koodali

Friday, April 17, 2015

వ్యక్తులు చేయగలుగుతున్నప్పుడు .. . వ్యవస్థ ద్వారా చేయగలగటం సాధ్యమే కదా !

  

 

ఒకప్పుడు  ఈ  దేశం   ఎంతో  సిరిసంపదలతో  తులతూగేదని   అప్పటి   విదేశీ  యాత్రికులు  తమ  గ్రంధాల ద్వారా తెలియజేసారు.  


మరి ఇప్పుడు ..ఈ దేశం ఎందుకిలా తయారయ్యిందో ?

దేశంలో  ఎందరో  మేధావులు  ఉన్నారు.  ఎందరో  కష్టించి  పనిచేసేవాళ్ళు  ఉన్నారు. అపారమైన  ప్రకృతి  సంపదలున్నాయి.  జలజలపారే  జీవనదులెన్నో  ఉన్నాయి.   చక్కటి  సూర్యరశ్మి  ఉంది.   చక్కగా  జీవించటానికి  కావలసినవెన్నో  ఉన్నాయి.


 మరి  దేశంలో  ఇంత  పేదరికం,  ఇంత  అశుభ్రత  ఎందుకు  పెరిగిపోయింది ? మనం  మన దేశాన్ని    బాగుచేసుకోలేమా?  అందరూ  తలచుకుంటే   దేశంలో   పేదరికం,  అవినీతి,  అశుభ్రత  పోకుండా  ఉండదు  కదా!


   మన  పూర్వీకులు  చక్కగా  పొదుపుగా  జీవించేవారు.  ఎక్కువ  ఆడంబరాలకు  పోవద్దని  ,  పరిసరాలను  శుభ్రంగా  ఉంచుకోవాలని ,  మరెన్నో  చక్కటి  విషయాలను   గ్రంధాల  ద్వారా  తెలియజేశారు.


శుచిశుభ్రత  ఉన్న  ఇంట్లో ,  పరిసరాలలో   లక్ష్మీదేవి  ఉంటుందని  తెలియజేశారు.  జీవితంలో  ఎలా  ప్రవర్తించాలో,  ఎలా  ప్రవర్తించకూడదో ,   ఎలా  ప్రవర్తిస్తే  ఎలాంటి  ఫలితాలు  వస్తాయో  పురాణేతిహాసాల  ద్వారా  తెలియజేశారు.


 మనిషి  పుట్టుక  నుంచి  మరణానంతరం  కూడా  ఏమవుతుందో    వివరించే  విజ్ఞానాన్ని    అందించారు. చావుపుట్టుకల  మధ్య  జీవించటానికి  అవసరమైన  విజ్ఞానాన్ని  తెలియజేశారు.


  నైతికవిలువలను  పాటించిన  దగ్గరే  దైవానుగ్రహం  లభిస్తుంది.   నైతికవిలువలను  పాటించకుండా  జీవిస్తున్న  జాతి   గతి   అధోగతే.
..................................... 


 కొందరు  వ్యక్తులు  తాము   జన్మించిన  ఊళ్ళను   ఆదర్శంగా  తీర్చిదిద్దారని , పేదరికం,  నిరక్షరాస్యత ,  దురలవాట్లు.  వంటివి  లేకుండా  చేశారని ,  తమ  గ్రామాలను  ఎంతో  అభివృద్ధి  చేసారని  పత్రికల్లో  రాస్తుంటారు.


ఇలాంటి   గొప్ప  వ్యక్తులు  తమ  గ్రామాలను  ఏ  విధంగా   అభివృద్ధి   చేసారో  చూసి  తెలుసుకుని  ఆ  విధంగా  అన్ని  గ్రామాలను,  నగరాలను  అభివృద్ధి  చేయవచ్చు.


చేతిలో  అధికారం,  ఆర్ధికవసతులు  సరిగ్గా  లేకుండానే   కొందరు  వ్యక్తులు  గ్రామాలను  అభివృద్ధి చేస్తున్నారంటే ,   ప్రభుత్వం,  అధికారులు,  ప్రజలు  గట్టిగా  సంకల్పించుకుంటే  ఈ  దేశం  తిరిగి  పునర్వైభవాన్ని  పొందగలుగుతుంది  ....అని  ఆశించటంలో  ఎటువంటి  సందేహమూ  లేదు.


2 comments: