koodali

Friday, September 29, 2017

పూర్ణాలు..గారెలు..విప్పింగ్ బ్లేడ్..పులిహోర..


పూర్ణాల తయారీకి.. ఉడికించిన శనగపప్పును..బెల్లం పాకంపట్టి ఉండలా తయారుచేసేటప్పుడు కొన్నిసార్లు త్వరగా దగ్గరపడదు. 


అలాంటప్పుడు పాకం గట్టిపడటానికి .. చివరిలో.. కొంచెం వేయించిన శనగపప్పును ( పుట్నాల పప్పును) మిక్సీలో పిండి కొట్టి, ఆ పొడిని పాకంలో కలిపితే వెంటనే గట్టిపడి ఉండ చేయటానికి వీలవుతుంది. 


అయితే తీపి తక్కువకాకుండా, వేయించిన శనగపొడిని కొద్దిగా వేసుకోవాలి.  తీపి తగ్గితే కొంచెం బెల్లం పొడి కలుపుకోవచ్చు.


సూచన.. వేయించిన శనగపప్పు పొడిని ముందే కలపకూడదు, పాకం త్వరగా రాని పరిస్థితిలో  మాత్రం చివరిలో కలుపుకోవచ్చు.


**************
గారెల కు మినపప్పును నానబెట్టిన  గిన్నెను  ఫ్రిజ్ లో పెట్టి ..  నానిన తరువాత మిక్సీలో రుబ్బితే బాగుంటాయి. 

గారెలు మృదువుగా రావటానికి..పొట్టుతో ఉన్న మినపపప్పు అయితే జిగురు ఉంటుందని కొందరు పొట్టు ఉన్న పప్పు వాడతారు. రోటిలో రుబ్బుతారు. ఈ మధ్య గ్రైండర్ వాడుతున్నారు.

 అయితే కొంచెం  మాత్రమే  పప్పు రుబ్బవలసి వచ్చినప్పుడు కొందరు గ్రైండర్ వాడరు. 

గారెలు మిక్సీలో మృదువుగా రావాలంటే పొట్టుతో ఉన్నపప్పు వాడవచ్చు. పొట్టు తీయటం కష్టం అనుకున్నప్పుడు పొట్టు తీసిన పప్పు కూడా వాడవచ్చు. 

పొట్టులేని పప్పును సుమారు .. రెండు లేక మూడు గంటలు  నానబెట్టి మిక్సీలో ఎక్కువ నీరు పోయకుండా కొద్దిగా గట్టిగా రుబ్బుకోవాలి. 

అప్పుడు విప్పింగ్  బ్లేడ్ ( గుండ్రంగా ఉన్న బ్లేడ్ ...) ఉన్న జార్ లో రుబ్బిన పిండిని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్ది గా నీరు పోసి తిప్పితే పిండి పొంగినట్లు అవుతుంది. 

విప్పింగ్  బ్లేడ్ వల్ల పిండి  మృదువుగా అవుతుంది. అలాగని మరీ ఎక్కువ నీరు పోయకూడదు. 

ఈ పిండితో అప్పుడే గారెలు వేసుకోవచ్చు. లేక ఫ్రిజ్ లో పెట్టి  కొంతసేపు తరువాత వేసుకోవచ్చు.

***************
గారెలకు విప్పింగ్  బ్లేడ్ ( గుండ్రంగా ఉన్న బ్లేడ్ ...) ఎందుకంటే, 

 గారెలు మృదువుగా రావటానికి కొందరు రుబ్బిన పిండిని చేతితో తడతారు.


రుబ్బిన గారెలపిండిని చేతితో తట్టడం వలన పిండిలో గాలి బుడగలు ఏర్పడి గారెలు బోలుగా వస్తాయి. 

అయితే, ఇలా చేతితో తట్టడం కన్నా, రుబ్బిన పిండిని విప్పింగ్ బ్లేడ్ ఉన్న జార్ లోకి మార్చి రెండు, మూడు రౌండ్లు రుబ్బితే  పిండి పైకి పొంగుతుంది. 


. అలాగని  ఎక్కువసేపు విప్పింగ్ బ్లేడ్ ఉన్న జార్ లో రుబ్బనవసరం లేదు.


************
  గారెల పిండిని రుబ్బేటప్పుడు, మరీ నీరు తక్కువ పోసి రుబ్బితే  పిండి మరీగట్టిగా ఉండి ..గారెలు గట్టిగా  ఉంటాయి. నీరు ఎక్కువపోస్తే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. 

అయితే, నీరు కొంచెం ఎక్కువయినా గారెలు మృదువుగా వస్తాయి.. అలాగని నీరు మరీ ఎక్కువపోసి పిండి పలుచగా చేయకూడదు. 

రుబ్బిన గారెల పిండి కొద్దిగా నీటిలో వేస్తే పిండి పైకి తేలాలి. అపుడు సరిగ్గా రుబ్బినట్లు అంటారు. 

గారెలు వేగేటప్పుడు పెద్ద మంట, చిన్న మంట కాకుండా, మధ్యస్థాయి మంటపై  వేగాలి.

**************
 మా ఇంట్లో అదివరకు సుమీత్ మిక్సీ ఉండేది. దానికి పెద్ద సైజు స్టీల్ విప్పర్ బ్లేడ్ కూడా ఇచ్చారు..ఈ మిక్సీలో బ్లేడ్లు  మార్చుకోవచ్చు. గారెలు పిండి రుబ్బిన తరువాత విప్పర్ బ్లేడ్ మార్చి మళ్ళీ కొద్దిసేపు మాత్రమే మిక్సీలో పిండి తిప్పితే పిండి బాగా పొంగేది. గారెలు చక్కగా వచ్చేవి.

ఇప్పుడు వేరే మిక్సీలలో అంత చక్కటి విప్పర్ బ్లేడు కనిపించలేదు. చిన్నవి ద్రవపదార్ధాలు విప్పింగ్ చేయటానికి ఇస్తున్నారు. ఫుడ్ ప్రాసెసర్ లో ప్లాస్టిక్  విప్పింగ్ అటాచ్మెంట్ ఉంటుంది.విడిగా హాండ్ బ్లెండర్స్ కూడా లభిస్తున్నాయి.

బజ్జీల పిండి కూడా విప్పింగ్ చేస్తే పిండి పొంగుతుంది. బజ్జీల పిండిలో కొద్దిగా వేడి నూనె కూడా వేయవచ్చు.

***************
పులిహోర తయారీకి ..కొందరు, చింతపండును చాలాసేపు నానబెడతారు. అయితే అలా నానబెట్టకుండా ..కుక్కర్లో  చింతపండు కొద్దిగా నీరుపోసి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. 

ఉడికించిన చింతపండును పిండి, ఆ రసాన్ని చిల్లుల ప్లేటులో వడపోస్తే పిప్పి పైన ఉండి, రసం క్రిందకు వచ్చేస్తుంది.


ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే కానీ, రాయాలనిపించి వ్రాసాను. 


5 comments:

  1. గారెలపిండి రుబ్బేటప్పుడు మిక్సీ వేడి అయితే పిండి వేడెక్కి గారెలు చేదుగా అయే అవకాశముందట.

    .ఇలాంటప్పుడు కొద్దిగ చల్లటి నీరు పోస్తూ పిండి రుబ్బవచ్చని అంతర్జాలం ద్వారా తెలుస్తోంది.

    ReplyDelete

  2. పప్పు రుబ్బేటప్పుడు చల్లటినీరుపోసి రుబ్బితే గారెలు, ఇడ్లీలు బాగుంటాయని అంటారు.

    మిక్సీలో మినప్పప్పు రుబ్బేటప్పుడు వేడెక్కి పిండి చేదు రాకుండా కొందరు చల్లటి నీరు పోస్తారు.

    అలా కాకుండా, మినపప్పు నానటానికి పప్పులో నీరు పోసి, ఆ గిన్నెను ఫ్రిజ్లో పెట్టి, మూడుగంటల తరువాత తీసి వెంటనే రుబ్బుకోవచ్చు.

    ReplyDelete

  3. నాకు మరి కొన్ని ఆలోచనలు కూడా వచ్చాయి.

    పప్పు ఎక్కువసేపు నానబెట్టినప్పుడు పప్పులలో జీవం వికసించి కొంత మొలకలు కూడా వస్తాయి...

    ఆ పప్పులను రుబ్బేటప్పుడు పప్పులలోని జీవానికి నొప్పి కలుగవచ్చు.పప్పులను నానబెట్టడానికి ఫ్రిజ్లో పెడితే చల్లదనం వల్ల మొలక త్వరగా రాకపోవచ్చు.

    మొలకలు వచ్చినా కూడా, నీటిలోని చల్లనిదనం వల్ల రుబ్బేటప్పుడు వాటికి బాధ కొంత తగ్గుతుందేమో?
    మనుషులకు ఇంజక్షన్ ఇచ్చిన దగ్గర ఐస్ ముక్క పెడితే బాధ కొంత ఉపశమిస్తుంది కదా..అలాగ.

    ReplyDelete

  4. గారెలు కోసం మినపప్పును కొద్దిగా వేయించి, పొడి చేసి ఉంచుకుని, ఆ పిండితో కూడా గారెలు చేయవచ్చంటున్నారు.

    దోసెలకు కూడా కొందరు పప్పులను, బియ్యాన్ని ...కలిపి పిండి పట్టించుకుని ఉంచుకుంటారు.

    ReplyDelete
  5. దోసెలు వేయటానికి మందపాటి అడుగు భాగం ఉండే
    విధంగా పెనం తయారుచేస్తే బాగుంటుంది.
    ఉదా..స్టీల్ కుక్కర్లకు అడుగుభాగం మందంగా ఉంటుంది.అలాంటి పెనాలు తయారుచేస్తే దోసెలు బాగా రావచ్చు.

    ఇప్పుడు స్టీల్ పెనాలు, ట్రిప్లెయ్ పెనాలు అనేక రకాలు మార్కెట్లో వచ్చాయి.

    ఎందుకో ఆ స్టీల్ పెనాలు అనేవి కొన్ని ..స్టీల్ మెరుపు లేకుండా కొంత తెల్లగా ఉంటున్నాయి.

    కొన్ని స్టీల్ పెనాలు అడుగుభాగం పల్చగా ఉండటం వల్ల దోసెలు రావటం లేదని కొందరంటున్నారు.

    మట్టి పెనాలపై దోసెలు నిదానంగా కాల్తాయి.

    ఇనుప పెనాలపై దోసెలు బాగానే కాలుతాయి కానీ, పెనం తుప్పు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇనుపవి చపాతీకి బాగుంటాయి.

    దోసెలు వేయటానికి రాతి పెనాలు కూడా ఉన్నాయి.వాటిని జాగ్రత్తగా వాడుకుంటే బాగానే ఉంటాయి.

    ReplyDelete