koodali

Friday, October 31, 2025

చేసిన తప్పు లకు పశ్చాత్తాపాన్ని పొంది.....

 

 దైవానుగ్రహం పొందాలన్నా, గురువు అనుగ్రహం పొందాలన్నా సత్ర్ప్రవర్తన అవసరం.

    కొందరు పాపాలు చేసి, తరువాత చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తారు.  తాము పశ్చాత్తాపం చెందాం కాబట్టి,  ఇక తమకు ఎటువంటి శిక్షా లేకుండా ఉండాలని కూడా కొందరు ఆశిస్తారు. 

ఇలాంటి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపం చెందారా లేక పరిస్థితి అనుకూలిస్తే మళ్ళీ నేరం చేస్తారా? అనేది తెలియదు.

        నిజంగా పశ్చాత్తాపం చెందినా కూడా కొంతయినా  శిక్ష పడక తప్పకపోవచ్చు. ఎందుకంటే, నేరస్తుల వల్ల బాధితులకు జరిగిన అన్యాయం, బాధ, ఆక్రోశం ఉంటాయి కదా!

   చిన్న నేరం అయితే బాధితులు నేరస్తులను క్షమించే అవకాశం ఉంది, లేక కొద్దిపాటి శిక్షతో సరిపెట్టుకోవచ్చు.

  పెద్ద నేరం, క్రూరమైన నేరం చేస్తే మాత్రం.. నేరం చేసిన వాళ్ళు పశ్చాత్తాపాన్ని ప్రకటించినా కూడా శిక్ష తప్పకపోవచ్చు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు.  అప్పుడు, నేరస్తులు ఎంత ప్రాధేయపడినా ఉపయోగం ఉండకపోవచ్చు.

  అయితే, నేరం చేసిన కొంతకాలం తరువాత కానీ,మరణానికి ముందు కానీ .. పశ్చాత్తాపం కలిగితే దానివల్ల మరుజన్మలో కొంత మంచి జన్మ రావటానికి ఉపయోగపడవచ్చు.
    ........................................................
       
    సమాజంలో క్రూరమైన నేరం చేసిన తరువాత ఉరిశిక్ష పడితే ఆ శిక్ష నుండి తప్పించాలని జడ్జి ముందు ఎంత ఏడ్చి ప్రాధేయపడినా ఏం లాభం? 

జడ్జి ఎంత దయకలవారైనా వారికి కొన్ని నియమాలు ఉంటాయి కదా..వారు చట్టం ప్రకారం నడచుకోవాలి.

   జీవులు తమను తాము నిగ్రహించుకోలేక పాపాలు చేసి, తత్ఫలితంగా కష్టాలు వస్తే దైవాన్ని నిందించటం సరికాదు.  .

   కొందరు పాపకర్మలను పరిహారాలు చేయటం ద్వారా తొలగించుకోవాలనుకుంటారు. అయితే, పాపకర్మల పరిహారం కొరకు పరిహారక్రియలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి.

కొన్ని పరిహారాలను చేయటం కూడా కష్టమే. కొన్ని పరిహారాలను ఆచరించటం కంటే, కష్టాలను అనుభవించటం ద్వారా పాపక్షయం చేసుకోవటమే తేలికగా అనిపించవచ్చు.

పరిహారాలు సరిగ్గా ఫలించాలన్నా సత్ప్రవర్తన అవసరం.
  .....................................................

        ఎవరైనా తప్పు చేస్తే చట్టంలో దానికి తగ్గ శిక్షలుంటాయి.  ఇలా శిక్షించటం ఎందుకంటే, శిక్ష వల్ల భయంతో ఇకమీదటైనా తప్పులు చేయరనే ఉద్దేశంతో శిక్షిస్తారు.

    అంతేకానీ , తప్పు చేసినా తప్పుకు శిక్షగా జరిమానా చెల్లించటం లేక కొంతకాలం జైల్లో ఉండి వచ్చి , చేసిన తప్పులకు పరిహారం జరిగిపోయింది కాబట్టి, మళ్లీ తప్పులు చేయటం ..అనేది అసలు ఉద్దేశం కాదు. 

తిరిగి మళ్లీ తప్పు చేయకూడదనేది సరైన ఉద్దేశ్యం.

    చెడుపనుల వల్ల కష్టాలు వచ్చినప్పుడు, ఆ కష్టాల నుండి తప్పించుకోవటానికి పరిహార పూజలు చేసుకోవటంలో తప్పులేదు. అయితే పరిహారం జరిగింది కాబట్టి, మళ్లీ పాపాలు చేయటం తప్పు.

    ఎన్ని పాపాలు చేసినా .. పరిహారాలతో బైటపడవచ్చు ..అనే భావన ప్రజలలో వస్తే అది ఎంతో ప్రమాదకరమైనది. పూర్వీకులు మనకు తెలిపిన ఉద్దేశ్యాలకు వ్యతిరేకమైనది.
 ..............................

కొందరు చేసే చెడ్దపనుల వల్ల సమాజంలో ఎందరికో కష్టాలు వస్తాయి.

ఇలాంటప్పుడు దైవం చూస్తూ ఊరుకోరు.. చెడుపనులు చేసేవారిని తనదైన విధానంతో దారిలోకి తెస్తారు.

    ****************************
    రావణాసురుడు ఎంతో గొప్ప పండితుడు. అతనికి ఎన్నో పరిహారాలు తెలిసే ఉంటాయి. అయినా మరి శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.

    పాపాలు చేయటాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిహారాలు చేయాలన్నా..అనుకున్నట్లు జరగకపోవచ్చు.

***************************

ఎవరైనా మంచిచేసినా.. చెడ్ద చేసినా దానికి తగ్గ ఫలితాలు ఉంటాయి.

    చెడ్దవారి విషయంలో ఎలాగూ వారు చేసిన చెడుపనులకు తగ్గ ఫలితాలు ఉంటాయి. 

అయితే, కొందరు మంచివారికి కూడా కొన్ని కష్టాలు రావటం, వ్యాధులు రావటం.. లోకంలో గమనిస్తాం.

     ఎన్నో మంచిపనులు చేసినా కూడా ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందో కదా ..అనిపిస్తుంది. 

     కొన్ని విషయాలు ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే, మంచివారి వల్ల కూడా కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందులు వస్తాయి.

ఉదా..ఒక మంచి వ్యక్తికి కోపం బాగా ఉండి అందువల్ల ఇతరులకు బాగా ఇబ్బందులు కలిగితే, అందువల్ల కూడా ఆ మంచివ్యక్తికి కొన్ని బాధలు కలిగే అవకాశముంది.

    ఉదా..ఒక మంచివ్యక్తి తాను కొన్ని మూఢనమ్మకాలను నమ్మి, కుటుంబసభ్యులను, ఇతరులను కూడా ఆ మూఢనమ్మకాలతో ఇబ్బంది పెడితే, ఆ ఉసురు వల్ల అతనికి ఈ జన్మలోనో, మరుజన్మలోనో..కొన్ని కష్టాలు..వచ్చే అవకాశముంది.
 .................................

భక్తులమని చెప్పుకునే వాళ్ళలో కూడా కొందరు చెడుపనులు చేస్తున్నారు. భక్తులనే వాళ్లు పాపాల విషయంలో ఎందుకు భయపడటం లేదు? 

బహుశా వాళ్ళ ఉద్దేశం ఎన్ని పాపాలు చేసినా దానికి తగ్గ పరిహారం చేసుకుంటే చాలు.. పాపాల నుంచి విముక్తులు కావచ్చని అనుకుంటున్నారు కాబోలు, లేక మనస్సును అదుపులో ఉంచుకోలేక తిరిగి తప్పులు చేస్తారు.    

 ................................................ 

దైవనామ స్మరణాన్ని, పూజలు చేయటాన్ని  మొదలుపెట్టి, అలా పూజలు  చేస్తూచేస్తూ..ఉండటం వల్ల  క్రమంగా   పాపాత్ములలో  మార్పు వచ్చి మంచిగా  పరివర్తన చెందుతారు.

* మందులు మనకు ఇష్టం ఉండి వేసుకున్నా, ఇష్టం లేక  మ్రింగినా అనారోగ్యాన్ని  పోగొడతాయి కదా! అలాగే ఏ కారణంతో దైవనామస్మరణాన్ని మొదలుపెట్టినా ఫలితం లభిస్తుంది. 

అయితే, దైవనామ స్మరణం చేసే వ్యక్తి  యొక్క  భక్తిశ్రద్ధలు , నీతినిజాయితీలను బట్టి  ఫలితాల్లో  ముందువెనుక  తేడాలుంటాయి.  కొందరికి  శీఘ్రంగా  మంచి  ఫలితాలు  కనిపిస్తాయి. కొందరికి  ఒక జన్మలో  మంచి మార్పు  కనిపిస్తే, మరి  కొందరిలో  కొన్ని జన్మలు పట్టవచ్చు. 

*  డాక్టరు  తన  వద్దకు  వచ్చిన  పది  మంది  రోగులకు  ఒకే రకం   మందులను  ఇచ్చినా ,  ఆ  రోగులు  సక్రమంగా  మందులను వేసుకోవటం,  సక్రమంగా  పధ్యాన్ని  పాటించే  విధానాలను   బట్టి  వారి  వ్యాధులు   తగ్గే  సమయంలో  ముందువెనుక  తేడాలుంటాయి.   
 
కొందరికి రోగం  త్వరగా  తగ్గుతుంది. కొందరికి ఆలస్యంగా  తగ్గుతుంది. మందులు  సరిగ్గా  వేసుకోకుండా, పధ్యం సరిగ్గా  పాటించని  వారికి  రోగం త్వరగా తగ్గకపోవచ్చు కూడా.
............................. 

 దైవాన్ని దృఢంగా నమ్మి శరణు పొందిన వారి విషయంలో దైవము, వారిని సరైన పద్ధతిలో జీవించేలా చేస్తారు.

అయితే, భక్తులం అని చెప్పుకునేవారికి కొందరికి అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది..తాను ఎన్నో పూజలు చేయటం వల్ల, తాను ఎలా ప్రవర్తించినా కూడా..దైవం కూడా తనకి లొంగక తప్పదు..అనే విధంగా అహంకారం ఉన్న వారి విషయంలో, వారు ఎన్ని పూజలు చేసినా కూడా గొప్పఫలితాలను పొందలేకపోవచ్చు. 

................................. 

    కష్టాల నుండి తప్పించుకోవాలంటే, చేసిన పాపాల గురించి పశ్చాత్తాపపడి మంచిమార్గంలోకి రావటానికి ప్రయత్నించాలి.

    తప్పులు చేసిన వారిని క్షమించటమూ అవసరమే. అయితే ఎంతవరకు?

    దైవం దయామయులు. ఎవరైనా మంచిగా మారటానికి కొంత సమయాన్ని ఇస్తారు.
    ఆ తరువాత కూడా వినకపోతే వారికి తగిన శాస్తి జరుగుతుందని పురాణేతిహాసాల ద్వారా తెలుస్తుంది.

    శ్రీరామునికి సీతాదేవిని అప్పగించేయమని ఎందరు చెప్పినా రావణాసురుడు వినలేదు.
    శివుని అంశ అయిన హనుమంతులవారు మంచి చెప్పినా రావణుడు వినిపించుకోలేదు. తుదకు అందుకు తగిన శిక్షను అనుభవించాడు.

(రావణాసురునికి తాను గొప్పసంపదలు ఉన్న వ్యక్తిని అనే అహంకారంతో పాటు, తన భక్తి కూడా ఎంతో గొప్పది, తాను ఎలా ప్రవర్తించినా కూడా ..దైవం కూడా తన కి లొంగక తప్పదు.. అనే అహంకారం ఉండి ఉంటుంది.అందుకే అతనిపరిస్థితి అలా అయ్యిఉంటుంది. )

  శ్రీకృష్ణుడు..శిశుపాలుని నూరు తప్పుల వరకు సహించి తరువాత శిక్షించారు.

 అందువల్ల, అందరమూ జాగ్రత్తగా ఉండటం మంచిది.

 దైవం పట్ల ప్రేమతో కూడిన శరణాగతి ఉంటే,
 దైవం  కాపాడుతారు.
    ......................

    గతంలో చేసిన పాపాలకు దృఢంగా పశ్చాత్తాపపడి,  ఇక మీదట పాపాలు చేయటం మాని, పూజలు చేయటం, కష్టాల్లో ఉన్నవారికి సాయంచేయటం.. వంటి పరిహారాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే.. గతపాపకర్మ ఫలితం గణనీయంగా పలుచబడి, తక్కువ కష్టాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. కష్టాలు వచ్చినా పెద్ద కష్టం తెలియకుండానే ఆ కష్టాలు గడిచిపోవచ్చు.

కష్టాలలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వారు పొందిన సంతోషం వల్ల మన పాపకర్మ పలుచబడే అవకాశముంటుంది.

పరిహారాలు సరిగ్గా పనిచేయాలంటే, పాపాలు చేస్తూనే పరిహారాలు చేయటం కాకుండా, పాపాలు చేయటం మాని పరిహారాలు చేస్తూ ఉండాలి.
...................................

మద్యానికి అలవాటు పడ్డ కొందరికి మద్యం హానికరమని తెలిసినా దానిని వదలలేరు. మద్యం వల్ల వ్యాధి వస్తే కొందరు దానిని తీసుకోవటం మానేస్తారు. కొందరు వ్యాధి వచ్చినా మద్యాన్ని మానలేరు. 

అలాగే కొందరు,  
పాపాలు చేయటం తప్పని, అందువల్ల కష్టాలు వస్తాయని తెలిసినా,  తాము చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపాన్ని పొందుతూ కూడా.....పాపాలు చేయకుండా మాత్రం మనస్సును నిగ్రహించుకోలేరు. 

అలాంటప్పుడు తమకు సరైనదారిలో జీవించేలా శక్తిని ఇవ్వమని దైవాన్ని దృఢంగా ప్రార్ధిస్తే దైవము కరుణించే అవకాశం ఉంటుంది.

...........................
 పాపపరిహారం కొరకు పరిహారాలు చేయటం మంచిదే....పాపపరిహారాలు చేయగాచేయగా...ఆ పుణ్యం వల్ల వాళ్ల పాపప్రవృత్తి పోవచ్చు. 

పూజలు, దానధర్మాలను చేయటం వంటి పరిహారాల వల్ల....చేసేవారికి, సమాజానికి మంచిదే. 

అయితే, సరైన దైవభక్తి లేకుండా, అహంకారం కలిగి ఉండటం, పాపభీతి లేకుండా చేసే పరిహారాల వల్ల గొప్ప ఫలితాలను పొందలేకపోవచ్చు.

  ...................................
  ఎన్ని పాపాలు చేస్తునా కూడా కొన్ని పరిహారాలు చేస్తే చాలు సరిపోతుందని అనుకోవద్దు. దైవము ఏమీ అమాయకులు కాదు.

ఉదా..కొందరిని గమనిస్తే, వాళ్లకు చాలా డబ్బుంటుంది. కాని, ఇష్టమైనవి తినలేనివిధంగా డయాబెటిస్ లేక అలాంటి వ్యాధులుంటాయి....

చేసిన పుణ్యాలకు చాలా డబ్బును ఇచ్చి, చేసిన పాపాలకు ఫలితంగా ఇష్టమైన ఆహారాన్ని తినలేని విధంగా సుగర్ వంటి వ్యాధులను వచ్చేలా చేస్తారు.

 కష్టాలు రాకుండా ఉండాలంటే, మనస్సును నిగ్రహించుకోవటానికి ప్రయత్నించక తప్పదు. 
...................

ఎవరికైనా మంచిగా మారటానికి దైవము కొన్ని అవకాశాలను ఇస్తారు. 

ఎన్ని అవకాశాలు ఇచ్చినా మంచిగా మారకుండా సమాజానికి హాని కలిగే విధంగా పాపాలు చేసినవాళ్లు.. ఒకవేళ సమాజం వేసే శిక్షల నుండి తప్పించుకున్నా కూడా, దైవం నుండి తప్పించుకోలేరు.
...........................

దైవభక్తి..ధర్మబుద్ధి ఉండేలా దైవాన్ని ప్రార్ధించుకుంటే బాగుంటుంది.
......................................

 అజామిళుని కధ. వంటి కధలను చెప్పటంలో....link krimda..

link.... ఓం ..కొన్ని విషయములు..

 link..జాతకంలో రాసిపెట్టి ఉన్నది అనుభవించక తప్పదా ?

    

Tuesday, October 28, 2025

గ్రహ స్థితులు ఎలా ఉన్నా ...

 

  కొందరు జోతిష్కులు చెబుతున్న ప్రకారం.. రాబోయేరోజుల్లో తీవ్రమైన బాధాకరమైన సంఘటనలు ప్రపంచంలో జరుగుతాయని చెబుతున్నారు. అవి వింటే ఎవరికైనా భయాందోళనలు కలుగుతాయి. 

అయితే, భక్తితో దైవస్మరణ, దైవనామస్మరణ,  లోకక్షేమం కొరకు యజ్ఞయాగాదులు చేయటం, ధర్మబద్ధంగా జీవించటం..వంటి వాటివల్ల రాబోయే విపత్తులు గణనీయంగా తగ్గుతాయి. 

గ్రహ స్థితులు ఎలా ఉన్నా .. దైవభక్తి, మన ప్రవర్తనను బట్టి కూడా పరిస్థితులను మార్చుకోవచ్చు. గాయత్రి మంత్రాన్ని .. అందుకు సంబంధించిన విధులను చక్కగా ఆచరించటం మంచిది. అందువల్ల లోకక్షేమం కలుగుతుంది. ఎక్కువసార్లు చేయకపోయినా, కొన్నిసార్లు అయినా శ్రద్ధతో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

అయితే, గాయత్రి మంత్రాన్ని అందరూ చేయకూడదంటారు. పెద్దవాళ్లు చెప్పినట్లు పాటించటం మంచిది.    సర్వగాయత్రి మంత్రాన్ని అందరూ చేయవచ్చు,  సర్వగాయత్రిని చేసినా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.
 

అయితే, కొందరు సర్వగాయత్రి మంత్రాన్ని చదవటంలో కూడా.. అలా కాదు, ఇలా చదవాలంటూ..చెబుతున్నారు. ఇవన్నీ సందేహాలు ఎందుకనుకుంటే.. దైవస్మరణ, దైవనామస్మరణ చక్కగా చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. కలికాలంలో దైవస్మరణ, దైవనామస్మరణ సులభోపాయమని పెద్దలు తెలియజేసారు. 

 ********************
దైవపూజలు చేసినప్పుడు ప్రజలు , ప్రపంచంలో అందరికి తమతో సహా బుద్ధి సరిగ్గా ఉండాలని కూడా దైవాన్ని ప్రార్ధించుకుంటే మంచిది. బుద్ధి సరిగ్గా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. సరైన విధంగా జీవించే శక్తిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్ధించితే మంచిది.

*********************

 వ్రాసిపెట్టి ఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు.

ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును  మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.


ఉదా.. భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని  పొందగలిగితే  మంచి జరుగుతుందని తెలుస్తుంది.
********* 

గ్రంధాల ద్వారా మరి కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు.  

 ఎవరైనా బాగా పట్టుదలగా తపస్సు చేస్తే, దేవతలు  వరాలనివ్వటం జరుగుతుంది.
 
కొందరి విషయాలలో.. తపస్సు వల్ల  విపరీతమైన వేడి వచ్చి, ఆ వేడి లోకమంతా వ్యాపిస్తే.. ఆ వేడిని తట్టుకోలేని ప్రజలు దేవతలను ప్రార్ధిస్తే.. దేవతలు వరాలనివ్వటం జరుగుతుంది. ఆ వరాలను పొందిన తరువాత, వరాలను పొందినవారు వరగర్వంతో  ప్రజలను బాధ పెడితే, అప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా లోకక్షేమం కొరకు  దైవం వారిని చంపివేస్తారు.

ఈ విషయాలను గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, ఒక్కరు దృఢంగా తపస్సు చేస్తేనే లోకంపై చాలా ప్రభావం ఉన్నప్పుడు....కొందరైనా మంచివాళ్ళు లోకక్షేమం కొరకు గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తే ... దైవం వరాలను ప్రసాదిస్తారు.. అనిపించింది.

 ******************

లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు  మనకు ఏమనిపిస్తుందంటే,   దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. 

అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం  చేయటం, పశుపక్ష్యాదులను చంపి తింటూ, మద్యం, మత్తుపదార్ధాల మత్తులో నేరాలు..ఘోరాలు చేయటం , పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా? 
 
దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా,   సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.

మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అంతా దైవము దయ.


*************************

 Sunday, August 18, 2024
ఈ పోస్టును పైనవ్రాసిన తేదీన మొదట పోస్ట్ చేయటం జరిగింది. కొన్ని కారణాల వల్ల అక్కడ పోస్టును ఇక్కడ వేసి, ఇక్కడ పోస్టును అక్కడ వేయటం జరిగిందండి.

 

 

ఏవి నిజమో? ఏవి ప్రక్షిప్తాలో? మరికొన్ని విషయములు..

 

గ్రంధాలలో 
ఎన్నో అర్ధం కాని విషయాలుంటాయి.  ప్రక్షిప్తాలు కూడా ఉంటాయి. 

ఇవన్నీ  అదేపనిగా ఆలోచిస్తూ, వాదిస్తూ సమయాన్ని గడపటం కన్నా, ఇవన్నీ విని గందరగోళం పడటం కన్నా..కొంతవరకు తెలుసుకుని..అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుని మన శక్తికొలది చక్కగా దైవాన్ని ఆరాధించుకోవటం మంచిదనిపిస్తుంది.
................

ఒకప్పుడు వేదములను రాక్షసులు అపరించినప్పుడు,  దైవము రాక్షస సంహారం చేసి వేదాలను రక్షించారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. 

వేదాలనే అపహరించగలిగినప్పుడు, ఎవరైనా గ్రంధాలలో మార్పులుచేర్పులు(ప్రక్షిప్తాలు) చేయటంలో ఆశ్చర్యం ఏముంటుంది.
..................
 

మాంసాహారం వల్ల ఎంతో జీవహింస జరుగుతుంది. మద్యం వంటి మత్తు పదార్ధాల వల్ల మనస్సు అదుపు తప్పి ఎన్నో నేరాలు జరిగే అవకాశముంది. అందువల్ల, వాటిని ప్రోత్సహించేలా మాట్లాడటం సరైనదేనా?
...................
మాంసాహారం తినకూడదని వేదములలో ఉందని కొందరు చెబుతున్నారు.

మద్యాన్ని తీసుకోవటం పంచమహాపాతకాల్లో ఒకటని గ్రంధాలలో ఉందంటున్నారు. వాటిని సమర్ధించటం కూడా పాపమేనట.

 ............

 చక్కగా గాయత్రిని ఆచరించే కుటుంబాలవారు ఎన్నో నియమాలను పాటిస్తారు. అలా చేయలేనివారు తక్కువ నియమాలను పాటిస్తారు....(నాకు తెలిసినంతలో.. పాత కాలంలో అలా ఉండేదనుకుంటున్నాను.)

అయితే ఈ మధ్య కొందరు, ఎవరైనా కూడా అనేక నియమాలను పాటించాలన్నట్లు చెబుతున్నారు. ఉదా.. ఉల్లి,వెల్లుల్లి వంటివి తినకుండా నియమాలు పాటించాలన్నట్లు చెబుతున్నారు.

మరికొందరు ఏమంటున్నారంటే, గాయత్రిని ఆచరించే కొన్ని అగ్రవర్ణాల వారు (ఉదా..క్షత్రియులు..)మాంసాహారం తినొచ్చు అంటున్నారు.

ఒకరు ఏమంటున్నారంటే, బ్రాహ్మణ,క్షత్రియులు..యజ్ఞంలో వ్రేల్చబడిన బలిని  (మాంసాహారాన్ని) తీసుకోవాలని గ్రంధాలలో ఉందని చదివినట్లు గుర్తు ..అని చెబుతున్నారు.

 గాయత్రి మంత్రాన్ని చేసేవారు మాంసాహారాన్ని తీసుకోవచ్చా?

 ఎలా తిన్నా కూడా మాంసాహారం మాంసాహారమే కదా...అప్పుడు ఎవరైనా దైవం పేరు చెప్పి జీవహింస చేసి మాంసాహారం తిని, మేం చేసింది తప్పుకాదు అంటే సరిపోతుందా?

నియమాలను పాటించేటప్పుడు ఉల్లివెల్లుల్లి వంటివే తినకూడదంటే, మాంసాహారాన్ని ఎలా తీసుకుంటారు? ఏమిటో ?

................

భారతదేశం విదేశీపాలనలో ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించో, ప్రలోభపెట్టో గ్రంధాలలో కొన్ని మార్పులుచేర్పులు( ప్రక్షిప్తాలు)చేయించారేమో?

హిందువుల్లోనే కొందరు తమలోతాము గొడవలు పడి తమకుతోచినట్లు ప్రక్షిప్తాలు చేసారేమో? ఏం జరిగిందో దైవానికే తెలుస్తుంది.
..............

కొంతమంది ఏమనుకుంటారంటే, సాటి జీవులను ఎక్కువగా చంపితే వీరత్వం అనుకుంటారు. ఎవరైనా తమ మనస్సును అదుపులో ఉంచుకున్న వారే వీరులు. అంతేకానీ, మూగజీవులను చంపటం వీరత్వం కాదు.
................

క్రూరమృగాలు ఊళ్ళమీద పడి మనుషులను చంపే సందర్భాల్లో క్షత్రియులు ఆ క్రూరమృగాలను చంపవచ్చు . అందువల్ల, క్షత్రియులకు వేట నిషిద్ధం కాదు. అలాగని వేట వ్యసనం కాకూడదు.
............

వేటకు వెళ్లినప్పుడు దశరధ మహారాజు, పాండుమహారాజు.. అంతటివారే శాపాలకు గురయ్యారు.
................

నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే, యుద్ధరంగంలో పోరాడేవారు పౌరుషం రావటానికి బహుశా మాంసాహారం అలవాటుచేసుకున్నారేమో?..అనుకున్నాను.

ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, రాజ్యం మీదకు దండెత్తి వచ్చిన శత్రువులను చూస్తే.. వారిని ఎదుర్కునే ధైర్యం దానికదే రావాలి. అంతేకాని, ధైర్యం రావటం కొరకు మూగజీవులను చంపనవసరం లేదు.

తామసాహారాన్ని తింటే కోపం, ఆవేశం..వంటి తామస గుణాలు కలుగుతాయంటారు.

 ఆ విధంగా ఆహారం ద్వారా ఆవేశం రావాలంటే, మాంసాహారమే తిననవసరం లేదు. ఉప్పు,కారం బాగా ఉండే నిల్వ పచ్చళ్ళు, చద్ది ఆహారం.. కూడా తామసాహారమే. అలాంటివి తిన్నా సరిపోతుంది.

...........................

ఇంతకుముందు ఒక పోస్టులో..
 
 యుద్ధసమయంలో జంతువులను వాహనాలుగా చేసుకునేవారు. యుద్ధసమయంలో కొన్నిసార్లు శాకాహారం సరిగ్గా దొరకని సందర్భాలలో..అలా చనిపోయిన జంతువులను తినేవారేమో? అని రాసాను.

ఇలా వ్రాసిన తరువాత నాకు కొన్ని ఆలోచనలు కలిగాయి....

మనుషులు తమ అవసరాల కొరకు జంతువులను పెంచటం అలవాటుచేసుకున్నారు. 


మన అవసరాల కొరకు జంతువులను కష్టపెట్టటం కూడా పాపమే. యుద్ధాలు వస్తే మనుషులే తమలో తాము పోట్లాడుకోవాలి. మధ్యలో జంతువులను వాడటం, వాటిని చంపటం ..ఇంకా పాపం.
 
పాపాలు చేసినప్పుడు ఫలితాలను అనుభవించాలి.
................
మనుషులు కోరికలు తగ్గించుకుంటే కష్టాలు తగ్గుతాయి. 
 
మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాకూడా వేరేవాళ్లు వచ్చి, రెచ్చగొట్టి యుద్ధాలు చేస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి యుద్ధం చేయకతప్పదు. అప్పుడు ఆ పాపం రెచ్చగొట్టిన వారికే ఎక్కువగా తగులుతుందనిపిస్తుంది.
...............................
 
 

Monday, October 27, 2025

ఎన్ని చేసినా ..

 

 ఎన్ని పూజలు చేసినా కష్టాలు తీరట్లేదని కొందరు వాపోతుంటారు. అలా జరగటానికి అనేక కారణాలుంటాయి. 

మరి కొన్ని విషయాలను చెప్పుకుందాము..

ఆవుపాలు, నెయ్యి..వంటివి తీసుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయని ప్రచారాలు ఎక్కువవటం, పూజలకంటూ పెద్ద ఎత్తున ధారాళంగా పాలు, నెయ్యి వాడకాలు పెరిగాక కూడా పాలు, నెయ్యి, పెరుగుకు డిమాండ్ బాగా పెరిగింది.

 వేలాదిగా జనం వచ్చే కొన్ని దేవాలయాలలో ప్రసాదాల కొరకు వేల లీటర్ల నెయ్యిని వాడుతారు. 

ఇంకా, మామూలుగా కూడా పాలు, నెయ్యి తో తయారుచేసిన స్వీట్స్ తినటానికి, కాఫీలు, టీలు..తాగటానికి జనాలు బాగా అలవాటు పడ్డారు. 

ఇంతమంది జనాలకు ఇన్ని పాలు కావాలంటే ఆవులు, గేదెలు..ఎన్ని సార్లు గర్భధారణ చేసి అలసిపోవాలి?

 మేము ఒకసారి కొద్దిగా ఆవుపాలకొరకు ఒక దగ్గరకు వెళ్తే, అక్కడ  
మసక వెలుతురులో ఉన్న ఒక బిల్డింగ్లో ఆవులను ఉంచి పెంచుతున్నారు. సిమెంట్ గచ్చు ఆవులకు గుచ్చుకుంటుంది కదా..

 అక్కడ పరిసరాలు మురికిగా ఉన్నాయి.  ఆ మసక వెలుతురులో ఆ ఆవులు పాపం ఆకలి కొరకు తినటం చేస్తున్నాయి. అవన్నీ చూశాక నాకు చాలా బాధనిపించింది. 

 చక్కగా ఆరుబయట పచ్చికబయళ్ళలో తిరగాల్సిన ఆవులను డబ్బుకొరకు అలా కట్టేసి వ్యాపారం చేయటం..అలాంటి పాలు, నెయ్యి తెచ్చి దైవానికి ఇస్తే దైవము మెచ్చుకుంటారా? 

ఇక ముసలి ఆవుల పరిస్థితి అయితే చెప్పలేము. కొందరు ఆవు పాలు పిండుకుని అవి ముసలివి అయ్యాక కబేళాకు పంపేస్తారు.ఇవి దారుణమైన విషయాలు. 

వాటిని జీవితాంతము చక్కగా పెంచగలిగితేనే వాటిని పెంచాలి. 

 మనకు పుణ్యం కొరకో, ఆరోగ్యం కొరకో, మనం అదేపనిగా స్వీట్స్ తినటానికి, కాఫీలు, టీలు..తాగటం కొరకో..వాటిని అలా  బాధించటం ఏమిటి? 

 తమ కష్టాలు తీరటం కొరకు మొక్కుకుని దూడలను పుట్టించి దేవాలయాలకు దానం ఇస్తారు కొందరు. ఇక అంతటితో అయిపోతుందా? అవేమీ బొమ్మలు కాదుకదా..ప్రాణమున్న జీవులు. 

వాటిని జీవితాంతము పోషించడానికి ధనం కావాలి, చక్కగా చూసుకునే మనుషులు ఉండాలి. 

వేలసంఖ్యలో గోవులు అయినప్పుడు,  ఒకవేళ వాటిని ఎవరైనా సరిగ్గా చూసుకోకుంటే,  ఆ పాపం ఎవరికి తగులుతుందో? మన కష్టాలు పోవాలని వాటిని కష్టపెట్టకూడదు కదా..

.............................

 పాతకాలంలో ఆవుపేడలో నీళ్లు కలిపి ఇంటిముందు కళ్లాపి చల్లేవారు. అక్కడ నేల గట్టిపడేది. ముగ్గువేసేవారు.

గోశాలలో ఆవులు ఉండే దగ్గర సిమెంట్ చేయకుండా ,  కల్లాపి జల్లితే నేల గట్టిపడి ఆవులు పడుకోవటానికి బాగుంటుందో? పశువుల మలమూత్రాల తడికి నేల బురద అవుతుందో? ( ఈ విషయాల గురించి నాకు తెలియదు.)

పశువులు ఉండటానికి  కొందరు రబ్బర్ మాట్ లు వేస్తున్నారు. కొబ్బరి పీచుతో లేక గోనె సంచులతో తయారుచేసిన మాట్లు వేస్తే తడికి తేమ ఆరకపోవచ్చు. 

సిమెంట్ చేయకుండా అలా మట్టి నేలపైన కూడా పశువులను ఉంచవచ్చు.

లేదంటే,  రబ్బర్ మాట్ల పైన కొంత ఎండుగడ్డి పరచి రోజూ ఆ గడ్డిని మార్చవచ్చు. 

మనుషులైతే తమ సౌకర్యాల కొరకు చాలా ఆలోచిస్తారు. జంతువులు వాటి బాధలు చెప్పలేవు కదా. దైవమే దిక్కు.

.....................

అభిషేకాల కొరకు లీటర్ల పాలు, పెరుగులు సమర్పించటం కన్నా, మంచినీటితో అభిషేకం చేసినా దైవానుగ్రహం కలుగుతుందని నా అభిప్రాయం. 

లేదంటే ఆవులను మంచిగా పెంచుతూ కొద్దిపాటి పాలతో అభిషేకించినా చాలు.

ఒక్కొక్కరు అభిషేకం చేయటం కంటే, సామూహికంగా  పూజ చేస్తూ పూజ చేయించుకునేవారు పక్కన ఉండి, వారి గోత్రనామాలు చదివి పూజారులు అభిషేకం చేయవచ్చు. అప్పుడు తక్కువ పాలు, నెయ్యి..సరిపోతుంది.
కొన్ని దేవాలయాలలో ఇలాగే అభిషేకాలు చేస్తారు. 

 ...................

అందరికి వేల లీటర్ల స్వచ్చమైన పాలు, నెయ్యి లభించక కల్తి చేస్తున్నారు. 

అన్యాయార్జిత సొమ్ముతో సంపాదించిన ద్రవ్యాలతోను, కల్తీ వాటితోను పూజలు చేసినా సరైన ఫలితాలు రాకపోవచ్చు.

......................
 జీవితంలో జాలి, దయ, నైతిక విలువలు పాటిస్తేనే దైవానుగ్రహాన్ని పొందగలరు కానీ, మానవత్వం లేకుండా ఎన్ని చేసినా ..

 ..........................

link... 

8.05M subscribers

అంతా దైవము దయ...

 
ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో శుభాలు జరిగాయి. అశుభాలు కూడా జరిగాయి.

 ప్రపంచంలో మతాల పేరిట, అధికారం గురించి, సంపదల గురించి ఎన్నో పోరాటాలు, రక్తపాతాలు జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఎంతో బాధాకరమైన విషయం.

 ప్రపంచంలో జరుగుతున్న హింస చాలా బాధగా ఉంది.

ఆధునికకాలంలో చాలామందిలో అత్యాశ,  పాపాలు చేసి  అయినా డబ్బు సంపాదించాలనే తత్వం పెరిగాయి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు. 

డబ్బు, అధికారం..కొరకు ఎన్నో పాపాలు చేస్తున్నారు. సామాన్యజనం కూడా తమ వంతు పాపాలు చేస్తున్నారు. వీటి ఫలితాలే ప్రస్తుతం ప్రపంచం అనుభవిస్తోంది.

మద్యపానం, మత్తుపదార్ధాల వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతోంది. 

సోషల్మీడియాలో హింసాత్మక దృశ్యాలు, చెడ్ద విషయాలు వల్లకూడా చాలామంది ప్రభావితులవుతున్నారు. 

ఎవరైనా ఘోరమైన నేరాలు చేస్తే వారిని కఠినంగా  శిక్షించేలా చట్టాలు ఉండాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే,  ఎవరైనా నేరాలు చేయాలంటే ..భయంతో వణికిపోయేలా ఉండాలి.    హింసతో కూడిన ప్రసారాలకు, సమాజానికి హాని కలిగించే వ్యవహారాలకు.. ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకట్ట వేయాలి.  ప్రభుత్వాలు ఎప్పుడు ఇవన్నీ చేస్తాయో అర్ధం కావటం లేదు.

    ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా,  నీతినియమాలను పాటించనివారిని మనం ఏం చేయగలం?  వారి సంగతి దైవం చూసుకుంటారు.

 కొందరైనా నీతినియమాలతో దైవభక్తి కలిగి.. ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ ..దైవాన్ని ప్రార్ధిస్తే.. ఆ ఫలితం వల్ల దైవకృప కలిగి.. సమాజంలో శాంతి నెలకొనే అవకాశముంది.

ఆ మధ్య ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు చెప్పినదాన్ని బట్టి.... ఆధునిక కాలంలో జీవ హింస చేయటం బాగా పెరిగింది. పశుపక్ష్యాదులను చంపి తినటం విపరీతంగా పెరిగింది... 

అలా చనిపోయిన జీవుల ఉసురు తగిలి కూడా ప్రపంచంలో కష్టాలు వస్తున్నాయని వారు తెలియజేసారు. 

మనుషులకు జరుగుతున్న హింస పట్ల మనకు ఇంత బాధ ఉన్నప్పుడు, జంతువుల పట్ల మనం చేస్తున్న హింస గురించి కూడా మనము ఆలోచించాలి.

కారణాలేమైనా కూడా, ప్రపంచంలో జరుగుతున్న  ఘోరాలు వింటుంటే చాలా బాధగా ఉంది. రాక్షసప్రవృత్తి కలవారి పట్ల సౌమ్యత, సహనం పనికిరాదు. ఎలాగైనా ఈ ఘోరాలు ఆగాలి. 

అయితే, అంతా దైవం మీదే భారం వేసి కూర్చోవటం కాకుండా, దారుణాలు ఆగడానికి అందరూ తమవంతు ప్రయత్నం చేయాలి. 

************** 

మనుషులు చేస్తున్న పాపాల వల్ల ఎవరి కర్మ వారిదని దైవము ఊరుకుంటున్నారేమో? 

   అయితే, యుద్ధాలు, హృదయవిదారకమైన ఘటనలు, యాక్సిడెంట్లు, రక్తపాతాలు జరిగినప్పుడు అమాయకులైన పిల్లలు, మంచివారైన పెద్దవాళ్లు, అమాయకజీవులు.. కష్టాలు పడినప్పుడు ఎంతో బాధనిపిస్తుంది. 

దైవం చెడ్డవారిని శిక్షించి, ఆ దారుణాలను ఆపితే బాగుంటుంది కదా ..అనిపిస్తుంది. 

గ్రంధాల ద్వారా దైవం.. రాక్షసులను చంపివేసి లోకాన్ని రక్షించిన సంఘటనలు గురించి మనం తెలుసుకోవచ్చు.

 అయితే, ఏది ఎందుకు జరుగుతుందో చాలాసార్లు అర్ధం కాదు. మహాభారతంలో శ్రీకృష్ణులవారు..తమ గురువుయొక్క మరణించిన పుత్రులను తీసుకువచ్చి ఇచ్చారు. 

కానీ, యుద్ధంలో అభిమన్యుని రక్షించలేదు. అలా జరగడానికి గల కారణాలు మనకు తెలియకపోవచ్చు. లోకంలో కూడా చాలా విషయాలు మనకు అర్ధం కావు. దైవానికి అన్నీ తెలుస్తాయి.

  మనలో చాలామంది జీవితంలో...దైవం ఉన్నారని చక్కగా అనుభవంలోకి వచ్చిన సంఘటనలు ఉంటాయి.  దైవాన్ని నమ్మి.. ధర్మబద్ధంగా జీవించాలి.
...............
 ప్రపంచంలో శాంతి నెలకొనాలని , అంతా బాగుండాలని అందరూ మనస్పూర్తిగా దృఢంగా దైవాన్ని ప్రార్ధించాలి.  దైవాన్ని, దైవనామాన్ని అందరూ స్మరించుకోవాలి.

అంతా దైవము దయ...

oka link.... గ్రహ స్థితులు ఎలా ఉన్నా ...