koodali

Friday, February 2, 2018

వైద్యం..కొన్ని విషయాలు...ఇంతకు ముందు మేము ఉన్న ఊరిలో .. ఇరుగుపొరుగు ఇళ్ళల్లో  ఒక లేడీ డాక్టర్ గారు లివర్ వ్యాధి వల్ల మరణించారు. ఆమె గమనించేసరికే వ్యాధి ముదిరి పరిస్థితి చేయిదాటి పోయిందట.


ఇంకొక ఆమె  కాన్సర్ వ్యాధితో మరణించారు.  కాన్సర్ అని తెలిసేవరకూ ఆమె ఆరోగ్యంగానే ఉండేవారు. వ్యాధి ఉన్న లక్షణాలేవీ తెలియలేదు. కాన్సర్ అని తెలిసిన కొన్ని నెలలకే ఆమె మరణించారు.


ఇప్పుడు మేము ఉన్న ఊరిలో .. కొన్ని రోజుల క్రిందట మా వీధిలో ఒకాయన లివర్ వ్యాధి వల్ల సడన్ గా మరణించారు. అంటే, మూడునెలల క్రితం మాత్రమే ఆ వ్యాధి ఉన్నట్లు వాళ్ళకు తెలిసిందట. 


 కిడ్నీ, కాన్సర్ వ్యాధిన బారిన పడుతున్న వారిలో పిల్లలు, మధ్యవయస్కులు, పెద్దవాళ్లు అని తేడా లేకుండా జబ్బులు వస్తున్నాయి.


ఇవన్నీ గమనించిన తరువాత ... ఈ రోజుల్లో వ్యాధులు బాగా పెరుగుతున్నాయనిపించి కొన్ని విషయాలను వ్రాసాను. 


అయితే ,  అనారోగ్యాలు తక్కువగా వచ్చేవారు కూడా సమాజంలో ఉన్నారు.

వ్యాధులు రావటానికి గల కారణాలను గుర్తించి వీలైనంతలో జాగ్రత్తలు పాటించితే అనారోగ్యాలు రావటం తగ్గుతాయి.
..........................


ప్రాచీనకాలంలో ఆయుర్వేదంలో  గొప్పప్రావీణ్యత కలిగిన సుశ్రుతుడు, చరకుడు వంటి గొప్పవైద్యులు ఉండేవారు. సుశ్రుతుడు ఆ రోజుల్లోనే శస్త్రచికిత్సలు చేయటంలో గొప్ప నైపుణ్యం కలిగినవారంటారు. 


ఇక వైద్యులైన అశ్వనీకుమారులు ..చ్యవన మహర్షి  యొక్క అంధత్వాన్ని పోగొట్టి, యవ్వనవంతునిగా చేసిన కధ చాలామందికి తెలుసు.


 రామాయణంలో హనుమంతులవారు  సంజీవని మూలిక తేవటం..లక్ష్మణుడు కోలుకోవటం  జరిగింది.


 ఇవన్నీ గమనిస్తే ప్రాచీనకాలంలోనే  వైద్యశాస్త్రం ఎంతో గొప్పగా ఉండేదని తెలుస్తుంది.


 ప్రాచీనకాలపు ఆయుర్వేద వైద్య విజ్ఞానం ఈ రోజుల్లో నిర్లక్ష్యానికి గురయింది. ఎంతో విజ్ఞానాన్ని మనం పోగొట్టుకున్నాం.


........................

 పూర్వం  వాళ్ళు  ప్రతి  చిన్న  అనారోగ్యానికి  వెంటనే   హాస్పిటల్స్ కు  పరిగెత్తేవారు  కాదు. 


  ఇంట్లోని  బామ్మగారు  మొదలైన  పెద్దవాళ్ళు  వంటింట్లోని  పదార్ధాలను  కలిపి  మందుగా  ఇచ్చేవారు.  అవి  వేసుకుంటే  కడుపునొప్పి,  అజీర్ణం  వంటి  ఎన్నో  అనారోగ్యాలు  తగ్గిపోయేవి.

 బామ్మలు  పెద్ద  చదువులు   చదవకపోయినా  తరతరాలుగా  వారసత్వంగా   నేర్చుకున్న  చిట్కా  వైద్యంతో  కుటుంబసభ్యుల  రోగాలను  తగ్గించేవారు.

  ఈ  రోజుల్లో   కూడా    కొందరు  వ్యక్తులు   తాము    వారసత్వం  ద్వారా  నేర్చుకున్న  ప్రాచీన  వైద్యం  ద్వారా   ప్రజలకు    చక్కటి    వైద్య  సహాయాన్ని  అందిస్తున్నారు.

 డబ్బు  ఆశలేకుండా  సేవాదృక్పధంతో  ప్రజలకు   వైద్యాన్ని  అందించే  మంచి వాళ్ళను  అనుమానించటం సబబు కాదనిపిస్తుంది .

.....................................

ఇంగ్లీష్  వైద్యం వల్ల కూడా ఉపయోగాలున్నాయి.

 ఎన్నో రోగాలను తగ్గించటంలో, ఎవరికైనా విపరీతంగా నీరసం వచ్చినప్పుడు సెలైన్ ఎక్కించటానికి, ఆపరేషన్స్ అవసరమైనప్పుడు చాలా ఉపయోగపడుతుంది.
 

రేబిస్ వ్యాధికి టీకా కనిపెట్టిన లూయి పాశ్చర్ గారు గొప్ప వారు.

...............

హోమియో వైద్యాన్ని చాలామంది నమ్మరు. అయితే ,  హోమియో కూడా బాగా పనిచేస్తుంది.నేను చిన్నతనంలో టాన్సిల్స్ వల్ల చాలా బాధపడ్డాను. 


ఇక, వేసవిసెలవులలో నాకు టాన్సిల్స్ సర్జరీ చేయించటానికి మా పెద్దవాళ్లు సిద్ధమవగా , ఒక హోమియో వైద్యులు పరిచయమయి , టాన్సిల్స్ తగ్గటానికి హోమియో మందులు ఇవ్వటం జరిగింది. 

అంతే టాన్సిల్స్ బాధ తగ్గిపోయింది. ఇప్పటివరకూ మళ్లీ ఇబ్బంది రాలేదు.***************

 నా విషయంలో,  హోమియో వైద్యం ద్వారా  టాన్సిల్స్ సమస్య పూర్తిగా తగ్గింది. 


 ఆశ్చర్యమేమిటంటే .. హోమియో ద్వారా చాలామందికి జబ్బులు తగ్గటం కనిపిస్తున్నా  కూడా ,  హోమియో వైద్య విధానం  శాస్త్రీయం కాదని కొందరు అనటం విడ్దూరంగా ఉంటుంది. 

 ఇలాంటి వారి దృష్టిలో శాస్త్రీయత అంటే అర్ధం ఏమిటో ?


అయితే ,  వైద్యం విషయంలో.. రోగాన్ని తగ్గించటంలో డాక్టర్ కు ప్రతిభ  ఉండాలి  మరియు రోగి కూడా డాక్టర్ చెప్పినట్లు మందులు  వేసుకోవాలి. 


డాక్టర్ రోగాన్ని సరిగ్గా  కనిపెట్టలేకపోయినా... రోగి సరిగ్గా మందులు వేసుకోకున్నా జబ్బు తగ్గకపోవచ్చు. ఇందుకు వైద్యశాస్త్రాన్ని తప్పుపట్టకూడదు.

************* 

  మాకు అనారోగ్యాలు తక్కువగానే వచ్చాయి. దైవానికి అనేక కృతజ్ఞతలు.
*****************

(Wednesday, December 16, 2015


వైద్యం..కొన్ని విషయాలు...)

 

 

No comments:

Post a Comment