koodali

Wednesday, August 30, 2017

బోలెడు పుస్తకాలు అవసరం లేకుండానే ఎన్నిసార్లైనా దైవ నామాలను వ్రాసుకోవచ్చు...


కొందరు దైవ నామాలను కొంత సంఖ్య ప్రకారం  వ్రాయాలనుకుని పుస్తకంలో వ్రాస్తుంటారు. 


పుస్తకం పూర్తి అయిన తరువాత ఆ పుస్తకం ఎక్కడ పెట్టాలో తెలియదు. కొందరు గుడిలో ఆ పుస్తకాలను ఇస్తుంటారు. 


కొన్ని పుస్తకాలను కలిపి స్తూపంలా భద్రపరచటం కూడా జరుగుతోంది. 



అయితే పేపర్ పైన దైవ నామాలను వ్రాసి, ఆ పుస్తకాలను ఎక్కడ దాచాలో అని సతమతమయ్యేవారికి నాకు తోచిన అభిప్రాయాన్ని వ్రాస్తున్నాను. 



ఏదైనా పుస్తకంలో మనం అనుకున్న దైవనామాన్ని కొంచెం పెద్ద అక్షరాలతో వ్రాసుకుని ,...... . మరల  దైవనామాన్ని వ్రాసేటప్పుడు ఇంతకుముందు వ్రాసిన నామం పైనే మళ్లీ  వ్రాసుకోవచ్చు.  



అంటే పాతకాలంలో పలకపైన చిన్నపిల్లలు అక్షరాలు నేర్చుకునేటప్పుడు బలపంతో దిద్దినట్లుగా వ్రాయాలి. 


 అయితే, ఇక్కడ  ముఖ్యమైన విషయం ఏమిటంటే, 


నామాలను మళ్లీ వ్రాసేటప్పుడు పెన్ను , పెన్సిల్ వంటి వాటితో దిద్దకుండా ఒకసారి వ్రాసిన నామం పైనే చేతి వ్రేలితో మరల దిద్దుకోవచ్చు.


ఇలాంటప్పుడు ఒక విధంగా గాలిలో నామాన్ని వ్రాస్తున్నట్లు ఉంటుంది.



ఇలా చేయటం వల్ల నామాలను వ్రాయటానికి బోలెడు పుస్తకాలు తేవటం, అవన్నీ పూర్తయిన తరువాత ఆ ప్రతులను ఎక్కడ దాచాలో అర్ధంకాకపోవటం వంటివి ఉండవు. 


 దైవనామాలను  వ్రేలితో కానీ పుల్లతో కానీ వ్రాసేటప్పుడు  ఎన్నిసార్లు వ్రాసామో తెలియడానికి .... 



ఒక్కొక్క నామం వ్రాసినప్పుడు ఎడమచేతి వ్రేళ్లతో లెక్కపెట్టుకుంటూ 10 నామములు పూర్తయిన వెంటనే  ఒక పేపర్ పైన టిక్ చేసుకోవచ్చు. లేక ఎక్కడైనా గుర్తు పెట్టుకోవచ్చు. 


ఉదా..10 సార్లు టిక్ పెడితే 100 నామాలను వ్రాసామని తెలుస్తుంది.. 



 కొందరు ఏదైనా మంత్రాన్ని దీక్షలో తీసుకుంటారు. 


ఆ మంత్రాన్ని ఇతరులకు తెలియనీయకూడదన్నప్పుడు  ఆ మంత్రాన్ని పుస్తకం పైన పెన్నుతో వ్రాయకుండా... ఎన్ని సార్లు మంత్రాన్ని వ్రాయాలనుకుంటున్నారో అన్ని సార్లు రోజూ ఒకే పుస్తకంపైన  వ్రేలితో గానీ ఏదైనా పుల్లతో కానీ  వ్రాయాలి. 


ఇలా వ్రాసిన మంత్రము ఇతరులకు కనిపించదు. 


వ్రాసిన పుస్తకాలను ఎక్కడ దాచాలో అనే బెంగా ఉండదు. ఒకే పేపర్ పైన ఎన్ని సార్లైనా వ్రాసుకోవచ్చు.



 వ్రేలితో నామములను వ్రాసేటప్పుడు గోళ్ళు బాగా పెరగకుండా కత్తిరించుకోవటం మంచిది. 


.ఒకేసారి చాలా విషయాలను వ్రాయటం వల్ల  ఎక్కువగా అయి గజిబిజిగా ఉంటుందేమోననిపించి ...మరికొన్ని విషయాలను వ్యాఖ్యల వద్ద వ్రాసానండి.



2 comments:


  1. పాతకాలం పలక పైన మనము వ్రాయాలనుకున్న సంఖ్యలో నామాలను వ్రాసుకుని తరువాత పలకను కడిగేసుకోవచ్చు కదా! అనిపిస్తుంది కానీ,

    . పలకల పైన చాక్ పీస్ తో నామములు వ్రాసి చెరిపితే వచ్చే దుమ్ము నేలపైన పడుతుంది.

    వ్రేలితో నేలమీద నామాలను వ్రాయవచ్చు కదా! అనుకోవచ్చు గానీ, నేల మీద దైవనామాలను వ్రాయటం సరైనది కాదేమోనని నా అభిప్రాయం. నేలపై దైవనామాలను వ్రాయటం వల్ల తరువాత ఆ ప్రదేశాన్ని త్రొక్కటం జరగవచ్చు.

    అందువల్ల ఒక పేపర్ పైన పెన్నుతో దైవనామాన్ని వ్రాసి తిరిగి ఎప్పుడు దైవనామాన్ని వ్రాయాలనుకున్నా ఇంతకుముందు వ్రాసిన నామము పైన దిద్దినట్లుగా ఎన్నిసార్లైనా వ్రాయవచ్చు.

    ఇవన్నీ నచ్చకపోతే ఈ మధ్య ఈ - పలకలు వచ్చాయి. వాటి పైన వ్రాసుకోవచ్చు.

    లేదంటే లేఖిని వంటి వాటిలో మనము వ్రాయాలనుకున్న నామములను వ్రాసుకుని తరువాత డిలీట్ చేసుకోవచ్చు.

    వ్రాసిన నామములను చెరపటం ఇష్టం లేనివాళ్ళు.. ఇంతకుముందు చెప్పినట్లుగా పేపర్ పైన వ్రేలితో కానీ లేక ఏదైనా పుల్లతో గానీ నామములను వ్రాయవచ్చు.

    వ్రాసిన వాటిలో ఏదైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.

    ReplyDelete

  2. ఒక సూచన ఏమిటంటే..
    వ్రేలితో పేపర్ పైన నామములను వ్రాయాలనుకుంటే మాత్రం విడి పేపర్లపై వ్రాసి వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయటం చేయకూడదు.

    ఎందుకంటే, అక్షరాలు పైకి కనిపించకపోయినా ఆ ప్రదేశంలో దైవనామములను వ్రాసినట్లే కదా.

    ఏదైనా దేవుని పుస్తకంలో ఖాళీగా ఉన్న ప్రదేశం పై వ్రాస్తే దేవుని పుస్తకాలు ఎక్కడపడితే అక్కడ పడేయం కాబట్టి బాగుంటుంది.

    దేవుని పుస్తకంలో ఒక ఖాళీ ప్రదేశం ఉన్న చోట.. ఒకే నామాన్ని ఎన్ని రోజులైనా, ఎన్నిసార్లైనా దిద్దవచ్చు..ఆ పుస్తకాన్ని ఎంతకాలమైనా అలా ఉపయోగించవచ్చు.

    ReplyDelete