koodali

Saturday, May 9, 2015

ఆదర్శవంతమైన పెద్దవాళ్ళకు వందనాలు..

ఇంతకుముందు ఒక టపాలో కొందరు అత్తగార్లు కోడళ్లను పెట్టే ఆరళ్ళ గురించి, ఇలాంటి గొడవల వల్ల  కొన్ని వివాహాలు విడాకుల వరకూ వెళ్ళటం గురించీ రాసాను. 

పిల్లల అభివృద్ధి కోసం తల్లితండ్రి ఎంతో కష్టపడతారన్నది  నిజమే.  పిల్లలకు కూడా తల్లితండ్రి అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. ఇదీ సహజమే. 


అయితే మనం మాట్లాడుకుంటున్నది  పిల్లల వివాహం తరువాత వచ్చే సమస్యల గురించి. 

...................

పిల్లలకు తల్లితండ్రి ముఖ్యమే. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. మరి జీవితభాగస్వామి ముఖ్యం కాదా ? 


తల్లా ? పెళ్లామా ? అని వెనకటికి ఒక సినిమా వచ్చింది. నా అభిప్రాయం ఏమిటంటే తల్లీ ముఖ్యమే. భార్యా ముఖ్యమే. 

............

 తల్లితండ్రిని వదిలి అత్తింటికి వచ్చిన అమ్మాయి పట్ల అమ్మగా ఆదరణ చూపించలేకపోయినా, అత్తగారు  మానవత్వం మరిచిపోకుండా ఉంటే బాగుంటుంది.  

................

అత్తను కష్టపెట్టే కోడలంటే అత్తగారికి  కోపం ఉంటే అర్ధం చేసుకోవచ్చు. 


మంచిగా ఉండాలనుకునే కోడళ్ళను కూడా ఆరళ్లు పెట్టే అత్తలను ఎలా అర్ధం చేసుకోవాలి?

 బ్రతుకు మీదే విరక్తి వచ్చేలా సూటిపోటి మాటలనే అత్త అంటే గౌరవం ఎలా కలుగుతుంది ? 


 ఆస్తి ఇస్తారు కాబట్టి, ఎన్ని ఆరళ్లయినా పెట్టే హక్కు పెద్దవాళ్ళకు ఉంటుందా ?
..........

ఆస్తి విషయం  గమనించితే, అబ్బాయికి  తల్లితండ్రి ఆస్తి ఇస్తారు...అలాగే... భార్య కూడా ఆస్తిని తన పుట్టింటి నుంచి తెస్తుంది కదా !


తల్లితండ్రి తమ పిల్లలకు బోలెడు ఆస్తి సంపాదించి ఇవ్వటం అనేది మానుకోవాలి. ఆస్తి సంపాదనలో పడి, చిన్నతనంలో పిల్లల బాగోగులు దగ్గరుండి చూసుకోవటం కూడా తల్లితండ్రికి సరిగ్గా కుదరటం లేదు.

....................

కొందరు అత్తలు కోడళ్ళను అనే సూటిపోటిమాటలు వింటే జీవితమంటేనే విరక్తి కలుగుతుంది. పెళ్ళి ఎందుకు చేసుకున్నామో? అనికూడా  అనిపిస్తుంది.  కొందరికి  అనారోగ్యం  పరిస్థితి కూడా వస్తుంది. 



ఆ మధ్య  ఒక  ఆమెను   చూసాను. ఆమె  అత్తింటి వారి ఆరళ్ళతో మానసికంగా,శారీరికంగా అనారోగ్యం పాలయితే, పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నారు. మనిషి చిక్కిశల్యమైన శరీరంతో ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చుని ఉంది. 


  ఇలా ఆరళ్లు పెట్టే వారిని పెద్దవాళ్ళంటూ గౌరవించాలా ? నరరూపరాక్షసులు అంటేనే వాళ్ళకు సరయిన మాట.

...................

పిల్లలకు వచ్చిన జీవితభాగస్వామి అభిప్రాయాలకు....  అత్తింటి వారి అభిప్రాయాలకు  అంతగా కలవకపోవచ్చు. 


 కోడలు నచ్చలేదని కొడుకుతో అంటూ అదే పనిగా పితూరీలు చెబుతూ ఉంటే ఆ అబ్బాయి ఏం చేయగలడు ? 


 కని, పెంచిన తల్లితండ్రికి నచ్చచెప్పలేక..ఇటు జీవితాంతమూ కలిసిఉంటానని  పెళ్లిలో ప్రతిజ్ఞ చేసి కట్టుకున్న భార్యకూ నచ్చచెప్పలేక మధ్యలో నలిగిపోతాడు.


 ( తల్లితండ్రి అభిప్రాయాలకూ పిల్లల అభిప్రాయాలకూ కూడా తేడాలు ఉండే అవకాశం ఉంది.మరి,  వాళ్ళు బాగానే ఉంటారు కదా!)

..................

కొందరు అత్తగార్లు తాము తమ అత్తను సరిగ్గా ఆదరించకుండా  ఇంట్లోనుంచి గెంటేసినా కూడా, తమ కోడలిపై మాత్రం పెత్తనం చేస్తుంటారు. 


కోడలిని, కోడలి తరపు వాళ్లను ఇంకా కట్నం తెమ్మని , తమకు  మర్యాదలు సరిగ్గా జరగటం లేదని సతాయిస్తుంటారు.

......................

 తన కూతురు అల్లుడు అన్యోన్యంగా ఉంటే మురిసిపోయే  అత్తగారు... కొడుకు కోడలు  అన్యోన్యంగా ఉంటే   సహించలేకపోవచ్చు .  . కూతురి విషయంలో ఒక రకమైన న్యాయం..కోడలి విషయంలో ఇంకో న్యాయమా? 

..............

వివాహం అంటే రెండు కుటుంబాలు సంబంధం కలుపుకోవటం ఉంటుంది. అలాంటప్పుడు అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయి తరపు వాళ్లు సఖ్యతగా ఉండాలి. అప్పుడే అంతా సంతోషంగా ఉంటారు. 


కోడళ్ళతో కొన్నిసార్లు మంచిగా, కొన్నిసార్లు కఠినంగా ఉండే వాళ్ళూ ఉంటారు. ఇలా ఎందుకుంటారో అర్ధం కాదు.

కోడలిని చక్కగా చూసుకునే అత్తగార్లు కూడా ఉన్నారు.  పంతాలు, పట్టింపులూ  తగ్గించుకుని  అందరూ కలిసిమెలసి ఉంటే..పెద్దవాళ్ళ పెద్దరికం విలువ పిల్లలకు తెలిసి వస్తుంది. ఇలాంటి ఆదర్శవంతమైన పెద్దవాళ్ళకు వందనాలు.




No comments:

Post a Comment