koodali

Friday, August 13, 2010

చిన్నతనం లోనే వారి విజ్ఞత .......

 

జీవులు ఎటువంటి బాధలు లేని పరమానందమును పొందాలంటే మోక్షము ద్వారా మాత్రమే అది సాధ్యము. ఆ పరమాత్మలో లీనమవ్వటమే మోక్షము. దైవమును, ధర్మమును నమ్ముకున్న వారికే ఇవన్నీ సాధ్యం.


మన ప్రాచీన కధలలో ఎన్నో విధములుగా ధర్మం గురించి చెప్పబడింది. దశరధులవారిని కైకేయి దేవి వరములు అడుగుతారు కదా....భరతునికి పట్టాభిషేకము, రామునికి 14 సంవత్సరములు వనవాసం ఇలా......


ఈ వరముల వల్ల దశరధులవారికి సంకట పరిస్థితి ................ ఒకవైపు రాముని వనవాసం. మరొకవైపు మాట తప్పవలసిన పరిస్థితి ..... ఎటు చూసినా ఏదీ తట్టుకోలేని ఇబ్బందికర పరిస్థితి.


ఇలాంటి పరిస్థితిలో , తన తండ్రి మాట నిలబెట్టుట కొరకు రాములవారు వనములకు వెళ్ళారు . సీతా దేవి రాములవారిని అనుసరించారు . ఇక లక్ష్మణులవారు తాను వనవాసం చేయవలసిన అవసరం లేకున్నా, తానుకూడా రాములవారిని అనుసరించి వారి కష్టకాలములో సహాయముగా ఉన్నారు.


కొంతమంది తండ్రి ఆజ్ఞ ప్రకారం రాములవారు వనములకు వెళ్ళారని అంటారు. వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణ మహాకావ్యం నేను చదవలేదండీ . కానీ దశరధులవారు, రాములవారిని వనవాసమునకు వెళ్ళమని స్వయముగా ఆదేశించలేదేమో అని నాకు అనిపించిందండి. అందుకే పైవిధముగా వ్రాశానండి...... రాములవారి వనవాసం , పుత్రవియోగం భరించలేకనే కదా దశరధులవారు మరణించారు...


ఇక భరతులవారు రాజ్య పాలనకు ఆశపడలేదు. రాములవారి వనవాసం ముగిసేవరకు వారి పాదుకలను పూజిస్తూ , తాను రాములవారి ప్రతినిధిగా రాజ్యమును చూసుకున్నారు. ఇక శత్రుఘ్నులవారు కూడా సోదరులవలెనే తానూ ధర్మమార్గములో నడిచారుగానీ అత్యాశకు పోలేదు.


ఇలా సోదరులందరూ తమ త్యాగములతో జీవితములో కొన్ని కష్టములను అనుభవించినా , అనంతరము చరిత్రలో ధర్మమూర్తులుగా నిలిచారు.


సామాన్యముగా లోకములో ఇలాంటి సందర్భములలో రాజులయిన అన్నదమ్ముల మధ్య వారసత్వ యుధ్ధములు, కుటుంబములో కలహములు, దేశములో అనిశ్చితి, ప్రజలకు బాధలు ఇలా ఉంటాయి.

కానీ ఈ అన్నదమ్ములు చిన్నవయసులోనే ఎంతో విజ్ఞతతో ప్రవర్తించారు.


ఇలాంటి విజ్ఞులు తాము ధర్మబధ్ధముగా ప్రవర్తిస్తేనే ప్రజలు మరియు తమతరువాతి తరములవారు కూడా ధర్మముగా ప్రవర్తిస్తారని భావించి తాము కష్టములను అనుభవిస్తారు...అలా గొప్పవారిగా చరిత్రలో నిలిచిఉంటారు.

 

No comments:

Post a Comment