koodali

Wednesday, August 8, 2018

ఈమధ్య వార్తాపత్రికలో చదివిన ఒక వార్త ఏమిటంటే,


  
జీవితభాగస్వామికి..  నయం కాని రోగాలు  ఉంటే  ఆ కారణంగా విడాకులివ్వచ్చని విన్నాను. 

ఈ విషయాల గురించి చట్టంలో  ఏముందో పూర్తి వివరాలు  నాకు తెలియదు.

అయితే, ఈమధ్య వార్తాపత్రికలో చదివిన  ఒక వార్త ఏమిటంటే,

 ఈరోజుల్లో కుష్టు వ్యాధికి నయమవటానికి మందులు వచ్చాయి కాబట్టి, 

విడాకులు ఇచ్చే విషయంలో ఈ వ్యాధి ఉన్నవారిని మినహాయించాలని కొందరు కోరుతున్నారట. 


ఇవన్నీ చదివాక  నాకు కొన్ని సందేహాలు కలిగాయి. నాకు ఏమనిపించిందంటే, 

అన్ని బంధాల కన్నా భార్యాభర్తల బంధం  బలహీనమైనదా ? అనిపించింది. 

తల్లితండ్రికి నయం కాని వ్యాధులు వస్తే వాళ్లను వదిలేయమని ఎవరూ అనరు. 

సోదరసోదరీమణులకు వచ్చినా వాళ్ళను వదిలేయమని అనరు.

 పిల్లలకు వచ్చినా ఎవరూ వదిలేయరు. 

మరి భార్యాభర్తల విషయంలోనే వాళ్ళను వదిలేయవచ్చు అనటం ఎందుకు ? అనేది  అర్ధం కాలేదు. 

******************
పిల్లలు తమ తల్లితండ్రి ఇద్దరూ తమ వద్ద ఉండాలనుకుంటారు.  భార్యాభర్తల విడాకుల వల్ల పిల్లలు బాధపడతారు. 

 వివాహంలో భార్యాభర్తలకు భరోసా అనేది లేదనే అభిప్రాయాలు పిల్లలకు కలిగి, వాళ్లు వివాహవ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి రాకూడదు. 

***********************

కొంతకాలం క్రిందట మాకు తెలిసిన వారింటికి వెళ్తే వాళ్ళ అమ్మాయిని చూసాము.. ఆమె మతిస్థిమితంలేని స్థితిలో ఉన్నది. 


ఆమె భర్త,  అత్తా, మామ.. ఆరళ్లు పెట్టగా ఆమెకు  మానసిక వ్యాధి వచ్చిందట.. 


మానసిక వ్యాధి  వచ్చేలా చేసిన భర్త కూడా  భార్యకు మెంటల్ అనే  కారణం చెప్పి విడాకులివ్వచ్చా?  


కొందరు బయటకు ఎంతో సాత్వికుల్లా కనిపిస్తూ, నీతులు చెబుతూ సమాజంలో  మంచిగా పేరు తెచ్చుకుంటారు.. 


తమకు ఇష్టం లేని కుటుంబసభ్యులకు  మాత్రం నరకం చూపిస్తారు....
 

తెలివిగా ప్రవర్తించి, తప్పు ఎదుటివాళ్ళదే అన్నట్లు లోకానికి అనిపించేలా ప్రవర్తిస్తారు.

సీరియల్స్ చూస్తే ఇలాంటి సంఘటనలు ఎలా ఉంటాయో చక్కగా అర్ధం అవుతుంది.  


 వివాహసమయంలో వధూవరులు ..జీవితంలో  కష్టసుఖాలను పంచుకుంటూ  కలిసిమెలసి కలకాలం కాపురం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు.అనారోగ్యం వచ్చిందనే కారణంతో జీవితభాగస్వామిని మధ్యలోనే వదిలేస్తే..ఇక  కుటుంబ బంధాలకు భరోసా ఏమిటి?


**************

ఏ బంధమూ లేకపోయినా సాటిమనుషులు కష్టాలలో ఉంటే వారిని ఆదుకోవటం మానవత్వం అంటారు కదా! 

జీవితభాగస్వామి అంటే జీవితంలో భాగం పంచుకునే దగ్గరి వ్యక్తి. 


మరి, జీవితభాగస్వామికి ఆరోగ్యం ఉన్నప్పుడు ఉపయోగించుకుని, అనారోగ్యం వస్తే విడాకులు ఇచ్చేసి వదిలేస్తే,


 ఆ బంధానికి  జీవితభాగస్వామి అనే ఘనమైన పదం వాడటం ఎందుకు?

***************************
ఎయిడ్స్ వంటి వ్యాధిగ్రస్తులకు  వైద్యులు ట్రీట్మెంట్ చేయటానికి నిరాకరిస్తే నేరమవుతుందట.

అయితే,  వ్యాధి ఉన్నదనే నెపంతో  జీవితభాగస్వామి మాత్రం విడాకులిచ్చి బాధ్యతల నుండి తప్పించుకోవచ్చా?అన్నది తెలియటం లేదు. 

*  ఇలాంటప్పుడు కొన్ని సందేహాలు కూడా వస్తాయి.

 జీవితభాగస్వామి ఎలాంటివారైనా సరే , వారిని ఆదరించాలి అంటే ఒక సమస్య...


 ఆదరించనక్కరలేదు అంటే ఇంకో సమస్య. 


ఉదా.. కొందరు వ్యక్తులు జీవితభాగస్వామిని ఏడిపించి, నైతికవిలువలు లేకుండా తమకు ఇష్టమొచ్చినట్లు బయటవారితో తిరిగి ఎయిడ్స్ వంటి వ్యాధులు తెచ్చుకుని, ఆనక తమను ఇంట్లో వాళ్ళు ఆదరించి తీరాలి అంటే.. ఆ పరిస్థితి ఎంతవరకు సరైనది ?ఇంకో ఉదా.. కొందరు ఏ తప్పూ చేయకపోయినా, పొరపాటునో లేక సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యాధిగ్రస్తులు వాడిన వస్తువు వాడటం వల్లనో  ప్రమాదకరమైన  జబ్బు వస్తే.. అలాంటి వారిని జీవితభాగస్వామి ఆదరించటం సరైనదే కదా! అనిపిస్తుంది. కొన్ని కాన్సర్లు, గుండె , కిడ్నీ.. వంటి  జబ్బులు కూడా ముదిరిన  తర్వాత గుర్తిస్తే   నయం కావు.  మరి అలాంటప్పుడూ విడాకులు ఇవ్వచ్చా ? 


**************
ఇలా సమాజంలో ఎన్నో సమస్యలు, సందేహాలు కలుగుతాయి .

 ప్రతి సమస్యకు ఒకే సమాధానం కాకుండా , ప్రతి సమస్యను దానికదే ప్రత్యేకంగా విశ్లేషించి ఏం చేయాలో నిర్ణయిస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. 

************
ఇంకొక విషయం ఏమిటంటే, తప్పులు చేసినవాళ్లు ఏదో ఒకటి చేసి ఇక్కడ శిక్ష నుండి తప్పించుకున్నా కూడా..దైవన్యాయస్థానం నుండి తప్పించుకోలేరు.1 comment:


 1. కొందరు ఏమంటారంటే, ప్రాచీనులు జీవితభాగస్వామి విషయంలో అలా చేసారు, ఇలా చేశారు.. అని విమర్శిస్తుంటారు. ఆ విషయాల గురించి గత టపాలలో వ్రాయటం జరిగింది.

  అయితే, ప్రాచీనులు ఏం చేసినా తప్పేనన్నట్లు విమర్శించేవాళ్ళు..ఇప్పటి సమాజంలో విషయాల గురించి ఏమీ అనలేరు.


  ఉదా..ఇప్పటికాలంలో జీవితభాగస్వామికి నయంకాని రోగం వస్తే విడాకులు ఇచ్చేయవచ్చు..అనే విషయాలను గమనించితే..

  జీవితభాగస్వామికి నయం కాని రోగాలు వస్తే విడాకులు ఇచ్చేయటం సరైనదే అని అంటే..

  భవిష్యత్తులో అలాంటి జబ్బు తమకే వస్తే జీవితభాగస్వామి విడాకులిస్తారేమో? అనే సంశయం ఉంటుంది.

  జీవితభాగస్వామికి నయంకాని రోగాలు వస్తే విడాకులు ఇచ్చేయటం సరైనది కాదంటే..

  జీవితభాగస్వామి ఎంత చెడ్డవాళ్ళు అయినా వాళ్లను తప్పనిసరిగా భరించాలా? అనే సంశయం ఉంటుంది.


  ReplyDelete