koodali

Friday, August 27, 2010

కొన్ని సంగతులు ......మరియు నా కల....




సాయి ఇలా అనేవారట. హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య యేమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలోవారు కలహమాడుట యెందులకు ? ఓ అజ్ఞానులారా ! చేతులు చేతులు కలిపి రెండు జాతులును కలిసిమెలిసి యుండుడు. బుధ్ధితో ప్రవర్తింపుడు. జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్లగాని, ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదమును విడువుడు. ఇతరులతో పోటీ పడకుడు. మీ యొక్క వృధ్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో నేదైన అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్ధము. ఎవరైనా మీకు కీడు చేసినచో ,ప్రత్యపకారము చేయకుడు. ఇతరులకొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు. అనేవారట.


నా చిన్నప్పుడు మా బంధువుల ఇంటి పక్కన పెద్ద ఖాళీ స్థలములో క్రిస్టియన్స్ సభలు జరిగేవి. పక్క ఇంటివారితో కలిసి నేను కూడా ఆ సభలకు ఒకటి, రెండు సార్లు వెళ్ళాను. మేము అమర్నాధ్ యాత్ర వెళ్ళినప్పుడు నేను అల్లాహ్ కు కూడా మనసులో నమస్కరించుకున్నాను.


ఒక సంఘటన చెప్పాలండి. ఒకసారి మేము షిర్డికి వెళ్ళే కొంతకాలం ముందు నాకు ఒక చెడ్డ కల వచ్చింది. ఆ కలలో షిర్డిలో నాకు పెద్ద ఆపద కలిగినట్లు కనిపించింది.


ఈ కల గురించి మా ఇంట్లో వాళ్ళకు చెప్పలేదు నేను. తరువాత మేము షిర్డి వెళ్ళాము. కానీ నాకు భయం ......... ఏమి జరుగుతుందో అని. మేము షిర్డి వీధిలో నడుస్తున్నాము. ఇంతలో ఆ జనం మధ్య నాకు ఎదురుగా ఒక సాధువు లాంటి వ్యక్టి కనిపించి చెయ్యెత్తి నన్ను ఆశీర్వదిస్తున్నట్లు కనిపించింది. నేను తేరుకునేలోపు ఆ వ్యక్తి మాయమయ్యారు.


ఆ సాయే అలా అభయమిచ్చి నా భయాన్ని పోగొట్టినట్లు అనిపించిందండి. ఆ తరువాత ఆ భగవంతుని దయవల్ల ఏ హానీ లేకుండా ఇంటికి తిరిగివచ్చాము.



No comments:

Post a Comment