koodali

Monday, September 2, 2024

అనే విషయాన్ని అందరూ..

 

   విజయవాడ ప్రకాశం బ్యారేజ్  కొంత ప్రమాదంలో ఉందంటున్నారు.  దైవం దయవల్ల వాన పడటం తగ్గింది.  బ్యారేజ్ కు  ఏమీకాదు.

***************
 ప్రపంచంలో చాలాచోట్ల పెద్ద ఎత్తున వరదలు, ఎండలు, అతివృష్టి, అనావృష్టి..వంటివి వస్తున్నాయి.  పర్యావరణాన్ని పాడుచేయటం వల్ల కూడా ఇలా జరుగుతాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తే మనుషులు ఏం చేయలేరు.

 

నుషులు అంతులేని కోరికలతో టెక్నాలజీ పేరుతో పర్యావరణాన్ని పాడుచేస్తే, కార్బండయాక్సైడ్ పెరగటం, ఓజోన్ పొర పలచబడటం, భూమి వేడెక్కటం, హుధుద్ తుపాన్ లాగ తుపాన్లు రావటం ..వంటివి ఎన్నో జరుగుతాయి.



గ్లోబల్ వార్మింగ్.. వంటి వాటివల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతాయంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో సముద్రమట్టం పెరిగి ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఊర్లు.. 

ఉదా..సముద్రపు ఒడ్డున ఉన్న వైజాగ్, ముంబై, చెన్నై..వంటి ఊర్లు  ప్రమాదంలో పడే  అవకాశాలున్నాయంటున్నారు.



 కొందరు పర్యావరణహిత శాస్త్రవేత్తలు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా, చాలామంది  పట్టించుకోవటం లేదు. ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ పడేయటం వల్ల అవి కాలువల్లో, చెరువుల్లో నీటికి అడ్డం పడిపోతున్నాయి. 

 

డ్రైనేజ్ సిస్టం సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. వానలు పడితే ముంబయ్, చెన్నై, హైదరాబాద్ ..వంటి నగరాల్లో  కూడా  వరదలు వస్తున్నాయి.

 

 *****************
 కొండచరియల క్రింద , చెరువుల్లో,కాలువల్లో.... ఇళ్లు కడితే ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది.


 అక్రమంగా కట్టిన ఇళ్లను కూల్చేస్తే మరల ప్రభుత్వాలను తిట్టిపోస్తారు. అక్రమంగా కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన ఉద్యోగస్తుల ఆస్తులను కూడా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలి. అవినీతిపనులు చేసే వారికి కఠినశిక్షలుండాలి.


 ప్రభుత్వం వారు, అధికారులు, ప్రజలు అందరు .. ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తిస్తేనే వ్యవస్థలు అన్నీ బాగుంటాయి. అంతేకానీ, ఎవరికి వారు తప్పులు చేస్తూ ఉంటే వ్యవస్థల పరిస్థితి తప్పులతడకలాగే ఉంటుంది.



 అవినీతితో వేలకోట్ల అక్రమ సంపాదన సంపాదించేవారు కొందరు, ఆఫీసుల్లో లంచాలు తీసుకుని, ఏ పనికైనా పర్మిషన్ ఇచ్చే వారు కొందరు, ఎన్నికల్లో వెయ్యి రూపాయలు.. ఒక మద్యం సీస..ఒక బిరియానిపాకెట్ తీసుకుని ఓట్లు వేసేవారు కొందరు. ప్రజలు చాలామంది ఇలా ఉన్నప్పుడు, వ్యవస్థ దానికి తగ్గట్లే ఉంటుంది.


 సమాజంలోని అందరూ ఎవరి పని వారు సక్రమంగా చేస్తేనే సమాజం సజావుగా నడుస్తుంది.

***********
 దైవానికి కూడా భయపడకుండా చాలామంది పాపాలు చేస్తున్నారు. ఎవ్వరైనా దైవం నుంచి తప్పించుకోలేరు..అనే  విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే మంచిది.

 ************

 ఈ మధ్యకాలంలో చాలా ఊళ్ళలో వరదలు వస్తున్నాయి. ప్రభుత్వం ఒక్కటే అంతా చేయలేరు. ప్రజలు కూడా సమాజం పట్ల తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి.


 మా చిన్నతనంలో మా తాతగారి ఊర్లో వేసవికాలంలో చెరువు ఎండినప్పుడు, ప్రజలే కలసి పూడిక తీసేవారు. ఎండ తగ్గిన తరువాత సాయంకాలం పనిచేసేవారు. కొన్నిసార్లు వెన్నెలవెలుగులో కూడా పనిచేసేవారు.  అదంతా చాలా సందడిగా ఉండేది.

చెరువులను, కాలువలను ఆక్రమించి .. ఇప్పటికే ఎంతోకాలం నుంచి బోలెడు కట్టడాలు నిర్మించారు.

అవి  చెరువులు, కాలువలు ప్రవహించే ప్రాంతాలని కొందరికి తెలిసి కూడా కట్టడాలను నిర్మిస్తే,  కొందరు  తెలియక  కొన్నామంటారు.  తెలిసిచేసినా, తెలియకచేసినా దాని పర్యవసానాలు ఉంటాయి.

అయితే, ఇప్పుడు ఆ కట్టడాలను కూల్చాలంటే చాలామంది ఒప్పుకోకపోవచ్చు. ఇక,  ప్రభుత్వాలు ఏం చేయగలరు? మరీ అడ్దంకిగా ఉన్న వాటిని కూల్చక తప్పదు కానీ, అన్నింటిని పడగొట్టాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో?  చెప్పలేము.


 భవిష్యత్తులో అయినా కొత్తగా అక్రమకట్టడాలు కట్టకుండా ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాలి. 

వరదలు వచ్చే ప్రాంతాలలో ఇళ్లను భూమికి బాగా ఎత్తుగా కడితే.. కొద్దిగా వరద వచ్చినప్పుడు నీరు ఇంట్లోకి రాకుండా ఉంటుంది.


బుడమేరు వరద రావటం వంటి సంఘటనలలో.. బుడమేరు వద్ద ఎత్తుగా గోడ కట్టడం వల్ల, వరద ఊరిమీదకు వచ్చే ప్రమాదం తగ్గవచ్చని నిపుణులు అంటున్నారట.

బుడమేరు నీరు సహజంగా కొల్లేరు సరస్సులో కలుస్తుందట. బుడమేరు కొల్లేరు  వరకు  సరిగ్గా వెళ్ళేలా  దారిలో అడ్డంకులను తొలగించాలి. కొందరు జనాలు కొల్లేరును కూడా కబ్జా చేస్తున్నారట.

 

గండ్లు పడి పెద్ద ఎత్తున వరదలు ఊర్ల మీద పడినప్పుడు.. ప్రాణనష్టం, వందలు లేక వేలు కోట్ల  ఆస్తినష్టం జరుగుతుంది..సహాయకార్యక్రమాలకు కూడా బోలెడు శ్రమ మరియు బోలెడు డబ్బు ఖర్చవుతుంది ..అలాంటప్పుడు, ఎక్కువ డబ్బు ఖర్చయితే.. అప్పు తెచ్చి అయినా ..  గోడవంటిది కట్టడం లేక వరద నీరు నిల్వ కొరకు చిన్న రిజర్వాయర్ కట్టడం.. వంటి  శాశ్వతపరిష్కారాలు చేయటం మంచిది.


వరదలు వచ్చే అవకాశమున్న ఊర్లలో.. అక్కడక్కడా ఎత్తైన భవనాలను నిర్మిస్తే వరదబాధితులకు పునరావాసకేంద్రాలుగా ఉపయోగించవచ్చు.

 
ప్రభుత్వాలు పడవలను, బల్లకట్టులను.. ఎక్కువసంఖ్యలో  కొనుగోలు చేసి ఉంచి, పడవలు నడిపే వారిని సిద్ధం చేసి ఉంచుకుంటే..ఎప్పుడైనా వరదలు వస్తే ప్రజలను త్వరగా రక్షించడానికి, ఇళ్లపైన ఉన్నవారికి ఆహారపొట్లాలను అందించడానికి పడవలు ఉపయోగపడతాయి. పడవల ద్వారా, మారుమూల ఉన్నవారికి కూడా త్వరగా సహాయాన్ని అందించవచ్చు.

**********
పడవలను ఉపయోగించటం మనకు కొత్తకాని, కేరళలో పడవలను ఎక్కువగా ఉపయోగిస్తారు.. అక్కడ రవాణాకు కూడా పడవలను ఉపయోగిస్తారు. మనకు కూడా పాతకాలంలో బకింగ్ హాం కాలువ ద్వారా ర
వాణావ్యవస్థ ఉండేదట.

*************

 ఎక్కువ నీళ్లు ఉన్నప్పుడు పడవలు ఉపయోగపడతాయి. నీరు తగ్గినతరువాత పడవలు ఉపయోగపడవు. విజయవాడలో నీరు ఎక్కువ ఉన్నప్పుడు పడవలను ఉపయోగించారు. నీరు తగ్గిన ప్రాంతాలలో వరదబాధితులను రక్షించడానికి ప్రభుత్వం వారు ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు.  ఇది మంచి ఆలోచన.  ఇలాంటప్పుడు ట్రాక్టర్లు బాగా ఉపయోగపడతాయి.

***************

 విజయవాడ వరదల్లో ఎంతోశ్రమతో కష్టపడి పనిచేస్తున్న వారు, సాయాన్ని అందిస్తున్నవారు ఎంతో గొప్పవారు. అందరికి ధన్యవాదములు.  ఎక్కడైనా సరే, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసిన అందరూ గొప్పవారే. అందరికి ధన్యవాదములు.

గోదావరి జిల్లాలు, విశాఖలో, ఉత్తరాంధ్రలో ..విపరీత వర్షాలు  త్వరగా  తగ్గుముఖం పడితే బాగుండు. ఎంతోశ్రమతో కష్టపడి పనిచేస్తున్న వారు, సాయాన్ని అందిస్తున్నవారు ఎంతో గొప్పవారు. అందరికి ధన్యవాదములు.  ఎక్కడైనా సరే, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసిన అందరూ గొప్పవారే. అందరికి ధన్యవాదములు.

1 comment:

  1. వరదబాధితులకు ప్యాకెట్లలో సరఫరా చేసే ఆహారం త్వరగా పాడవకుండా ఉండాలి. ఉదా..చింతపండు పులిహోర ఇవ్వచ్చు. అన్నం..త్వరగా పాడవని కూరలు, వేపుడు కూరలు ఇవ్వచ్చు.

    చపాతీలు నిలువ ఉంటాయి. చపాతీలతో తినడానికి వేపుడుకూర కానీ, పచ్చడి లేక జాం పాకెట్లను ఇవ్వవచ్చు. అయితే, చపాతీలు అందరు తినకపోవచ్చు. మనకు అన్నం అలవాటు.

    ఇడ్లీలు.. టమేటో పచ్చడి, అల్లం పచ్చడి కానీ, కారప్పొడి కానీ..ఇవ్వవచ్చు. చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి పచ్చడిలో కారం తక్కువ వేయాలి. బిస్కట్లు.. కూడా ఇవ్వచ్చు.

    ReplyDelete