koodali

Wednesday, May 20, 2015

ఇంటింటికో కధ ..

 

 

ఒకటవ కధ....ఒక విధానం..

   మాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నారు. వారు అన్నదమ్ములు అందరూ కలిసి ఒకే ఇంట్లోఉంటారు. వారి తల్లితండ్రితో ఉంటారు. అందరితో సందడిగా ఉంటుంది వారిఇల్లు. తల్లిదండ్రులకు కూడా ఒక గది వేరేగా ఉంది.

 ..... 
ఇంకొక విధానం..
ఇంకొకకుటుంబంలో కొందరు అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండటం కాకుండా, పక్కపక్క ఇళ్ళు కట్టుకుని ఉండేవారు. వారి తల్లితండ్రితో ఉంటారు..వీరి ఇళ్ళు కూడా అందరితో సందడిగా ఉంటాయి.
 

**********************

మనుషులన్నాక బేధాభిప్రాయాలు సహజం. సర్దుకుపోతేనే కదా జీవితం సవ్యంగా సాగుతుంది.
 అయితే అందరి జీవితాలు ఒకలా ఉండవు కదా ! 
అందరి జీవితాలూ సవ్యంగా ఉంటే ఇక చెప్పుకోవటానికి ఏముంటుంది ?మనం ఎంత బాగా ఉన్నా అవతలి వాళ్ళు సరిగ్గా అర్ధం చేసుకోకపోతే కష్టాలే. 
..........................

రెండవ కధ.......
ఇంకొక కుటుంబం ఉన్నారు. వారిది జాయింట్ ఫామిలీయే. కొడుకుకోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ అత్తగారు ఒకసారి మా ఇంటికి వచ్చారు.

 ఆవిడ చెప్పిన విషయాలు ఏమంటే .....ఆ పెద్దవాళ్ళకు ఉదయాన్నే మెలకువ వచ్చేస్తుందట. వారికి టీవీలో భక్తి కార్యక్రమాలు చూడాలనిపిస్తుందట.



 కానీ ప్రొద్దున్నే టీవీ పెడితే టివీ సౌండ్ వల్ల కొడుకు కోడలు ఏమైనా అనుకుంటారేమోనని వీళ్ళు ఫీలవుతుంటారట. అంటే కొడుకు వాళ్ళు కొంచెం లేటుగా నిద్ర లేస్తారట. .


ఇంకా సాయంత్రం పూట పెద్దవాళ్ళకేమో పండ్లు లేక ఏదైనా లైట్గా తింటే చాలు అనిపిస్తుందట. పెద్దవాళ్ళకు బీపీ, సుగర్ .....వంటి అనారోగ్యాలు ఉంటే దానికి తగ్గట్లుగా ఉప్పు, కారం, పంచదార వంటివి తగ్గించి తీసుకోవాలి కదా ! 


కొడుకు వాళ్ళకేమో స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమట. 
ఇలాంటి సమస్యలతో సర్దుకుపోలేక వారు ఏం చేశారంటే..

వాళ్ళు ఉన్న ఇంట్లోనే ఒక భాగంలోనేమో పెద్దవాళ్ళు ఉంటే , ఇంకో భాగంలో కొడుకు వాళ్ళు ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారట. ఇప్పుడు వాళ్ళకు బాగానే ఉందట.
.. పెద్దవాళ్ళు వాళ్ళకు ఇష్టమయినట్లు ఉదయాన్నే భక్తి ప్రోగ్రాంస్ చూడటం ...తమకు నచ్చినట్లుగా వంట చేసుకుంటున్నారట.


తమకు ఏమైనా అనారోగ్యం వస్తే దగ్గరలో పిల్లలు అండగా ఉన్నారని పెద్దవాళ్ళకు 
ధైర్యంగా ఉంటుంది .......


కొడుకు వాళ్ళకేమోతాము ఉద్యోగం నుంచి ఆలస్యంగాఇంటికి వచ్చినా లేక ఏదైనా ఊరెళ్ళినా పిల్లలనుచూసుకోవటానికి పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది
 మొత్తానికి ప్రస్తుతం బాగానే ఉందనిఆవిడ చెప్పుకొచ్చారుఇలా ఉండే కుటుంబాలు ఈమధ్యమరికొన్నింటిని చూసాను.

**********************

మూడవ కధ........
ఇంటిపనీ, ఆఫీసు పనితో సతమతమయ్యే కోడళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఉద్యోగం చేసే కోడలికి ఇంటిపనిలో ఇష్టంగా సహాయం చేసే అత్తగార్లూ ఉన్నారు కానీ ........వారి సంఖ్య తక్కువ.

అలాంటి ఒక అత్తగారికధ....... కోడలికి వంట రాదని అత్తగారే ఉదయం పూటవంట చేసి భోజనం బాక్సులో పెట్టి కోడలికి ఇచ్చేవారట.వారి కోడలు రోజూ ఆఫీసు నుంచీ ఆలస్యంగా వచ్చేదట.సెలవు రోజుల్లో కూడా స్నేహితురాళ్ళతో షాపింగుకు వెళ్ళటం, ఇంటిపని పట్టించుకోకపోవటం .......అలా అత్తాకోడళ్ళకు గొడవలు అయిపోయాయి. ఇలాంటి అత్తకుఇలాంటి కోడలు రావటమే వింత .
***********************
నాలుగవ కధ........
కొందరు పెద్దవాళ్ళు పిల్లల ఉద్యోగాల వల్ల ఈ వయసులో కూడా ఇంటిపనులే సరిపోతున్నాయి. అని వాపోతుంటారు.  
నాకు తెలిసిన ఒక పెద్దామె కూతురు ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయికి ఒక పాప. కెరీర్ పోతుందని చెప్పి ఆ అమ్మాయి తన నెలల వయస్సున్న చంటిపాపను తల్లిదండ్రుల దగ్గర విడిచి ఉద్యోగంలో చేరిపోయింది. . 

పెద్దవాళ్ళకు సాయానికి పనివాళ్ళున్నారు. ఎంతైనా చంటిపిల్లల పని అంటే శ్రమే కదా ! . పనివాళ్ళు రానిరోజున పెద్దవాళ్ళ పని చాలా కష్టమైపోయేది. 

చంటిపాపను క్రెష్  అంటూ పరాయి వారి పెంపకంలో వదలలేక ఆ పెద్దవాళ్ళు అలాగే ఇబ్బందులు పడ్డారు. ఇదంతా చూసి వారి అమ్మాయి పాపను క్రెష్ లో వేసింది.

ఇలాంటివారిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, 
వారు వారి అమ్మాయిని చదివించి ఉద్యోగంలో చేర్పించటానికి ముందే ఈసమస్యల గురించి ఆలోచించుకుంటే బాగుండేది. .
 ఇప్పుడు చంటిపాపను క్రెష్లో చేర్పించటం కన్నా.. ఓపిక తెచ్చుకుని పెద్దవాళ్ళే పాపను పెంచటం న్యాయం అన్నది నాఅభిప్రాయం.

*********************

అయిదవ కధ.....
అయితే మరి కొందరు పెద్దవాళ్ళకేమో తమ మనుమలను,మనుమరాండ్రను పెంచిపెద్దచేయాలని ఎంతో సరదాగా ఉంటుంది. 

కానీ ఆ పిల్లల తల్లిదండ్రులేమో తమ చంటి పిల్లలను పెద్దవాళ్ళ దగ్గరకు పంపరు . తామే పెంచుకుంటాము అని క్రెష్ లో వేస్తుంటారు.

అక్కడ సరిగ్గా చూసినా చూడకపోయినా నోరులేని చంటిపిల్లలు తమ అభిప్రాయాలను పెద్దవాళ్ళకు చెప్పలేరు కదా పాపం !

చంటిపిల్లలను పెంచే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వారి దగ్గరే పెంచటం మంచిది.

*********************

కొందరు పెద్దవాళ్ళు పిల్లల దగ్గర ఉందామని వచ్చి తరువాత బాధ పడుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే ,

 మేము మా పిల్లలను పెంచి పెద్దచేసి ఇప్పుడు కాస్త విశ్రాంతిగా ఉండాలనీ , నాలుగు ఊళ్ళు తిరిగిరావాలనీ అనుకున్నాము. కానీ , పిల్లల ఉద్యోగాల వల్ల ఈ వయసులో కూడా ఇంటిపనులే సరిపోతున్నాయి. అని వాపోతుంటారు. 


అప్పటివరకూ జీవితంలో కష్టపడి మళ్ళీ పిల్లల వద్ద ఇంటిపనీ, వంటపనీ, పిల్లల పనీ నెత్తినేసుకుని చెయ్యాలంటే పెద్దవయస్సు వాళ్ళకి ఇబ్బందే మరి.

( పూర్వం అంటే కోడళ్ళు ఇంటిపనీ, వంటపనీ, చంటి పిల్లల పనీ చేసుకుంటే ....తాత బామ్మలు తమ మనుమలు, మనుమరాండ్రతో ఆడుకోవటం, వారికి కధలు చెప్పటంతో కాలక్షేపం చేసేవారు.
 )

యిలా రకరకాల కారణాల వల్ల ....కొందరు పెద్దవాళ్ళు తమ పిల్లలతో కలిసి ఉండటానికి అంతగా ఇష్టపడటం లేదు.వారికి పిల్లలతోనూమనుమలుమనుమరాళ్ళతో కలిసిజీవించాలని ఉన్నా కూడా .... విడిగా ఉంటున్నారు.

ఇంకొక పెద్ద కారణం ఏమంటే ...... పెద్దవయస్సులో పనిభారం పెరిగి ఏమైనా అనారోగ్యం వచ్చి మూలన బడితే వాళ్ళను చూసేవాళ్ళు ఎవరు ? అన్నది కూడా ఈ రోజుల్లో పెద్ద సమస్య అయిపోయింది కదా! .

*******************

ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే,

 చంటిపిల్లలనుసంరక్షించటానికి..... వృద్ధులను సంరక్షించటానికి,.....కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగినప్పుడువారిని సంరక్షించటానికి ......మరిన్ని రోబోట్లనుశాస్త్రవేత్తలు తయారుచేయాలేమో !!..

మనుషులు బిజీఅయిపోయారు కదా !)

*******************

పైన వ్రాసిన విషయాలు చదివి నావి అన్నీ నెగెటివ్ ఆలోచనలు అని చాలామంది విమర్శిస్తారు. చుట్టూ సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూసే వ్రాసాను . . రోజూ వార్తాపత్రికల్లో ఇంతకంటే చిత్రమైన జీవితకధలను చదువుతున్నాము.

భార్యాభర్తల మధ్య పెరుగుతున్న విడాకులు, టీనేజీ పిల్లలలో పెరుగుతున్న దురభ్యాసాలు, సమాజంలో పెరుగుతున్న అక్రమసంబంధాలు , ఇవన్నీ చూస్తూ కూడా సమాజం అంతా బాగుంది అనుకుంటే అది భ్రమ మాత్రమే..


దురదృష్టమేమిటంటే..  మద్యపానం, అర్ధనగ్నంగా దుస్తులు ధరించటం , ఇలాంటి అలవాట్లు ఉన్న వారికి సమాజంలో గౌరవం లభించటం
.

No comments:

Post a Comment