koodali

Friday, December 16, 2011

కొన్ని ఆలోచించవలసిన విషయాలు....



కొందరు ఏమంటారంటే ఈ రోజుల్లో కూడా ఇంకా దేవుడు, దెయ్యం వంటి చాదస్తాలు ఏమిటి ? అంటారు . వాళ్ళలా ఎందుకంటారో అర్ధం కాదు .

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దైవం శాశ్వతం.

ఇక ప్రాచీన కాలమయినా ....ఆధునిక కాలమయినా మార్పు ఏముంది ? ప్రాచీనులు భోజనం చేసినట్లే మనమూ చేస్తున్నాము.. వారు నిద్ర పోయినట్లే మనమూను. వారిలాగే అహంకార, మమకారాలు మనకూ ఉన్నాయి.


ప్రాచీనకాలం నాటి విజ్ఞానాన్ని తక్కువగా చూస్తూ .... ఇప్పటికాలపు విజ్ఞానం వల్ల అన్నీ లాభాలే అంటున్నారు కొందరు., ఈ నాటి విజ్ఞానంలో కొన్ని లాభాలతో పాటు పొరపాట్లు కూడా జరుగుతున్నాయి.


రాకెట్లను అంతరిక్షంలోకి పంపటం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉండవచ్చు అంటున్నారు కొందరు. . రాకెట్లు తిరిగి భూమికి వచ్చేటప్పుడు అంతరిక్షం నుంచి కొత్తరకం సూక్ష్మజీవులు కూడా భూమికి వచ్చే అవకాశముందట. వాటి వల్ల భూమిపై కొత్తరకం జబ్బులు వ్యాపించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలిందట.


యాంటిబయాటిక్స్ కనుగొనటం వల్ల వ్యాధులు బాగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా ఇప్పుడు మళ్ళీ తేలుతున్నదేమిటంటే, యాంటిబయాటిక్స్ ను విపరీతంగా వాడటం వల్ల వ్యాధికారక బాక్టీరియా దానికి అలవాటుపడి యాంటిబయాటిక్స్ కు కూడా లొంగని విధంగా శక్తిని సాధిస్తున్నట్లుగా పరిశోధనల్లో తేలిందట.


ఇలా ఏ మందులకూ లొంగని రోగాల వల్ల ప్రజలకు మరిన్ని కష్టాలు వచ్చిపడే అవకాశం ఉందనీ, అందువల్ల యాంటిబయాటిక్స్ ప్రతి చిన్న రోగానికీ విపరీతంగా వాడకూడదనీ వైద్యులు చెబుతున్నారు.


ఎన్నో ఉపయోగాలున్నాయని అందరూ భావించిన ప్లాస్టిక్ ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సమస్యగా తయారయ్యింది. ప్లాస్టిక్ నుంచి పెట్రోల్, గ్యాస్ తయారుచెయ్యవచ్చు అంటున్నారు. ఇది కొంతలో కొంత శుభ పరిణామమే.


అయితే ఈ పెట్రోల్ వాడకం ద్వారా వాతావరణం కలుషితం కాదని ప్రస్తుతానికి చెబుతున్నారు ..కానీ కలుషితం అవుతుందా ? కాదా ? ఓజోన్ పొర దెబ్బ తింటుందా ? లేదా ? అన్నది కాలమే తేల్చాలి.


ఈ మధ్య టీవీ చానల్ లో ఒక వార్త వచ్చింది. ఏమంటే కొందరు శాస్త్రవేత్తలు ఒక పదార్ధం కనిపెట్టారట. దానితో చేసిన వస్త్రం కప్పుకుంటే మనిషి ఎదుటి వారికి కనపడరట.

ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ విన్నాక ఆశ్చర్యంగా అనిపించింది.

ఈ వస్త్రం పోలీసు వారికి ఒక వరం . అని ఆ శాస్త్రవేత్తలు భావిస్తున్నారట. అయితే ఈ వార్త విన్న ప్రజలు మాత్రం బెంబేలు పడిపోతున్నారట.

పోలీసుల సంగతి అటుంచితే ....... నేరస్తులకు ఇది ఒక వరంలా ఉపయోగపడుతుందనీ, ఇటువంటివి ఆవిష్కరించవద్దు మహాప్రభో ! అని ప్రజలు శాస్త్రవేత్తలను వేడుకుంటూన్నారని వార్తా సారాంశం.


ఇలాంటివి ఏమీ లేకపోయినా నేరస్తులు అందినమటుకు అందినట్లు దోచుకుపోతున్న ఈ రోజుల్లో .... ఇలాంటివి అందుబాటులోకి వస్తే ఇక అంతే సంగతులు. అని ప్రజల ఘోష. ( పట్టించుకునేదెవరు ? )

పోలీసులు, దొంగలు ఇద్దరూ కూడా ఈ వస్త్రాన్ని ఉపయోగిస్తే కధ మళ్ళీ మొదటికొస్తుంది.


శాస్త్రవేత్తలు ఏమంటారంటే ,మేము కనిపెట్టిన విజ్ఞానాన్ని ప్రపంచ క్షేమం కొరకు మాత్రమే ఉపయోగిస్తాము. అంటారు.

అందరూ వారిలా మంచిగానే ఆలోచిస్తే ప్రపంచంలో ఇన్ని అన్యాయాలు ఎందుకు జరుగుతాయి ? అన్నది అసలు విషయం.


ఇలాంటివాటిని నెగటివ్ గా ఎలా ఉపయోగించాలి ? అని ఆలోచించేవారు కూడా కొందరు ఉంటారనేది అందరూ ఆలోచించవలసిన విషయం.

ఇవన్నీ ఎవరినీ నొప్పించటానికి వ్రాయలేదండి. దయచేసి అపార్ధం చేసుకోవద్దని కోరుకుంటున్నాను..


* ప్రాచీన కాలంలో కూడా కొందరికి ఇలా మాయమయ్యే శక్తులు ఉండేవని చెబుతారు. అయితే గొప్ప తపస్సులు వంటివి చేసిన వారికి మాత్రమే ఇలాంటి శక్తులు అందుబాటులో ఉండేవనీ, అందరికీ అందుబాటులో ఉండేవి కాదని చెబుతారు.


* శాస్త్రవేత్తలు లోకానికి ఎన్నో ఉపయోగకరమైన ఆవిష్కరణలను కూడా అందించారు. అందుకు మనము వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.


2 comments:

  1. ప్రతీ విషయం లోనూ మంచీ చెడూ ఉంటాయని, వాటి లోనుంచి ఎంత మంచి, ఎంత చెడు, ఏ నిష్పత్తిలో తీసుకుంటామనే దాని లోనే ఉన్నది మన మనుగడ మనం సుఖంగా ఉండటం అని అనుకుంటాను. చివరికి ఎక్కువ భోజనం చేసినా బాధే కదా మరి.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
    మీరు చెప్పినది నిజమేనండి..

    ReplyDelete