koodali

Wednesday, May 6, 2015

పెళ్ళిళ్ళు..పంతాలు, పట్టింపులూ..

 
వివాహాలు కలహాల కాపురాలుగా మారటానికీ, విడాకులు కావటానికి పెద్దవాళ్ళ పంతాలు, పట్టింపులూ కూడా కారణాలుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్న విషయం.  

పిల్లలకు వివాహాలు చేయాలని  తాపత్రయపడి వివాహాలు చేస్తారు పెద్దవాళ్లు.


 అయితే వివాహం  అనుకోవటం తరువాయి పెట్టుపోతలు, మర్యాదలు..అంటూ  పెళ్ళికుమార్తె తరపు మరియు  పెళ్ళి కొడుకు తరపు పెద్దవాళ్ళ మధ్య పంతాలు, పట్టింపులు మొదలవుతాయి. 


ఈ గొడవలే  భార్యాభర్త  జీవితమంతా గొడవలు పడటానికి చాలావరకూ కారణాలవుతాయి.

.............................. 

ఈ పంతాలు, పట్టింపులు ఆడవాళ్ళలో అధికంగా కనిపిస్తుంటాయి.


కోడలు వచ్చేసరికి కుటుంబంలో తన ఆధిక్యత తగ్గుతుందేమో? అనే అభద్రత వల్ల కావచ్చు... సాధారణంగా చాలా మంది అత్తగార్లు కోడళ్ళను  సాధించటం మొదలుపెడతారు.


 కోడలు ఎంత మంచిగా ఉండటానికి ప్రయత్నించినా ప్రతిపనిలో వంకలు చూపిస్తూ కోడలిని సాధిస్తుంటారు.


చిత్రమేమిటంటే ,అత్తగారి సాధింపులు అనుభవించి  ఎన్నో బాధలు పడ్ద కోడలు,  తాను అత్తగారుగా మారిన తరువాత తన కోడలిని ఎందుకు సతాయిస్తుందో ? అర్ధం కాని విషయం. 

....................

ఒకవేళ అత్తగారు తన కోడలిని ప్రేమగా చూసుకుందామని అనుకున్నా కూడా.. బంధువులు, ఇరుగుపొరుగు .. అత్తకు, కోడలికి మధ్య తగవు పెట్టేస్తారు. 


మా దూరపు బంధువులలో ఒకామె కాబోయే  కోడలిని  ప్రేమగా చూసుకోవాలనుకుంది. వివాహం జరిగి కొత్తకోడలు అత్తవారింటికి వచ్చింది. ఇంట్లో బంధువులు  కూడా ఉన్నారు. 


అత్తగారు కోడలితో ఆప్యాయంగా మాట్లాడుతోంది. ఇది చూసి సహించలేని అత్తగారి తరపు బంధువులు కొందరు ( స్త్రీలు) ఆమెతో.. 


కోడలితో ఇంత మంచిగా మాట్లాడితే తరువాత నీ నెత్తికెక్కి కూర్చుంటుంది. అని చెప్పటం నేను స్వయంగా విన్నాను.


 కొంతసేపటికి  అబ్బాయి తరపు బంధువులలో కొందరు మహిళలు , చిన్న విషయానికే  అమ్మాయి తరపు బంధువులతో గొడవ పెట్టుకోవటమూ జరిగిపోయింది. 


కొంతకాలానికి  ఆ అత్తాకోడలికి మధ్య సరిపడక  వేరు కాపురం పెడతామని కోడలు అడగగా, అత్తింటివాళ్ళు ఒప్పుకోలేదు.


 మరికొంతకాలానికి భార్యాభర్త గొడవలు పడటం , విడాకులు  కూడా జరిగిపోయాయి.( వారికి ఒక బిడ్ద కూడా ఉన్నాడు.)

.................................. 

ఈ రోజుల్లో అమ్మాయి తరపు పెద్దవాళ్ళు కూడా గట్టిగానే ఉంటున్నారు.


అత్తింటి నుంచి అమ్మాయి  ఏడుస్తూ ఫోన్లు చేయగానే అత్తింటి వారిపై కేసు వేస్తామని బెదిరించటం, లేకపోతే  విడాకులు ఇచ్చేయమని అనటం ఎక్కువగా జరుగుతోంది.


 అమ్మాయి నిజంగానే అత్తింట్లో చాలా కష్టాలు అనుభవిస్తుంటే  పుట్టింటి వారు ఆదుకోవటంలో తప్పులేదు కానీ , చిన్నచిన్న విషయాలకే అత్తింటి వారిని బెదిరించటం సరైనది కాదు. 

............................... 

(అభిప్రాయభేదాలు తల్లిబిడ్దలకు కూడా వస్తాయి. అత్తింటి వారితో అభిప్రాయభేదాలు ఉండటం సహజమే. అయితే అందరూ సర్దుకోవాలి..తెగేదాకా లాగకూడదు.


మరీ సర్దుకోలేకపోతే ఇక ఎవరిష్టం వాళ్ళది..రెండో  పెళ్లి వాళ్లతో అయినా సర్దుకుపోక తప్పదు కదా !)

..............

ఒక జంట  వివాహం భగ్నం కావటంలో..  కొందరు  బంధువులు, ఫ్రెండ్స్ పాత్రతో పాటు  కొందరి విషయంలో  తల్లితండ్రి పాత్ర   కూడా ఉండటం అనేది అత్యంత బాధాకరమైన విషయం.


 తమ పంతాలు, పట్టింపులతో సనాతన  భారతీయ వివాహవ్యవస్థ  విచ్చిన్నం కావటానికి కారణం అవుతున్న వారు దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తారు. 

...............

పెద్దవాళ్ళకు విన్నపం ఏమిటంటే .. పిల్లలు వివాహం  చేసుకుని  సుఖంగా ఉండాలని అనుకుంటే , వాళ్లు చక్కగా కాపురం చేయటానికి సహకరించండి. 


పిల్లల జీవితాల కన్నా..  పెద్దవాళ్ల పంతాలు, పట్టింపులు, ఆధిక్యతలే ముఖ్యం అనుకుంటే మీ పిల్లలకు వివాహాలు చేయకండి.


మీరు పచ్చగా ఉంటే చూడలేని కొందరు ఇరుగుపొరుగు, ఫ్రెండ్స్, బంధువులు..మీ కుటుంబంలో గొడవలు సృష్టించటానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ గుడ్దిగా నమ్మకండి.

..................
అయితే..  కొడుకుకోడలు, కూతురుఅల్లుడూ.. గొడవలు పడుతుంటే  సర్దిచెప్పి ,వాళ్ల జీవితాలు సాఫీగా నడవటానికి చేతనైనంత  సాయం చేసే  తల్లితండ్రులూ ఎందరో  ఉన్నారు. ఇలాంటి పెద్దవాళ్ళకు వందనాలు.



2 comments: