koodali

Friday, May 8, 2015

చతురాశ్రమ ధర్మాలు ..

 మనిషి జీవితంలో ఎన్నో దశలుంటాయి. బాల్యం, యవ్వనం, నడివయస్సు, వృద్ధాప్యం.
ఇప్పటి వృద్ధులు ఒకప్పటి పిల్లలే... . నేటి పిల్లలే భవిష్యత్తులో వృద్ధులవుతారు. 
...............

మనిషి జీవితం ఒక క్రమ పద్ధతిలో సాగటానికి పెద్దలు ఎన్నో విషయాలను తెలియజేసారు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్తం, సన్యాసం..అనే చతురాశ్రమాలను  తెలియజేసారు.


 బాల్యంలో ఆటపాటలు, విద్యాభ్యాసం తో  ..  బ్రహ్మచర్యాశ్రమం,  వివాహంతో    గృహస్థాశ్రమం, శరీరం వడలే దశలో..  వానప్రస్థం,  ఇక తరువాత సన్యాసాశ్రమం .

...................

బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం చాలామంది విషయంలో సాఫీగానే  జరిగిపోతాయి. 


వానప్రస్థం, సన్యాసం  దశలే  కష్టంగా  ఉంటాయి. ప్రయత్నిస్తే  ఈ  సమయాన్ని  కూడా  సాఫీగా గడుపుకోవచ్చు .  

...................

మనిషి మనసుకు, కోరికలకు వృద్ధాప్యం  ఉండకపోవచ్చు. అయితే శరీరానికి వృద్ధాప్యం ఉంది కదా!   నడివయస్సు వచ్చేసరికి  శరీరం   యవ్వనంలోలా  పనిచేయలేదు .


ఇష్టమైనంత ఆహారాన్ని తినాలని ఉన్నా శరీరం సహకరించదు. మనస్సును అదుపులో ఉంచుకోవటం తప్పనిసరి అవుతుంది.ఈ విధానం చాలా  విషయాలకు  వర్తిస్తుంది. 



వానప్రస్తం అంటే, ప్రాచీనకాలంలో కొందరు వనాలకు వెళ్లి జీవించేవారట. అందరికీ అలా ఆచరించే  ఓపిక  ఉండకపోవచ్చు.


ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిలో..  అరణ్యాలకు  వెళ్ళకుండా,  సంసారంలో  ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూ కూడా దైవకృపను పొందటానికి  ప్రయత్నించవచ్చు. 

..................

ఇక, సన్యాసం అనే విషయం  ఈ రోజుల్లో ఎక్కడో అరుదుగా తప్ప, అందరి వల్లా సాధ్యమయ్యే పని కాదు.


దైవకృపను పొందటానికి .. సాధ్యమయినంతలో రాగద్వేషాలను అదుపులో ఉంచుకుంటూ  జీవించటానికి ప్రయత్నించవచ్చు.

............................

 వృద్ధులైన  పెద్దవాళ్లను  పిల్లలు  ఆదరించాలని   కూడా పెద్దలు    తెలియజేసారు.  


పిల్లలు పెద్దవాళ్ళను  ఆదరించాలి . తాము  కూడా  భవిష్యత్తులో  వృద్ధులమవుతామని  గుర్తుంచుకోవాలి .  

 ............................. 

మరణానంతరం కూడా ఆత్మ  ఉంటుందని పెద్దలు తెలియజేసారు. ఆత్మ మోక్షాన్నీ పొందవచ్చు లేక మరుజన్మనూ పొందవచ్చు.


 మోక్షమే వస్తే అంతకంటే కావలసింది ఏముంటుంది. ఒకవేళ మోక్షాన్ని పొందలేకపోయినా చక్కటి మరుజన్మ రావాలంటే,   కనీసం   జీవిత మలిసంధ్యలో అయినా దానికి తగ్గ ప్రయత్నం చేయటం  అవసరం.

............................ 

జీవిత చరమాంకములో కూడా  అనవసరమైన సంపాదనా  యావతో,  పంతాలు, పట్టింపులతో, ఆధిక్యతా పోరాటాలతోనే  పొద్దుపుచ్చితే , మరణించిన తరువాత నరకయాతనలతో బాధలు పడవలసి వస్తుంది.


అలా కాకుండా ఉండాలంటే , పదుగురికి ఆదర్శంగా జీవించాలి  తప్ప, ఆరాటాలూ, పోరాటాలతో జీవితం  గడిపితే మరుజన్మ దీనాతిదీనంగా ఉండే అవకాశం  ఉంది... .అప్పుడు చింతించి ప్రయోజనం ఉండదు.

...............

సరైన మార్గంలో జీవించటానికి  తగినంత  శక్తినివ్వమని   శాశ్వత  బంధువు అయిన  దైవాన్ని ప్రార్ధించాలి.


శ్రీ దేవీ భాగవతము, ఒక యోగి ఆత్మ కధ..గ్రంధముల ద్వారా ఎన్నో విషయములను తెలుసుకోవచ్చు.




2 comments:

  1. మరణానంతరం కూడా ఆత్మ ఉంటుందని పెద్దలు తెలియజేసారు. ఆత్మ మోక్షాన్నీ పొందవచ్చు లేక మరుజన్మనూ పొందవచ్చు.--మీ మూఢనమ్మకాలకి నమస్కారం

    ReplyDelete

  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నాది మూఢత్వం కాదు.

    ఆధునికవిజ్ఞానం...".Matter and energy cannot be created or destroyed "......అని వివరించటం జరిగింది. ఈ సూత్రం ప్రకారం చూసినా జన్మలు,పునర్జన్మలు ఉండే మాట వాస్తవమే.

    Wednesday, August 29, 2012
    ".Matter and energy cannot be created or destroyed "......జన్మపరంపర
    అనే టపాలో ఈ విషయం గురించి వ్రాయటం జరిగింది. వ్యాఖ్యలు కూడా చదవగలరు.

    ReplyDelete