Wednesday, April 15, 2015
ఆధునిక సింగపూర్ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన లీ క్వాన్ యూ గురించి మరియు ..
ఆధునిక సింగపూర్ నిర్మాతగా ప్రసిద్ధి చెందిన లీ క్వాన్ యూ.. గురించి ఈనాడులో కొన్ని వివరాలు చదివిన తరువాత ..
సింగపూర్ను ఆయన ఎన్నో కోణాల నుంచి అభివృద్ధి చేయటం జరిగిందని తెలుస్తోంది.
........
కొన్ని విషయాల గురించి చెప్పుకుందాము.
సింగపూర్ లో సహజ వనరులు లేకపోయినా అంతర్జాతీయ వ్యాపారంలో దూసుకువెళ్తోందట.
( మనదేశం కూడా ఆర్ధికంగా అంతర్జాతీయంగా వెలుగులు విరజిమ్మితే బాగుండు .)
సింగపూర్ ప్రజలకు ఉన్నతమైన అలవాట్లు ఉండాలని ఆయన భావించారట. ప్రజల వ్యసనాలను వదిలించటానికి ఎన్నో ప్రయత్నాలు చేసారట .
( మనదేశంలో ప్రభుత్వాలు మద్యం మీద వచ్చే ఆదాయం కోసం ఆధారపడకుండా ఉంటే బాగుంటుంది. .)
వెనుకాముందూ చూడకుండా వీధుల్లో తుపుక్కున ఊసే వారితో జరిమానా కట్టించారట.
( మన దేశంలో కూడా ఇలాంటివి అమలులోకొస్తే బాగుంటుంది.)
ఇద్దరు పిల్లల్ని మించి కనొద్దని హుకుం జారీ చేసాడట. అయినా వినకుండా గంపెడు పిల్లల్ని కనేవారి మీద పన్నులు వేశారట.
( ఇక్కడ పన్నులు వేయకపోయినా, ఓటుహక్కు రద్దుచేయటం..వంటివి చేయొచ్చేమో? ఎవరికైనా ఒక్కరు కాకుండా, ఇద్దరు పిల్లలు ఉంటే మంచిది.)
కాలుష్యనివారణకూ అధిక ప్రాధాన్యతను ఇచ్చారట... కారు కొనాలంటే ఆ
ధరకు ఒకటిన్నర రెట్లు మొత్తాన్ని పన్నుగా చెల్లించాలనే షరతు విధించారట.
ఇంకా కొన్ని షరతులూ ఉన్నాయట.
ఈ తలనొప్పులన్నీ ఎందుకనుకుంటే, ప్రజారవాణా వ్యవస్థను
ఉపయోగించుకోవచ్చట. అందుకే సింగపూర్ లో ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే కారు
ఉంటుందట.
( మన దేశంలో కూడా ఇలా జరిగితే బాగుంటుంది.)
..........
ఆయన అధికారంలోకి రాకముందు, ప్రజలు .. మురుగునీటినీ, పారిశ్రామిక వ్యర్ధాల్నీ నదుల్లోకి మళ్లించేవారట.
మన జీవితాల్ని మనమే సర్వనాశనం చేసుకుంటామా? ఇదేం పద్ధతి ? అని ఆగ్రహంగా ప్రశ్నించారట లీ క్వాన్ యూ.
ప్రజలు ఆలోచనలో పడి జలవనరులను సంరక్షించుకోవటానికి స్వచ్చందంగా ముందుకొచ్చారట..
( మనదేశంలో కూడా ఇలాంటి అద్భుతాలు జరిగితే బాగుండు . మనదేశప్రజలు కూడా జలవనరులను సంరక్షించుకోవటానికి స్వచ్ఛందంగా ముందుకొస్తే బాగుంటుంది.)
...............
మాతృభాషకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారట.
( మాతృభాష అంటే మృత భాషగా భావించే మన దేశంలోని జనం తమ అభిప్రాయాలను మార్చుకుని మాతృభాషను గౌరవిస్తే బాగుంటుంది..)
సింగపూర్ లో అవినీతి చాలా తక్కువట.
( ఇలాంటివి మనదేశంలో అసలు ఊహించగలమా ? మన దేశంలో కూడా అవినీతిపరుల పని పట్టే పటిష్టమైన వ్యవస్థ వస్తే బాగుంటుంది.)
.............
సింగపూర్లో ఖనిజవనరులు అసలేమీ లేవట. నీటివసతి కూడా అంతంత మాత్రమేనట. లీ క్వాన్ యూ అధికారాన్ని చేపట్టే నాటికి సింగపూర్ సంక్షుభిత దేశమట.
అయితే, నాయకుని ఆలోచనలకు ప్రజలూ స్పందించి తమ సహకారాన్ని అందించారట.
అయినా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సింగపూర్ను అభివృద్ధి చేసిన
మహామనీషి లీ క్వాన్ యూ అంటారు. ఇలాంటి నాయకులను ప్రజలు కలకాలం
గుర్తుంచుకోవటంలో ఆశ్చర్యం ఎంతమాత్రమూ లేదు.
అయితే, నాయకునికి సహకరించిన అధికారులూ, ప్రజలూ కూడా ఎంతో అభినందనీయులే.
నాయకులు, అధికారులూ, ప్రజలూ కలిసి పనిచేస్తే చక్కటి స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చని అనుభవపూర్వకంగా తెలుస్తోంది.
No comments:
Post a Comment