koodali

Wednesday, October 31, 2018

ఇద్దరూ ముఖ్యమే. ...


జీవితంలో తల్లితండ్రులూ ముఖ్యమే...జీవితభాగస్వామీ ముఖ్యమే.

కొందరు తల్లితండ్రిని బాగా గౌరవించి, జీవితభాగస్వామిని చిన్నచూపు చూస్తారు.

కొందరు జీవితభాగస్వామిని బాగా గౌరవించి, తల్లితండ్రిని చిన్నచూపు చూస్తారు.

 రెండూ తప్పే.

తల్లితండ్రులూ  ముఖ్యమే.. జీవితభాగస్వామీ   ముఖ్యమే.
........................

తల్లి తనకు  జన్మించిన సంతానాన్ని ఎంతో ప్రేమిస్తుంది.

 ఎందరో భార్యలు కూడా తమ భర్తలను ఎంతగానో ప్రేమిస్తారు.

తల్లి స్థానం ఎంతో గొప్పది.... అలాగని భార్యను చిన్నచూపు చూడటం సరికాదు.

రక్తం పంచుకుని పుట్టపోయినా ఎందరో స్నేహితులు ప్రాణస్నేహితులుగా ఉంటారు.


భార్యాభర్త కూడా జీవితంలోని  కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా చక్కటి స్నేహితుల్లా ఉండాలని పెద్దలు 
 అంటారు.
..................

తల్లి నవమాసాలు మోసి సంతానానికి జన్మనిస్తుంది.

భార్య నవమసాలు మోసి, భర్తకు చెందిన సంతానానికి జన్మనిస్తుంది.


తల్లి, భార్య ఇద్దరూ గొప్పవారే.


 కొన్ని కారణాలవల్ల కొందరు దంపతులకు సంతానం కలగకపోవచ్చు.  


సంతానం లేరని క్రుంగిపోకుండా దంపతులిద్దరూ జీవితంలోని కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా ఉంటూ సంతోషంగా ఉండాలి. 

దైవపూజలు చేయటం, వైద్య సహాయం ద్వారా సంతానాన్ని పొందే ప్రయత్నాలు చేయవచ్చు. లేదంటే ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు.

..................

కొందరు భర్తలు బయట తమకు కలిగిన విసుగును ఇంటికొచ్చి భార్యపై చూపిస్తారు. ఇలా చేయటం సరైనది కాదు.

కొందరు మగవాళ్ళు .... తల్లితండ్రితోనూ, అన్నదమ్ములతోను, అక్కచెల్లెళ్ళతోను , ఇరుగుపొరుగుతోనూ, ఆఫీసువాళ్ళతోనూ, అందరితో బాగా మాట్లాడుతూ భార్యతో సరిగ్గా మట్లాడకుండా విసుగును ప్రదర్శిస్తారు.

కొందరు స్త్రీలు కూడా ....అందరితో బాగా మాట్లాడి భర్తతో సరిగ్గా మాట్లాడరు.

భర్యాభర్తలను అర్ధనారీశ్వరులని పెద్దలు తెలియజేసారు.

శివపార్వతుల అర్ధనారీశ్వరతత్వం మనకు తెలుసు. అర్ధనారీశ్వర తత్వాన్ని గమనిస్తే, భార్యాభర్త బంధం యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. 

మరి జీవితంలో భార్యపాత్ర, భర్త పాత్ర కూడా ముఖ్యమే కదా!


 జీవితంలో ఒకరికొకరు తోడుగా జీవించటం కొరకు, సత్సంతానం కొరకు వివాహాన్ని ఏర్పాటుచేసారు.

భార్యాభర్త యొక్క బంధం సరిగ్గా లేనప్పుడు తల్లితండ్రిగా బాధ్యతలను కూడా సరిగ్గా నిర్వహించలేరు. అప్పుడు పిల్లలు బాధలుపడతారు.

కుటుంబవాతావరణం సరిగ్గా లేనప్పుడు ఆ ప్రభావం సమాజంపై పడుతుంది.

చక్కని కుటుంబవాతావరణం ఉన్న సమాజం బాగుంటుంది.
..................... 
విషయాల గురించి కొన్ని పాత టపాలను క్రింద ఇచ్చిన లింక్ వద్ద చూడగలరు.

Thursday, March 20, 2014


Wednesday, May 20, 2015



10 comments:


  1. కొన్ని సామెతలను గమనించితే,

    1..అడగనిదే అమ్మయినా పెట్టదు..ఈ విషయాన్ని గమనించితే, అమ్మ అడగనిదే పెట్టదు అనేది నిజం కాదు.


    బిడ్డ ఆకలి అని అడగకపోయినా, బిడ్డ ఆకలి గమనించి అన్నం పెడుతుంది తల్లి.

    పిల్లలు కొంచెం పెద్దయిన తరువాత, తల్లి పనిలో నిమగ్నమయి, పిల్లలకు ఆకలి వేసినప్పుడు అడుగుతారులే.. అనుకుని పనిచేసుకునే సందర్భాలలో.. అడగనిదే అమ్మయినా పెట్టదు.. అనే సామెత వచ్చి ఉండవచ్చు.

    అంతేకానీ, అడగనిదే అమ్మయినా పెట్టదు..అనేది ఎప్పుడూ నిజం కాదు.

    ...............

    2..తల్లిని గౌరవించేవారు భార్యనూ గౌరవిస్తారు...ఈ సామెతను గమనిస్తే, ఇది కూడా అందరి విషయంలోనూ నిజం కాదు.

    తల్లిని విపరీతంగా గౌరవించే కొందరు కొడుకులు, తల్లి చెప్పే మాటలు విని భార్యను తిట్టడం, వేధించటం..చేస్తుంటారు.


    ఇలాంటి సందర్భాలలో.. తల్లిని గౌరవించే మగవాళ్లు భార్యనూ గౌరవిస్తారు..అనే సామెత నిజం కాదు.. అని తెలుస్తుంది.

    ReplyDelete

  2. కొన్ని ఇతర విషయాలు..

    కొన్ని పాత సినిమాల్లో.. హీరోయిన్ ప్రేమను పొందటానికి హీరో ఇంకొక స్త్రీ వెంటపడితే, అది చూసి అసూయ కలిగి హీరోయిన్ హీరోకోసం వస్తుందన్నట్లుగా చూపించేవారు.

    ఇలాంటివి చూసి, కొందరు మగవాళ్లు అలా ప్రయత్నించే అవకాశముంది.

    హీరోయిన్ ప్రేమ కోసం ..మధ్యలో ఇంకొక అమ్మాయిని వాడుకోవటం ద్వారా.. నలుగురిలో ఆ అమ్మాయికి చెడ్డపేరు తెచ్చి, బ్లాక్ మెయిలింగ్ పద్ధతి ద్వారా హీరోయిన్ ప్రేమను పొందాలనుకునే వాడు అతనేం హీరో?


    స్త్రీ ప్రేమను పొందాలంటే ఆమెను చక్కగా చూసుకోవాలి.. అంతేకానీ, ఇతర స్త్రీల వెంటపడే పురుషులను ఏ స్త్రీ కూడా ఇష్టపడదు.


    ఈ రోజుల్లో అయితే, కొందరు స్త్రీలు మగవాళ్ళు తమ ఇష్టానికి తిరుగుతున్నప్పుడు, తాము మాత్రం తమ ఇష్టానికి తిరిగితే తప్పేమిటి ? అని ప్రశ్నిస్తున్నారు.

    స్త్రీలు, పురుషులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ అక్రమసంబంధాలతో తిరుగుతుంటే ఇక పిల్లలకు వారేం
    విలువలను నేర్పుతారు ?

    జీవితభాగస్వామి చెడ్దగా తిరిగితే అది వాళ్ల ఖర్మ. చెడ్ద వాళ్లను చూసి మంచివాళ్లూ చెడిపోకూడదు.
    .............

    పాతకాలపు సమాజంలో ఇన్ని విపరీత పోకడలు లేవు.
    ..మత్తుమందులు, పబ్బులు, నేరాలు..ఘోరాలు కొంత తక్కువగానే ఉండేవి.

    కాలక్రమేణా .. సినిమాలు, ప్రసారమాధ్యమాలు, సెల్ ఫోన్లు.. పెరిగిపోయాక మారుమూల గ్రామాలకూ ఆధునిక విపరీత పోకడలు విస్తరించాయి.
    ..........

    నైతికవిలువలను వదిలేయటం చాలా తేలిక.

    నైతికవిలువలతో జీవించటమే కష్టం. నైతికవిలువలతో జీవించే వారే గొప్పవారు.

    ReplyDelete
    Replies


    1. లోకంలో ఎన్నో రకాల మనస్తత్వాలు. ఎన్నోవిభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.

      అత్తాకోడళ్ళ సంగతులు ఇలా ఉంటే, భర్త యొక్క వివాహేతర సంబంధాల సమస్యతో కొందరు భార్యలు బాధలు పడుతుంటారు.

      ఈ విషయంలో భార్య బాధకు భర్తతో పాటు ఇంకొక స్త్రీ కూడా కారణం కదా!

      పై విషయాలను గమనిస్తే, స్త్రీల కష్టాలకు పురుషులు మాత్రమే కాకుండా, కొందరు సాటి స్త్రీలు కూడా కారణం అని తెలుస్తుంది.

      Delete

    2. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో చాలామందిలో డబ్బు సంపాదన కోరిక బాగా పెరిగింది. తల్లితండ్రి ఇద్దరూ సంపాదించటానికి వెళ్తున్నారు.

      తల్లితండ్రి ఏమంటారంటే, ధరలు బాగా పెరిగాయి కాబట్టి ఇద్దరూ సంపాదించకుంటే ఈ రోజుల్లో కష్టం అంటారు. అలాంటప్పుడు ధరలు తగ్గాలని పోరాడవచ్చు కదా!

      ధరలు పెరగటానికి కారణం కూడా ప్రజలే. డబ్బు బాగా సంపాదించాలనే కోరికతో కొందరు ప్రజలు ధరలు బాగా పెంచుతారు.

      ఎవరైనా కొంతవరకు సంపాదించుకుని తృప్తి పడితే సమాజంలో ఆర్ధిక అసమానతలు ఉండవు. పేదరికం గణనీయంగా తగ్గుతుంది. కుటుంబాలలో ఆస్తుల గురించి గొడవలు తగ్గుతాయి.

      జీవితంలో ఎన్ని ఉన్నాకూడా తృప్తి అనేది లేకపోవటం వల్ల..ఇంకా ఏదో కావాలనే తాపత్రయంతో సమాజంలో ఇంత పోటీ పెరిగి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కోరికలను పెంచుకుంటూ పోతే ఎంత డబ్బూ చాలదు.

      ఈ రోజుల్లో చాలామంది చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. చెడువ్యసనాలకు బానిసలైనవారు ఎంత చదువులు చదివినా, ఎంత డబ్బు సంపాదించినా ఏం లాభం?

      చెడు వ్యసనాలు ఉన్నా ఫరవాలేదు, డబ్బు సంపాదిస్తే చాలని భావించే ప్రజలు సంఖ్య పెరిగితే ఇక ఆ సమాజం గతి అధోగతే.

      Delete
    3. ఈ రోజుల్లో చదువు పేరుతో ఎంతో ఒత్తిడిని పిల్లల నెత్తిన రుద్దుతున్నారు.

      చాలామంది పిల్లలు తమ బాధలను ఎవరూ సరిగ్గా పట్టించుకోవటం లేదనే భావనతో బాధ పడుతున్నారు.

      చదువుల వత్తిడితో కొందరు పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కొందరు మత్తుమందులకు బానిసలు అవుతున్నారు.

      ఇవన్నీ కొందరు పిల్లల గురించి తెలుసుకున్న తరువాతే రాసాను.

      చిన్నపిల్లలు కూడా ఆటపాటలు లేకుండా గంటలతరబడి చదవాలని ఒత్తిడి చేస్తున్న తల్లితండ్రులు చాలా మందే ఉన్నారు.

      తల్లితండ్రులే అలా కోప్పడుతుంటే, తమకు అంతసేపు చదివే శక్తి లేని పిల్లలు తమ బాధలను ఎవరికి చెప్పుకోగలరు?

      కొందరు యువత కూడా తాము అంతంత చదువులు చదవలేకపోతున్నామని, తమ బాధలను తల్లితండ్రికి చెప్పినా కూడా... ఎలాగోలా సర్దుకుపోయి బాగా చదువుకోవాలి అంటున్నారే తప్ప, తమ బాధను పట్టించుకోవటం లేదని, జీవితమంటే విరక్తిగా ఉందని బాధ పడుతున్నారు.

      ఇవన్నీ కొందరు యువత గురించి తెలుసుకున్న తరువాతే రాసాను.

      ఈ కాలంలో యువతలో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా మద్యపానానికి అలవాటుపడటం గమనిస్తే, దేశం ఎటు పోతుందో అర్ధం కావటం లేదు. పెద్దవాళ్లు ఎవరి బిజీ వారిది. ఎవరికీ ఏమీ పట్టించుకునే తీరిక లేదు.


      బాధాకరం ఏమిటంటే, పెద్దవాళ్ళు చిన్నవారి బాధలను అర్ధం చేసుకునే పరిస్థితి తక్కువగా ఉంది.

      దయచేసి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ల బాధలు అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

      Delete

    4. కొందరు పెద్దవాళ్లు ఏమనుకుంటారంటే , తాము పిల్లలతో ఎక్కువగా మాట్లాడకుండా స్ట్రిక్టుగా ఉంటే పిల్లలు చెప్పినట్లు వింటారనుకుంటారు. పిల్లలతో ముభావంగా ఉండటం, వాళ్లు తమ సొంత అభిప్రాయాలను చెబితే కసురుకోవటం, చిన్నపొరపాటు చేసినా గట్టిగా కేకలువేసి కోప్పడటం, ఇలా చేయటం వల్ల పిల్లలకు పెద్దవాళ్ళంటే భయం, బెరుకు ఏర్పడతాయి. దాంతో పెద్దవాళ్ళతో ఎక్కువగా మాట్లాడకుండా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. పెద్దయినా కూడా వారిలో పెద్దవాళ్ళంటే ఉన్న బెరుకు పోదు.

      పెద్దవాళ్ళు పిల్లలను విపరీతంగా కట్టడి చేస్తే, పెద్దవాళ్ళంటే కోపంతో పిల్లలు మొండిగా తయారయ్యే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశముంది.

      కొందరు పెద్దవాళ్లు తమకు పెద్దవయస్సు వచ్చిన తరువాత ఏమనుకుంటారంటే, పిల్లలు తమతో సరిగ్గా మాట్లాడటం లేదంటూ వాపోతారు. ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, పెద్దవాళ్లు పిల్లలతో చిన్నతనం నుంచి ఆప్యాయంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా పెద్దలతో స్వేచ్చగా మాట్లాడతారు.


      ఇక కొందరు పెద్దవాళ్లేమో పనిలో బిజీగా ఉండి, పిల్లలతో ఎక్కువ సమయం గడపటం లేదనే బాధతో పిల్లలు ఏమడిగినా కొనీచ్చేస్తారు. అతిగా స్వేచ్చ ఇచ్చి గారాబం చేస్తారు. వాళ్లు ఎక్కడ తిరిగినా పట్టించుకోరు. పెద్దవాళ్ళు పిల్లలను అస్సలే పట్టించుకోకపోతే, పిల్లలు తెలిసీతెలియని వయస్సులో దారితప్పే ప్రమాదముంది.

      ఏ విషయంలోనైనా విపరీతధోరణి పనికిరాదు. ఏది ఎంతవరకో అంతవరకూ ఉండాలి.

      తల్లితండ్రి అంటే పిల్లలు భయంతో వణికిపోయేలా తల్లితండ్రుల ప్రవర్తన ఉండకూడదు. అలాగని, తాము ఏం తప్పు చేసినా తల్లితండ్రి ఏమీ కోప్పడరు.. అని పిల్లలకు అనిపించకూడదు.

      Delete

    5. కొందరు పెద్దవాళ్లు తమకు పెద్దవయస్సు వచ్చిన తరువాత ఏమనుకుంటారంటే, బోలెడు డబ్బు సంపాదించి పిల్లలకు ఇచ్చినాకూడా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. పిల్లలకు డబ్బు సంపాదనే ప్రధానం అయ్యింది అనుకుంటారు.

      నిజమే, ఇప్పటి సమాజంలో చాలామంది డబ్బు సంపాదనే జీవితధ్యేయంగా బ్రతుకుతున్నారు.

      అయితే, చాలామంది తల్లితండ్రి కూడా పిల్లలను స్కూల్లో చేర్చిన నుంచీ పిల్లలతో నువ్వు బాగా చదవాలి , క్లాసులో నువ్వే ఫస్ట్ రావాలి, పెద్ద ఉద్యోగం సంపాదించాలి...అని చెబుతుంటారు.

      జీవితంలో డబ్బే ప్రధానం అని చెప్పటం తల్లితండ్రి అభిప్రాయం కాకపోవచ్చు. అయితే, జీవితంలో డబ్బే ప్రధానం అనే విధంగా పిల్లలు అర్ధం చేసుకునే ప్రమాదముంది.

      పెద్ద ఉద్యోగం చేసి బాగా డబ్బు సంపాదించాలి లేకపోతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ పెద్ద ఉద్యోగం సంపాదించి బాగా డబ్బు సంపాదించాలి..పెద్ద బంగళా, కార్లు..పిల్లల గురించి బంధువులలో గొప్పగా చెప్పుకోవాలి..ఇలా కూడా ఉంటాయి కొందరు పెద్దవాళ్ల అభిప్రాయాలు.

      అంతేకానీ, పిల్లలు బాగా చదివి, మంచి ఉద్యోగంలో చేరి బోలెడు డబ్బు ప్రోగేయకపోయినా ఫరవాలేదు కానీ, కుటుంబంలో, సమాజంలో మంచి వ్యక్తిగా ఉండాలి..అని చెప్పే తల్లితండ్రులు ఎంతమంది ఉన్నారు?

      ఇక, తల్లితండ్రి కూడా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉంటారు. ఇద్దరూ ఉద్యోగాలు ఎందుకంటే, ఈ రోజుల్లో పెరిగిన ధరలతో ఇద్దరికీ ఉద్యోగం లేకపోతే ఎలా? అంటారు. ఇలా అన్నివైపులా ఎటు చూసినా డబ్బే సర్వస్వం అనే విధంగా పరిస్థితులు కనిపిస్తుంటే పిల్లలు కూడా డబ్బు సంపాదనే ధ్యేయం అనే పరిస్థితిలోకి వచ్చేస్తారు.

      ఇక వాళ్ళు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగం సంపాదించి, తమ కొరకు, తమ పిల్లల కొరకు డబ్బు సంపాదించే పనిలో బిజీ అయిపోతారు.

      ఈ రోజుల్లో చాలామందికి భార్యా పిల్లలతో సరిగ్గా మాట్లాడటానికి గానీ తల్లితండ్రితో సరిగ్గా మాట్లాడటానికి గానీ సమయం ఉండట్లేదు. ఇంకా చెప్పాలంటే, కొన్ని వృత్తుల వారికి తాము సమయానికి భోజనం చేయటానికి కూడా సరిగ్గా సమయం ఉండటం లేదు.

      ..............

      నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే పని విభజన జరిగి, పని భారం తగ్గుతుంది. అయితే, ఎక్కువ మంది ఉద్యోగస్తులను నియమించుకుంటే జీతాలు ఎక్కువగా ఇవ్వాలనే కారణంతో కొన్ని సంస్థల వాళ్ళు తక్కువ ఉద్యోగస్తులతో పని జరిపిస్తుంటారు.

      వీటన్నింటికీ కారణం ఎక్కువ జీతాలు కావాలనే ఉద్యోగస్తుల కోరిక, ఎక్కువ లాభాలు రావాలనే సంస్థల కోరిక, మొత్తానికి చూస్తే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ప్రజల కోరిక కారణం.

      Delete
    6. ఈ రోజుల్లో చాలామంది తల్లితండ్రి ఇద్దరూ బయటకు వెళ్తున్నారు.

      పిల్లలు చిన్నతనంలో క్రెష్లలో, తరువాత హాస్టల్ల్స్లో ఉండవలసి వస్తుంది. అక్కడ వాళ్లు సరిగ్గా తింటున్నారో? తినటం లేదో ? అనారోగ్యంతో ఎలా ఉన్నా కూడా వాళ్ళ బాధలు వాళ్ళే పడవలసి వస్తోంది.

      సమాజంలో పురుషుల హక్కుల గురించి మాట్లాడతారు, స్త్రీల హక్కుల గురించి మాట్లాడతారు.పెద్దవాళ్ళ హక్కుల గురించి మాట్లాడతారు. మరి పిల్లల హక్కుల గురించి ఎందుకు మాట్లాడరు ? చిన్నతనంలో తల్లితండ్రి దగ్గర పెరిగే హక్కు పిల్లలకు లేదా?

      పెరిగే వయస్సు ఎంతో ముఖ్యమయినది. చిన్నతనంలో సరైన ఆలనాపాలనా ఉంటే పిల్లలు శారీరికంగా, మానసికంగా చక్కగా పెరుగుతారు. తండ్రి డబ్బు సంపాదన కొరకు పనిలో ఉంటే, తల్లి అయినా దగ్గరుండి పిల్లలను పెంచటం అవసరం కదా!

      తల్లి అయినా పిల్లల విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తే పిల్లలు ఒంటరితనం ఫీలవ్వరు.

      Delete

    7. అత్తాకోడళ్ళ గొడవలు ఇప్పటివి కావు. తరతరాలనుంచి ఉన్నవే.

      అత్తగారి సాధింపులు వల్ల, భార్యాభర్తల మధ్య గొడవల వల్ల ఆత్మహత్య చేసుకున్న స్త్రీలు ఉన్నారు. చివరి నిమిషంలో పిల్లలు గుర్తొచ్చి కానీ, చావటానికి ధైర్యం సరిపోక కానీ .. ఆత్మహత్య విరమించుకుని బ్రతుకుతున్న వాళ్ళూ ఉన్నారు.

      అత్తగారి వల్ల బాధలు పడ్ద కోడళ్ళు కూడా.. తాము అత్తలయిన తరువాత తమ కోడళ్ళను సూటిపోటి మాటలతో బాధించటం ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ అలా చేయకపోయినా, కొందరు అలా ప్రవర్తిస్తారు.

      బహుశా తాను అత్తగారి వల్ల బాధలుపడినప్పుడు, కోడలు మాత్రం ఎందుకు సుఖంగా ఉండాలి అనిపిస్తుందేమో ? లేక కొన్నిసార్లు కోడళ్లు కూడా ఏమైనా తప్పుగా ప్రవర్తించి ఉండవచ్చు.

      కోడలు వచ్చిన కొత్తలో అత్తాకోడళ్లు బాగుండి, అత్తగారు కోడలితో ప్రేమగా ఉంటే... చుట్టుప్రక్కల వాళ్ళు కొందరు, కోడలిని అలా నెత్తికెక్కించుకుంటే ముందుముందు అలుసైపోతావు అనే విధంగా మాట్లాడి అత్తగారి మనస్సు మార్చే వాళ్ళూ ఉంటారు.


      ఈ రోజుల్లో అత్తగారిని బాధపెడుతున్న కోడళ్ల గురించి కూడా వింటున్నాం. కోడళ్ళు కూడా అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకోకూడదు. అత్తలను వేధించకూడదు.

      కొందరు కోడళ్ళు అత్తామామగార్లకు దూరంగా భర్తతో స్వేచ్చగా ఉండాలనుకుంటారు. అలాంటప్పుడు అత్తగారు మంచిగా ఉన్నా కూడా కోడళ్లు ఏదో వంకతో గొడవలు పడుతుంటారు. కోడళ్లకు దూరంగా ఉండాలనుకునే అత్తగార్లు కూడా కొందరు ఉంటారు.


      అత్తా ఒకప్పటి కోడలే. కోడలూ కాబోయే అత్తే. అత్తాకోడళ్ళు సఖ్యంగా ఉంటే బాగుంటుంది.

      సమాజంలో అనారోగ్యాలతో ఎందరో బాధలు పడుతున్నారు. కొందరు తమకు ఎన్నో భాగ్యాలు ఉన్నా కూడా పంతాలు, పట్టుదలలతో జీవితాలను నరకం చేసుకుంటూ అనారోగ్యం తెచ్చుకుంటున్నవాళ్ళూ ఉన్నారు.

      జీవితాలు శాశ్వతం కాదు. ఉన్నంతకాలం వీలైనంతలో సంతోషంగా ఉండాలికానీ, పంతాలు, పట్టుదలలతో జీవితాలను నరకం చేసుకోవటం తెలివితక్కువతనం.

      కొందరు పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే, ఎక్కువ డబ్బు సంపాదించి ఇస్తే తమకు పెద్ద వయస్సులో.. పిల్లలు తమను బాగా చూస్తారనుకుంటారు.అందరి విషయంలోనూ అది నిజం కాదు. తల్లితండ్రులు డబ్బు సంపాదించకపోయినా వారిని చక్కగా చూసుకునే పిల్లలు ఎందరో ఉంటారు.

      పెద్దవాళ్లు జీవితమంతా విపరీతంగా శ్రమపడి ఆస్తులు కూడబెట్టి పిల్లలకు ఇవ్వటం కన్నా, కొంత వరకు మాత్రం సంపాదించి, ఎక్కువగా పుణ్యకార్యాలు చేయటం మంచిది. ఇందువల్ల తమకు.. కుటుంబానికి.. సమాజానికి..కూడా మేలు జరిగే అవకాశం ఉంది.

      పుణ్యకార్యాలు చేయటం ఇహానికీ పరానికీ కూడా మంచిది.

      Delete
  3. పాతకాలంలో ఉమ్మడికుటుంబాలు ఎంత బాగుండేవో.. అంటారు కొందరు. అప్పట్లో ఎక్కడో కొద్దిమంది తప్ప, ఎక్కువమంది అన్నదమ్ములు వారసత్వంగా వచ్చే వృత్తులను చేస్తూ ఉమ్మడికుటుంబంగా ఉండేవారు. ఉమ్మడికుటుంబాలలో పెద్దవయస్సు వారికి, చిన్నపిల్లలకు సందడిగా ఉండేది. ఇక స్త్రీలకు పొద్దస్తమానం వంటలుచేయటం, ఇల్లు సర్దుకోవటం వంటి పనులతో కాలం గడిచిపోయేది.ఉమ్మడికుటుంబాలలో కూడా ఎన్నో గొడవలు ఉండేవి. అన్నదమ్ముల్లో కష్టపడి పని చేసేవారు కొందరయితే, బద్ధకస్తులు కొందరుంటారు. అన్నదమ్ములు వేరే వేరే పనులు చేసేవారైతే, కొందరికి ఎక్కువ సంపాదన ఉంటే, కొందరికి ఎంత కష్టపడినా తక్కువ సంపాదన ఉండేది. అందరి సంపాదన మాత్రం ఉమ్మడిగా ఖర్చుపెట్టబడేది. ఈ విషయాల గురించి కొన్ని గొడవలు వచ్చేవి. ఇక తోటికోడళ్ళ విషయంలో, గడుసుగా ఉండి తియ్యగా కబుర్లు చెప్పుకుంటూ పని తప్పించుకుని తిరిగే వారు కొందరయితే , మెతకగా ఉండి పనిభారం ఎక్కువగా మీదవేసుకుని కష్టపడి పనిచేసే వారు మరికొందరు. అత్తాకోడళ్ళ గొడవలు, తోటికోడళ్ల మధ్య గొడవలు ఉండేవి. మళ్ళీ అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవటం కూడా జరిగేది. ఇలా ఎన్నో విషయాలుంటాయి.


    ఉమ్మడికుటుంబాల్లో గొడవలు భరించలేక అప్పట్లో కొందరు అన్నదమ్ములు విడిపోయి ప్రక్కప్రక్కన ఇళ్లు కట్టుకుని ఉండటమూ చేసారు. అంటే, అందరూ ఒకే ఇంట్లో కాకుండా ఇరుగుపొరుగున ఉండటం వల్ల ఎవరి ప్రైవసీ వారికి ఉంటుంది, అదే సమయంలో కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగానూ ఉండచ్చు. ఇలా విడిగా ఉన్నా కూడా అందరూ తల్లితండ్రిని చూసుకునే వారు.


    ఇక కొంతకాలానికి, చదువులకోసం, ఉద్యోగాల కోసం తలొకదారి వెళ్ళే పరిస్థితి వచ్చాక ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. ఇండిపెండేంట్ కుటుంబాలు ఎక్కువయ్యాయి. ఈ పద్ధతిలో భార్యాభర్తలకు మాట్లాడుకోవటానికి, పోట్లాడుకోవటానికి చాలా స్వేచ్చ ఉంటుంది. అయితే, భార్యా భర్త ఇద్దరూ ఉద్యోగం వల్ల బయటకు వెళ్తే చిన్నపిల్లలను, వృద్ధులను చూసుకోవటానికి ఇబ్బందులు ఉంటాయి.


    ఇక ఇప్పుడయితే మరీ ఇండిపెండేంట్ కుటుంబాల వ్యవస్థ ఎక్కువయింది. అంటే, భార్య ఒక ఊరిలో, భర్త ఒక ఊరిలో , పిల్లలు వేరే ఊళ్ళలో హాస్టల్స్లో ఉంటూ అందరూ అప్పుడప్పుడు కలిసి ఉండి అదే కుటుంబం అనే రోజులొచ్చాయి.

    ఇక ముందుముందు పరిస్థితులు ఎలా మారతాయో?

    ReplyDelete