koodali

Monday, February 19, 2018

ఏపీ వారి పట్ల ఇప్పటికీ కొందరి ద్వేషభావం...


  ఇప్పటికీ కొందరు తెలంగాణా వాళ్ళ మాటల్లో ఏపీ ప్రజల పట్ల ద్వేషభావం ఉన్నదని తెలుస్తోంది  కాబట్టి  ఇవన్నీ  వ్రాయటం జరిగింది.. అయితే,  ఏపీ పట్ల సానుభూతి చూపిస్తున్న  ప్రొఫెసర్ కె.  నాగేశ్వర్ గారు  వంటి తెలంగాణా వాళ్ళూ ఉన్నారు.

  విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ నష్టపోయి   ఉన్నా కూడా  ఇప్పటికీ కొందరు తెలంగాణా  వాళ్ల మాటలలో ఏపీ ప్రజలంటే  ద్వేషభావం  ఉంటోంది. ఇలా  ద్వేషభావం ఉండటం  అత్యంత బాధాకరం.

ఏపీ వాళ్లు దోపిడీదార్లయితే  సీమాంధ్ర  ఇలా వెనుకబడి ఉండేది కాదు. కొందరు పెట్టుబడిదారులు సమాజ  సంపదను  దోచుకున్న మాట విషయం వాస్తవమే.  అయితే,  సమాజసంపదను దోచుకున్న వారిలో  అన్ని  ప్రాంతాల  వాళ్లూ ఉన్నారు. తెలంగాణా  వాళ్ళు  కూడా  ఉంటారు.


ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రాంతం దోచుకునుంటే ... విభజన  జరిగిన వెంటనే తెలంగాణా సంపన్న రాష్ట్రం గా ఎలా మిగిలింది ?  ఆంధ్రప్రదేశ్ పేదరాష్ట్రంగా ఎలా మిగిలింది ?


******************

కొందరు  తెలంగాణా వాళ్లు ఏమంటారంటే, ఏపీ వాళ్లు మా ఉద్యోగాలను దోచుకున్నారు, మా నీటిని దోచుకున్నారు.. అన్నారు.

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా  స్థానికులు..వలసవాదులు..అనే  సమస్యలు వస్తున్నాయి. ఒకే భాష వారిలో కూడా  స్థానికులు..వలసవాదులు..అనే  సమస్యలు  వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా రావడంలో ఆశ్చర్యం లేదు.

   ఆంధ్ర వాళ్ళ వల్ల మా ఉద్యోగాలు పోతున్నాయి.. అని కొందరు తెలంగాణా  వాళ్ళు అన్నారు.  మరి ఎందరో  తెలంగాణా వాళ్ళు  ఉద్యోగాల  కోసం  ఇతర దేశాలకు కూడా వెళ్తున్నారు కదా!  వీళ్ళ వల్ల  అక్కడి స్థానికుల  ఉద్యోగాలు తగ్గుతాయి కదా!


ఇంకో విషయం ఏమిటంటే,  నదులు అందుబాటులో   ఉండే ప్రాంతాలను నదీ పరీవాహక ప్రాంతాలంటారు.

అయితే, ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలేమిటంటే, కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటాయంటే,  నదులు ప్రవహిస్తున్నా కూడా నీరు భూమికి  తేలికగా  అందనంత దూరంలో ఉంటుంది.  అంటే , భౌగోళిక పరిస్థితి వల్ల   నదుల నీరు  వాడుకోవాలంటే ఎత్తిపోతల ప్రాజెక్టులు అవసరమవుతాయి.

ఉదా..తెలంగాణాలో  నదులు ఉన్నా కూడా,  భౌగోళిక పరిస్థితి వల్ల ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టడం తప్పనిసరి.  ఇలాంటి ప్రాంతాలు పేరుకి  నదీపరీవాహకప్రాంతాలే కానీ,  నీరు అందుబాటులోకి రావాలంటే చాలా ఖర్చవుతుంది..


 ఏపీలోని  కృష్ణా, గోదావరి  ప్రాంతాలలో ఎక్కువ భాగం  పల్లంగా ఉంటాయి కాబట్టి , అక్కడ నీరు అందివ్వాలంటే    పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి   బోలెడు  ఎత్తిపోతల పధకాలు కట్టనవసరం లేదు.

అందువల్ల,   నీరు సులభంగా ప్రవహించే ఆంధ్రప్రదేశ్లోని  కృష్ణా, గోదావరి ప్రాంతాల లో    కొంతవరకు    వ్యవసాయం  అభివృద్ధి చెంది ఉండవచ్చు.  అంతేకానీ, తెలంగాణాను చిన్నచూపు చూశారనుకోవటం సరైనది కాదు.


ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టాలంటే వేలకోట్ల డబ్బు అవసరమవుతుంది.  సమైఖ్య రాష్ట్రంలో  తెలంగాణా ప్రాంతంలో     నిర్మించిన   ఎత్తిపోతల పధకాలన్నీ  కేవలం   తెలంగాణా జిల్లాల  నుంచి వచ్చిన ఆదాయం తోనే కట్టారా?
......................

ఇంకో  విషయం ఏమిటంటే ,    రాజధాని కాబట్టి హైదరాబాద్ కు  అందరూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో  మిగతా ప్రాంతాలలో ఎక్కువగా అభివృద్ధి జరగలేదు.. వ్యవసాయాధారిత పరిశ్రమలు కూడా  అభివృద్ధి కాలేదు ..ఏపీ  వాళ్లు కూడా తమ పెట్టుబడులను హైదరాబాద్ చుట్టుప్రక్కలే పెట్టారు.


కేంద్ర సంస్థలు ఎక్కువగా హైదరాబాద్   చుట్టూనే  ఏర్పాటు చేసారు.ఈ కారణాలతో  ఎక్కువమంది  హైదరాబాద్ కు  రావటం జరిగింది. ఎక్కడికక్కడ ఉపాధి ఏర్పాటు చేసి ఉంటే హైదరాబాద్   వెళ్ళవలసిన అవసరమేముండేది ?


సీమాంధ్రులు  విశాలాంధ్ర కోసం  తమ ప్రాంతములో రాజధానిని  త్యాగం చేశారు.  . విభజన తరువాత   తమ ప్రాంత అభివృద్ధిని కూడా పట్టించుకోలేదు.
 

****************
తెలంగాణా జిల్లాలలో సీమాంధ్ర జిల్లాల కన్నా అభివృద్ధి బాగానే ఉందని శ్రీ కృష్ణ కమిటీ వివరించారు కదా !

ఉమ్మడిరాష్ట్రంలో తెలంగాణాకు అన్యాయం జరిగిందని  కొందరు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో  ఏ ప్రాంతంలోనూ  సరైన అభివృద్ధి  జరగలేదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా  భారతదేశంలో  జరగవలసినంత అభివృద్ధి జరగలేదు.  ఈ దుస్థితికి పాలకులు  మరియు ప్రజలు కూడా  కారణం.

***************

కొందరు ఏమంటారంటే , నాగార్జునసాగర్ విషయంలో ఆంధ్రవాళ్ళు అన్యాయం చేసారంటారు. ఏమిటి ఆంధ్రవాళ్ళు చేసిన అన్యాయం?

ఆంధ్ర.. తెలంగాణా.. రాయలసీమ.. ఉత్తరాంధ్ర...ప్రాంతాలకు నీరు అవసరం కదా! 


ఆ రోజుల్లో .. ఉమ్మడి మద్రాసు రాష్ట్రము  కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు సన్నాహాలు చేయుట మొదలుపెట్టింది. ....( అక్కడ కావేరి నది ఉన్నా కూడా .. ఆ నీరు చాలటం లేదని ,  ఎక్కడో  ఉన్న కృష్ణానీటి కోసం వారి ప్రయత్నం..)

 ఇలాంటి పరిస్థితిలో.. నదుల పరీవాహక ప్రాంతాల వాళ్ళయిన ఆంధ్రవాళ్ళు.. తమ నీటిని నదులకు  దూరంగా ఉన్న ప్రాంతాలకు  తరలించుకుపోతుంటే  అడ్డుకుని,  నాగార్జునసాగర్  ఏర్పాటుకు ఎంతో శ్రమించారు. ఇందులో  ఆంధ్రవాళ్ళు చేసిన అన్యాయం ఏముంది? 

***********

కె.సి.ఆర్. గారికి తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం అనీ తెలుగువాళ్ళు కలిసిమెలిసి ఉండాలని కోరుకునేవారనీ వార్తా పత్రికలలో చదివాను. మరి ప్రత్యేక తెలంగాణా వాదాన్ని ఎందుకు ప్రచారం చేసారో ? ఆశ్చర్యంగా అనిపిస్తోంది......

కె.సి.ఆర్. గారు తెలంగాణాకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రాతినిధ్యం వహించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలు చేస్తే ఎంతో బాగుండేది.

  రాష్ట్ర విభజన కోరకుండా ఉమ్మడిరాష్ట్రం లో  కొత్తపార్టీ పెట్టి గెలిచి ఉంటే... సమైఖ్య రాష్ట్రంలో  అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే అవకాశం లభించి ఉండేది కదా !

అలా చేసి ఉంటే  , రాష్ట్రాన్ని విభజించిన వారిలో ఒకరిగా చరిత్రలో ఉండటం కన్నా, రాష్ట్రంలోని  అన్ని ప్రాంతాలనూ  అభివృద్ధి చేసిన  వారిగా చరిత్రలో  ఉండే అవకాశం ఉండేది కదా ! 

 **************
ఈ మధ్య  ఒకరు ...హైదరాబాద్ లో  చాలా  ఆదాయం ఏపీ  ప్రజల నుంచే  వస్తోంది..వీళ్లందరూ ఏపీకి వెళ్తే నిధుల అవసరం తీరుతుందని  అన్నారు.. ఆసక్తి ఉన్నవారు  ఇక్కడ క్లిక్ చేసి చూడగలరు.  
Hyderabad Andhras key to AP development....





1 comment:

  1. ఈ విభజన విషయాల గురించి ఈ బ్లాగ్ లో ఇంతకుముందు చాలాసార్లు చర్చలు జరిగాయి. ప్రస్తుతం బ్లాగ్ లో తిరిగి చర్చలు జరగాలని నేను అనుకోవటం లేదు. ఎవరూ పాజిటివ్ గా గానీ, నెగటివ్ గా గానీ వ్యాఖ్యలు వేయొద్దండి.

    ReplyDelete