koodali

Sunday, August 18, 2024

గ్రహ స్థితులు ఎలా ఉన్నా ...

 

 కొందరు జోతిష్కులు చెబుతున్న ప్రకారం.. రాబోయేరోజుల్లో తీవ్రమైన బాధాకరమైన సంఘటనలు ప్రపంచంలో జరుగుతాయని చెబుతున్నారు. అవి వింటే ఎవరికైనా భయాందోళనలు కలుగుతాయి. 

 

అయితే, భక్తితో దైవస్మరణ, దైవనామస్మరణ,  లోకక్షేమం కొరకు యజ్ఞయాగాదులు చేయటం, ధర్మబద్ధంగా జీవించటం..వంటి వాటివల్ల రాబోయే విపత్తులు గణనీయంగా తగ్గుతాయి. 



గ్రహ స్థితులు ఎలా ఉన్నా .. దైవభక్తి, మన ప్రవర్తనను బట్టి కూడా పరిస్థితులను మార్చుకోవచ్చు. గాయత్రి మంత్రాన్ని .. అందుకు సంబంధించిన విధులను చక్కగా ఆచరించటం మంచిది. అందువల్ల లోకక్షేమం కలుగుతుంది. ఎక్కువసార్లు చేయకపోయినా, కొన్నిసార్లు అయినా శ్రద్ధతో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

 

అయితే, గాయత్రి మంత్రాన్ని అందరూ చేయకూడదంటారు. పెద్దవాళ్లు చెప్పినట్లు పాటించటం మంచిది.    సర్వగాయత్రి మంత్రాన్ని అందరూ చేయవచ్చు,  సర్వగాయత్రిని చేసినా మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు.

 

అయితే, కొందరు సర్వగాయత్రి మంత్రాన్ని చదవటంలో కూడా.. అలా కాదు, ఇలా చదవాలంటూ..చెబుతున్నారు. ఇవన్నీ సందేహాలు ఎందుకనుకుంటే.. దైవస్మరణ, దైవనామస్మరణ చక్కగా చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. కలికాలంలో దైవస్మరణ, దైవనామస్మరణ సులభోపాయమని పెద్దలు తెలియజేసారు. 

 ********************

 వ్రాసిపెట్టి ఉన్నది ఎలాగూ తప్పనప్పుడు మనం ఏం చేయగలం? అని చాలామంది నిరాశగా అనుకుంటారు. అలా భావించటం పొరపాటు.దైవానుగ్రహాన్ని పొందగలిగితే భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉందని కొందరి చరిత్రల ద్వారా పెద్దలు తెలియజేసారు.

ఉదా..సతీ సావిత్రి చరిత్రలో సావిత్రి యమధర్మరాజును  మెప్పించి , సత్యవంతుని ఆయుర్దాయాన్ని పెంచుకోవటమే కాకుండా ఎన్నో వరాలనూ పొందటం జరిగింది.


ఉదా.. భక్త మార్కండేయుని చరిత్రను గమనించినా ..దైవానుగ్రహాన్ని  పొందగలిగితే  మంచి జరుగుతుందని తెలుస్తుంది.
********* 

గ్రంధాల ద్వారా మరి కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు.  

 ఎవరైనా బాగా పట్టుదలగా తపస్సు చేస్తే, దేవతలు  వరాలనివ్వటం జరుగుతుంది.

 
కొందరి విషయాలలో.. తపస్సు వల్ల  విపరీతమైన వేడి వచ్చి, ఆ వేడి లోకమంతా వ్యాపిస్తే.. ఆ వేడిని తట్టుకోలేని ప్రజలు దేవతలను ప్రార్ధిస్తే.. దేవతలు వరాలనివ్వటం జరుగుతుంది. ఆ వరాలను పొందిన తరువాత, వరాలను పొందినవారు వరగర్వంతో  ప్రజలను బాధ పెడితే, అప్పుడు ఎటువంటి మొహమాటం లేకుండా లోకక్షేమం కొరకు  దైవం వారిని చంపివేస్తారు.

ఈ విషయాలను గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, కొందరైనా మంచివాళ్ళు లోకక్షేమం కొరకు గట్టి పట్టుదలతో ప్రయత్నిస్తే ... దైవం వరాలను ప్రసాదిస్తారు.. అనిపించింది.

 ******************

లోకంలో కొందరు దుర్మార్గులు దారుణాలు చేసినప్పుడు  మనకు ఏమనిపిస్తుందంటే,   దైవం లోకంలోని చెడ్డవారిని అందర్నీ  చంపేయవచ్చు కదా.. అనిపిస్తుంది. అన్నీ దైవమే చేస్తే మనుషులు ఏం చేస్తారు? టెక్నాలజీ పేరుతో ప్రకృతిని ధ్వంసం చేస్తూ, పశుపక్ష్యాదులను చంపి తింటూ, పాపాలు చేసి అయినా ఆస్తులు పెంచుకుంటూ విలాసాలలో మునిగి ఉంటారా? 

 

దైవం జీవులకొరకు మంచి వాతావరణం, ఆహారం కొరకు ఎన్నో మొక్కలను, ఆహ్లాదకరంగా ఎన్నో సుందర ప్రకృతిదృశ్యాలను..ఇంకా ఎన్నింటినో ప్రసాదించినా కూడా,   సంతోషంగా ఉండటం చేతకాక... అంతులేని కోరికలతో, అసూయాద్వేషాలతో కొట్టుకు పోతున్నారు.


మనం ధర్మబద్ధంగా జీవించటానికి ప్రయత్నిస్తూ మన ప్రయత్నాలు మనం చేస్తూ.. కాపాడమని దైవాన్ని ప్రార్ధిస్తే కలికాలంలోనైనా
కూడా , అమాయకులు, మంచివారైన వారికి బాధలు గణనీయంగా తగ్గే అవకాశముంది. అంతా దైవము దయ.

 


No comments:

Post a Comment