koodali

Wednesday, October 25, 2017

తులసి మొక్క, రావి మొక్క కొన్ని విషయాలు..


కొన్ని సంవత్సరాల క్రిందట మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కుండీలలో తులసి, గులాబీ, చామంతి వంటి మొక్కలు పెంచటం జరిగింది.

 తులసి మొక్క గింజలు ప్రక్కనున్న కుండీలలో పడి వాటిలో కూడా మొక్కలు వచ్చాయి. అలా ఎక్కువ తులసి మొక్కలు రావటం సంతోషంగానే అనిపించింది.

 అయితే, గులాబీ మొక్కల కుండీలలో కూడా తులసి పెరిగితే గులాబీలు ఏపుగా పెరగవని భావించి, తులసి కండీలను.. మిగతా కుండీలను దూరందూరంగా జరిపాను.

ఎవరైనా తులసి మొక్క కావాలని అడిగితే మా వద్ద ఉన్న తులసి మొక్కలనుంచి తీసి ఇవ్వటం జరిగింది. 

తరువాత కొంతకాలానికి ఒకరు ఏం చెప్పారంటే, ఇంటిలో తులసి మొక్క ఒక్క కుండిలో ఉంటే చాలు, బోలెడు కుండీలలో ఉండకూడదన్నట్లు చెప్పారు. 

ఇది విన్న తరువాత సంశయం కలిగి, మా వద్ద రెండు కుండీలలో ఒక కుండీని మా ఇంటి ప్రక్క ఉన్న దేవాలయంలో పెట్టేసి వచ్చాను.

తరువాత  ఏమనిపించిందంటే,  దేవాలయంలో పెడితే ఒకవేళ నీరులేక మొక్క ఎండిపోతే ఎలా? అనిపించి అప్పుడప్పుడు వెళ్ళి నీరు పోస్తున్నాను.

 ఇలా కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఒక సందేహం కలిగి దానిని పరిష్కరించటానికి చూస్తే,  మరిన్ని సందేహాలతో వ్యవహారం గొలుసుకట్టు వ్యవహారంలా తయారవుతుంది.

నాకు ఏమనిపిస్తుందంటే, తులసి మొక్క ఉంటే చుట్టుప్రక్కల గింజలు పడి మొక్కలు రావటం సహజం. తులసి మొక్కలు ఎన్ని ఉన్నా పూజనీయమే.


అయితే , ఎక్కువ కుండీలలో తులసి ఉంటే అన్నింటికీ రోజూ పసుపు, కుంకుమతో ..  పూజలు చేయాలా? అనే సందేహాలు వస్తాయని భావించి,  ఒక్క కుండీ నే ఉండాలి. అని చెప్పిఉండవచ్చు. 


అంతేకానీ, ఎక్కువ మొక్కలు ఉంటే తప్పు ..అని  వారి  ఉద్దేశం కాకపోవచ్చు.  
***********
  తులసి ఆకులను ఎప్పుడుపడితే అప్పుడు తెంపకూడదని పెద్దలు తెలియజేసారు. అలా చెప్పటం మంచిదే. 

లేకపోతే భక్తులు పూజ కొరకు అంటూ విపరీతంగా తులసి ఆకులను, కొమ్మలను ఎప్పుడుపడితే అప్పుడు తెంపేసి మొక్కలను పెరగనివ్వరు. 

******************
 తులసి గింజలు ప్రక్కన పడకుండా, ఎండిన  తులసి కంకులను 
అప్పుడప్పుడు నేనే  త్రుoచి మొక్క మొదట్లో వేయటం జరిగేది.

అయితే, కొందరు ఏమంటారంటే , స్త్రీలు తులసి కంకులు 
త్రుoచ కూడదంటారు. మగవారు త్రుoచవచ్చంటారు.

 అయితే, మగవారికి ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండవచ్చు, లేకపోవచ్చు.  అలాంటప్పుడు,  స్త్రీలే 
త్రుoచక తప్పదు కదా!


మరి , స్త్రీలు తెంపితే పాపం వస్తుందంటున్నారు. 

ఇలా ఎన్నో సమస్యలు, సందేహాలు కలిగి అసలు ఇలాంటి దేవతా మొక్కలను పెంచకుండా ఉంటే సరిపోతుందేమో ? అనిపించే పరిస్థితి రావచ్చు. 


పెద్దలు మనకు చక్కటి విషయాలను తెలియజేసారు. అయితే, అతి సందేహాలతో భయపడి అసలు విషయానికి దూరం కాకూడదు. 

***********
 రావి చెట్టు దేవతా వృక్షం. ఈ వృక్షం దేవాలయాలలో తప్ప ఇంట్లో ఉంటే మంచిదికాదంటున్నారు.రావి వృక్షాలను నరకటం వంటివి చేస్తే ఎంతో పాపం, కష్టాలు వస్తాయని అంటున్నారు.

 వృక్షాలు నరికితే తప్పే కావచ్చు. మరి చిన్నమొక్కలు వస్తే ఏం చేయాలో తెలియటం లేదు.

పక్షుల వల్ల రావి విత్తనాలు ఎక్కడయినా పడి మొక్కలు వస్తుంటాయి. మా ఇంటివద్ద చిన్న రావి మొక్కలు వచ్చాయి. వాటిని పీకాలంటే భయంగా ఉంది.

 ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి వేరే చోట పెట్టవచ్చు కానీ, ఇలాచేయటం ఎప్పుడూ కుదరకపోవచ్చు.

**********
కొన్ని మొక్కలు , వృక్షాలలోని గొప్పదనాన్ని గ్రహించిన పెద్దలు వాటిని దేవతా మొక్కలు , వృక్షాలుగా తెలియజేసారు. అలాంటి  వాటిని  జాగ్రత్తగా సంరక్షించాలి.

 అయితే,  మరీ అతి సందేహాలతో  భయపడి .. అసలు అలాంటి మొక్కలను, వృక్షాలను పెంచకుండా  దూరంగా ఉంటే మంచిది ..అనే పరిస్థితి రాకూడదు.


ఎన్నో విషయాల గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అయితే మనం మరీ ఎక్కువగా సందేహాలతో భయపడి అసలు విషయాలకే దూరం కావటం కాకుండా,  ఆచారవ్యవహారాలలోని అసలు అంతరార్ధాలను అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. 


 పెద్దలు ఎన్నో ఆచారవ్యవహారాలను తెలియజేశారు. ఆచారవ్యవహారాలలో ఎన్నో చక్కటి  విషయాలు ఉన్నాయి.


అయితే , ప్రాచీనులు  తెలియజేసిన విషయాలు కొన్నైతే, మధ్యలో వచ్చిచేరినవి కొన్ని.

ఏవి పెద్దలు చెప్పినవో? ఏవి  మార్పులుచేర్పులతో మధ్యలో వచ్చిచేరినవో తెలియటం లేదు.
 
 

1 comment:

  1. మేము కొన్నాళ్లు ముంబయిలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. మొక్కలు పెంచాలనిపించి కొన్ని మొక్కలు కొన్నాము. ముంబయి నుండి వచ్చేటప్పుడు ఆ మొక్కలకుండీలను అంతదూరం నుంచి తీసుకురావటం ఎందుకు..కావాలంటే, మళ్ళీ కొనుక్కోవచ్చు ..అన్నారు మా ఇంట్లోవాళ్లు.

    ఇళ్ళు మారేటప్పుడు కొందరు ఎక్కువగా ఉన్న మొక్కలకుండీలను అక్కడే వదిలేస్తారు. అపార్ట్మెంట్స్లో వాచ్మెన్ వాళ్లు నీళ్లు పోస్తుంటారు. అలా అందరూ వదిలేసే మొక్కలకుండీలు చాలా అవుతాయి. అన్నింటికి రోజు నీళ్లు పొయ్యాలంటే కష్టం. వాటికి నీళ్లు సరిగ్గా పోయకుండా వదిలేస్తారేమో కూడా. నాకు అలా వదిలేసి వెళ్ళటం నచ్చలేదు.

    ఒక ఆలోచన వచ్చింది. మేము మొక్కలు కొన్న నర్సరి మా ఇంటి దగ్గరలోనే ఉంది. మొక్కలను నేలలో పెట్టలేదు. కుండీల్లోనే ఉన్నాయి. ఆ కుండీలను పట్టుకెళ్లి ఆ నర్సరి వాళ్లకు ఇచ్చాము. కుండీలు ఇచ్చినందుకు మేము డబ్బులేమీ అడగలేదు. పాతకుండీలు కదా..వాళ్ళు తీసుకుంటారో లేదో ? తీసుకుంటే చాలు అనుకున్నాము. వాళ్లు తీసుకున్నారు. కనీసం నీళ్ళు సరిగ్గా పోస్తారు కదా..అని సంతోషం అనిపించింది.

    ReplyDelete