koodali

Thursday, September 7, 2017

మనదేశమూ అందంగా ఆహ్లాదంగా ...

 
కొన్ని విదేశాలలో పచ్చటి చెట్లతో చక్కటి పార్కులు, రహదారులకు ఇరువైపులా దట్టమైన చెట్లు, సరస్సుల చుట్టూ పూలగుత్తులతో నిండిన ఒత్తయిన వృక్షాలు , పండ్ల వృక్షాలు వంటివి ఉండి వాతావరణం ఎంతో బాగుంటుంది. 

ఇప్పుడు మనదేశంలో చాలా పట్టణాలు, నగరాలలో రోడ్ల ప్రక్కన చెత్తచెదారం తప్ప వృక్షాలు చాలా తక్కువగా పెంచుతున్నారు.

 ఇక చాలా సరస్సుల ( చెరువులు) ప్రక్కన చూస్తే కుళ్ళిన చెత్తకుప్పలు, ప్లాస్టిక్ కుప్పలు.. దర్శనమిస్తాయి. 

ఈ రోజుల్లో ఎక్కువమంది ప్రజలు ఇళ్ళలో కూడా వృక్షాలు పెంచటానికి అంతగా ఇష్టపడటం లేదు. 

ఇళ్లలో పెద్ద చెట్లు పెంచుదామన్నా కరెంట్ వైర్లకు అడ్డమని నరికేస్తారు. 

కొందరు ఇళ్ల గోడలు బీటలు వస్తాయంటూ పెద్ద వృక్షాలను పెంచటం లేదు. 

మరికొందరేమో రాలిపడిన ఆకులు, పువ్వులు  ఎత్తిపొయ్యలేమంటూ సాకులు చెబుతారు.

 కొద్దిగా ఖాళీ స్థలం మిగిలినా గదులు కట్టేసి అద్దెకు ఇస్తున్నారు. 

కొందరు  ప్రజల మనస్తత్వాలు ఇలా మారిన తరువాత..  కాంక్రీట్ , ప్లాస్టిక్ తప్ప పచ్చదనానికి చోటెక్కడుంటుంది.

చెట్లను పెంచడానికి పెద్ద ఖర్చేమీ అవదు. చెట్ల వల్ల ఎన్నో లాభాలున్నాయి. 


 ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే విజయవాడ వంటి ఊరిలో కూడా చెట్లు బాగా ఉన్న ఏరియాలో వేడి కొంత తక్కువగా ఉంటున్నట్లు చెబుతున్నారు. 

అలాంటప్పుడు మరింత  దట్టంగా చెట్లను పెంచితే ఉష్ణోగ్రత కొంతయినా తగ్గుతుంది కదా!

 చెట్లను దట్టంగా పెంచే విషయంలో ప్రజలు శ్రద్ధ వహించాలి.

 ప్రతి ఇంటి వద్ద  కొన్ని చెట్లను పెంచాలన్నే విషయాన్ని తప్పక పాటించాలి.  

విదేశాల వాళ్లు వారి పరిసరాలను అందంగా పచ్చదనంతో తీర్చిదిద్దుకుంటుంటే, మనం ఎందుకు పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాము ? 

ఎందుకంటే మన దేశంలో చాలామందికి పట్టుదల లేదు. 

ప్రాచీనులు నదులను దేవతలుగా వర్ణిస్తే చాలామంది హేళన చేసారు. 

ఇప్పుడు కొన్ని విదేశాలలో నదులను ప్రాణమున్న వాటిగా చట్టం చేసి జాగ్రత్తగా రక్షించుకుంటున్నారు. 

మరి, నదులను దేవతలుగా పూజించే మనదేశంలో నదులను స్వచ్చంగా ఉంచుతున్నామా ? 

నదులను దేవతలంటూ పూజిస్తూనే.. ఆ నదులలో మురుగును వదలటం ఏం సంస్కారం ? 

విదేశాలు బాగున్నాయి అనుకోవటం కంటే,  మనదేశాన్ని మనమూ బాగుచేసుకోవచ్చు. 

అందరూ  పట్టుదలగా పనిచేస్తే మనదేశమూ పరిశుభ్రంగా పచ్చదనంతో అందంగా ఆహ్లాదంగా ఉంటుంది.




No comments:

Post a Comment