koodali

Monday, August 16, 2010

వ్యాసుల వారు వ్రాసిన రామాయణం గురించి నాకు ఇలా తెలిసింది........

 

ఇంతకుముందు వ్యాసంలో ఒక పొరపాటు జరిగిపోయిందండి. అందులో వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం ............... అనటానికి బదులు వ్యాసులవారు వ్రాసిన రామాయణం ............ అని వ్రాసి పోస్ట్ చేసేసాను .


తరువాత మళ్ళీ పోస్ట్ చూస్తే నాకు ఒకటే కంగారు. ఇంత తప్పు ఎలా జరిగింది ? అని ..... రచయిత పేరు కూడా సరిగ్గా తెలియకుండా తోచినట్లు రాసిపారేస్తున్నారని ఎవరైనా అనుకుంటారని ...........అప్పుడు తప్పు సరిచేసాను.


తరువాత చేసేదేమీ లేక ..... అదే కంగారులో వ్యాస రామాయణం అని ఎక్కడయినా ఉంటుందేమోనని ఆశగా నెట్లో చూసానండి. ఆశ్చర్యంగా వ్యాసులవారు వ్రాసిన రామాయణం గురించి నిజంగానే ఉంది. దీని పేరు ఆధ్యాత్మ రామాయణం అట. { స్పెల్లింగ్ సరిగ్గానే రాసానో లేదో తెలియటం లేదు . } ఇంతకు ముందు పేరు విన్నాను కానీ ,వ్యాసులవారు వ్రాసారని తెలియదండి. శివుడు పార్వతుల గురించి కూడా ఇందులో చెప్పబడింది.


ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. బ్లాగ్ చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ఎంతో కృతజ్ఞతలండి. మీరందరూ నాకన్నా చాలా విషయాలు తెలిసినవారు.. అందుకని ఏమైనా తప్పులు వచ్చినప్పుడు , మీకు ఇబ్బంది లేకపోతే, దయచేసి తెలిపితే, తప్పులు సరిజేసుకుంటానండి.


ఒకోసారి నాకు ఏమనిపిస్తుందంటే నేను వ్రాస్తున్న వాటిలో మీకు నచ్చని విషయాలు కూడా ఉండొచ్చు. అప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుందికదా అని నాకు అనిపిస్తుంది. అందుకు అందరికీ సారీ నండి.


ఇక వాలి, సుగ్రీవుల కధ లో వారిద్దరూ మొదట చాలా అన్యోన్యంగానే ఉండేవారట. ఒకసారి వాలి యుధ్ధములో మరణించారని సుగ్రీవులవారు పొరపడిన సందర్భములో రాజ్యక్షేమం కొరకు ఆయన రాజ్యపాలన స్వీకరించవలసి వచ్చింది కదా....


తరువాత వాలి తిరిగివచ్చి సుగ్రీవుని అపార్ధం చేసుకోవటం , తరువాత చాలా సంఘటనల అనంతరం వాలి వధింపబడటం వరకు విషయం వెళ్ళింది. అసలు వాలి రావణుని కంటే ఎక్కువ బలవంతుడట.


ఇంకోవిషయం రాములవారు వాలి కోరిక ప్రకారం వాలి కుమారుడైన అంగదుని యువరాజుగా చేయటంగురించి మాట ఇచ్చారు. నాకేమనిపించిందంటే రాములవారు వాలి యొక్క కుమారునికి న్యాయం చేసారని.


ఎలాగంటే వాలి వధానంతరం సుగ్రీవులవారు రాజు అయ్యారు కదా......సుగ్రీవుని తరువాత సుగ్రీవుని సంతానం కాకుండా వాలి యొక్క కుమారుడైన అంగదులవారికి రాజ్యం లభించింది. విధంగా సుగ్రీవునికి, వాలి యొక్క కుమారునికి కూడా న్యాయం జరిగినట్లయిందని నాకు అనిపించింది.



ప్రాచీన కధల ద్వారా ధర్మమునకు, అధర్మమునకు సంబంధించిన సూక్ష్మమయిన విషయములను తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. సత్యవాక్యం యొక్క గొప్పదనం చెప్పిన పెద్దలే .....మన సత్యవాక్యం ఒక జీవికి అన్యాయముగా ప్రాణహాని కలిగించేదయితే ,అది అధర్మమే అవుతుందని కూడా తెలియజేసారు.


నాబోటి వాళ్ళకు ధర్మసూక్ష్మములు అంతగా అర్ధం కావు. అందుకే సర్వాంతర్యామి అయిన భగవంతుడి తోడు మనకెంతో అవసరం. ఆయనను శరణుకోరటం కూడా కష్టమే కానీ ... ప్రయత్నించాలి.


అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని పెద్దలు చెప్పినట్లు, దైవం కృపకు మనం పాత్రులమయితే ఇక లోటేముంటుంది .... భగవంతునికి నా ధన్యవాదములు.


No comments:

Post a Comment