పనిచేయించటంటం కన్నా, అదే పనికి ఇద్దరిని నియమించి ఒక్కొక్కరికి లక్ష ఇస్తే, నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. 

వ్యక్తులు అలసిపోరు కాబట్టి పనిలో నైపుణ్యత పెరుగుతుంది.   పనిగంటలు తగ్గి సమయం మిగులుతుంది కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబసంబంధాలు కూడా బాగుంటాయి.

ఉద్యోగుల జీతాలు పెంచితే, వ్యాపారస్తులు ధరలు పెంచుతారు. ఇలాంటప్పుడు తక్కువ ఆదాయ వర్గాల వారు కొనలేని పరిస్థితి ఉంటుంది.

విపరీతంగా ధరలు పెంచకుండా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

.......................
ఈ రోజుల్లో ఉద్యోగాలంటూ స్త్రీలు ఉదయం వెళ్ళి రాత్రికి వస్తుంటే విపరీతమైన పనివల్ల అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. స్త్రీలలో గర్భసంచి వ్యాధులు బాగా పెరిగాయి.

 స్త్రీలు అంద
రికి  ఉద్యోగాలు కావాలని  ఎవరినైనా బ్రతిమలాడటం కన్నా,  దర్జాగా  కొందరు స్త్రీలు కలసి చిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. తమకు సదుపాయంగా ఉండేటట్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పనిగంటలు ఏర్పాటుచేసుకోవచ్చు. 

అందరూ స్త్రీలే  ఉంటారు కాబట్టి, లైంగిక వేధింపులు వంటివాటి బారినుండి కూడా కొంతవరకు తప్పించుకోవచ్చు.

డబ్బు బాగా ఉన్న స్త్రీలు మహిళామండలిగా ఏర్పడి సమాజసేవ చేయవచ్చు. పేద వారు పైకి రావటానికి సాయం చేయవచ్చు. అంటే విద్య, వైద్యం వంటి విషయాల్లో తమకు తోచిన సాయం చేయవచ్చు. వారికి చదువు చెప్పవచ్చు. చక్కటి సలహాలను అందించవచ్చు. 

రకరకాల చీరలు, నగలు ధరించినా కలగని సంతోషాన్ని ఇతరులకు సాయం చేయటంలో పొందవచ్చు...ఎంతో పుణ్యం కూడా వస్తుంది.
.................

ఈ మధ్య యూట్యూబ్ లో కొన్ని వార్తలు చదివాను. కొన్ని చోట్ల కొందరు స్త్రీలను కొందరు బాస్ లు బెదిరిస్తున్నారట. ఉద్యోగం ఊడకుండా ఉండాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా తమ కోరికలు తీర్చాలని అడుగుతున్నారట. తప్పని పరిస్థితిలో కొందరు స్త్రీలు లొంగిపోతున్నారట. ఇలాంటివి ఎంతో బాధాకరం.

 తల్లుల మాట చాలా మంది పిల్లలు వింటారు కాబట్టి,  తల్లులు తమ పిల్లలకు చిన్నతనం నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని,  నైతికవిలువలతో జీవించాలని నేర్పించితే వారు వినే అవకాశం ఉంది.

.................

 కొందరిలో ఎందుకో తెలియదు కాని,  పాపభీతి లేకపోవటం, అత్యాశ, సోమరితనం, స్వార్ధం..వంటి లక్షణాలు పెరిగాయి.

ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న నేరాలు..ఘోరాలు గమనిస్తే, మనుషులకు నైతికవిలువలు ఎంత అవసరమో తెలుస్తుంది.

ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే, బయట ఎక్కువసార్లు తినకుండా చక్కటి ఇంటిభోజనం తినాలి.

 శారీరికంగా, మానసికంగా దేశానికి  మంచి పౌరులు తయారవ్వాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు తప్పనిసరిగా వీలు కుదుర్చుకుని పిల్లలకు నైతిక విలువలను నేర్పించాలి. ఇందుకు గృహిణి యొక్క సహాయసహకారాలు ఎంతో ముఖ్యం.

 ఉపాధ్యాయులు కూడా పిల్లలకు నైతిక విలువలు పెంపొందేలా కృషిచేయాలి.

మంచి పౌరులను తయారుచేయటం ఎంతో గొప్పవిషయం.  
 నైతికవిలువలు కలిగిన మంచి పౌరులు ఉంటే ...కుటుంబాలు తద్వారా సమాజమూ అన్నీ బాగుంటాయి.

నైతికవిలువలు కలిగిన 
వారు  మంచిగా ప్రవర్తిస్తారు. అశ్లీల చిత్రాలు దేశమ్మీదకు వదిలి డబ్బు సంపాదించరు,  ఇతరులను మోసం చేయరు , నేరాలుఘోరాలు చేయరు. ధరలు విపరీతంగా పెంచి ఇతరులను దోచుకోరు. 

*నైతికత ఉన్న పౌరులు ఉన్నసమాజం దానికదే బాగుంటుంది. ఎప్పటికైనా అంతా బాగుండాలి.

 ................
* అన్నింటికి దైవమే దిక్కు. 

 ........................

Beautiful Village Giethoorn of Netherlands |

How to visit Giethoorn, Netherlands, a charming village ...
Visit Giethoorn, the picturesque Dutch village with no roads ...

***************
 
 దైవానికి అనేక కృతజ్ఞతలు.
 

 

Friday, September 5, 2025

ఏం మనుషులో...?

 


మేము వినాయక నిమజ్జనం కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉందంటే..ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ఆకులు, పువ్వులు ఉన్నాయి. చెత్త కూడా పడేసి ఉంది.  దుర్వాసన వస్తోంది.
 
 ఇక ఆ నీటిలో నిమజ్జనం చేయలేక ఇంటికి వచ్చి చిన్న బకెట్లో నీళ్ళు పోసి,  ఆ నీటిలో నిమజ్జనం చేసి నీటిని చెట్ల వద్ద పోసాను. ఎవరికైనా దగ్గరలో మంచి నీటి  చెరువు ఉంటే అక్కడ కూడా కలపవచ్చు.  

ఆ నీటిని మొక్కల వద్ద పోస్తే మనం అక్కడ మట్టిలో నడుస్తాము కదా..అని సందేహాలు రావచ్చు..చెరువు నీటిలో నిమజ్జనం చేసినా చెరువునీటిలో నిలబడతారు, చెరువు నీటిని పనులకు వాడుకుంటారు, చెరువు నీటిని  స్నానానికి కూడా ఉపయోగిస్తారు  కదా..అనిపించింది. 

మరీ ఎక్కువ ఆలోచిస్తే అయోమయం అవుతుంది. కొంతవరకే ఆలోచించగలం. మానవప్రయత్నంగా కొంతవరకు ఆలోచించి పాటించి.. దైవాన్ని నమ్ముకోవటం మంచిది.
 ..............

 పాతకాలంలో వినాయక చవితి సందర్భంగా  కొందరు తమ పిల్లలను మొక్కలు, చెట్ల వద్దకు తీసుకువెళ్ళి పత్రిని సేకరించేవారు. ఆ విధంగా ఎంతో విలువైన 21 రకాల పత్రి గురించి పిల్లలకు తెలిసేది. పూజ తరువాత ఆ పత్రిని చెరువులలో కలపటం వల్ల ఆ ఆకులలోని మెడిసినల్ గుణాలు నీటిలో కలిసేవి. 
 
 వినాయకుని  ప్రతిమకు రసాయన రంగులు వేసి నీటితో కలిపితే మంచిది కాదు. 
.....................

మరికొన్ని విషయములు..

ఈ రోజుల్లో చాలా పూజలలో విపరీతంగా సామాగ్రిని వాడుతున్నారు.
 
పూజలు ముగిసేసరికి బోలెడు నిర్మాల్యం మిగులుతాయి. కొందరు  వాటిని చెత్తలో వేస్తున్నారు.  ప్లాస్టిక్ కవర్లతో సహా నీటిలో పడేస్తారు కొందరు. 
 
కొందరు తమ దీక్షలు పూర్తయ్యాక దీక్షా వస్త్రాలను నదీతీరాల వద్ద గట్లవద్ద వదిలేసి వెళ్లిన దృశ్యాలు వార్తల్లో వచ్చాయి. 
 
కుంభమేళా తరువాత మిగిలిన టన్నుల వ్యర్ధా

లను మిషన్లతో ఎత్తిపోయవలసి వచ్చిందట. 

ప్రజలు కొన్ని విషయాలను పాటించాలి. 

దైవచిత్రాలను ఎక్కడపడితే అక్కడ ముద్రించి తరువాత వాటిని చెత్తలో వేయటం సరైనది కాదు. 

 పూజల తరువాత మిగిలిన వాటిని, తినగా మిగిలిన ప్రసాదం పాకెట్లను రోడ్ల పక్కన పడేయటం కాకుండా జాగ్రత్తగా ఒక దగ్గర వేయాలి.

పసుపుకుంకుమ తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు, నూనె, నెయ్యి కవర్లు..ఇలాంటివి  నీటిలోను, రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ వేయడం కాకుండా, ప్లాస్టిక్ వేసే చెత్తబుట్టలలో మాత్రమే వేయాలి. 

పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. చెరువులను, నదులను అశుభ్రంగా చేయకూడదు

....................

పాతకాలంలో సంక్రాంతికి భోగి రోజున ఇంట్లోని పాత చెక్క సామాను విరిగినవి, పాడైనవి ఉంటే భోగిమంటలో వేసేవారు. ఆ విధంగా ఇల్లు శుభ్రం అయ్యేది. ఈ రోజుల్లో కొందరు భోగిమంటలో రబ్బరు టైర్లను కూడా వేస్తున్నారు. ఇందువల్ల పొల్యూషన్ పెరుగుతుంది.
 .........................................
 
టెక్నాలజి పేరుతో ప్లాస్టిక్ ..వంటివాటి వల్ల పొల్యూషన్ పెరుగుతుంటే.. వాటిని విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ పడేస్తూ మరింత పొల్యూషన్ పెంచుతున్నారు.
 
పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వంటివి వాడి ఎక్కడపడితే అక్కడ పారేయటం,  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు  రసాయన రంగులు కలిసిన భారీ విగ్రహాలను తయారు చేసి, నీటిలో నిమజ్జనం చేయటం.. జరుగుతోంది. 

ప్లాస్టిక్ వంటి కొన్నింటి తయారీ మరియు వాడకం వల్ల 
కొందరు ఉపాధి పొందుతున్నారు కాబట్టి, అలాంటి వాటిని విమర్శించకూడదు, నిషేధించమని అనకూడదని కొందరు అనుకుంటారు.

 పొల్యూషన్ వల్ల కొన్ని జీవజాతులు అంతరించే పరిస్థితిలో ఉన్నాయని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అలాంటప్పుడు మన అవసరాలకోసం లేక కొందరు బ్రతకటం కోసం  పొల్యూషన్ పెంచుతూ పోతే మనుషులతో సహా అన్ని జీవజాతులు అంతరించే ప్రమాదముంది.

.....................................

సోషల్ మీడియా వల్ల  విపరీతధోరణి మరింత పెరిగింది. మీడియాలో ఉండాలంటే ఎప్పుడూ ఏదో ఒక్కటి చెప్పాలని కొందరు ఎప్పుడూ ఏదో చెబుతూ ఉన్నారు.

 మన దేశంలో చాలా మందికి అత్యాశ పెరిగింది. ఎంతసేపూ ఎలాగైనా డబ్బు సంపాదించాలనే పిచ్చి పెరిగింది. తల్లితండ్రి పిల్లలను చంపటం, భార్యాభర్తల అక్రమసంబంధాలు..ఒకరినొకరు క్రూరంగా చంపుకోవటాలు ఎక్కువయ్యాయి. 


మీడియా ద్వారా అశ్లీలమైన, భయంకరమైన వ్రాతలు, దృశ్యాలు ప్రసారాల ప్రభావం చాలా ఉంటుంది. మూఢనమ్మకాలను ప్రచారం చేసేవాళ్లు కూడా ఎక్కువయ్యారు. ఇలాంటి వాటిని ఎందుకు బాన్ చెయ్యటం లేదో అర్ధం కావటం లేదు.


 అశ్లీలత, భయానకమైన విషయాలు, మూఢనమ్మకాలు..ఇలాంటివి మీడియాలో రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇలాంటివి ప్రచారం చేసే వాళ్లపైన కేసులు పెట్టి శిక్షించాలి.
..........................

మన దేశంలో చాలామంది  శుభ్రతను పాటించటం లేదు. అశుభ్రంగా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేసే వారిపైన కూడా కేసులు పెట్టి శిక్షించాలి.
....................

ఈ రోజుల్లో చాలా విషయాల్లో వేలం వెర్రిలా ఏది ఎందుకు చేస్తున్నారో తెలియకుండా తయారవుతోంది.

ఎలాగోలా డబ్బు సంపాదించటం..విపరీతంగా ఆస్తులు పోగేయటం..విపరీతంగా వస్తువులను కొనేయటం..రకారకాలు వండుకుని విపరీతంగా తినటం...చేస్తున్నారు. మా డబ్బుతో మేం కొనుక్కుంటాం.. అనటానికి వీల్లేదు. 


విపరీతమైన వస్తు వినియోగం వల్ల పర్యావరణం పాడవుతుంది. అమూల్యమైన ఖనిజ సంపద తరిగిపోతుంది. ఈ ప్రపంచం ఏ కొద్దిమందికి సంబంధించినది కాదు. అన్ని జీవులకు సంబంధించినది.
...............

మన కష్టసుఖాల గురించి కొందరు మనుషులతో చెప్పుకోవటం కంటే, దైవానికి చెప్పుకోవటం మంచిదనిపిస్తుంది.
 
సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సాటి మనుషులతో కూడా మంచిగా ఉండాలి.  కష్టసుఖాలలో సాటి మనుషుల  సహాయసహకారాలు కూడా అవసరమే కానీ, మనుషులు కొంతవరకే చేయగలరు. 
 
దైవము సర్వశక్తివంతులు. వారు తలచుకుంటే ఏమైనా చేయగలరు. మానవప్రయత్నం సరిగ్గా చేస్తుంటే, దానికి తగ్గ ఫలితాన్ని దైవమే అందిస్తారు. 


పండుగలు, పూజలు కూడా కొందరు తమకు తోచినట్లు చెబుతుంటే, చేసేవాళ్లు తమకు తోచినట్లు చేస్తున్నారు. ఆచారవ్యవహారాల పేరుతో ప్రజలను భయపెట్టటం కూడా ఎక్కువయ్యింది.

ఈ రోజుల్లో ఎవరికి ఏమీ చెప్పేటట్లు లేదు. అందరిని సరైన దారిలోకి తీసుకురావాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.